రుద్రదండం (జానపద నవల ) - అచ్చంగా తెలుగు

రుద్రదండం (జానపద నవల )

Share This
రుద్రదండం (జానపద నవల )
-       ఫణి రాజ కార్తీక్
(జరిగిన కధ : పార్వతికి తంత్ర విద్య నేర్పుతూ,ఆమె పరధ్యానానికి కోపించిన శివుడు శక్తులను ఆపాదించిన రుద్రదండం త్రిశూలంతో విరిచేస్తాడు. ముక్కలైన రుద్రదండం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు మాంత్రికుడైన మార్తాండ కపాలుడు. ఆ దండంలోని ముక్కలు అనేక చోట్ల జంబూ ద్వీపంలో పడతాయి.   అవి దక్కించుకుని, వాటితో తిరిగి రుద్రదండం తయారు చేసినవాడు దైవసమానుడు అవుతాడు.తన కధను డింభకుడికి చెప్తూ ఉంటాడు మాంత్రికుడు.బీదవాడైన మాంత్రికుడి రాజ్యంలో యువరాణికి అంతుబట్టని జబ్బు చేస్తుంది. అరణ్యంలోని ముని అందించిన శక్తులతో యువరాణి జబ్బును నయం చేస్తాడు మార్తాండ కపాలుడు. అయినా రాజు అర్ధరాజ్యం, యువరాణతో వివాహం చెయ్యక అతడిని బయటకు వెళ్ళగోడతాడు.వికల మనస్సుతో ఒక గుహలోకి వెళ్ళిన అతడికి, శుద్రదేవి విగ్రహం ముందు, ఒక మొండెం, దూరంగా దాని తల కనిపిస్తుంది.దాన్ని గురించి ఓ యక్షిణి ఇలా చెప్పసాగింది...) ఆ మాంత్రికుడి పేరు కాలకూటకపాలుడు. కొన్ని వందల ఏళ్ళ క్రితం ఒక రాకుమారుడు ఆ గుహలోకి ప్రవేశించి, కాలకూటుడితో ద్వ౦ద్వ యుద్ధం చేసి తల, మొండెం వేరుచేసినాడు. మరణించినాడు అని భావించి రాకుమారుడు వెళ్ళాడు కాని, కాలకూటుడు తన మంత్ర శక్తీతో శుద్రదేవిని ఆరాధిస్తూ, పూర్వమే తనకు బంది అయిన నన్ను రక్షణగా పెట్టి, నాకు శాపవిమోచనం (నన్నుఎదిరించి, శుద్ర దేవి మంత్రం చేయటం) చెప్పాడు. అప్పడు శుద్రదేవి వాణి, నువ్వు అంతే తపస్సు చేయి, ఎదురుగా ఉన్న అగ్ని గుండంలో నుండి నీకు వజ్రాయుధ దేహం వస్తుంది అని చెప్పింది. అంతేకాక, ఆ దేహం ఎందుకు అని అడిగే లోపలే, నేను నీకు చూపిన దర్పణ దృశ్య కథ చెప్పి రుద్రదండం గూర్చి చెప్పి నా మార్గం గోచరింపచేసింది. ఇప్పుడు నేను ఏమి చేయాలో అడిగే లోపలే, మా౦త్రికుడికి విధేయుడు అయి ఉండు అని చెప్పి “ఒక ప్రశ్నకే సమాధానం చెప్పేది“ అని మాయం అయిపోయింది. కాని యక్షిణి స్వరం వినపడింది. ”నాకు శాపవిమోచనం కల్పించిన నీకు ధన్యవాదాలు. మాంత్రికుడి దగ్గర విద్యలు నేర్చుకో, అతనికి వచ్చే వజ్రాయుధ దేహం సామాన్యమైనది కాదు” అని... యక్షిణి వరప్రభావంతో నాకు చెప్పినట్లు రుద్రదండం జాడ తెలుసుకున్నాను. అలాగే ఆ కాలకూటుడు స్థావరంలో అన్ని సౌకర్యాలతో కాలం గడుపుతున్నాను. కాలకూటుడి