చితికిన బ్రతుకుల్లో “ఆశాదీపం” - అచ్చంగా తెలుగు

చితికిన బ్రతుకుల్లో “ఆశాదీపం”

Share This

 చితికిన బ్రతుకుల్లో “ఆశాదీపం”

-      భావరాజు పద్మిని.

నవలలు, నవలికలు రాసే రచయతలు ఉన్నారు. అనేక కొత్త అంశాలపై అలవోకగా రాసెయ్యగల నడిచే ఎన్సైక్లోపీడియా లు ఉన్నారు. ప్రేమను, దుఃఖాన్ని, విజయాన్ని, పరాజయాన్ని, ఇంకా జీవితంలో, ప్రపంచంలో జరిగే అన్ని అంశాలను కవితలుగా కూర్చేవారు ఉన్నారు. కాని తెలిసో తెలియకో ఒక ఊహించని వ్యాధికి గురైతే వారికి ధైర్యం, స్వాంతన చేకూర్చేలా, బ్రతుకు మీద తిరిగి కొత్త ఆశలు చిగురించేలా స్పూర్తిని అందించే పుస్తకాలు మొత్తం తెలుగు సాహిత్యంలో ఎన్ని ఉన్నాయి ? అసలు అటువంటి వాళ్ళ కోసం మేమే ఎందుకు రాయాలి ? అంటారా? ‘మీరూ నేను కలిస్తేనే మనం... మనం మనం కలిస్తేనే జనం... జనం జనం కలిస్తేనే ప్రభంజనం...’ ఎవరో ఒకరు ఈ దిశగా ముందడుగు వెయ్యలిగా, ఆ అడుగు తానే ముందుకు వేసారు శ్రీ సి.పార్ధసారధి గారు, IAS. ఆ అడుగుగు చేదోడుగా నిలిచి, అనేకమంది తెలుగు రచయిత్రులకు స్పూర్తినిచ్చి, వారి కలాలు కదిలించారు అయినంపూడి శ్రీలక్ష్మి గారు. అక్టోబర్ 26, 2013 న జూబ్లి హాల్, హైదరాబాద్ లో APSACS ఆధ్వర్యంలో హెచ్.ఐ.వి. పై “ సాహితీ సమారోహణ కార్యక్రమం “ జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి 138 మంది రచయిత్రులు ఈ సభలో పాల్గొన్నారు. ఆ సభలో ‘తరుణి’ స్వచ్చంద సంస్థ అధినేత మమతా రఘువీర్ గారు ముందుకొచ్చి, HIV సోకిన వారి వాస్తవిక అనుభూతులను రచయిత్రుల ముందుంచారు. సభకు హాజారైన రచయిత్రులు వారి దీన గాధలకు చలించి, కంటతడి పెట్టారు. తమ స్పందనకు వెంటనే అక్షర రూపం కల్పించి, దాదాపు 80 కధలను పంపారు. సంపాదక వర్గంలో హరికృష్ణ మామిడి గారు, అయినంపూడి శ్రీలక్ష్మి గారు, మమతా రఘువీర్ గారు ఉండి, ప్రతీ అడుగులోనూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. అందులో న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన కధలను 59 కధలను “ఆశాదీపం” పేరుతో,  HLFPPT ప్రతినిధి కొవ్వలి డాలి గారి సౌజన్యంతో ప్రచురించడం జరిగింది. మీకో ఆశ్చర్యకరమైన విషయం తెలుసా ?ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ప్రతి ౩౦౦ మందిలో ఇద్దరు హెచ్.ఐ.వి. పాజిటివ్ ఉన్నారు. ఈ వ్యాధి ఉన్నవారికి కావలసింది సానుభూతి కాదు. సహానుభూతి. రోగులకు ఆత్మీయత, ప్రేమానురాగాలు పంచి, వారు ఆ వ్యాధి నుంచి తెరుకోగలిగే మనోధైర్యాన్ని వారి కుటుంబం వారు ఇవ్వాలి. ఆ ధైర్యాన్ని కధల రూపంలో ఇచ్చారు రచయిత్రులు. బాధకు, వ్యాధికి గురైనవారి వెతల్ని మనసు దారంతో అల్లి, 59 మంది రచయిత్రులు అల్లిన సుందర కదంబం “ఆశాదీపం”. హృద్యం, అజరామరం, అద్భుతం ఈ ప్రయత్నం. ఇది సమాజంలో పెరుగుతున్న కొత్త రుగ్మతకు, ఆ రుగ్మత వల్ల జనించే సమస్యలకు, సమిష్టిగా రచయిత్రులు చేసిన ‘సాహితీ వైద్యం’. ‘ఆశాదీపం’ పుస్తకంలోని కొన్ని కధల విశేషాలు