బాబోయ్! భారతదేశంలో ఆడజన్మ!!!
పెయ్యేటి శ్రీదేవి
ఒకప్పుడు ‘కత్తిపోటు-కలంపోటు’, ‘ఆడవాళ్ళకు చదువు అవసరమా కాదా’ అని వ్యాస పోటీలుండేవి. ఆనాటి స్త్రీల జీవితాలు పెళ్ళికి ముందు తండ్రి చాటున, తరువాత భర్త చాటున, తరువాత పిల్లల చాటున సురక్షితంగా గడిచిపోయేవి. ఆనాటి మహిళలు చదువు లేనందున ఇంటికే పరిమితమై వంటింటి కుందేళ్ళు అన్న బిరుదు పొందారు. ఆనాటి నుంచి చూసుకుంటే , ఈనాటి మహిళలు ఎన్నో తెలివితేటలతో అన్ని రంగాలలో దూసుకుపోయి రాణిస్తున్నారు. అసలీ తెలివితేటలు గాని, ఆలోచనా విధానం గాని స్త్రీలలోనే ఎక్కువగా ఉంటోంది. కాని ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తే స్త్రీల పరిస్థితి గిలగిల కొట్టుకుంటున్న మేకపిల్లలా తయారయింది. స్త్రీల శారీరక బలహీనతలను ఆసరాగా చేసుకుని, ఉచ్చం నీచం లేకుండా, చుట్టూ మృగరాక్షసులు ఎక్కువై పోతున్నారు. ఈ దేశంలో ఏ విధంగాను స్త్రీలకి రక్షణ లేకుండా పోయింది. ఎన్నో దురాచారాలు జరుగుతూంటే, అవి జరగకుండా అరికట్టేది పోయి, నేరస్థులకు కఠిన శిక్షలు వెయ్యకపోగా, మంత్రులందరూ ఎదురు జాగ్రత్తలు స్త్రీలకే చెప్పడం బాధాకరం. అదివరకు ఈ అత్యాచారాలు అక్కడక్కడ జరిగినా, దేశ రాజధాని ఢిల్లీ లోనే నిర్భయ దారుణ సంఘటన జరిగిన తర్వాత మరెన్నో దుర్ఘటనలు జరిగాయి, జరుగుతూనే వున్నాయి. ఆ సంఘటన జరిగిన తర్వాత వెంటనే కఠిన శిక్షలు వెయ్యకపోవడం వల్లనే, అది ఆసరాగా తీసుకుని అదే విధంగా ఇంకా జరుగుతున్నాయి. ఇప్పుడు దేశానికి పోయేకాలం దాపురించినట్టుంది. అదివరకు రాజేంద్రనగర్లో అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఒకమ్మాయి మొహం మీద యాసిడ్ పోశారు. ఆమె మొహం అందవికారంగా తయారయింది. ఆ తర్వాత విజయవాడలో శ్రీలక్ష్మిని ప్రేమించడం లేదని పట్టపగలే కాలేజీలో ఓ దుర్మార్గుడు గొడ్డలితో నరికేసాడు. తరువాత ఒక అమ్మాయి మేడని బ్లేడ్ తో కోసి, ఆమె తల్లిదండ్రులని కూడా చంపేసాడు మరో దుర్మార్గుడు. ఇలా స్త్రీలపై ఎన్నో యాసిడ్ దాడులు, అత్యాచారాలు, సీజనల్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు సీజన్ మారింది. ఇప్పుడు నడుస్తున్నది గ్యాంగ్ రేప్ సీజన్. ఈ వార్తలన్నీ టి.వి.ల్లో వస్తూనే వుంటాయి. కాని ఇవన్నీ మంత్రులు చూడరా? వాళ్ళలో వాళ్ళు తిట్టుకుంటే మాత్రం చర్చలు పెడతారు, పెద్ద గొడవలు చేస్తారు. వీటిని అరికట్టే ప్రయత్నాలు ఎందుకు చెయ్యరు? ఇదీ మన దేశ స్త్రీల విషయంలో దిగజారుడు అభివృద్ధి. ఇదే దినదినాభివృద్ధి చెందుతోంది. స్త్రీ శక్తిస్వరూపిణి అంటారు, ఆదిశక్తి అంటారు. ముగురమ్మల మూలపుటమ్మ స్త్రీ. లక్ష్మి, సరస్వతి, పార్వతి – ఈ ముగురంమలతో పోలుస్తారు మన స్త్రీలని. అలాంటి ఈ మన భారతదేశ మహిళలపై ఇంత దారుణాలా? అవి అందమైన సూక్తులు వరకేనా? యాత్ర నార్యంతు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజింప బడటారో, అక్కడ దేవతలు నర్తిస్తారట. స్త్రీలని కనీసం మర్యాదగానన్నా చూస్తున్నారా? వినాశకాలే విపరీత బుద్ధీః అని దేశానికి వినాశకాలం పట్టింది. ఆనాడు కత్తిపోటు కన్నా కలంపోటే గొప్పదైనా, ఈనాటి పరిస్థితులు చూస్తె కలం కన్నా కత్తికి పడునేక్కువై, ఆ కత్తులతో మహిళల్ని ప్రేమించలేదంటూ నరికేస్తున్నారు. ఈ భారతదేశంలో ఆడవాళ్ళు స్వేచ్చగా తిరగాలంటే చాలా భయపడిపోతున్నారు. కలకంఠీ కంట కన్నీరొలికితే ఇంటికే కాదు, దేశానికి కూడా మంచిది కాదు. స్త్రీల మీద అత్యాచారాలు జరగకుండా ఆత్మరక్షణ చేసుకోవాలట. ఎలా చేసుకోవాలో ఈ మంత్రులే శెలవిచ్చారు. కరాటేలు నేర్చుకోమన్నారు. పెప్పర్ స్ప్రేలు పెట్టుకోవాలన్నారు. పోలీసులకు వెంటనే ఫోన్ చెయ్యాలన్నారు. మరి మూడేళ్ళ పసిపాపలు కూడా ఇవన్నీ చెయ్యగలరా? మరి ఎనభై ఏళ్ళవారు కూడా పెప్పర్ స్ప్రేలు దగ్గర పెట్టుకోవాలనుకుంటారా? నేను ప్రభుత్వాలని, ప్రతిపక్షాలని, పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎన్ని యుగాలు మారినా, ఈ పవిత్ర భారతదేశంలో పసిపాపల నుంచి వయోవృద్ధుల దాకా ఆడవాళ్ళ బ్రతుకులింతేనా? పెప్పర్ స్ప్రేలు దగ్గర పెట్టుకోమంటున్నారు గాని, ఆ పెప్పర్ స్ప్రేలె మృగాళ్ళు ఆడాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. ఇదంతా ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ చూసి, అది ఆదర్శంగా తీసుకున్నట్టుగా అయింది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ గురించి యావద్భారతం కన్నీరు కార్చింది. జరిగిన దారుణం గురించి అందరూ కొవ్వొత్తుల ప్రదర్శనలు చేసారు. సమావేశాలు జరిపి చర్చలూ ఎన్నో చేసారు. ఇక నుంచి ఇలాంటి సంఘటనలు జరిగితే ప్రతిస్పందిస్తామని సినిమా వాళ్ళు ప్రమాణాలు చేసారు. కాని, వీటివల్ల ఏ ప్రయోజనమూ జరగలేదు సరికదా, కీచకులకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంకా ఇంకా అత్యాచారాలు జరుగుతూనే వున్నాయి. స్త్రీలను అవమానించి అతి నీచంగా భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. స్త్రీ జాతిని నాశనం చేస్తున్నారు. రాజధాని ఢిల్లీ నగరంలోనే ఆ తర్వాత ఐదేళ్ళ పాపపై అత్యాచారం జరిగింది. ఇలాంటి కిరాతక చర్యలు ఏ విధంగా రూపుమాపాలని టి.వి.చానెళ్లలో చర్చలు జరిపారు గాని, ఎవరూ ఏకాభిప్రాయానికి రాలేదు. ఎవరిలోనూ సఖ్యతా భావం లేదు. మార్పు రావాలంటే సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది. ఇన్ని రోజులైనా దోషులకి శిక్ష పడలేదు గాని, సినిమా వాళ్ళు డబ్బు చేసుకుందుకు అప్పుడే ఈ సంఘటన గురించి సినిమా తీసేస్తున్నారు. సమాజానికి ఇంకా నేర్పి నాశనం చేయడం కోసం. చలిని కూడా లెక్క చెయ్యకుండా ఢిల్లీ అంటా కదలి వచ్చి నిర్భయకి జరిగిన అన్యాయానికి వెంటనే వాళ్ళని శిక్షించమని కోరితే, మన ప్రభుత్వాలు