ప్రకృతి పరిశీలనము - మానసిక ప్రశాంతత - డా. వారణాసి రామబ్రహ్మం
మనము ప్రకృతి సాయముతో మనశ్శాంతిని పొందవచ్చు. వానజల్లు పడుతోంటే ఇంట్లో కిటికీ దగ్గర కూర్చుని ఆ వానజల్లుని ఆనందించవచ్చు. ఇంకా సరదా, ఉత్సాహము ఉంటె ఆ వాన జల్లులో తడిసి గంతులు వేయచ్చు.
పున్నమి వెన్నెలలో డాబా పైన కూర్చుని ఆ హాయిని, చల్లదనాన్ని జుర్రుకోవచ్చు. శీతాకాలములో నును వెచ్చని సూర్య రశ్మిని ఒంటిపై పడేట్లు చేసుకోవచ్చు. పక్షుల కిల కిలారావములు వినచ్చు. వికసించిన పూవుల అందాన్ని చూస్తూ ;మైమరుస్తూ వాటి పరిమళముల ఆస్వాదనలో ఒళ్ళు మరిచిపోవచ్చు. పచ్చని చెట్లు చూస్తూ వాటి పచ్చదనానికి మురుస్తూ, మనని మరుస్తూ అన్నీ మరిచి పోవచ్చు.
మనసు ప్రకృతి దృశ్యములలో లీనమైన స్థితి నిర్మల మానసిక స్థితి.
మన జ్ఞానేన్ద్రియములైన కన్నులు, చెవులు, ముక్కు, చర్మము, నాలుక - ప్రకృతిలో గల దృశ్యములు, ధ్వనులు, నిశ్శబ్దము, పరిమళములు, స్పర్శలు, రుచుల లో లీనమైతే అదే ఆత్మానుభవము. మనసనేది వేరే ఉండకుండా గ్రహించిన విషయముతో (దృశ్యములు, ధ్వనులు, నిశ్శబ్దము, పరిమళములు, స్పర్శలు, రుచులతో) గాని, లేదా ఆ విషయము కలిగించిన అనుభవముతో (వాసన, జ్ఞప్తితో) గాని తాదాత్మ్యము చెందితే మనసుకు ప్రశాంతత కలుగుతుంది.
ఆధ్యాత్మిక ఉపాసనలు, పూజలు, దర్శనములు, ధ్యానపద్ధతులు అన్నీ కూడా మనసు ప్రశాంతతను పొందడానికి ఏర్పరచినవే. నిజానికి భగవంతుడు సర్వ వ్యాపి అని మనందరకూ ఎఱుకే. వ్యక్తితత్వము మరుగైన సమయమే భగవత్ సమయము. ప్రకృతిలో తాదాత్మ్యమైన మనసే ఆత్మ. బ్రహ్మము.
ఆత్మానుభవము, బ్రహ్మానుభవము అని పెద్ద పెద్ద మాటలు వాడి మనలను ఈ కపట సన్యాసులు, అమ్మలు, బాబాలు, కుగురువులు, పరిణితి, పరిక్వత చెందని సామాన్యులు ఆధ్యాత్మిక కుటీరాలు, భవంతులు పెట్టుకుని వేషాలు వేసి (అన్నీ పొట్ట కూటికే) అదరగొడతారు, హడల గొడతారు గాని ఆత్మానుభవము అదే ప్రశాంత మానసిక స్థితి మన కరతలామలకము. అరచేతిలోని ఉసిరికాయ.
మనని (వ్యక్తిత్వాన్ని), మనముని (మనసుని) భగవత్ నామ స్మరణలోను (నామము శబ్దము లేక ధ్వని కదా), భగవత్ రూప దర్శనము లోను (దృశ్యము) లీనము చేయడము ఆధ్యాత్మికత. అన్ని జ్ఞానేన్ద్రియములతోను ప్రకృతిని మనసుద్వారా ఆస్వాదించి ఆ విషయములలో మనసు రమించి లీనము కాగా మనము పొందే రస స్థితి కూడా ఆధ్యాత్మిక అనుభవమే.
జ్ఞానేన్ద్రియములని ఉపయోగించుకుని మనసుని గ్రిహిత వస్తువులో లీనము చేసుకుంటే అది సగుణ మార్గము. జ్ఞానేన్ద్రియములని, మనసుని విరామస్థితి లోనికి తీసికొని వెళితే అది నిర్గుణ మార్గము. రెండు మార్గములలోనూ మనకి తెలిసి, తెలియక మనసుని గ్రహిత వస్తువులో లీనము చేస్తాము. నిర్గుణ మార్గములో ఆత్మ లేక బ్రహ్మము గ్రహిత వస్తువు.
మన ఆనంద లేదా శాంత, ప్రశాంత లేదా మౌన స్థితియే మోక్షస్థితి. నిర్వాణస్థితి. సకల ధ్యాన పద్ధతుల గమ్య స్థితి. మనము నిండుకున్న స్థితి. పూర్ణత నిండిన స్థితి.
అలా ప్రకృతిని పరిశీలిస్తూ అందులో తాదాత్మ్యము చెందడమూ ఆధ్యాత్మికతయే.
భగవన్నామ స్మరణములోనూ, భగవద్రూప దర్శనము లోనూ లీనమయ్యే వ్యక్తిత్వమూ, అన్తఃకరణములూ, ప్రకృతి పరిశీలనములోనూ తాదాత్మ్యము చెంది విరమింప బడతాయి.
మన అన్ని మానసిక కార్య కలాపములు నిర్వహించే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అవి అనుసంధానింప బడే అంతర (విషయ, విషయానుభవముల యొక్క ముద్రా సమాహారము) , బహిర్ (జ్ఞానేంద్రియముల సాయముతో గ్రహించ బడే బయటి భౌతిక ప్రపంచము) జగత్తులతో సహా దృష్టి యందు విరమింప బడి సకలమూ, సమస్తమూ భగవన్మయము లేక చిన్మయము కావడమే జ్ఞాన గమ్యము. అది తెలిసికొని ఆ జ్ఞాన స్స్తితిని పొందడమే జ్ఞానము.
No comments:
Post a Comment