అంతర్యామి-2 - అచ్చంగా తెలుగు
అంతర్యామి-2
పెయ్యేటి రంగారావు

(జరిగిన కధ : రామదాసు గారు నరసాపురం కాలేజి లో లెక్చరరు ,ఆస్తికుడు. ఆయన మిత్రుడు లావా నాస్తికుడు,స్థానిక హేతువాద సంఘం అధ్యక్షుడు. వారిద్దరి మధ్య భగవంతుడు ఉన్నాడా ,లేడా అన్న విషయమై వాదోపవాదాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. రామదాసుగారి ఇంటికి అంతర్యామి అనే స్వామీజీ తన  శిష్యులతో రాబోతున్నారు. ఇక చదవండి ....) 
 అందరూ ఊరు మొదట్లో ఆత్రంగా అంతర్యామి గారి రాక కోసం నిరీక్షిస్తున్నారు. నాలుగు చిన్న కార్లు అల్లంత దూరాన కనిపించగానే అందరిలోనూ ఉత్సాహం ఇనుమడించింది ,క్షణాల్లో అక్కడి వాతావరణమే పవిత్రముగా మారిపోయింది వేదవేదాంగ పరాయణులైన పండిత ప్రకండులు ఉఛ్చ స్వరాలతో వేదాలు చదువుతున్నారు. నాదస్వర విద్వాంసులు సామరాగం వాయిస్తుంటే ,డోలు విద్వాంసులు లయ విన్యాసం చూపిస్తున్నారు . అంతర్యామి గారు తను వేసుకున్న బంగారు జరీ శాలువాను సవరించుకుంటూ,మంత్ర జపం చేసుకుంటూ నెమ్మదిగా కారులోంచి కిందకు  దిగారు.   ఆహా! ఎంత మనోహరమైన రూపము వారిది! చెవులకు స్వర్ణ కుండలాలు,చేతులకు బంగారు కంకణాలు! మెడలో బంగారముతో చుట్టబడిన రుద్రాక్షలు!   అందరూ దుమ్ము, ధూళి తో ఉన్న కంకర రోడ్డు అని కూడా చూడకుండా ,నేల మీద సాష్టాంగ పడి వారికి ప్రణామాలు ఆచరించి తమ బ్రతుకుల్ని ధన్యం చేసుకున్నారు. పురోహితులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలుకుతూ ,మంత్రోఛ్చారణల  మధ్య వారిని సగౌరవం గా రామదాసు గారి ఇంటిదాకా తీసుకు వచ్చారు.
***************************
అంతర్యామి గారి శిష్యులు ముందు గానే రామదాసు గారికి, మిగిలిన కార్య నిర్వాహక వర్గానికీ చెయ్యవలసిన కార్యక్రమాల గురించి వివరించి వుంచారు. అంతర్యామి గారు రామదాసు గారి ఇంట్లోకి అడుగు పెడుతూండగానే నూటెనిమిది కొబ్బరి కాయలు పగిలాయి!   వారిని నిలువెత్తు పూలమాలలతో అలంకరించారు తరువాత నలుగురు ముత్తైదువలు వెండిపళ్ళెంలో హారతి కర్పూరపు ముద్దను వెలిగించి వారికి హారతి ఇచ్చారు .   . అంతర్యామి గారు అభయహస్త ముద్ర తో అందరినీ ఆశీర్వదిస్తూ లోనికి అడుగుపెట్టారు.తరువాత హాలులో ముందే ఏర్పాటు చేసిన వేదిక మీద తను తెచ్చుకున్న బంగారు దేవతా విగ్రహాలను ప్రతిష్టించారు  ధూప దీప నైవేద్యాలతో అరగంటలో ఆ విగ్రహాలకు అర్చన ముగించారు.   