అది – వాడు – చేప - అచ్చంగా తెలుగు

అది – వాడు – చేప

Share This
అది – వాడు – చేప         
- బి.వి.ఎస్. రామారావు
 “ఓసెక్కడికే లాక్కుపోతున్నావు. పొద్దుగూకిందంటే రేపు నావ వదిలేత్తారు. నన్నొగ్గెయ్యి” గోడు పెట్టాడు సొట్టమావ్. వాడి మాటలేవీ వినిపించుకోటం లేదు. బుసలు కొడుతూ ఏక బిగిన తెడ్డేసి కొండ చాటుకు పోనిస్తోంది నావను. “ఆడొక్కడినే ఎందుకు పోనిచ్చావు యెర్రి మొగమా! నువ్వూ ఆడెంటే పోవాల్సింది.” “కాదు మావా! సీరట్టుకు రమ్మన్నాను. ఆ వచ్చినోడు సేతిలో డబ్బడితే ఆడు ఏం సేత్తాడో ఆ దేవుడికే ఎరుక. నాగులసవితినాడు కోకట్టుకొస్తానని సీతానగరం కాడ సంతకెళ్ళి సత్తుగిన్నట్టుకొచ్చాడు. “ఏటిరా ఈ గిన్నట్టుకొచ్చావని నిల్దీసి అడిగితే, ‘నా కూడు ఈ గిన్నెలోనే పెట్టు. నేను నీ ఎంగిలి గిన్నెలో తినను’ అని బిగిసిపోనాడు.” “అందులో తప్పేముందేస్?” “ఎంగిలిట ఎంగిలి! సెమటెట్టి ఒళ్ళంతా సిరాకెత్తిపోతుంటే నా మూతి నాకే లంజకొడుక్కి ఎంగిలి పనికి రానేదేటి.” “పోనీలేని! అయన్నీ యిప్పుడెందుకు? నావ తిప్పేయి బేగీ పోవాలి.” నావ కొండ మొదలికి చేరింది. చుట్టూ కనుచూపు మేరలో మరే నావా లేదు. తెడ్డొదిలేసి తొట్టి నడుమ సొట్టమావ ముందు నిలబడింది. కొండగాలికి చెదిరిన పమిట కెరటాల్లా గాలిలోకి తేలిపోతోంది. విరబోసిన జుట్టు విసురుగా ముఖమంతా పాకేస్తోంది. “మావ! నిన్ను సేసుకోమంటే బుద్ధి గుడిసేటిదయి ఆడిని సేసుకొన్నాను. నాకు బాగా సాస్తి అయింది. నేనీ చనం నుంచీ నీ దాన్ని. నన్ను నీ యిట్టం వచ్చినట్టు సేసుకో” అంటూ చేతులు బారచాపి కళ్ళు మూసేసుకుంది. వాడు  తనపై పడి వాటేసుకోవాలని, దారుణంగా తనని చెరచాలని కసితీరా తను చెడాలని ఆశించింది. కాని, నిముషాలు గడిచినా ఏమీ జరగలేదు, కళ్ళు తెరిచి చూసింది. నీరసంగా ముడుచుకు కూర్చున్నాడు సొట్టమావ. ఏటాలస్యం అన్నట్టు వాడీకేసి సూటిగా చూసింది. “ఓసోసి! ఈయాల శివరేతిరి. నేనట్టాంటి ఎదవపన్లు సేయనే” అన్నాడు బెదురు చూపులు చూస్తూ. “ఎదవ సన్నాసి- నువ్వూ ఇంతేనన్న మాట.” అనుకొని గిర్రున తెడ్డును మరింత గిర్రుమని తిప్పుతూ నావను మళ్ళించింది. నిమిషాలమీద నావ సంబరం చేరుకుంది.