తపస్సు మరీ తీవ్రంగా సాగింది. ఆ తీవ్రత ఎంత అంటే అర్ధరాత్రి వెలుగుగా మారేది. ఇలా కొన్ని దినాలు గడిచిన తరువాత, నేను కూడా కాలకూటుడి మొండెం పక్కన కూర్చొని రోజు తపస్సు చేయటం ప్రారంభించా, ఒక నాడు నేను చూస్తుండగానే మొండెం భస్మం అయింది. అగ్ని గుండంలో నుండి ఒక తేజోమయ బలిష్ట శరీరం బయటకి వచ్చింది. దానికి తల లేదు. అంతే, కాలకూటుడు కళ్ళు తెరచి, ధన్యుడిని శుద్రమాత అని యక్షిణిని పిలిచాడు. ఎవరు రాకపోయేసరికి శాపవిమోచనమైనదని గ్రహించిన కాలకూటుడు నన్ను పిలిచాడు. ”నీ ధ్యేయం ఏమి” అని నన్ను అడిగాడు. “తమరి వద్ద శిష్యరికం చేయటమే” అని వినయంగా జవాబు ఇచ్చాను. కాలకూటుడు మరి కొన్ని ప్రశ్నలు అడిగాడు. నా వృత్తా౦తం చెప్పి నాకు మంత్ర విద్య నేర్పమన్నాను. బిగ్గరగా నవ్విన కాలకూటుడి తల “అలాగే కుమారా” అని ఆశిర్వదించి, తన తలను ఇప్పుడు వచ్చిన మొండెంపై పెట్టమన్నాడు. ఆతలను నేను మోయలేకపోయా. శుద్రదేవి మంత్రం చేస్తూ ఆ తలను తీసుకుపోయి మొండ౦పై పెట్టా, ఎంతో వయసున్న ఆ తల, ఆ మొండెంఫై పెట్టగానే, నిప్పులు కురిపిస్తూ, ఒక బలిష్టమైన యువకుడు ప్రత్యక్షమయ్యాడు. అతను నన్ను మార్తాండకపాల అని పిలిచాడు. నేను కాలకూటుడను లోకమునకు కాబోవు రాజును, దేవుణ్ణి” అని అరిచాడు. గుహ ఆ ధ్వనితో మారుమ్రోగిపోయింది . కాలకూటుడు ఇలా చెప్పసాగాడు ”శిష్యా, నీకు నా అయిదు వందల ఏళ్ళ తపస్సులో సాధించిన విద్యలు నేర్పుతాను. నాకు శిష్యుడవై, నాకు సపర్యలు చేస్తూ కాబోవు దేవుడికి ఇప్పటి నుంచే పూజలు చెయ్యి“ అని అట్టహాసంగా నవ్వాడు. నేను “స్వామి నా వృత్తా౦తం నీకు తెలిపాను కదా, మీ వృత్తా౦తం నాకు చెప్పండి అని నీవలె ప్రాధేయపడ్డాను. ఇలా చెప్పాడు కాలకూటుడు – “నేను ఒక మాంత్రికుడి కొడుకుని, నా తండ్రి నాకు సమస్త విద్యలు నేర్పాడు. నేను అందాన్ని ఆస్వాదించే తుమ్మెదని, ఒకనాడు, ఆకాశమార్గాన పయనం సాగిస్తుండగా ఒక సరస్సులో ఒక అందగత్తె స్నానం చేస్తుంది. తనను చూస్తే బ్రహ్మ దేవుడికే తన సృష్టి మీద ఈర్ష్య కలుగుతుంది. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఎవరు వారు తన ముందు? చంద్రుడు  సైతం రోహిణిని వదిలి తన వెంటవస్తాడు. ఆమె రూపం మరొక రతీదేవి అవతారం. ఆమె పొందుతో తహతహలాడాలని ఆరాటాపడ్డాను. ఆమెను అనుసరించి, ఆమె రాణి అని తెలుసుకున్నాను. వీరుడైన యువరాజును పట్టాభిషేకంలో వరించి పాతివ్రత ధర్మాన్ని పాటిస్తుంది అని