అల్లసాని విఘ్నేశ స్తుతి - అచ్చంగా తెలుగు

అల్లసాని విఘ్నేశ స్తుతి

Share This
 అల్లసాని విఘ్నేశ స్తుతి
సత్యనారాయణ పిస్క, మంచిర్యాల.
మొబైల్ :  9849634977.
  ఏ కార్యం ఆరంభించినా ముందుగా విఘ్నాధిపతియైన గణేశుణ్ణి పూజించడం మన హైందవ సంప్రదాయం. మన ప్రాచీన తెలుగుకవులు తమతమ కావ్యారంభాల్లో విఘ్నేశుని ఎలా స్తుతించారో చూద్దామని నావద్ద ఉన్న ప్రబంధాలన్నీ ముందేసుకుని కూర్చున్నాను.
ఐతే, కొంతమంది కవులు తమ కావ్యావతారికల్లో ఆయనను స్మరించకపోవడం విస్మయాన్ని కలిగించింది. చూచినవాటిలో అల్లసానివారి యీ క్రింది పద్యం నాకు బాగా నచ్చింది.... నిజానికి చాలా యేళ్ళ క్రితం (సుమారు 2 దశాబ్దాలకు పూర్వం) ' మనుచరిత్ర ' తొలిసారి పఠించినప్పుడే నన్ను ఈ పద్యం ఆకట్టుకుంది. ఆ రోజుల్లోనే నాకు తోచిన విధంగా వ్యాఖ్యానం రాసుకున్నాను దీనికి! అది మీ దృష్టికి తేవాలని ఈ ప్రయత్నం! మొదట పద్యాన్ని చిత్తగించండి.
'అంకముఁ జేరి శైలతనయా స్తనదుగ్ధము లానువేళ బా ల్యాంక విచేష్ట తొండమున నవ్వలి చన్ గబళింపఁబోయి యా వంకఁ గుచంబుఁ గాన కహివల్లభు హారముఁ గాంచి వే మృణా ళాంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తు నభీష్టసిద్ధికిన్.'
గణపతిదేవుణ్ణి ఎందరో కవులు ఎన్నెన్ని విధాలుగానో ప్రస్తుతించారు. ఐతే, ఈ పద్యంలో చిత్రించినట్టుగా ' బాలవినాయకుడు ' బహుశా మరెక్కడా ప్రత్యక్షమవలేదేమో! ఇందులో కవి అత్యంత రమణీయంగా ఆ గిరిజాతనయుణ్ణి మన కన్నులకు కట్టినట్టుగా చూపించాడు.
         పర్వతరాజ పుత్రిక అయిన పార్వతీదేవి తన గారాల కుమారుడైన చిన్నివినాయకుడికి స్తన్యం ఇవ్వాలని ఒళ్ళోకి తీసుకుంది. పాలు తాగుతున్న ఆ అల్లరిపిల్లాడు కుదురుగా ఉండకుండా తన తొండముతో అవతలివైపున్న రెండో కుచమును అందుకోడానికి ప్రయత్నించాడు. (ఇది చాలా సహజమైన బాల్యచేష్ట! తల్లిపాలు తాగుతున్న పసిపిల్లలను కాసింత పరిశీలనగా పరికిస్తే ఈ దృశ్యాన్ని ఈనాటికీ మన ఇళ్ళల్లో దర్శించవచ్చు)....ఐతే, ఆ వైపున అమ్మగారి రెండవ స్తనం లేదట! పైపెచ్చు, నాగేంద్రహారం ఉందట ఆ చోట! సహృదయ పాఠకులు ఈపాటికి కనిపెట్టే ఉంటారు.
  ఏమంటే, జగన్మాతయైన శైలజ తన నాథుడైన పరమేశ్వరునిలో అర్ధశరీరాన్ని ఆక్రమించుకుని ఉంది కదా!... అందుకే ఆ ప్రక్కన అయ్యగారి తాలూకు పాముల హారాలున్నాయి. పొడవుగా, మెత్తగా ఉండటం చేత అదేదో తామరతూడు కాబోలనుకుని దానితోనే ఆటలాడుతున్నాడట మన బాలగణపతి! ఏనుగులకు కొలనులలో తామరతూండ్లతో క్రీడించడం పరిపాటే! మరి, మన అబ్బాయి గజవదనుడే కదా!
పై పద్యంలోని ' గజాస్య ' పదప్రయోగ ప్రయోజనం ఇదేనని చెప్పవచ్చు!.... ఎంత మనోహరమైన సుందరదృశ్యం...! అరుదైన రీతిలో ఆ విఘ్నేశ్వరుణ్ణి సాక్షాత్కరింపజేయడమే కాక, ఆదిదంపతుల అర్ధనారీశ్వరతత్వాన్ని అందంగా ప్రతిపాదించిన పద్యప్రసూనం ఇది! ఇంతమాత్రమే కాకుండా పై పద్యం ఇంకొక విశేషాన్ని కూడా తనలో ఇముడ్చుకొన్నది. ఆంధ్రకవితా పితామహుడైన అల్లసాని పెద్దన గారి అద్వితీయ ప్రబంధం ' మనుచరిత్ర ' ఆరంభంలో అగుపించే ఈ పద్యంలో కావ్యగతమైన ముఖ్యాంశాన్ని గుంభనగా ధ్వనింపజేశారు కవీంద్రులు!  ' మనుచరిత్ర ' కే మరో పేరు ' స్వారోచిష మనుసంభవము '. అనగా స్వారోచిష మనువు జన్మవృత్తాంతాన్ని తెలిపేదే మనుచరిత్ర! స్వారోచిషమనువు జననీజనకులు వనదేవత - స్వరోచి. మరి, ఆ స్వరోచి ఎవ్వరికి ఉదయించాడంటే వరూధినీ మాయాప్రవరులకు!... మంచుకొండల మధ్యన వరూధిని అభ్యర్థనను తోసిపుచ్చిన ప్రవరాఖ్యుడు, అగ్నిహోత్రుని ప్రార్థించి ఆయన కృపతో తన స్వగ్రామమైన అరుణాస్పదపురానికి వెడలిపోతాడు. ఎప్పటినుండో వరూధినిపై మరులుగొనియున్న ఒక గంధర్వుడు ఇదంతా గమనించి, కామరూపవిద్యతో ప్రవరుని రూపంతో వరూధినిని సమీపిస్తాడు. విరహాతిశయంతో పరితపిస్తున్న ఆ ముద్దరాలు ఈ మాయను గుర్తించక, అతడిని ప్రవరుడిగానే భావించి ఆ భ్రాంతిలో తన సర్వస్వాన్ని అర్పిస్తుంది అమాయకంగా! ఫలితమే స్వరోచి జననం!
         చెప్పవచ్చేదేమంటే, వరూధిని భ్రాంతి స్వరోచి జన్మకు కారణమయింది. మనం చెప్పుకుంటున్న వినాయకస్తుతి పద్యంలో కూడా బాలగణపతి నాగేంద్రహారాన్ని మృణాళాంకురంగా భ్రాంతి పడ్డట్టు వర్ణితమయింది. ఈ భ్రాంతి అనేది ఈ కావ్యంలో ప్రధానపాత్ర వహిస్తుందని పై పద్యం ద్వారా సూచించారు పెద్దనామాత్యులు!

No comments:

Post a Comment

Pages