మూగ మనసు
- పెయ్యేటి శ్రీదేవి
అదో పెద్ద డబ్బున్న వాళ్ళు దిగే లాడ్జి. సినీ డైరెక్టరు భైరవమూర్తి , నిర్మాత నాగరాజు రూమ్ నెం. 107 లో దిగారు. వాళ్ళు తీయబోయే కొత్త చిత్రాల కథా చర్చల కోసం తరచు 'స్వైర విహార్' లాడ్జి రూమ్ నెం. 107 లో దిగుతారు. అది వాళ్ళ సెంటిమెంటు. పదిరోజులన్నా వుంటారు.
ఇప్పుడు తీయబోయే చిత్రం 'మూగమనసు కోసం దిగారు .
ఇంతలో బెల్ నొక్కారు.
వీరమ్మ గది క్లీన్ చేయడానికి వచ్చింది .
'బాగున్నారా అయ్యా ?' అని పలకరించి , గది తడిబట్ట పెడుతూ అంది వీరమ్మ , 'అయ్యా ! మా
అమ్మాయికి మీ సినిమాలో చిన్న వేషం ఇప్పించండయ్యా .'
వాళ్ళా రూములో దిగినప్పుడల్లా గది ఊడుస్తూ ఈ మాట అడుగుతూనే వుంటుంది వీరమ్మ సరదాగానో, నిజ౦గానో .
'అలాగే' అని వీళ్ళూ అంటుంటారు.
ఈసారి కూడా అలాగే అడిగితే , 'అలాగే' అనకుండా ,మీ అమ్మాయెలా వుంటుంది అని అడిగాడు
భైరవమూర్తి .
'అమ్మాయి బాగుంటుందయ్య . సినెమా యాకటరు శోభనమ్మ లాగుంటుంది .కాని మూగపిల్ల .
మాటలాడదన్నమాటే గానీ , తెలివి తేటలకేం తక్కువలేదయ్యా .అయినా మాతోచ్చినా , మీరెలాగూ డబ్బింగు లెడతారు కదయ్యా ? పోనీ మూగ పిల్ల యేసమే ఇయ్యండయ్యా.'
'సరే, మీ అమ్మాయిని తీసుకురా చూస్తాను .'
'ఏమయ్యా భైరవమూర్తి ! నీకేమన్నా మతిపోయిందా ? ఆ పనమ్మాయి కూతురుకి , అందులోనూ
మూగదానికి, సినిమాలో వేషం ఇస్తావా ? ఆ అమ్మాయి అడిగితే మాత్రం, సినిమాలో చాన్సిచ్చేస్తావా ?' అడిగాడు నిర్మాత నాగరాజు , ఆ పనమ్మాయి వెళ్ళిపోయాక.
'ఏం చెయ్యమంటావు ? మన సినిమాలో బుక్ చేసుకున్న హీరోయిన్ అమాంతం రేటు పెంచేసింది .వాళ్ళ పిన్ని ఎంత చెబితే అంత. ఆ అమ్మాయి అడిగిన రేటు ఇస్తేగానీ రాదు. అందుకే నాకో ఐడియా వచ్చింది సడెన్ గా.'
' ఏ౦టా చచ్చు ఐడియా ? మూగపిల్లని పెట్టి సినిమా తియ్యడమా ?'
'అలా కోపం చెందకు నాగరాజూ ! ఈ అమాయిని పెట్టి లోబడ్జెట్ సినిమా తీసి బాగా సంపాదించు.'
'ఏమయ్యా ,ఇంకా పిలలని చూడలేదు .మూగాపిల్లతో సినిమా ఎలా తీస్తానయ్యా?'
'పాడైన వంటలో కొత్తిమీర వాసనలా , ఎన్ని అవకరాలున్నా మేకప్ లో మరుగున పడిపోతాయి.
ఇప్పుడున్న హీరోయిన్లు ,హీరోలూ అందగాళ్ళా ? మన సినిమా పేరు 'మూగ మనసు ' కాబట్టి .ఆ పిల్ల కారెక్టరు మూగాదానికిండా చెయ్యొచ్చు. డబ్బింగ్ ఖర్చు కూడా వుండదు . 'సిరివెన్నెల 'లో సుహాసినిది మూగ వేషమే కదా .'
'ఊరుకోవయ్యా . గొప్పనటి సుహాసినికి , ఈ పిల్లకి పోలికా ? ఆమెకి మామూలుగా మాట్లాడటం వచ్చు.
యాక్షన్ పరంగానే మూగ వేషం కనుక మనమేం చెప్పినా అర్ధమవుతుంది . ఆమె మూగ సైగలు మనకేం
తెలుస్తాయి ? కొరివితో తల గోక్కోడమంటే ఇదే. నెత్తిన కొంగేసుకోవాలి !'
'నాగరాజూ ! నువ్వేం కంగారు పడకు . లోబడ్జెట్ సినిమా కాబట్టి మనకే నష్టమూ రాదు. సినిమా
ఫెయిలయినా కొంచంలో పోతుంది. '
ఇంతలో వీరమ్మ తన కూతుర్ని తీసుకొచ్చింది. ఆ అమ్మాయిని ఎగాదిగా చూసి కొన్ని ప్రశ్నలడిగాడు.
ఆమె అన్నిటికీ సైగలతో సమాధానమిచ్చింది.
కొన్ని డైలాగులు చెప్పి యాక్షన్ చెయ్యమన్నాడు . పెదాల కదలికతో యాక్షన్ బాగా చేసింది. చిన్న కెమెరా తో వీడియో తీసారు . ఫోటోలు , వీడియో చాలా బాగా వచ్చాయనిపించింది భైరవమూర్తి కి.