తెలుసుకున్నాను. నేను చేసిన పొరపాటు ఏమిటి అంటే, ఆ లావణ్యను కలిసి నా కోరికను బట్టబయలు చేసి, నాకు చేతనైన మంత్రాలు చూపాను. అంతేకాక, నా గూర్చి నా నివాస స్థలం గూర్చి నా శక్తి గూర్చి చెప్పాను. కాని తను మాత్రం “నన్ను క్షమించండి“ అని “నా భర్త తప్ప అన్యులు నాకు పితృ, పుత్ర సమానులు అని అంది“. ఆ కోమలా౦గిని బలాత్కరించటం నాకు ఇష్టం లేదు. ఎంతైనా పువ్వులు విచ్చుకున్నప్పుడు తేనె పిలిస్తేనే కదా తుమ్మెదకు ఆనందం అనుకొని, తనకు తెలియకుండా తనను వెంబడించి, తన భర్త రూపు రేఖలు తెలుసుకొని, ఆమె భర్త లాగా మారాను. ఒక రోజు రాత్రి ఆమె శయన మందిరంలోకి, తన భర్త రూపంలో ప్రవేశించి తనను పొంధబోయాను. తేడా కనిపెట్టిన ఆమె తన పాతివ్రత్యంతో నా నిజరూపాన్ని బట్ట బయలు చేసింది. నేను అక్కడ నుండి పారిపోయాను. నా అధరాల మాటల ద్వారా తన భర్త వచ్చి, ఇంద్రుడు తనకు బహూకరించిన వజ్రాయుధ సమానమైన ఖడ్గంతో నన్ను నరికాడు. అప్పటినుంచి నా కథ నీకు తెలిసిందే, ఇక ఆ యక్షిణి, ఆ రాకుమారి లాగా కాక, నన్ను చూసి తన మగడిగా భావించి మోసపోయింది. దాంతో ఆమె భర్త, తనకు శాపమును, మరియు శాపవిమోచనమును ఇచ్చి, వారి లోకానికి వెళ్ళాడు. తనకు నీవు శాప విమోచనం గావి౦చావు. అయితేనేమి, నీవు నేను కలుసుకున్నాము. జై శుద్ర మాతా అని అన్నాడు. నా మనసులో మెదిలిన రుద్రదండం గూర్చి అడగటం మాత్రం అడగటం స౦శయి౦చాను. దాని గూర్చి నాకు తెలియనట్టే నటించాను. ఎంతైనా రుద్రదండానికి సాటి మేటి, పోటి, మరొకటి లేదుగా. కాని నా మనసు మాత్రం శక్తులకే శక్తి అతీంద్రియ శక్తి రుద్రదండం పైనే ఆలోచన సాధించాను. “నేను నా శక్తులతో పగ తీర్చుకుందామంటే ఆ అల్ప మానవుడు బ్రతికి ఉండడు. ఏలనగా కొన్ని 100ల సంవత్సరాలు అయిందిగా. నేను పగ తీసుకోవలసింది మానవుడి మీద కాదు మానవాళి మీద, నా ధ్యేయం పూర్తి చేసుకొని మానవాళిని నా బానిసలను చేసుకుంటా” అని నవ్వుతూ అన్నాడు. నేను మాత్రం “మీరు తీర్చుకోలేకపోయినా, నేను తీర్చుకుంటా గురుదేవా” అని నా వృత్తాంతం మరొకసారి గుర్తు చేసాను. అలాగే అని నవ్వాడు కపాలకూటుడు. కొన్ని నెలల సమయంలో నాకు కాలకూటుడు అన్ని విద్యలు నేర్పాడు. క్షుద్ర విద్యలు, యక్షిణి విద్యలు, మంత్ర-తంత్రాలు, అస్త్రశస్త్రాలు అన్నీ నేర్పాడు. నేను వాటిని ఎంతో శ్రద్దగా నేర్చుకున్నా. నేను వాటిని ప్రయోగించటంలో నాటికి నేటికి ద్రష్టనయ్యా. ఇంక మా గురువు గారి అనుమతి తీసుకొని ప్రతీకారేచ్చతో మా