అంతర్యామి గారి  ముఖ్య శిష్యులు  అయిన భగవంతం గారు అందరికీ పచ్చకర్పూరం ,తులసి వాసనలతో ఘుమ ఘుమ లాడుతున్న తీర్ధాన్ని భక్తులందరికీ ఇచ్చారు .తరువాత అందరినీ ఉద్దేశించి ఈ విధముగా ప్రసంగించారు .   'అయ్యలారా! అమ్మలారా! స్వామి వారు ప్రయాణములో అలిసిపోయి వచ్చారు.ఈ రోజుకు ఇంక కార్యక్రమాలేవీ ఉండవు. రేపటినుంచి వరసగా తొమ్మిది రోజులు ఉదయాస్తమాన వేళలలో ఆంజనేయస్వామి కి సహస్ర నామార్చనలు,అష్టొత్తర  శతనామార్చనలు ,బాలభోగాలూ వుంటాయి. ఎవరైనా తమ గోత్రనామాలతో అర్చనలు చేయించుకోవాలనుకుంటే ఇక్కడ చీట్లు వ్రాయించుకోవచ్చును. సహస్ర నామార్చనకు అయిదువేలు ,అష్టోత్తర శతనామార్చనకు  మూడు వేలు ,బాల భోగానికి రెండు వేలు ,హారతికి వెయ్యి రూపాయలు సమర్పించుకోవలసి ఉంటుంది .ఈ ద్రవ్యం యావత్తూ ఆ శ్రీ రామచంద్రమూర్తి పాదదాసులైనటువంటి ఆంజనేయస్వామి వారి సేవ నిమిత్తం మాత్రమే వినియోగం అవుతుందని మనవి చేసుకుంటున్నాము.   ఇక , మధ్యాహ్నం   రెండు గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ భక్తుల వ్యక్తిగతమైన సమస్యలకు స్వామి వారు సమాధానములిస్తారు .ఐతే తన్నిమిత్తం అంతర్యామి వారికి ఆ ఆంజనేయస్వామి వారి నుండి ఆదేశం లభించవలసి ఉంటుంది. భక్తుల అదృష్టాన్ని బట్టీ స్వామి వారికి భగవంతుని ఆదేశం లభిస్తూ ఉంటుంది.   ఇక ప్రశ్న అడగదలచుకున్న వారు  ఒక చీటీ పై తమ గోత్రనామాలు వ్రాసి ,ప్రశ్న వ్రాసి ,ఆ చీటీ తో కలిపి కేవలమూ రెండు వందల రూపాయలు మాత్రం సమర్పించుకోవాల్సి ఉంటుంది .మానవసేవ లో మాధవ సేవ ఉంటుందని ,అందువల్ల మానవ సేవ కూడా చెయ్యవలసిందని ఆ వాయునందనులైన ఆంజనేయస్వామి వారు స్వయముగా అంతర్యామి వారిని ఆదేశించినందువల్ల, వారు ఈ ప్రజా సేవకు పూనుకున్నారు.   ఇహ ఈ వేళకి అందరూ స్వామివారికి పాదాభివందనములు చేసుకుని తమ తమ ఇళ్ళకు దయచేయవలసిందిగా కోరుతున్నాము '.   కొద్దిక్షణాల్లో ఆ ఇంట్లో సద్దుమణిగింది , రామదాసు, లావా ,ఊరి ప్రముఖులు పదిమంది మాత్రమే మిగిలారు .మిగిలిన అందరూ అంతర్యామి గారికి పాదాభివందనాలు చేసి, అర్చనలకు చీటీలు వ్రాయించుకుని వెళ్ళిపొయారు.   అంతర్యామి గారు హాలు లో కుషన్ సోఫా పై దర్భాసనం పరుచుకుని దానిపై ఆశీనులై వున్నారు  .   