ఏమీ చేయకపోగా, ఆడవాళ్ళందరూ ముస్తాబయి నినాదాలు చేసారని, రాత్రి ఆడవాళ్ళు తిరగడం ఎందుకని, ఆడవాళ్ళు వంటింటికే పరిమితమై వుండాలని – ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు బాధ్యతారహితంగా కారుకూతలు కూసారు. ఇంట్లో పిల్లల్ని సరిగా పెంచాల్సిన బాధ్యత తల్లితండ్రులది, బయట గురువులది, తరువాత సమాజానిది, సినిమాలది, మీడియా వాళ్ళది, టివి ఛానెళ్ళది. దేశంలో జరిగే అక్రమాలకి, అత్యాచారాలకి జవాబుదారీ పోలీసు యంత్రాంగానిది, ప్రభుత్వాలది. కాని ఇందులో ఏ ఒక్కటీ సక్రమంగా జరగటల్లేదు. తల్లితండ్రులు పిల్లల్ని బాగా పెంచినా, ఇళ్ళలో తిష్ట వేసుకుని కూచున్న టివి ఛానెళ్ళలో వార్తల్లో రాత్రి సినిమా నటీమణుల గురించి చెబుతూ, A తో Z చూడకూడనివన్నీ విచ్చలవిడిగా చూపించేస్తున్నారు. ఇంకా నేడు హింస, అసభ్యకరమైన సినిమాలు టివిలో వస్తూనే వున్నాయి. ఇది చాలదన్నట్టు సినిమాలని తలదన్నే కత్తులతో పొడిచేసే హింసాత్మక సీరియల్స్ వస్తున్నాయి. వీటి ప్రభావం సమాజం మీద పడట్లేదా? ఇక శృంగార సమస్యలు, ఏక్సిడెంట్లదృశ్యాలు, శృంగార సన్నివేశాలు – ఇవన్నీ చూపించడం అంట అవసరమా? ఇది చాలదన్నట్టు సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లో కూడా అసభ్య దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ అరికట్టినప్పుడే సమాజానికి మంచి జరుగుతుంది. కాని ఎవరు మారతారు? సినిమాలు చెడుగా ఉన్నాయంటే సినిమావాళ్ళకి కోపం. జనం చూస్తున్నారు కాబట్టి తీస్తున్నాం అంటారు. తీస్తున్నారు కాబట్టి ఎలా తీసినా చూడక ఛస్తారా? సీరియల్స్ ని అంతే ఛానెల్ వాళ్లకి కోపం. ప్రభుత్వాన్ని అంటే మంత్రులకి కోపం. పోలీసుల్ని అంటే వాళ్ళకీ కోపం. ఎవర్నంటే ఎవరూ ఊరుకోరు. కానీ ఈ సమాజానికి యెంత ద్రోహం చేస్తున్నారో ఎవరూ తెలుసుకోవట్లేదు. సమాజ బాధ్యత అందరికీ వుంది. టివి ఛానెల్స్ అన్నీ ఒక గంజాయి వనంలా తయారయింది. ఆ వనంలో తులసి మొక్కల్లా ‘పాడుతా తీయగా’, కొందరి మహాత్ముల ప్రవచనాలు, భక్తి ఛానెల్స్ లో వచ్చే లలితాసహస్రం, విష్ణుసహశ్రం, సప్తగిరిలో ధర్మ సందేహాలు బాగుంటున్నాయి. కాని మంచి సూక్తులు, దేవుడి స్తోత్రాలు కొంతమందే వింటారు. ఎవడి గోల వాడిదన్నట్టు అనేక రకాల ఛానెల్స్ వున్నప్పుడు జనంలోకి ఆ తులసిమొక్కలు ఎంతవరకు చేరతాయి? సినిమాల్లో, సీరియల్స్ లో చూపించే హింస, వాళ్ళ నటన మాత్రమే అనుకుంటారు. కాని దాని ప్రభావం సమాజం మీద పడి యువత చెడు మార్గాన నడుస్తోంది. ప్రతిఘటన సినిమాలో చూపిన సంఘటన తరవాత నిజంగా నరిగింది. ధనుంజయుని ఉరి తీసిన సంఘటనని టివిలో వివరంగా చూపించేసరికి, ఉరి అంటే ఎలా వుంటుందో అని ఏడుగురు చిన్నపిల్లలు ఉరి వేసుకుని చనిపోయారు. తరువాత ఉరి అనే సినిమా కూడా తీసారు. సీరియల్స్ లో ఉరి వేసుకోవడం చూపించారు. అప్పట్నుంచి ఎన్నోవేల మంది ఉరి వేసుకుని