రాజ్యంలోకి అడుగుపెట్టా. నేను రాజ్యం లోకి అడుగుపెట్టగానే, పొలిమేరలో నన్ను చూసి భీతి చెందారు. నేను నవ్వి ఆకాశంలో  పెద్ద కారుమబ్బు సృష్టి౦చా, వారిని నా వశీకరణ విద్యతో లోబరుచుకున్నా. ఇక నా ప్రతాపం చూపిద్దామని రాజ్య రాజధానికి అంతఃపురానికి బయలుదేరాను. అందరు నా అవతారం చూసి భీతి చెందారు. వారికి ఆకాశంలో సూర్యుడిని, వానని ఒకేసారి చూపాను. అది యాద్రుచ్చికం అనుకొని, నన్ను పిచ్చివాడిగా జమకట్టారు. నా శక్తితో కోట ప్రహరీగోడలు బద్దలు చేశా. దానితో ప్రజలు భీతి చెందారు. వారికి నిప్పుల వర్షం చూపించా, దానికి వాళ్ళు నాకు సాష్టా౦గపడి మ్రొక్కారు. అప్పుడు నాకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇంక నేను ముందుకు సాగాను. వెళ్తూ వెళ్తూ నా రూపాన్ని మునుపటి మర్తా౦డుడిలాగా మార్చాను. రాజభటులు నన్ను చూసి పరిహసించారు. సేనాని మిరీకుడు నాకు ఎదురయ్యాడు. అలా కొంత సేపు కావాలనే వారి ధూషణలను సహించాను. కాని, అంతఃపురం కోట ముందు, ఒక్కసారిగా వారి గుర్రాలతో సహా లేపి విసిరిపారేసాను. సేనాని మోహంలో భయం కనపడింది. నేను “శక్తిహీనుల మీద కాదురా నీ ప్రతాపం ఇప్పుడు చూడు“ అని కొట్టిన దెబ్బకు నేలలో సగం కూరుకుపోయాడు. వాడిని మళ్ళీ పైకి లేపి వాణ్ణి పచ్చడి చేశాను. అలా ఆ దేశ సైన్యాన్ని ఓడించాను. ఎన్నో గుర్రాలు, ఏనుగులు ఎందరో రక్షకభటులు నా ముందు నిలువలేకపోయారు. సేనాని నన్ను చూసి భయపడసాగాడు. సరిగ్గా అప్పుడు ఒక బాణాల సమూహం వచ్చింది. నా చెంతకు వచ్చేసరికి పూలమాలలా మార్చాను. సుమారు గంట సాగిన సమరంలో వారు కనీసం నన్ను తాకను కూడా  తాకలేదు. వారందర్నీ మట్టి కరిపించా. ఆ రోజు ప్రజలందరికీ అది ఒక భయానక దృశ్యమైనది. నేను సేనానితో “నిన్ను చంపితే ఒకేసారి ఛస్తావురా, అందుకే నీకు విడతలు విడతలుగా ఛావుని చూపిస్తాను, మంచి చేసిన వాడి మీద, న్యాయం అడిగిన వాడి మీదరా నీ పౌరుషం, కాస్కో అని ఒక్క ఉదుటన వాడిని గాలి లోంచి రాణి గారి మందిరం లోకి విసిరి వేసాను. ఇక బయట అందర్ని చెల్లాచెదురు చేసాను. అలా కోటలోకి ప్రవేశించబోయాను. చూట్టూ చేరిన ప్రజా సమూహం నన్ను చూసి బెంబేలెత్తి పోయారు. ప్రజలందరు నా ముందు మోకరిల్లారు. దాంతో నా అహం పతాక స్థాయికి చేరింది. వారందరినీ వశీకరణ౦ చేసుకొని వారిని నా అనుచరులుగా మార్చుకున్నా. ఇప్పుడు రాజ్యం మొత్తం నా వశీకరణంలో ఉంది. నేను కోటలోకి వెళ్ళే కొద్ది అందరు నా ఆధీన౦ లోకి రాసాగారు. ఒక్క