ఆనంద్ కాంటీష్ కుమారస్వామి(2 వ భాగం ) - అచ్చంగా తెలుగు

ఆనంద్ కాంటీష్ కుమారస్వామి(2 వ భాగం )

Share This
ఆనంద్ కాంటీష్ కుమారస్వామి(2 వ భాగం ) 
 -కరణం కళ్యాణ్ కృష్ణకుమార్

 డా "స్వామిగారి సేవలు విస్తృతంగా వినియోగించుకోవాలని సింహళ ప్రభుత్వం ఆయనకు "మినరలాజికల్ సర్వే "శాఖకు డైరెక్టర్ పదవిని ఇచ్చింది.ప్రమోషన్ తో పాటు భాధ్యతలు కూడా పెరుగుతాయి.ఈ ఉద్యోగం ఆయన ఆశయ సిద్ధి కి అడ్డంకి గా మారింది.తండ్రి లాగే స్వామి గారు కూడా ప్రజలతో సంబంధాలు పెంచుకున్నారు."సిలోన్ సోషల్ రిఫారం సొసైటీ " ని స్థాపించారు."సిలోన్ నేషనల్ రివ్యూ" అనే పత్రికను స్థాపించారు.ఒక ప్రింటింగ్ ప్రెస్  కొన్నారు...ఆరు సంవత్సరాల కాలంలో స్వామి గారు ఊహకందనంత స్థాయికి ఎదిగిపోయారు... 
డా'స్వామి గారు మిడివల్ సిం+హళీస్ ఆర్ట్స్ "అనే పుస్తకాన్ని వ్రాసి ప్రచురించారు.ఒక రోజున జార్జి బర్డ్ వుడ్ అనే పేరు మోసిన ఓ కళాప్రపూర్ణుడు "ప్రాచ్య-పాశ్చాత్య కళలు "అనే అంశం మీద ప్రసంగం చేయబోతున్నాడు అని తెలిసి డా'స్వామి గారు వెళ్ళారు.అందం అంటే ఏమిటో పాశ్చాత్య్ శిలులకి తెలియదని,వారు అజ్ఞానులని,వారు చెక్కిన బుద్ధుడి బొమ్మలే అందుకు నిదర్శనం అని అవి రంపపు పొట్టుతో చెసినట్లు ఉంటాయే తప్ప,శిల్పం చెక్కినట్లు అనిపించదని బర్డ్+వుడ్ విమర్శ చేస్తుంటే డా"స్వామి గారికి తన గుండెల్లో కత్తులు దించుతున్నట్లు అనిపించింది.ఆ మూర్ఖులకు బుద్ది చెప్పాలి అనుకున్నారు.పత్రికల ద్వారా ఎదురు దాడిని ప్రారంభించారు.బుద్ధుడి విగ్రహాల అందాలను పాశ్చాత్యులకు తెలియచెప్పాలని ఆరిజన్ ఆఫ్ బుద్ధ ఇమేజ్ పుస్తకాన్ని వ్రాసి ప్రచురించారు.... 
 భారతీయ సంగీత సాంప్రదాయాల గురించి డా"స్వామి గారు పరిశోధన చేస్తున్నప్పుడు రత్నా దేవి అనే సిం+హళ వనిత ఆయనకు పరిచయం అయ్యింది.ఆయన పరిశోధన ని అభినందించింది. ఇద్దరిని "చదువులతల్లి" ఆశీర్వదించింది.పెండ్లి చేసుకున్నారు.రత్నాదేవి సహచర్యంలో డా"స్వామి గారు తన అధ్యయనాన్ని ఉధృతం చేసారు.ఉద్యోగానికి రాజీనామా చేసి లండన్  నగరానికి మకాం మార్చారు. వీరికి కలిగిన మగ బిడ్డకి 'నారద 'అని,ఆడ బిడ్డకి 'రోహిణి ' అని పేరు పెట్టారు. ఆ అనుభవంతో భారతీయ సంప్రదాయాలు కళల మీద చాలా వ్యాసాలు రాశారు. సంచలనం రేకెత్తించే పుస్తకాలను వ్రాసి ప్రచురించారు.అందులో 'ఆర్ట్ అండ్ స్వదేశీ' అనే పుస్తకం విశ్వవ్యాప్త ఆదరణ పొందింది. తరువాత ది "ఆర్ట్స్ అండ్  క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ సిలోన్ ' అనే పుస్తకం చెప్పుకోదగినది. దీనిలో డా"స్వామి గారు భారతీయ శిల్పం,చిత్రలేఖనం, మరియు హస్తకళల గురించి విపులంగా చర్చించారు....   