చూద్దాం... కొండవీటి సత్యవతి గారి ‘పాలపుంత’ కధ విదివంచితులై, ఉన్నట్లుండి జీవితాల్లో అమావాస్య చీకట్లు కమ్ముకున్న ఓ జంట కలిసి వెన్నెల దారుల్లో పయనించే చక్కటి కధ. ఏదో కోల్పోయాము అని జరిగిన దానికి బాధపడే కంటే, మన చేతుల్లో ఉన్న బంగారు క్షణాల్ని, చిన్న చిన్న ఆనందాల్ని ఆస్వాదించాలన్న సందేశం ఇచ్చే ఈ కధ చితికిన బ్రతుకుల్లో కొత్త ఆశలను చిగురింప చేస్తుంది. డి.కామేశ్వరి గారి ‘మానవత్వం మరువకు’ కధ ‘మానవత్వం మరువకు’ చాలా బాగుంది. పురుషుడి మోసానికి గురై, వేశ్యా గృహానికి చేరి, హెచ్.ఐ.వి సోకిన కవిత, సమాజం పట్ల తనకున్న ద్వేషంతో ‘తనకొచ్చిన జబ్బు ఇతరులకు అంటితే తప్పేముంది ?’ అనుకుంటుంది. చివరికి మగాళ్ళ మీద కోపంతో తాను తీసుకున్న నిర్ణయం మగాళ్ళనే కాదు, వారి కుటుంబాలనూ బలి తీసుకుంటుంది అన్న సత్యాన్ని గ్రహించి, సేవా మార్గంలోకి మారాలని నిర్ణయించుకుంటుంది. కరడుకట్టిన మనసుల్లో సైతం మానవత్వాన్ని మేల్కొలిపేలా ఉంది ఈ కధ ! నెల్లుట్ల రమాదేవి గారి ‘కాంతిరేఖ’ కధ చాలా బాగుంది. ఇది ఏ పాపం తెలియని ఓ కరుణ కధ ! పెళ్ళికి ముందు శృంగార అనుభవం లేకపోతే భార్య ముందు చులకన అవుతావన్న స్నేహితుడి మాటలు నమ్మిన ఆమె భర్త ఓ వేశ్య వద్దకు వెళ్తాడు. అప్పుడతనికి అంటుకున్న రోగం కరుణకు సంక్రమిస్తుంది. అది తెలిసేలోగా అతను మరణిస్తాడు. గర్భవతి అయిన కరుణ తన వారి చీత్కారాలకు గురై, అర్ధరాత్రి జోరువానలో నడిరోడ్డుమీదకు వెలివెయ్యబడుతుంది. తర్వాత ఆమె జీవితం ఎలా మలుపు తిరిగింది, అన్నది రచయిత్రి చాలా అద్భుతంగా వివరించారు. చివరకు దిక్కు లేక తన పంచన చేరిన అత్తమామలను, ‘ఎవరి స్వార్ధం వారు చూసుకునే ఈ ప్రపంచంలో కొద్దిమందైనా దయా స్వరూపులు, ప్రేమను సహానుభూతినీ పంచేవారు లేకపోతే మానవతకు అర్ధం ఉండదు,’ అంటూ కరుణ వారిని చేరదీసిన తీరు రచయిత్రి వర్ణించిన విధానం చాలా హృద్యంగా ఉంది. మొత్తం కధల్లో ఏదీ ఇది తక్కువ, అది ఎక్కువ అని చెప్పేందుకు లేకుండా ఒక్కో కధా ఒక్కో ఆణిముత్యం లా ఉంది. ఒక కధ మనసు మాగాణి తడిపితే, మరో కధ కొత్త ఆలోచనల విత్తులు చల్లింది. ఆ కరడుగట్టిన మనసు విత్తుల గోడలు, మరో కధ మండుటెండ లా చురుగ్గా తాకి చేధిస్తే, ఆ చిట్టి మొలకకు మరో కధ కొత్త ఊపిరి పోసింది. ఇలా కధా- కధా... ఆలోచన ఆలోచన కలిసి, సమస్యలకు ఎదురొడ్డి, ధృడంగా నిలబడి, అనేక మందికి ఆసరా ఇచ్చే ఒక మహావృక్షాన్ని తయారుచేసాయి. ఈ పుస్తకం చదివిన వారు పెడదారి పట్టరు. ఈ పుస్తకం చదివిన వారు హెచ్.ఐ.వి బాధితుల్ని అసహ్యించుకోరు. ఈ పుస్తకం చదివినవారు ఇతరులకు ఈ వ్యాధిని గురించి అవగాహన కల్పించి, ఆసరా అందించగలరు. ఇంతకంటే సాహిత్యానికి పరమార్ధం ఏముంది ? సమాజంలో ఒక నవ చైతన్యానికి తొలి అడుగు ఈ పుస్తకం... తప్పక చదవండి.   పుస్తకం వెల : 450 రూ. ప్రతులకు సంప్రదించండి : HLFPPT, Ph.no.: 040 23298417, 040 23298418.    

No comments:

Post a Comment

Pages