సినిమా తత్వం వెనుక శివతత్వం – తనికెళ్ళ భరణి
- పరవస్తు నాగసాయి సూరి
రచనల మధ్య నట స్వరూపం...
నటిస్తూనే దర్శక విశ్వరూపం...
వెండితెరపై ఆకట్టుకునే నట స్వరూపం...
‘(సిని)మా’లిన్యం అంటని శివస్వరూపం...
అంతా శివుడే అంటారు....
అంతలోనే డిసైడ్ చేస్తానంటారు....
ఆటగదరా శివా అంటారు...
ఆట మొదలెట్టేశానంటారు...
శివ చిలకల చిద్విలాసానికి సాక్షీ భూతంగా నిలిచే ఆ శివపుత్రుడు తనికెళ్ళ భరణి.
చిన్నప్పణ్నుంచి నాటకాలంటే మోజు. అదే ఆయన్ను స్టేజి ఆర్టిస్టును చేసింది. ప్రముఖ హాస్యనటుడు రాళ్ళపల్లితో పరిచయం ఆయన గమనాన్ని సినిమా పరిశ్రమవైపు తీసుకెళ్ళింది. 1984లో కంచు కవచం సినిమా ద్వారా మాటల రచయితగా తొలి అవకాశం దక్కింది. ఫర్వాలేదనుకున్నారు. ప్రయత్నాలు మొదలు పెట్టారు. అంతలో వంశీ దర్శకత్వంలో ఓ సినిమా. పేరు లేడీస్ టైలర్. జమ్మ జచ్చతో అదృష్టాన్ని పరీక్షించుకునే కథానాయకుడితో పాటు... జమాజటజలతో భరణి కూడా తన కలం బలమేంటో చూపించారు. రచయితగా అద్భుతమనిపించడమే కాదు... నటుడిగానూ పని కొస్తారని నిరూపించుకున్నారు. అనంతరం మాటల రచయితగా ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. నవ్వించే మాటలతో వెండితెరపై ఆయుష్షు పెంచుకున్నారు.
సరిగ్గా అప్పుడే వంశీ దర్శకత్వంలోనే తెరకెక్కిన మరో చిత్రం శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్... ఈ సినిమా తనికెళ్ళ భరణికి మంచి పేరు తీసుకొచ్చింది. చెట్టుకింద ప్లీడర్ లో పాత సామాన్లు కొంటాం అంటూ... ప్రేక్షకులకు మరింత కొత్తగా పరిచయం అయ్యాడు. ఓ మంచి హాస్య నటుడు వెండితెరకు వచ్చాడు అనుకున్నారంతా. అంతలో శివ సినిమాలో నానాజీ అనే పాత్రతో తనలోని మరో కోణాన్ని చూపించారు. ఇంకేముంది వరుస విలనీ పాత్రలు వెతుక్కుంటూ రావడం మొదలయ్యాయి. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమా ద్వారా కామెడీ విలనీనీ పోషించ గలనని నిరూపించారు. దానికి దీనికని కాదు ఏ పాత్ర ఇచ్చినా... భరణి పూర్తి న్యాయం చేయగలరనే పేరు సంపాదించుకున్నారు.
రచయితగా, హాస్యనటుడిగా, ప్రతినాయకుడిగా, క్యారక్టర్ నటుడిగా సాగుతున్న భరణి కెరీర్ లో జనాలకు మరో పార్శ్వం పరిచయమైంది. ఎంత నటిస్తున్నా ఏదో తెలియని వెలితి. అందరు రచయితలకు సాధారణంగా ఉండే వెలితే. అదే దర్శకత్వం. నటుడిగా బిజీగా ఉంటునే స్వీయ దర్శకత్వంలో సిరా అనే లఘు చిత్రం ద్వారా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. బాలు, లక్ష్మిలతో తెలుగింటి అమ్మనాన్నల ప్రేమకథను పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కించిన మిథునం సినిమాను ఆస్వాదించని తెలుగువారు ఎవరున్నారు.
సినిమా అనేది భరణి అనే నాణేనికి ఒక వైపు ఉన్న అచ్చు మాత్రమే. రెండో వైపు ఉన్న బొమ్మ సాక్షాత్తు పరమ శివుడే. పరమేశ్వరుడి మీద అచంచల భక్తితో తెలంగాణ యాసలో శభాష్ రా శంకరా పేరుతో శివ తత్వాన్ని ఆవిష్కరించారు. అంతేనా పరికిణి, నక్షత్ర దర్శనం, ఎందరో మహానుభావులు, ఆటగదరా శివా లాంటి రచనలతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. శభాష్ రా శంకరా, ఆటగదరా శివా, నా మనసు కోతిరా రామా లాంటి ఆడియో సీడీలను రూపొందించారు.
భరణికి సినిమా జ్ఞాపకం... రచన వ్యాపకం... దర్శకత్వం దైవికం... శివుడు జీవితం... అందుకే సినిమా రంగంలో ఉన్నా... ఆ ప్రభావం ఆయన మీద పడలేదు. తామరాకు మీద నీటిబొట్టులా నిత్య శివగంగలో మునుగుతూనే ఉన్నారు. శివచిలుకలా ఎగురుతూనే ఉన్నారు.
శభాష్ రా శంకరా...
http://www.youtube.com/watch?v=TFyUQoneJi8&hd=1
మిథునం చిత్రం
http://www.youtube.com/watch?v=13TQ13cdrXg&hd=1
సిరా లఘు చిత్రం
ఆట గదరా శివా
http://www.youtube.com/watch?v=Gmvyw5MdBWs&hd=1
No comments:
Post a Comment