3
          అంతా చీకటిమయం. తెల్లని ఇసుక తిప్పల నడుమ నల్లని గోదావరి నిశ్శబ్దంగా పారుతోంది. పరిచిన గొంగళిలో గొంగళి పురుగులా మండకొడిగా సాగుతోందా నావ. రేవులో దానికి, దాని మొగుడికి మధ్య జరిగిన ముష్టియుద్ధాన్ని తనివితీరా చూసిన జనాభా ఆఖరికి కల్గజేసుకుని చివాట్లెట్టి వారిమధ్య రాజీ కుదర్చడంలో విఫలమై “మీ వూరెళ్ళి అక్కడ తాపీగా తేల్చుకోండి” అని సబబు చెప్పి బలవంతంగా ఆ జంటని నావలో కెక్కించి నావని గెంటారు. బుసలు కొడుతూ పడిచెక్క నానుకొని తొట్టిలో కూర్చుంది అది. బిగుసుకుపోయి ఆవరం తట్టుమీద కూర్చున్నాడు వాడు. పాదాలకు కొత్త హవాయి చెప్పులు, కళ్ళకి గంతల్లాంటి నల్ల కళ్ళజోడు వాడ్ని ఇంకా అంటిపెట్టుకొన్నాయి. చుట్టూచలిగా ఉన్నా ఆ ఎడముఖం పెడముఖం మధ్యనున్న గాలి భగ్గుభగ్గున మండిపోవడంతో చిరుచెమట్లు పట్టాయి దానికి, వాడికి. గంటలు గడిచాయి. ప్రయాణం సాగటం లేదు. ఇంకా గమ్యానికి సగం పైచిలుకు దూరం ఉంది. చుక్క పొడిచింది. వెలుతురు మసగ్గా ఉంది. ఒళ్ళు విరుచుకుని ఆవలించాడు వాడు, ఏదో అలికిడి విన్నట్టయింది. తాటిదూలం లాంటిది నీటిలో దూసుకుపోతున్నట్లనిపించింది. ఏమిటో తెలుసుకోడానికి తొట్టెలో తన వల తీసి యథాలాపంగా విసిరాడు. వలతాడు బిగుసుకుంది. ఎంత లాగినా రాలేదు. నీటిలో పెద్ద బుడగలు వచ్చాయి. ఆ బుడగలను చీల్చి రెండు గజాల ఎత్తుకెగిరింది ఏదో ఆకారం. అదో పెద్ద చేపని పసిగట్టాడు వల తాడుతో పాటు దానికి చిక్కిన గేలం తాడు కూడా తన చేతిలో ఉండటం గమనించాడు. రెంటినీ మెలేసి గట్టిగా పట్టుకున్నాడు. వలబాపతు రాతిపూసలు, వాటితో పాటు గేలం, చేప తల ప్రక్కనున్న మొప్పలో ఇరుక్కుపోయాయి. వాటిని విదుల్చుకోడానికి చేప గిలగిల్లాడింది. “అమ్మనీయమ్మ పండిగొప్ప” అని బిగ్గరగా అరిచాడు వాడు- తనలోతనే. బారెడు పొడుగున్న ఆ చేపని పండిగొప్పంటారు. సాధారణంగా అలాంటి చేపలు ఆ ప్రాంతానికి రావడం అరుదు. మనిషంత బరువుండే ఆ చేపకి నీటిలో మనిషికన్న పదిరెట్లు శక్తుంటుంది. అలాంటి చేపల్ని పట్టడానికి ప్రత్యేకమైన వలలుంటాయి. వీడు విసిరిన గేలం ఆ చేపమొప్పలో తగులుకోడం అన్నది అరుదుగా జరిగే విశేషం. తాళ్ళను బలంగా లాగి పడిచెక్కకు కట్టేశాడు. జలాంతర్గామిలా చేప ప్రవాహానికి సుడులు తిరిగింది. దానికో నావ అడ్డం తిరగగా, పెద్ద కెరటం లేచి నావలో పడింది నావలో మడవదాకా నీళ్ళు చేరాయి. అది చూసి విసుక్కుంది అది, చేప తన వేగాన్ని రెట్టింపు చేసి ప్రవాహాన్ని చీలుస్తూ నావని లాక్కుపోతోంది, చేపకి, నావకి నాలుగు బారల దూరం ఉంది. ఆ దూరాన్ని తగ్గించడానికి వలని తాడునీ తాగబోయి పట్టుతప్పి దభీమని తొట్టిలో కూలబడ్డాడు వాడు! ఆ అదురులో వదులుగా ముక్కు మీదకు జారిన కళ్ళజోడు ఎగిరి గోదాట్లో పడింది. రబ్బరుచెప్పుల పట్టీలు తెగిపోయాయి. అది చూసి ఫక్కున నవ్వింది అది. తెగిన