రాజు, రాణి, సేనాని తప్ప. కావాలనే వారిని వశీకరణం చేయాలా. నేను సింహాసనం మీద కూర్చుందామని ప్రయత్నించే లోపలే రాజు, రాణి, సేనాని నా ముందు మోకరిల్లారు. సేనాని నిలువెల్లా వణికిపోయాడు. నేను వాని వద్దకేగి ఒక నవ్వు నవ్వాను. దానితో వాడు స్పృహ తప్పాడు. రాజు, రాణి ఏడుస్తూ ”యువరాణి పద్మిని దేవి ఒకనాడు స్నానానికి సరస్సుకు పోయినది. ఎంతసేపటికి రాలేదు. భటులను పంపేసరికి యువరాణి మృతదేహం లభించినది. విషసర్పకాటుకు బలై౦దని, శరీరం మొత్తం నల్లగా తయారయ్యిందని నురుగు కక్కుకొందని“ చెప్పారు. నేను కూడా ఆ అందాల రాశిని పొందలేకపోయాను అని బాధపడ్డాను. కాని రాజ్యం అంతా నా పాదాల క్రింద ఉంది. అందరు నా వశీకరణంలో ఉన్నారు. అయినా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి ఆ రాజ్యానికి రాజునయ్యా. ఇంక నా వైభవం సామాన్యమైనది కాదు. విందు, పొందు, చిందు అన్ని తనివితీరా అనుభవించా. సేనాని చేత అన్ని పనులు చేయించుకునేవాడిని. అలా రాజ్యంలో పర్యటిస్తుండగా ప్రజలందరు నారాయణునికి, పరమశివుడుకి, శక్తికి మ్రొక్కటం చూసాను. అప్పుడు నా మదిలో అంతర్మధనం మొదలయింది. అలా కొన్ని సంవత్సరాలు చూసాను. చిన్నగా సేనాని కాలధర్మం చెందాడు. నేను సుఖి౦చిన కాంతలు ముసలివారయి చనిపోవటం చూసాను. నాకు ఏదో ఆరాటం మొదలయింది. నాకున్న శక్తులతో  ఎన్నో రాజ్యాలు జయించాను. చక్రవర్తిని కూడా అయ్యాను. కాని నాకు ఎదో అసంతృప్తి. అందరు నా రాజ్యంలో దేవుడికి మ్రొక్కసాగారు. నేను ఇలా ఆనుకున్నా ‘ఆహా, దేవుడు ఎంత గొప్పవాడు, అయినా అడగకు౦డానే ఆయనను పూజిస్తున్నారు. ఈ రాచరికం, ఈ ఐహికం అంతా దండగ. నేను కూడా భగవంతుడిని అయితే నాకు చిరకాలం సేవలు చేస్తారు, మ్రొక్కుతారు. కాలకూటుడు నేర్పిన ఇచ్ఛామరణం కాకుండా, ఎప్పుడూ చిరంజీవిగా మిగలవచ్చు. అందుకే నేను దేవుణ్ణి, అంత శక్తిమంతుణ్ణి అవుదామని నిర్ణయి౦చుకున్నా. ఎన్ని సంవత్సరాలు అయినా దానిని సాధించి ఈ సృష్టిని పరిపాలించదలిచా. అప్పుడు మొదలయింది నా మనస్సులో రుద్రదండం.... రుద్రదండం... రాజ్యమును, ముసలిరాజుకి అప్పజెప్పి వశీకరణం వెనక్కి తీసుకొని, అలా కొన్ని సంవత్సరాల తరువాత కాలకూటుడి స్థావరానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి కాలకూటుడి తల, మొండెం మళ్ళి వేరైనవి. నేను పరుగున వెళ్లి “గురుదేవా! ఏమైనది?” అని అన్నాను. కాలకూటుడు “మార్తాండకపాల! నేను నీకు తెలుపని వేరొక విషయం