 1914 వ సంవత్సరంలో ఎడింబరోలో ఇండియన్ అసోసియేషన్ వార్షికోత్సవ సభకు ఆహ్వానం రాగా డా"స్వామి గారు ఆ సభకు వెళ్ళారు.సభలో సంఘం కార్యదర్శి దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య వందన సమర్పణ చేసారు.దుగ్గిరాల వారి వాక్చాతుర్యానికి,సంగీత మాధుర్యానికి డా"స్వామి గారు ముగ్ధులైనారు.ఇంటికి వచ్చి ఆ రాత్రి "గోపాలక్రిష్ణరాయ "అని సంభోదిస్తూ అభినందనలు తెలుపుతూ ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో దుగ్గిరాల వారిని తన ఇంటికి ఆహ్వానించారు.. ఇంకో ఉత్తరంలో "నీవు మా ఇంటికి వచ్చే ప్రయత్నం విరమించుకోలేదనుకొంటా" అని మరో ఉత్తరం లో "మే నెలలో ఇక్కడి వాతావరణం చక్కగా ఉంటుంది.మొదటి జాబులో నేను క్రిష్ణరాయ అని సంభోధించి వ్రాశాననుకొంటాను. హంపిని పాలించిన క్రిష్ణదేవరాయలను గురించి అప్పుడు చదువుతున్నాను. అందుకే పొరపాటు దొర్లింది. నీవు అడిగిన పుస్తకాలన్నీ నా దగ్గర ఉన్నాయి. వస్తూ నీతో తప్పకుండా తబలా తీసుకురా!" అంటూ మరల ఉత్తరాన్ని కూడా దుగ్గిరాల వారికి డా"స్వామి గారు రాశారు. (డా"స్వామిగారు దుగ్గిరాల వారికి వ్రాసిన ఇరవై ఉత్తరాలను,మరికొన్ని టెలిగ్రాములను శ్రీ గుమ్మిడిదల వెంకట సుబ్బారావు గారు,స్టేట్ ఆర్కివ్స్-హైదరాబాదులో తన పేరిట ఏర్పరచిన జి.వి.యస్ గ్యాలరీలో భద్రపరిచారు..)   దుగ్గిరాల వారు డా"స్వామి గారు ఉంటున్న బ్రిట్ ఫోర్డ్ గ్రామానికి వెళ్ళారు.ఇది సాలిస్ బరి పట్టాణానికి మూడుమైళ్ళ దూరంలో ఉంది.డా"స్వామి గారిలో దుగ్గిరాల వారు గొప్ప గురువుని చూశారు. ఆయన వద్ద నాలుగునెలలు గడిపారు. రత్నాదేవి కి భక్తి గీతాలు నేర్పించారు. 
నందికేశ్వరుడు వ్రాసిన "అభినయ దర్పణం"అనే సంస్కృత నాట్య గ్రంధాన్ని ఆంగ్లం లోకి మిర్రర్ ఆఫ్ గెస్చుర్స్(Mirror of Gestures) గా అనువాదం చేయుటలో దుగ్గిరాల వారు డా"స్వామి గారికి తోడ్పడ్డారు. ది.10-07-1916 న న్యూయార్క్ నుండి శిష్యుడికి వ్రాసిన ఉత్తరంలో "అభినయ దర్పణం" ముద్రించడానికి తాను చేస్తున్న ప్రయత్నాన్ని ప్రస్తావించారు. 