చెప్పులను గోదాట్లో విసిరేశాడు వాడు, పౌరుషం వచ్చి. ఆ రెండు వస్తువులూ అలా గోదాట్లో కొట్టుకుపోతుంటే సింగారే కొట్టుకుపోయి పీడ వదిలినట్లనిపించింది దానికి. అప్పటిదాకా ఏమీ పట్టించుకోనిదల్లా ఆవలిస్తూ ఒళ్ళు విరిచి తన వల తీసి చేపకేసి ఒడుపుగా విసిరింది. వల విసరడంలో దానికదే సాటి. విల్లులా శరీరాన్ని వంచి గిర్రున తిరుగుతూ వల విసిరితే అది గురితప్పక సూటిగా పువ్వులా విచ్చుకుంటుంది. ఆ వల పూర్తిగా కప్పేయడంతో చేప చెదిరి తన దిశమార్చి అడ్డం తిరిగి వల తప్పించుకుంది. దాంతో నావకూడా ఉన్నట్టుండి అడ్డం తిరిగింది ఆ క్షణంలో వలతాడు కాస్త వదులు అవడం గమనించి బిగియలాగి కొయ్యపెట్టెకి చుట్టేశాడు వాడు. దానితో చేప కి, నావకి మధ్య దూరం రెండు బారలలోపులో పడింది. చేప నావని గిరగిర తిప్పసాగింది. వలతాడు తెగిపోయింది. గేలం తాడు మాత్రం మిగిలింది. అదీ ఏక్షణానయినా తెగిపోవచ్చు. చేజిక్కిన చేప చేజారిపోవచ్చు. దభీమని చేపమీదకి దూకేశాడు వాడు. దానితో కలియబడి దాని తలని వాటేసుకుని మొప్పల్లో అరచేతులు రెండూ దూర్చేశాడు. చేపకి భయంకరమైన కోపం వచ్చింది. పొలుసులన్నీ నిక్కపొడుచుకున్నాయి. సర్రుమని తోక జాడించి వాడి ఛాతీని ముట్టెతో ఢీకొట్టింది. వాడి గిలగిల్లాడిపోయాడు. అదురుకి గేలం తాడు కాస్తా తెగిపోయింది. చేప వాడి వేళ్ళను కరవబోయింది, వాడు ఒడుపుగా దాని దవడలను సాగదీసి పట్టుకున్నాడు. నావ దూరమై, నావభారం వదలగానే చేప విజృంభించి వాడితో ముఖాముఖి యుద్ధానికి దిగింది. అక్కడ గోదావరి రెండు తాళ్ళలోతుంటుంది. వాడు దాని గెడ్డం పట్టుకుని వ్రేలాడుతున్నాడు. ఉన్నట్టుండి వాడిని లోతులోకి ఈడ్చేసింది. వాడు బాణంలా దాన్తో పాటే దూసుకుపోతున్నాడు. మరుక్షణం జువ్వలా నీటిమట్టంపైకి తేలింది. వాడూ పైకి తేలి చుట్టూ కలియజూశాడు. నావ బాగా దూరమైపోయింది. మళ్ళీ వాడిని లోతులోకి లాగేసింది. అలా పైకి, క్రిందకి ఈదుతూ వాడి పట్టు వదుల్చుకోడానికి ప్రయత్నిస్తోందా చేప. కాలికో బండరాయి తగలడంతో దానిని తన్నిపెట్టి బలవంతాన చేపని వాడు ఈతకి మళ్ళించాడు. దానితో నావ దగ్గరైంది. వాడికోసం వేయికళ్ళతో చూస్తూ కూర్చుంది అది. పైకి తేలగానే వాటం చూసి కట్టుతాడు విసరడానికి. నాలుగైదు సార్లు ప్రయత్నించిన మీదట కట్టుతాడు వాడికందింది. అమాంతం ఒక చెయ్యి వదులు చేసుకుని తాడు కొసని చేప మొప్పలోకి దూర్చి రెండోచెయ్యి కూడా తప్పించుకొని పీటముడి వేసేశాడు. అప్పటికే వాడెంతో అలిసిపోయాడు. తాడట్టుకు పైకి తేలి నావ ఎక్కాడు. ఉన్నట్టుండి చేప లోతులోకి దూసుకుపోయింది. దాంతో నావ ఒక ప్రక్కకి వాలింది. మరికాస్త వాలితే తొట్టిలోకి నీళ్ళు ఎక్కి మునిగిపోతుంది. అప్పటికే తొట్టిలోకి చాలా నీళ్ళు ఎక్కేశాయి. వాడు- అది నీటిలోకి దిగి నావ అవతల ప్రక్కన వ్రేల్లాడారు. నావని తూకంగా ఉంచడం కోసం. చేప