జాటర్ డమాల్ దినోత్సావం - అచ్చంగా తెలుగు

జాటర్ డమాల్ దినోత్సావం

Share This
ముళ్ళపూడి వెంకటరమణ గారి జయంతి సందర్బముగా  తోటి బుడుగుల, సీ గాన పెసూనాంబల   అభ్యర్దనమేరకు  అస్సలెసంబ్లీలో బుడుగు చేసిన స్మారకోపన్యాసం...
జాటర్ మాల్ దినోత్సావం
- శ్రీనివాస్ యనమండ్ర
చిచ్చర పిడుగుల్లారా   నా పేరు బుడుగు. ఇంకో పేరు పిడుగు. అలాగే మీలంతా పిడుగులూ, పిడిగినులూ . మన సంగం పేరు అస్సలెసంబ్లీ పిడుగుల సంగం .ఇది తెలియని తెలుగువారు ఉండరని ముందుగా మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు మా గురువుగారు రమణగారి బర్త్డే సందర్బముగా మాట్లాడమని నన్ను అడిగిన ముక్కుమంత్రిగారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. బుడుగుగా నా మాటలు మీకెంతో నచ్చేలా తీర్చిదిద్దిన రమణగారికి నివాళి అర్పిస్తూ మీ ముందుకు ఒక ప్రతిపాదన తీసుకువస్తున్నాను.   ఫాదర్స్డే, మదర్స్డే, చిల్డ్రన్స్డే, వాలైంటన్స్డే అని రకరకాల దినోత్సవాలు మనం ఈ రోజుల్లో జరుపుకుంటున్నాం. ఆ రోజుల్లో సంతోషాన్ని మనమిత్రులతో కుటుంబసభ్యులతో పంచుకుని ఆనందిస్తున్నాం. కానీ బుడుగు , జీవితం అంటే సంతోషమొక్కటే కాదు కదా. మనకి నచ్చని పని ఎదుటివారు చేసినప్పుడు, మనకి ఎదుటివారు  ప్రైవేట్లు చెప్పినప్పుడు, మనల్ని ఎవరైనా జెల్లకాయ పీకినప్పుడు – మనకి ఆవేశమో, దుక్కమో కూడ ఒచ్చేస్తుందిగా. ఆ ఆవేశము, దుక్కమూ టీవీ ప్రోగ్రాముల్లో  చూపించే న్యూసులోను, సీరియల్సులోనూ మరీ ఎక్కువయిపోతోంది కదా  పిడుగు వాండులారా ?   టీవీ ప్రోగ్రాంలు ప్రతీవారూ శ్రధ్ధగా ఇంట్లో అందరూ చూస్తుంటారు కదా మలి.  అందులో నాలాంటి చిన్నపిల్లలు కూడ ఉంటుంటారు కదా. అసలే చిన్నపిల్లలు అంటే ఎన్నోకష్టాలు, ప్రైవేట్లు  కదా. వాళ్ళకి టివి ఇమ్మన్నా వాళ్ళ అమ్మా, నాన్నా వాళ్ళకి కావల్సిన ప్రోగ్రాం పెట్టరుకదా ! నాన్న ఎప్పుడూ న్యూసుచానెలు చూస్తూ వుంటారు. నాన్న ఇంట్లో లేనప్పుడు అమ్మ, బామ్మ, పక్కింటిపిన్నిగారు ఎప్పుడూ టి.వి.సీరియల్సు చూస్తూ వుంటారు. మరి ఆ న్యూసుచానెల్సులోను, సీరియల్సులోనూ అందరికీ ఆవేశమూ,  దుక్కమూ ఎక్కువ.  వాళ్ళు దాంతో పక్కవాళ్ళ మీద అరిచేస్తుంటారు కదా. అలా అరుపులు, కేకలు టీవీప్రోగ్రాంలో చూసిచూసి అమ్మా, నాన్న, బామ్మ, పిన్నిగారు ఇలా అందరికీ ఆవేశమో, దుక్కమో పెరిగిపోయి ఇంట్లో చిన్నపిల్లలకి ఈ మధ్యప్రవేట్లు చెప్పటం ఎక్కువయిపోయింది  బుడుగ్స్ .  పిల్లలు దానితో బాగా అల్లరిచిల్లరిగా తయారయిపోతున్నారు.   అందుకని, రమణగారి జన్మదినం జూన్ 28 ని “జాటర్ఢమాల్” దినోత్సవముగా మారుస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయమని నేను మనవి చేసుకుంటున్నాను పిడుగు వాండులారా . ఈ “జాటర్ఢమాల్” అనేది తెలీని తెలుగువారు కూడ ఉండరు కదా మలి. దానికి మరింతగా ప్రాచుర్యం తీసుకురావాలన్నది నా సంకల్పం.ఈ జాటర్ఢమాల్దినోత్సవం నాడు అస్సలెసంబ్లీలో, టీవీసీరియల్సులోనూ జాటర్ఢమాల్ అనే పదం తప్ప అరుచుకోవటాలు, కేకలు ఉండకుండా రూలు పెట్టండి ముక్కుమంత్రిగాలూ .   