ఈ గురుశిష్యుల మధ్యప్రేమాభిమానాలు ఎలా వృద్ధి చెందాయో గురువు గారు ఉత్తరాలలో చేసిన సంభోదన స్పష్టం చేస్తుంది. మొదట కొన్ని ఉత్తరాలలో 'గోపాలక్రిష్ణాయ్య"అని,ఆ తరువాతవ్రాసిన వాటిలో "గోపాల" అనిచివరిలో వ్రాసిన వాటిలో "శిష్యా" అని సంభోధించడం దుగ్గిరాల వారి పట్ల కుమారస్వామి గారు పెంచుకున్న వాత్సల్యాన్ని చాటుతుంది.   23-06-1915 వ తేదీన దుగ్గిరాల వారు తన ప్రాణ స్నేహితుడు నడింపల్లి నరసింహరావు గారికి ఉత్తరం రాస్తూ "ఆచార్యవాన్ పురుషోవేద:" అనే ఆర్యోక్తిని అనుసరించి నిజమైన విద్యాన్వేషణకు గురువు అవసరం కాబట్టి నేను డా"స్వామి గారిని గురువుగా స్వీకరించాను.అందుకు డా"స్వామిగారు అంగీకరించారు అని వ్రాసారు.15-12-1915 వ తేదీన మరోసారి ఉత్తరంలో "నేను కుమారస్వామిగారితో ఉన్న నాలుగునెలలు-ఇంత వరకు నా జీవితంలోఉత్తమోత్తమ సమయం.ఆయన ఉనికి నా జీవన వైఖరినే మార్చేసింది.శారీరకంగానూ,మానసికంగానూ నేను పూర్తి గా మారిపోయాను.స్వామి గారి ఆశ్శీస్సులతో నాకిట్టి సంస్కారం కలిగింది."అని నరసింహరావు గారికి తెలియచేశారు. 
దుగ్గిరాల వారు1915 జూన్ నుండి సెప్టెంబర్ వరకు డా"కుమారస్వామి గారి ఇంట్లోనే పేయింగ్ గెస్ట్ గా నాలుగు నెలలు ఉన్నారు.   1915 వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్దం జరుగుతున్న రోజులవి. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి ఇంటికి తిరిగి వస్తూ దారిలో ఇంగ్లాండులో ఆగారు.అది తెలిసి డా"స్వామి గారు తన శిష్యుడు గోపాల్ (గోపాల క్రిష్ణయ్య గారు)తో గాంధీజీ వద్దకు వెళ్ళారు. దారిలో గోపాల క్రిష్ణయ్య గారితో గాంధీజీ గురించి " ది కమింగ్ మాన్ ఆఫ్ యువర్ కంట్రీ"  అని వర్ణించారు.అలా డా"స్వామి గారికి ఉన్న దూర దృష్టి గమనించదగినది.  
దుగ్గిరాల వారి దృష్టిలో తుప్పు పట్టిన లోహన్ని బంగారంలా మార్చగలిగిన పరుసవేది డా"స్వామి గారు.   దుగ్గిరాల వారి ఎం.ఏ కోర్సు 1915 కు పూర్తి కావల్సినది.డా"స్వామి గారిని గురువుగా పొందే పూర్వ సుకృతం వల్లనేమో, ఆయన ఎం.ఏ తప్పడం జరిగింది. ఆ రీతిన ఈ గురు శిష్యుల అనుబంధం ఒక దైవఘటన గా చెప్పుకోవచ్చు.   1917 లో దుగ్గిరాల వారు స్వదేశానికి తిరిగి వచ్చారు. అదే సంవత్సరంలో అమెరికాలోని బోస్టన్ పట్టణంలో ఏర్పరచిన మ్యూజియంలో భారతీయ,పర్షియన్,మహమ్మదీయ కళలకుసంబంధించిన రీసెర్చ్ డైరెక్టరు పదవిని చేపట్టవలసినదిగా డా"స్వామిగారికి ఆహ్వానం వచ్చింది. 