స్తబ్దురాలై పోయింది. అది కాసేపు సేద తీర్చుకొని మళ్ళీ విజృంభిస్తుందన్న సంగతి వాడికీ తెలుసు, దానికీ తెలుసు! “ఒసే! నువ్వు కోలేసి మెరకున్న కాడికి నావని పట్టించు, నేను తొట్టిలో నీళ్ళు తోడేస్తా” అనడమేమిటి ఇద్దరూ శక్తి మేర రంగంలోకి దూకారు. అది ఒంటి కోలేస్తూ నావని తిప్పకేసి నడిపిస్తూంటే, వాడు జబ్బ పులిసిపోయేలా తాటాకు చేదతో నీళ్ళు తోడేస్తున్నాడు. ఇంకో పదిబారల్లో మెరక తగుల్తుందనగా చేప మళ్ళీ విజృంభించి ఎదురుపడిలోకి నావని లాక్కుపోయింది. “లాభం లేదు మావా. సేపలిసిపోయేదాకా అంతే. దాన్ని నావకాడికి లాక్కొచ్చి అలిసేటట్టు సేద్దాం.” దాని మాట నిజమేనని, చేపకి కట్టిన తాడు బలంగా లాగనారంభించాడు వాడు. అదీ వాడికి తోడైంది. ఇద్దరూ తొట్టిలో వంపులను తన్నిపెట్టుకొని తాడు లాగడం మొదలుపెట్టారు, ఎంతో శ్రమ పడితేకాని మూరెడు తాడు ముందుకు రాలేదు. ఇద్దరికీ కసి పెరిగింది. పళ్ళు బిగించి శక్తినంతా కూడదీసుకొని తాడును లాగారు. కట్టుతాడు తెంపుకోడానికి చేప బారెడు ఎత్తు గాలిలోకి ఎగిరింది. దాంతో తాడు వదులవడం, దానిని బిగించెయ్యడం తృటిలో జరిగిపోయాయి. ఇప్పుడు చేప నావకి గజం లోపులో ఉంది. తెడ్డుచ్చుకొని  దాని ముట్టెమీద కొట్టాడు వాడు. చేప తన దేహాన్ని చుట్టలా చేసుకొని బలంగా తోక జాడించింది. అంతలా తోక జాడిస్తే, చేప అలిసిపోతుంది. కాబట్టి కొయ్యకర్రతో దాని ముట్టెమీద తెగ బాదుడు బాదడం మొదలెట్టాడు వాడు. కాసేపటికి చేప నిశ్చలమైపోయింది. తక్షణం వాడు తెడ్డు, అది కోల పుచ్చుకొని నావని ప్రవాహానికి ఏటవాలుగా ఇసుక తిప్పకేసిమళ్ళించారు. నావ బాపతు ‘మాకు’ తిప్పలోకి దూసుకుపోగానే కట్టుతాడు విప్పి చేపని తిప్పమీదకి లాక్కుపోదామనుకున్నాడు వాడు. ముడి విప్పుతున్న వాడిని చూడగానే చేప ఉగ్రురాలైంది. బలంగా తోక జాడించింది. వాడి వీపు తట్టు రేగిపోయింది. దాంతో వాడికి రోషం వచ్చి మొప్పట్టుకొని కోల కొయ్యను దాని గొంతుకలో దిగేశాడు. చేప చచ్చినట్టు ఊరుకుంది. చేపని గట్టుకు చేర్చేసరికి వాళ్ళిద్దరికీ ఎక్కడలేని నీరసం ఆవహించింది. ఏదో విజయం సాధించామన్న గర్వం కన్నా అది పెట్టిన యాతనకు గండం తప్పినట్టయింది వాళ్ళకి. రెప్ప వాల్చకుండా రెప్పలులేని చేపకళ్ళను చూస్తూ ఉండిపోయారు వసురుస్తూ చాలాసేపు. “నా సామిరంగా! ఈయాలే మనకు శివరేతిరి, సీరలు, రైకలు, గాజులు, పట్టీలు, ముక్కుపుడక, రింగులు, సెంటు, నూనె, బొట్టు పెట్టె అన్నీ కొనితెత్తాలే” అంటూ లేచాడు వాడు. “నువ్వలాగే అంటావు. అయన్నీ ఆ సింగారి నంజకే కొనిత్తావు” అంది కటువుగా. “స్సీ! దానూసెత్తమాక నాకాడ. దాని సోకుమాడ. అది పైన పటారం. అంతా ఎముకల గూడు. పది జనవలు ఎత్తినా దానికి నీ నిండు రాదసే” అంటూ తన వైపుకి తిప్పుకున్నాడు దానిని. భళ్ళున తెల్లారింది.

No comments:

Post a Comment

Pages