చనిపోయారు. మరి అదే విధంగా సినిమాలలో, సీరియల్స్ లో చూపించే అసభ్యకర దృశ్యాలు, హింసలు, విషప్రయోగాలు – వీటివల్ల మనుషులు ఎంత నీచంగా దిగాజారిపోతున్నారో తెలుసుకోరెందుకని? డబ్బు కోసం నటీ నటులు ఎలా చేయమంటే అలా నటించేస్తారు. తెర వెనుక వాళ్ళు సఖ్యతగా హాయిగా కబుర్లు చెప్పుకుంటారు. కాని చూసే వాళ్ళ మనసులలో దుష్ప్రభావం పడుతోంది. ఎంతో అందమైన అమ్మాయిలని విలన్లుగా చూపిస్తున్నారు. టివి వచ్చిన కొత్తలో ఒక్క హిందీ ఛానెల్, దూరదర్శన్ మాత్రమె వుండేది. అప్పుడు ఇరవైనాలుగు గంటలు టివి కార్యక్రమాలు ఉండేవి కాదు. రామాయణం, ఏ జోహై జిందగీ, గులదస్తా లాంటి మంచి మంచి సీరియల్స్ వచ్చేవి. ప్రతి ఆదివారం ఢిల్లీ దూరదర్సన్ లో ఏదో ఒక భాషా చిత్రం వచ్చేది. బుధ గురువారాల్లో చిత్రలహరి ఉండేది. రాత్రి పదకొండు గంటల వరకు మాత్రమే కార్యక్రమాలు ఉండేవి. అందుకే అప్పుడు ఈ దేశం భ్రష్టు పట్టిపోలేదు. ఇప్పుడు నేరాలు-ఘోరాలు, పారాహుషార్ లు, అంటూ జరుగుతున్నవన్నీ చూపించేస్తున్నారు. రాత్రి పగలు అని లేకుండా ఇరవైనాలుగు గంటలూ టివి కార్యక్రమాలు నడుస్తాయి. అందుకని టివి చూస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు ఇంకా ఇంటర్నెట్, సెల్ ఫోన్లు కూడా తిష్ట వెయ్యడంతో వాటిల్లో వచ్చే అసభ్యకర దృశ్యాలు కూడా చూస్తున్నారు. ఎంత మంచివాళ్ళకైనా చిన్నమెదడులో ఆ దృశ్యాలు రికార్డయిపోతాయి. దీనివల్ల ఎంతోమంది మహిళలు, విద్యార్దినిలు, పిల్లలు, పెద్దవారు అందరూ అత్యాచారాలకు గురౌతున్నారు. అత్యాచారం హత్య కన్నా హేయమైన చర్య. స్త్రీ జాతిని నాశనం చేసే అతి హేయమైన దారిద్ర నీచ నికృష్ట రాక్షస కర్కశ మృగాళ్ళ జాతి అతివేగంగా తయారైపోతోంది. ఇది అంటురోగంలా ఇంకా ఎక్కువగా వ్యాపిస్తోంది. పులులు, సింహాలు, కొండచిలువలు కన్నా ప్రమాదకరమైన ఈ మృగ జాతిని అంతమొందించాల్సిన బాధ్యత అందరిమీదా వుంది. తల్లితండ్రులు బాగా పెంచినా ప్రయోజనం ఏమిటి? పూర్వం తల్లితండ్రులు, గురువులు పిల్లలకి ఎన్నో నీతిబోధలు చేసేవారు. అబద్ధములు ఆడరాదు, ఎల్లప్పుడు సత్యమునే పలుకవలెను, పెద్దలను గౌరవింపుము, పరస్త్రీలను తల్లులుగా గౌరవించవలెను, ఇలా ఎన్నో చెప్పేవారు. మంచి నీటి కథలు చెప్పేవారు. దైవారాధన, పురాణకథలు, క్రమశిక్షణ నేర్పేవారు. ఇప్పుడా పరిస్థితి పోయింది. మగాళ్ళు మృగాళ్ళలా తయారౌతున్నారు. సినిమాల్లో, సీరియల్స్ లో స్త్రీలను అసభ్యంగా చూపిస్తున్నారు. ఆడంబరాలు ఎక్కువయ్యాయి. ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాం కాని పవిత్ర భారతదేశం అపవిత్రమై పోతోంది. ఇండియా ఒక బాత్రూం లాగానో, ఇంకో విధంగానో తయారయింది. అధిక ధరలు, అవినీతి, లంచగొండితనం, దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు అన్నీ పెరిగిపోయాయి. ప్రభుత్వాలు పట్టించుకోవు. వాళ్లకి తమ పదవులు కాపాడుకోవడంతో సరిపోతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, మన హోం మంత్రి, ఇంకా ఎంతో మంది స్త్రీలు మంత్రి పదవులలో రాణిస్తున్నారు. సాటి స్త్రీలకి అన్యాయం జరిగితే వెంటనే చర్యలు తీసుకోలేక పోతున్నారు. ప్రజలకి ప్రభుత్వాల వల్ల గాని, పోలీసుల వల్ల గాని భరోసా లేదు. పోలీసు యంత్రాంగం ప్రభుత్వం అధీనంలో ఉంటుంది కాబట్టి, పోలీసులు ఏం చెయ్యలేరు. అందరిలో స్వార్ధం పెరిగిపోయింది. పాపభీతి లేదు. అవినీతి ఎక్కువైపోయింది. డబ్బుకు భారత్ దాసోహం. అందుకే మన ప్రభుత్వాలకి ప్రజల బాధలు పట్టవు. పైగా అందరూ తలో రకంగా మహిళలపై వ్యాఖ్యలు చేస్తారు. మృగాళ్ళని ఉరి తీస్తే నేరాలు తగ్గవు. నడిరోడ్డులో సున్నంబొట్లు పెట్టి గాడిదల మీద ఊరేగిస్తూ తీసుకెళ్ళి, వాళ్ళని కూడా జూల్లో బోన్లో మెడలో రేపిస్టులు అని బోర్డులు వేలాడేసి నిలబెట్టండి. వచ్చినవాళ్లందరూ వాళ్ళని చూసి ఛీ అని అసహ్యించుకుంటూ వుంటే వాళ్ళు శిగ్గుతో చచ్చిపోవాలి. జంతువులకి పెట్టినట్టే వాళ్లకి కూడా బ్రతకడానికి చాలినంత తిండి పడేయండి. జైళ్లలో పెడితే ప్రయోజనం లేదు. వాళ్లకి వారం వారం నాన్-వెజిటేరియన్ భోజనాలు, ములాఖాత్ లు, సెల్ ఫోన్లు ఇంకా సకల రాజభోగాలు జైళ్లలో సమకూరుతున్నాయి కదా! సమాజంలో ఇటువంటి ఘోరాలు జరగకుండా అందరూ మారాలి. టివిలలో, సినిమాలలో అసభ్యతని, మితిమీరిన హింసని చూపకండి. స్త్రీలని గౌరవించండి. కొవ్వొత్తులు పుచ్చుకు తిరిగినంత మాత్రాన కాదు. ఈనాడు మహిళలు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలో స్త్రీలకే చెబుతున్నారు గాని, వాళ్ళని ఎలా రక్షించాలో, ఎలా కాపాడాలో ఎవరూ ఎటువంటి ప్రయత్నాలు చెయ్యట్లేదు. పైగా ఇవి టివి ఛానెళ్ళలోనూ, బయట వేదికల మీద చర్చనీయాంశంగా మారింది. పరిష్కార మార్గాలు ఎవరూ ఆలోచించట్లేదు. అన్ని సమస్యలకి పరిష్కార మార్గాలుంటాయి. కాని ఆ సమస్యలు ఎందుకు తలెత్తాయో ఆలోచించి, వాటి మూలాలని కూకటివేళ్ళతో పెళ్ళగించి పరిష్కరించాలి. ఈ విషయంలో స్వార్ధం మాని అందరూ నడుం బిగించి మన దేశ స్త్రీలను, మన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా వుంది. ఇది చర్చనీయాంశంగానే కాకుండా, ఆచరణలోకి వచ్చేలాగ చూద్దాం. ఇది గత ప్రభుత్వంలో జరిగిన సంఘటనలకి స్పందించి రాసిన వ్యాసం. ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి. ఈ కొత్త ప్రభుత్వంలోనైనా దేశంలో మార్పు వస్తుందని ఆశ పడ్డాను. పాతసీసాలో కొత్త సారాలా మళ్ళీ అవే అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, యాక్సిడెంట్లు, అధిక ధరలు. ఎటువంటి చిన్న మార్పూ లేదు. ఉచిత వాగ్దానాలు తప్ప వాళ్ళ మానిఫెస్టోలలోకి ఇవి రావా? ఎన్నికలైపోయాయిగా! వాళ్ళ పదవులకి ఐదేళ్ళ దాకా డోకా లేదు. ప్రజలేమైపోతేనేం? ఇదేనా మన భారతదేశం?
No comments:
Post a Comment