డా"స్వామి గారు తన భార్యను సలహా అడిగితే ఆమె "తక్షణం చేరండి" అని ప్రొత్సహించింది.అలా మకాం అమెరికాకు మారింది.   గంధానికి పన్నీరు తోడయినట్లు బోస్టన్ లో డా"స్వామి గారికి సోదరి నివేదిత తోడయింది. ఈ ఐరిష్ వనిత స్వామి వివేకానందుని శిష్యురాలు. ఆమె అసలు పేరు మార్గరెట్ -ఈ- నోబుల్. హిందూ మతం స్వీకరించి నివేదితగా మారింది. ఆమెతో కలిసి "మిస్టరీస్ ఆఫ్ హిందూస్ అండ్ బుద్ధిస్ట్స్" అనే పుస్తకాన్ని వ్రాశారు.  డా"స్వామిగారి కృషిని గుర్తించి ఆయనకు మ్యూజియం వారు డైరెక్టర్ గా ప్రమోషన్ ఇచ్చారు.. కొడుకు 'నారద' పెరిగి పెద్దవాడైనాడు. తండ్రి అడుగు జాడలలో చదవడం, వ్యాసాలు వ్రాయడం మొదలు పెట్టాడు. కుమార్తె రోహిణి భారతీయ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది.తన అభీష్టానికి తగ్గ ఉద్యోగం దొరికింది.
 అనుకూలవతి అయిన భార్య తోడయింది.జీవితం సుఖంగా సాగిపోతుంది. కొడుకులో నారదుడు లక్షణాలు గూడు కట్టుకున్నాయి. "నాన్న గారు నాకు దేశాలు చూడాలని ఉంది" అ ని కొడుకు అడగగానే "పేరు సార్ధకము చేసుకొని ముల్లోకాలు చుట్టొస్తావా?" అని డా"స్వామి గారు నవ్వుతూ సరే అన్నారు.మళ్ళీ డా"స్వామి గారికి గడ్డు రోజులు దాపురించాయి. రత్నాదేవి ఆరోగ్యం అడ్డం తిరిగింది. ఓ ఘోర విమాన ప్రమాదంలో నారద శాశ్వతంగా అదృశ్యమయ్యాడు. ఆ వార్త విన్న రత్నాదేవి తట్టుకోలేక కన్ను మూసింది. ఈ షాక్ నుంచి పూర్తి గా కోలుకోకమునుపే కుమార్తె రోహిణి తన వద్దకు వచ్చి  "నాన్న గారు నేను అమెరికన్ యువకున్ని ప్రేమించాను.మీ అనుమతితో పెల్లి చేసుకోవలనుకుంటున్నాను." అని చెప్పగానే డా"స్వామి గారు నిశ్చేష్ఠుడైనారు.  
"అమ్మా నాకు మిగిలింది నీవొక్కదానివే.నీకు భారతీయ సంగీతం నేర్పాను.నీకు భారతీయ యువకున్ని తెచ్చి పెళ్ళి చేయాలనుకుంటున్నాను. నా మాట వినమ్మా నీకు ఇండియాలో పేరుప్రఖ్యాతలు వస్తాయి" అని కూతుర్ని బ్రతిమిలాడారు. రోహిణి అందుకు నో అన్నది. కోరుకున్న వాడిని కట్టుకుని ఆమె అత్తవారింటికి వెళ్ళింది. కష్టాలు కట్టలు కట్టుకుని వస్తాయన్నది డా"స్వామి గారి జీవితంలో అక్షర సత్యం అయ్యింది.   
