సరస్వతీ దేవి - ఎకో గణేష్
వేసవి సెలవులు ముగిసి పిల్లలు బడికి వెళ్ళే కాలం దగ్గరపడుతోంది. పిల్లలందరు ముఖ్యంగా పూజించవలసిన అమ్మవారు సరస్వతీ దేవి. మన చదువుల తల్లి సరస్వతీ దేవి.
సరస్వతీదేవి తెల్లని వస్త్రాలు సాత్వికతను సూచిస్తాయి. విద్యాభ్యాసం చక్కగా సాగాలంటే ఆహారంలో, ప్రవర్తనలో, మొత్తం జీవితంలో సాత్వికత ఉండాలి. సత్వగుణమే ప్రధానమని సూచిస్తున్నది అమ్మ వస్త్రధారణ. సరస్వతి దేవి ఒక చేతిలో జపమాలను,మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది. వేదం అనంతమైన జ్ఞానానికి సంకేతం. వేదం ఈ సృష్టికి ముందే పరమాత్ముడి ద్వారా ఇవ్వబడింది. వేదం నశించనిది, ఎప్పటికి ఉంటుంది. జపమాల జపానికి సంకేతం. జపమాలతో సరస్వతి దేవి నిరంతరం జపిస్తూ ఉంటుంది. చదువు రావాలి, జ్ఞానాన్ని పొందాలి అంటే, నేర్చుకున్న విషయాన్ని అనేక మార్లు మననం చేయాలి, మనసులో ధారణ చేయాలి. అప్పుడే మనకు సారం అర్ధమవుతుంది.
“తపస్స్వాధ్యాయ నిరతం" అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన, ఆసక్తి ఎంత అవసరమో, తెలిసిన విషయాలను మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవడం కూడా అంతే అవసరం అంటుంది మన ధర్మ శాస్త్రం. సరస్వతి దేవి ఒక చేతిలో జపమాలను, మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది. మిగితా దేవీదేవతలందరూ పువ్వుల్లో కూర్చుంటే చదువుల తల్లి సరస్వతి దేవి మాత్రం రాయి మీద కూర్చొని ఉంటుంది. ఏ పువ్వైనా కొంత సమయం మాత్రమే వికసించి ఉంటుంది. ఉదయానికి వికసించిన పువ్వు సాయంత్రానికి వాడిపోతుంది. కాని రాయి మాత్రం పదిలంగా ఉంటుంది. ఈ లోకంలో విద్య, జ్ఞానం మాత్రమే శాశ్వతమైనవని, సంపదలు కొంత కాలం మాత్రమే ఉంటాయి అని, అమ్మ సందేశం ఇస్తూ, ఎప్పటికి తరిగిపోని విద్యనే అనుగ్రహిస్తానంటోంది.
అమ్మవారి వాహనం హంస - పాలు,నీరు కలిపి హంస ముందు పెడితే హంస నీటిని వేరు చేసి పాలను మాత్రమే త్రాగుతుంది. ఒక నాణానికి బొమ్మ బొరుసుల తరహాలో ప్రతి విషయంలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రతి విషయంలోని మంచిని మాత్రమే వెతికి దానిని మాత్రమే గ్రహించి, చెడును విసర్జించే వారే సరస్వతి దేవికి అత్యంత ప్రియులని, వారి ద్వారా తన వైభవాన్ని చాటుతుందని తన హంస వాహనం ద్వారా అమ్మ సందేశమిస్తోంది.
హంస అంటే ఊపిరి. మనం నిశ్వాస నుంచి "సః" అనే శబ్దం అని వెలువడుతుంది. బయటనుంచి లోపలికి ప్రవశించే ప్రాణవాయువు ఉచ్చ్వాశం "అహం" అంటూ లోనికి ప్రవేశిస్తుంది. ఉచ్చ్వాశ, నిశ్వాసల నిరంతర ప్రక్రియనే హంస జపం అంటారు. శరీరంలో ప్రాణం ఉన్నతవరకు ఈ జపం జరుగుతూనే ఉంటుంది. సః అంటే అతడు, భగవంతుడు, పరమాత్మ అని, అహం అంటే నేను అని అర్ధం. ఇది పరంపరలో, వేగంలో ముందు వెనుకా అయి అహం సః, అహం సః........ అంటూ హంసో హంసో హంసోహం హంస్ససోహం హంసః అంటు బాగా గమనిస్తే సోహం అంటుంది వినిపిస్తుంది. అప్పటివరకు అతడు, నేను అని వెర్వేరుగా వినిపించేది, అతడే నేను గా మారుతుంది. అతడు పరమాత్మ. నేను అంటే జీవాత్మ. అతడే నేను అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. అదే అసలైన విద్య. దానికి ఎంతో సాధన కావాలి. ఈ విద్యకు అధిదేవత మన అమ్మ సరస్వతి దేవి. అందుకే ఆవిడ హంసను వాహనంగా చేసుకుంది.సర్వసతి అన్న పదం కూడా రెండు పదాలను వచ్చింది. సరః అంటే సారము అని, స్వః అంటే నా/వ్యక్తి యొక్క. అందరిలో ఉండే నేను గురించి పూర్తిగా తెలుసుకునే శక్తినిచ్చేది కనుక అమ్మ సరస్వతీ.
ఇంకోమాటలో చెప్పాలంటే ఎవరో చనిపోతారు. అందరూ ఏడుస్తుంటారు, అప్పుడే పోయావో అంటూ శోకాలు పెడతారు. ఇంకా శవాన్ని దహనం చేయలేదు. ఆ వ్యక్తి అక్కడే పడుకుని ఉన్నాడు. కాకపోతే ఉలుకుపలుకు లేదు, బొమ్మలాగా ఉన్నాడు, అంతేకదా. మరి ఎక్కడికో పొవడమేమిటి? ఎక్కడికో పోయింది ఎవరు? కదలకుండా ఉన్న ఆ దేహం ఎవరు? అతనే దేహం అయితే అతను అక్కడే ఉన్నాడు. మరీ ఈ ఏడుపులు, శోకాలు ఎందుకు? వెళ్ళిపోయిందెవరు, పోని అతను వెళ్ళిపోయాడంటే అక్కడ పడి ఉన్నది ఎవరు? అతను ప్రాణం అయితే, ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి పోయింది? అసలు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి. వాటికి సమాధానం చెప్తుందీ విద్య.
ఇన్నాళ్ళు అతన్ని దేహంగా గుర్తించినవారు ఇప్పుడు అతన్ని వెరొక పదార్ధంగా గుర్తిస్తున్నారు. ఆ పదార్ధమే ఆత్మ. దాని గురించి తెలుసుకుంటే ఇక ఈ లోకంలో తెలుసుకోవలసినవంటూ ఏవీ ఉండవు. అది అర్దమైతే అన్ని అర్ద్మైనట్లే. దాన్ని తెలుసుకోవడమే ఆత్మవిద్య. దాన్ని అనిగ్రహించే తల్లీ మాన సరస్వతీదేవి.
సరస్వతీ నమస్థుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా
సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు
No comments:
Post a Comment