నరసాపురం టౌను మునిసిపల్ చైర్మన్ గారైన శివరామయ్యగారన్నారు 'అదృష్టవంతుడవయ్యా  రామదాసూ! మేం కోటీశ్వరులం ఎంతమందిమి ప్రయత్నించినా దొరకని భాగ్యం నీకు లభించింది .సాక్షాత్తూ ఆంజనేయస్వామి వారు నీ పెంకుటింట్లో వెలిసారు. అదిన్నీ శ్రీకృష్ణుడికి కుచేలుడే ప్రేమ పాత్రుడైనట్టూ !'   అంతర్యామి గారు చిరునవ్వు నవ్వి అన్నారు 'అంతా భగవదనుగ్రహం వల్లను, భగవాదేశం మీదనూ మాత్రమే జరుగుతుంది. నా శిష్యులు ముందర ఈ ఊరు వచ్చినప్పుడు వీరి ఇల్లు చూడగానే అలౌకికమైన అనుభూతికి లోనయ్యారు .ఈ ఇంట్లోని పవిత్ర వాతావరణం  మమ్మల్ని ఇక్కడకు రప్పించడానికి కారణమై ఉండవచ్చు , లేక క్రితం జన్మలో కూడా ఈ రామదాసుగారు ఆంజనేయ స్వామిని అకుంఠిత దీక్షతో ఉపాసించి ఉండవచ్చు. అందరూ రామదాసు కేసి ఈర్ష్యగా చూశారు . లావా అంతర్యామి గారినే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు .   శివ కామయ్యగారన్నారు 'స్వామీ ! తమరన్నది అక్షరాలా నిజం ! ఏ క్షణాన ఎవరి మీద భగవంతుడికి అనుగ్రహం కలుగుతుందో ఎవరికీ తెలియదు. ఉదాహరణకి, వేమన గారి మాటేమిటి చెప్పండి? అభిరాముడు ఎన్నో సంవత్సరాల నుంచి గురు శుశ్రూష చేస్తున్నా లభించని బ్రహ్మజ్ఞానం అయాచితం గా వేమనకు లభించింది '.   భగవంతం గారు అన్నారు 'మీరన్నది నిజమేనండీ'.   శివకామయ్య గారు మళ్ళీ అన్నారు ' నా చిన్నతనములో ఒక పదేళ్ళ కుర్రాడిని చూశాను. అతడు ప్రతివాళ్ళకీ ముఖం చూసి  భూత భవిష్యద్వర్తమానాలు అవలీలగా చెప్పేసేవాడు . ఆ కుర్రవాడి తండ్రిని ఆ అద్భుతానికి కారణమడిగాను . ఆయన చెప్పింది వింటే నాకు చాలా ఆశ్చర్యమేసింది .  ఒక సాయంత్రం ఆ కుర్రవాడు బడినించి ఇంటికి వస్తూ జేబులో ఉన్న చాక్లెట్టు తీసి నోట్లో వేసుకోబొయ్యాడుట ! అదే సమయానికి రోడ్డు పక్కన మాసిన గడ్డం తోనూ, గోచి గుడ్డ తోనూ ఉన్న ఒక బిచ్చగాడు కనిపించాడుట,ఈ కుర్రవాడికి జాలి కలిగి ఆ చాక్లేట్టుని ఆ బిచ్చగాడి చేతిలో వేసాడుట .వెంటనే ఆ బిచ్చగాడు ఆనందం గా ఆ కుర్రవాడిని దగ్గరకు తీసుకుని మంత్రోపదేశం చేసాడట! అప్పటినుంచీ ఆ కుర్రవాడికి ఎక్కడలేనీ అతీంద్రియ శక్తులూ లభించాయిట!'   అందరూ ఆయన చెప్పేది ఆశ్చర్యముగా వింటున్నారు...   మళ్ళీ శివకామయ్యగారన్నారు 'ఆ తర్వాత మా ఊరి వాళ్ళు ఆ బిచ్చగాడి కోసం ఊరంతా గాలించారు.నేనైతే ఎప్పుడూ జేబునిండా ఇన్ని చాక్లేట్ట్లు పోసుకుని ఊరంతా తెగ తిరిగాను. కానీ అతడు ఆ తర్వాత ఎప్పుడూ ఎవరికీ కనిపించలేదు.'   