 డా"స్వామి గారు ఓ ఋషిగా మారాడు.తన ఆశ్రమంలో తన వంట తనే చేసుకుంటూ, తన మంచి చెడ్డలు తనే చూసుకుంటూ, తన అధ్యయనాన్ని మరింత తీవ్రం గా కొనసాగించారు. బోస్టన్ లో"డోనాలిసా"అనే అర్జెంటీనా దేశస్థురాలి అభిమానం డా"స్వామి గారికి లభించింది. ఆమె వితంతువు.చివరి రోజులలో డా"స్వామి గారికి తోడుగా నీడగా నిలిచింది. ఆమె సహచర్యంలో డా'స్వామిగారు కొంత ప్రశాంతతను పొందారు. 
డా"స్వామి గారి రచనలను ఈమె ఎడిట్ చెసింది.     'ది డాన్స్ ఆఫ్ శివా' 'ట్రాన్స్ ఫర్మేషన్ ఆఫ్ నేచర్ ఇన్ ఆర్ట్' 'క్రిష్టియన్ అండ్ ఓరియెంటల్ ఫిలాసఫి ఆఫ్ ఆర్ట్' 'హిస్టరి ఆఫ్ ఇండియన్ అండ్ ఇండోనేషియన్ ఆర్ట్' 'బుద్ధ అండ్ గాస్పిల్ ఆఫ్ బుద్ధిజం'   అనే పుస్తకాలను డోనాలిసా ప్రోత్సాహముతోడా"స్వామి గారు వ్రాశారు. వీరిద్దరికీ ఒక మగ బిడ్డ పుట్టాడు. అతనికి 'రాము' అని పేరు పెట్టరు. వీడినైనా తన అభీష్టం మేరకుపెంచాలని ఆ పసివాణ్ణి భారతదేశం తీసుకొచ్చి హరిద్వార్ లో ఒక ఆశ్రమ పాఠశాలలో చేర్పించారు.  
 "ప్రాగ్దేశముల ఆదర్శ వాదముతో పాశ్చాత్య దేశముల ఆచరణ వాదము, డా"కుమారస్వామిలో సమ్యక్ సమన్వయ మందినది." అంటారు నడింపల్లి వారికి వ్రాసిన ఉత్తరంలో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య గారు.   1925 జనవరిలో తన సంపాదకత్వంలో ప్రారంభించిన "సాధన" అనే ఆంగ్ల వారపత్రికను దుగ్గిరాల వారు తన గురువు కుమార స్వామి గారికి పంపుతూ,"మై డియర్ గురూజీ" అని సంభోధించి "ఆశీర్వాదాలు అందించి,పత్రికకు వ్యాసాలు వ్రాయవలసినది." గా లేఖ రాసి అర్ధించారు.ఆ సుధీర్ఘమైన లేఖలో ఆనాటి భారతదేశ రాజకీయ,సాంఘీక పరిస్థితులు వివరంగా వర్ణించబడ్డాయి. చీరాల-పేరాల ఉద్యమంకు నాయకత్వం వహించిన .. దుగ్గిరాల వారి అకాల మరణం తెలిసి స్వామి గారు ఎంతో భాధ పడ్డారు.   భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దాకా బ్రతికి తృప్తిగా 1947 సెప్టెంబర్ 8 వ తేదీన , తన 80 వ ఏట డా"స్వామి గారు ఈశ్వర సాన్నిధ్యం పొందారు. తన దేహన్ని హిందూ సాంప్రదాయ బద్దంగా దహనం చేసి అస్థికలను గంగా జలంలో నిమజ్జనం చేయవలసినదిగా వీలునామా వ్రాసి మరీ కన్నుమూసారు. అమెరికా లోని ఐన్ స్టీన్ ఆస్పత్రిలో సర్జన్ గా ఉంటున్న రాము, తండ్రి గారి కోరికి అమేరకు అస్థినిమజ్జనం గావించి ఆ భారతీయ సంస్కృతీ పథగామి ఆత్మకు శాంతిని చేకూర్చారు. 
 (సహకారం : మన ఆంధ్రరత్న -  కరణం సుబ్బారావు గారు)

No comments:

Post a Comment

Pages