అస్సలెసంబ్లీలో ఆ రోజు జాటర్ఢమాల్ అని మాత్రమే అనాలి. ఇంకా కోపమొచ్చేస్తే అందరిసభ్యులకేసి చూసేసి జాటర్ఢమాల్ అని గాఠిగా అరిచేసి వాకౌట్చేసెయ్యలి. బుడుగాధ్యక్షుడు చేసేపని నచ్చకపోతే  అస్సలెసంబ్లీ బయట “జాటర్ఢమాల్, జాటర్ఢమాల్” అని నినాదాలు చేసే హక్కు అందరిసభ్యులకీ ఆ రోజున ఉండాలి. అలాకాకుండా అరుపులు, కేకలు, పెడబొబ్బలు పెట్టేసభ్యులని మీరే జాటర్ఢమాల్ అనేసి సస్పెండ్చేసేయ్యండి. దీనివల్ల  ఎన్నోమైకులు, కుర్చీలు, బల్లలు విరగకుండా బోల్డుడబ్బులు మిగులుతాయి కదా  ! ఆ డబ్బులతో  అస్సలెసంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులూ పిల్లలకి కిండర్జాయ్ చాక్లేట్లు పంచిపెట్టండి.   అలాగే ఆవేశమో, దుక్కమో వచ్చినపుడు జాటర్ఢమాల్ పదంవాడాలని మన తెలుగుసీరియల్సు తీసేవారందరికీ కూడా రూలుపెట్టాలి. అత్తగారు కోడలుపైన అరవాలన్నా, కోడలు అత్తగారుపైన అరవాలన్నా – ఎవరైనా పక్కింటివాళ్ళ మీద అరుచుకోవాలన్నా జాటర్ఢమాల్ అని మాత్రమే అనాలని రూలు పెడదాం పిడుగు వాండులారా .  ఆడవాళ్ళు జాటర్ఢమాల్ అంటే ఆవేశము, దుక్కమూకాకుండా చాలా ఫన్నీగా కూడ ఉంటుంది కదా. అప్పుడు పిల్లలు కూడా కార్టూన్లు చూడకుండా హాయిగా టీవీసీరియల్సు మాత్రమే చూస్తారు. ఎవరికీ టీవీరిమోటుతో పని ఉండదు. అలాగే దానితో ఇంట్లో అందరికీ టీవీవాల్యూం వల్ల వచ్చే తలకాయనొప్పి తగ్గి మందులకి వాడుకునే ఖర్చుకూడ తగ్గుతుంది కదా  మలి. ఆ డబ్బులు కూడా పిల్లలచాక్లేట్లకి ఎంచక్కా వాడుకోవచ్చు.   ఈ జాటర్ఢమాల్దినోత్సవం వల్ల ఎన్ని ప్రయోజనాలో చూడండి మలి . ఆవేశమో, దుక్కమో మనలోపల ఉండిపోయి మనగుండెకి గాఠిగా తగులుతూ ఉంటే మనకి డేంజరు కాదూ?మా బాబాయిలాంటి వాళ్ళయితే అలాంటప్పుడు ఏ సిగిరెట్టో తాగేస్తారు. నాన్నలాంటి వారు పక్కవాళ్ళకి ప్రైవేట్లు చెప్పేస్తారు .బామ్మలాంటివాళ్ళు “ఓరివెధవా” అని అరిచేస్తారు. అమ్మలాంటివాళ్ళు గోళ్ళు కొరుక్కుంటూ టీ.విసీరియల్ చూసేస్తారు. వీరందరికీ టీవీప్రోగ్రాంలో జాటర్ఢమాల్ అనుకోవటం చూపిస్తే ఆవేశము, దుక్కమూ తగ్గిపోయి ఎంచక్కా గాఠిగా నవ్వేసి పిల్లలని ముద్దు పెట్టేసుకుంటారు. అప్పుడు పిల్లలుకూడ ఎంచక్కా హాయిగా నవ్వుకుంటూ చదివేసుకుని పెద్దవాళ్ళు చెప్పినట్టు వినేస్తారు.   అలా అందరూ సంతోషంగా ఉండగలిగే మహత్తరమయిన మంత్రం ఈ “జాటర్ఢమాల్” . ఈ మంత్రం మొదట్లో  అస్సలెసంబ్లీలో, టీవీ సీరియల్సు పెట్టినా కానీ, రానురాను ప్రతీవారిచేతా వాడించేలా  కృషిచేసేదిశగా ఒకజాటర్డమాల్కమిటీని కూడా వెయ్యండి  పిడుగు వాండులారా  . ఈ కమిటి వారు దైనందిన జీవితంలో మనం ఎక్కడెక్కడ ఆవేశమూ, దుక్కమూ తెచ్చేసుకుని అరుస్తామో పరిశీలించి జాటర్డమాల్వాడకం ఆ సందర్బాలకి కూడ అన్వయించేలా ప్రతిపాదనలు చేయచ్చు. కావాలంటే ఈ కమిటి అధ్యక్షుడిగా నా వంతు సహకారం అందించటాని కిముందుకు వస్తాను  పిడుగ్స్ . నన్ను అభిమానించే మా అచ్చంగాతెలుగు సబ్యులనుండి కూడ అలాంటి సందర్బాలు సేకరించి, జాటర్ఢమాల్వాడకానికి మరికొన్ని సలహాలు తీసుకుంటాను.   ఈ ప్రతిపాదనలని  సభ్యులలో ఎవరైనా వ్యతిరేకిస్తే వారందరి నీజాటర్ఢమాల్ అనేస్తూ రమణగారికి మరొక్కసారి నా నివాళులు అర్పిస్తూ ఇంతటితో నా ప్రసంగం ముగిస్తున్నా పిడుగ్స్ .  

No comments:

Post a Comment

Pages