భగవంతంగారన్నారు ' అంత వరకెందుకండీ? స్వామి వారి జీవితమే భగవంతుడి లీలలకి చక్కని నిదర్శనం! వారెక్కడో ఊరి చివరలో ఒక చిన్న పాక వేసుకుని అందులో నివసించసాగారు .ఐతే వారికి రోజూ అర్ధరాత్రి ఒక ఆకారం లీలగా కనిపించసాగింది. స్వామి వారు మొదట్లో ఎవరో దొంగ అనుకున్నారు . దొంగ అయితే తన దగ్గర ఏముందని తన ఇంటి చుట్టూ తచ్చట్లాడాలి అని  సమాధాన పడ్డారు. తరువాత ఎవరైనా చనిపోయిన వారి ఆత్మేమోనని అనుమాన పడ్డారు.   ఒక రాత్రి ఆ విషయాన్ని ఏమైనా సరే తేల్చుకోవాలని తెగించి ఆ నీడను వెన్నాడారు. కానీ ఆ నీడ చూస్తుండగానేమాయమైంది. ఆ తర్వాత చాలా రాత్రులు ఆయన ఆ నీడను వెంటాడటం, ఆ నీడ ఉన్నట్టుండి అంతర్ధానమవటం కొనసాగింది   ఒక నాడు వేకువ ఝామున స్వామి వారికి స్వప్నం లో వాయుసూనుడు సాక్షాత్కరించారు! వారు చెప్పిన విషయాలు అబ్బుర పరచేవిగా ఉన్నాయి!   స్వామి వారు ఇల్లు కట్టుకున్న ప్రదేశము లో చోళుల కాలం నాటి ఆంజనేయస్వామి ఆలయం వుందిట.ఆ ప్రదేశమంతా చోళరాజధానిట! చోళులు సరిగ్గా ఆ ప్రదేశం లోనే ఆలయాన్ని నిర్మించారుట. ఆ ప్రదేశాన్ని తవ్వితే అడుగున ఉన్న మందిరం బైట పడుతుందట .అందుకని తనకి అక్కడే స్వామివారి ఇంట్లోని ఈశాన్య భాగములో చిన్న ఆలయం నిర్మించమని హనుమంతుడు సెలవిచ్చాడట! అందుకే అంతర్యామి గారు వారి ఇంట్లో చిన్న ఆలయాన్ని నిర్మించారు. అక్కడి స్వామిని దర్శించుకుంటే భక్తులకు సకల శుభాలూ కలుగుతాయనడంలో ఏ మాత్రమూ సందేహం లేదు '.   అంతర్యామి గారు మందహాసంతో అన్నారు .' ఆ స్థలం కావాలని నేనే ఎందుకు కొన్నానో,వారి దర్శనం నాకే ఎందుకు లభించిందో తలుచుకుంటే ఇప్పటికీ.....'   బయట కారాగిన చప్పుడు అయింది.   రామదాసు గారు లావా ని ఆ వచ్చిన వారిని గౌరవించమని బయటకు పంపారు. లావా బైటకు వెళ్ళాడు.   '.......నాకు వొళ్ళు గగుర్పొడుస్తుంది! వారెప్పుడు నాకు దర్శనమిచ్చినా......'   చూస్తూ చూస్తూ ఉండంగానే అంతర్యామి గారి మొహం ఎర్రగా మారిపోయింది. కండరాలు బిగుసుకున్నాయి. శరీరమంతా ఉద్రేకంతో ఊగిపోసాగింది! మూతి పొడుచుకు వచ్చింది! చేయి గదను పట్టుకున్నట్టు గా పైకి లేచింది! ఆయన తీవ్రమైన ఆవేశంతో రొప్ప సాగారు.   వారి వొంటి మీదకు ఆంజనేయస్వామి వారు వచ్చారు. (సశేషం..)  

No comments:

Post a Comment

Pages