ఉంది. అదే రుద్రదండం” అని మళ్ళీ యక్షిణి నాకు చూపిన కథను చెప్పి “దానికోసమే ఇన్ని సంవత్సరాల తపస్సు... ఈ వజ్రదేహం నీవు వెళ్ళిన వెంటనే దాని జాడ కొరకు నేను జంబూద్వీపం వదలి ఒక మంచు ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ అంతా మంచు. సామాన్య మానవుడు అక్కడి చలికి చనిపోతాడు. అక్కడ నాకు ఒక దేవతల బృందం కనపడింది. వారిని చాటుగా పరిశిలించాను. వారందరు వెళ్ళిన తరువాత, ఒక ఇద్దరు దేవతలు అక్కడ ఉండి రుద్రదండం గూర్చి మాట్లాడకొనసాగారు. ఎలాగైనా అది దుష్టుల చేతిలో పడకూడదని అనుకున్నారు. దాని కీలకం ఈ మంచు గుహలో ఉందని చెప్పారు. వారు వెళ్ళిన వెంటనే నేను ఆ మంచు గుహలోకి వెళ్ళాను. అక్కడ మరోకిద్దరు నా మీద దాడి చేసారు. వారు నా మీద యుద్ధం చేస్తూ ఇలా అన్నారు. ”ఓయీ! మాంత్రిక నిన్ను దేవేంద్రుడు కనిపెట్టమని చెప్పాడు, రుద్రదండం కనక నీ చేతికి వస్తే మా ఇంద్రుడి పదవికి ఆటంకం అని వారి దగ్గర ఉన్న వింత ఆయుధాలతో నన్ను పొడిచారు. వారిని నిలువరించలేక నిలుచున్నాను. కాని నా దేహానికి ఏమి కాలేదు. అప్పుడు వారు నా తల పై వేటు వేసి, కాసేపు అంతే ఆ ఆయుధాన్ని ఉంచి మాయం అయ్యారు. నాకు ఆ రుద్రదండపు ఛాయలు ఏమి కనపడలేదు. నేను మళ్ళీ స్థావరానికి వచ్చాను. వచ్చిన పిమ్మట ఈ దేహం కు తల వేరైనది. మళ్ళీ అతుక్కొనుట లేదు. మార్తాండ, నీవు నా మొండాన్ని అగ్ని గుండం లో పడవెయ్యి.  నీ తల తీసి ఈ మొండానికి పెట్టుకో. నీ దేహం కూడా శుద్రమాతకి ఆర్పణం చెయ్యి. అప్పుడు నా ఆత్మ, నీ ఆత్మ కలిసి   వజ్రాయుధ దేహమే కాదు, తలకి వస్తుంది. ఇది నాకు శుద్రమాత వాణి చెప్పింది. కానిమ్ము అన్నాడు. నేను అలాగే గురుదేవా అని అయన తలను అగ్ని గుండంలో పడవేసి, నా తలని నరుక్కొని, శుద్ర దేవిని కీర్తిస్తూ ఆ మొండం పై పెట్టాను. నా మునుపటి మొండెంను అగ్ని గుండంలో త్రోసాను. నేను ఒక దివ్యరూపుడై ఇప్పుడు నువ్వు చూస్తున్న మార్తాండ కపాలునిగా మారాను. ఆనాటి అదియే నా స్థావరం సం||ల తరబడి. ఇప్పుడు ఇదే ఆ స్థావరంగా రూపాంతరం చెందింది. తరువాత మంచు ప్రదేశంలో (కూటుడు చెప్పిన) లోకమంతా తిరిగాను. కాని నాకు రుద్రదండం భాగాల ఛాయలు కనపడలేద. అప్పటి నుండి గాలిస్తున్నా”.. అదిరా డింభకా నా సంక్షిప్త కధ. నిన్ను మెచ్చినానురా సేవకా” అని మార్తాండుడు తన కథ చెప్పటం ముగించాడు. రుద్రదండం సాధనకై తీవ్రంగా ఆలోచించసాగాడు. (సశేషం...)

No comments:

Post a Comment

Pages