వెంటనే ఆ అమ్మాయిని పెట్టి సినిమా తియ్యాలనుకున్నాడు .
'ఏమైనాసరే , శృతిశ్రీ కాక పోతే వేరే ఇంకో హీరోయిన్ ని చూసుకోవాలి గాని , మాట రాని ఈ మూగపిల్లతో సినిమా ఏంటయ్యా ? హీరోయిన్ అన్నాక ఒక సినిమా హిట్టవగానే తరవాత సినిమాకి రేటు పెంచడం అనేది సినీ ఫీల్డు లో కొత్త కాదు కదా ? ఆమె మీద కోపంతో ఈ మూగపిల్లని పెట్టి సినిమా తీస్తావా ?' అన్నాడు నిర్మాత నాగరాజు .
'మాటలొచ్చిన హిందీ అమ్మాయిలకన్నా ,తెలుగు తెలిసిన , భావాలు అర్ధం చేసుకొనే ఈ మూగపిల్ల నయం కదా . ఎవరికైనా డబ్బింగ్ పెట్టాలి . అమ్మాయి కూడా బాగుంది . నీతి లేని వాళ్ళకి డబ్బు హోదాలా ,
వారమైనా స్నానం చేయని అశుభ్రంతో వుండే వాళ్ళకి సెంటు వాసనలా , ఈ అమ్మాయికి మేకప్ వేస్తే చాలా
బాగుంది .' అన్నాడు భైరవమూర్తి.
'నువ్వెన్ని నీతివాక్యాలు చెప్పినా , నేనీ సినీ నిర్మాణానికి డబ్బివ్వను. నే మానేస్తున్నాను .' అంటూ విసురుగా తలుపు తోసుకొని వెళ్ళిపోయాడు నాగరాజు .
డైరెక్టరు భైరవమూర్తి తనే నిర్మాతయి ,బయ్యర్లకి కూడా అమ్మకుండా తక్కువ బడ్జెట్ తో
ఉన్నతమైన, సంస్కారవంతమైన సినిమా తీస్తూ , మీడియావాళ్ళని పిలిచి ,అందరూ చెప్పే 'డిఫరెంట్ గా 'కాక,నిజంగానే ఈ సినిమా డిఫరెంటు గా వుంటుంది అని చెప్పాడు.
అనుకున్నట్టుగానే డిఫరెంటు గానే సినిమా తీసాడు. హీరోయిన్ పేరు సుప్రజ అని పెట్టాడు .
ఐటం సాంగ్ లో ముమైత్ ఖాన్ తో దశావతారాలు చేయించి , ఒక్కొక్క అవతారానికి ,ఒక్కొక్క దేవాలయం
చూపాడు .ఇంకా అజంతా ,ఎల్లోరాలు ,సుందర కాష్మీరాలనించి ,కన్యాకుమారి అందాల వరకు భారతీయదనాన్ని అంతా అద్భుతంగా చూపించాడు .
సినిమా రిలీజైంది .మొదటిరోజే జనం బాగా వచ్చారు . అలా వారం రోజులు జనం విపరీతంగా
పెరుగుతూ వస్తున్నారు .
టి.వి.'కె' ఛానెల్లో , లైవ్ లో అందరితో డైరెక్టరు మాట్లాడాడు . సినిమా చాలా బాగుందని ,
ఎన్నో ఏళ్ల తరవాత హీరోయిన్ ని ,మిగతా ఆర్టిస్ట్ లను చీరలతో చూసాము ,ఇంకో గొప్ప విషయం ఐటం సాంగ్ లో ముమైత్ ఖాన్ చేత కూచిపూడి దశావతారాలు చేయిస్తూ అన్ని దేవాలయాలు చూపించడం ,మన భారతదేశ గొప్పదనాన్ని ,చారిత్రిక కట్టడాలను ,చూపించడం చాలా చాలా బాగుంది .ధైర్యం చేసి ,వినూత్నంగా ఈ చిత్రం తీయడం చాలా బాగుంది . మీరు ఇలాంటి చిత్రాలు మరెన్నో తీయాలని , మిగతా నిర్మాతలు ,దర్శకులు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని , అందరూ మెచ్చుకుంటూ మాట్లాడారు .
సినిమా వందరోజుల పండుగ చేసుకుని ఇంకా జైత్రయాత్ర సాగిస్తోంది .
డైరెక్టర్ భైరవమూర్తి కూడా అనుకోలేదు సినిమా అంతబాగా సక్సెస్ అవుతుందని . ఈ సినిమా వల్ల చాలా చాలా లాభాలోచ్చాయి . హిందీ , తమిళం , కన్నడ భాషలలోకి ఈ సినిమా డబ్బింగ్ చేయబడుతోంది .
హీరోకన్నా హీరోయిన్ కి మంచి పేరు వచ్చింది .మీడియావాళ్ళు ఆమె వెంట పడుతున్నా ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఆ కోపం తో ఆ హీరోయిన్ సినిమాల్లో మూగవేషమే కాదు , నిజంగా కూడా మూగదే అని , కాదేదీ సినిమాకనర్హం , మూగావైతే నేమి , డబ్బింగ్ ఉందిగా అంటూ పత్రికలూ ఏకేసాయి.
భైరవమూర్తి తీసిన 'మూగమనసు' సినిమా చూసి మిగతా డైరెక్టర్లు .నిర్మాతలు ఉన్నత
విలువలతో వున్న సినిమాలే చేస్తున్నారు. హీరోయిన్లందరూ నేను ఎక్స్పోజింగ్ కి వ్యతిరేకిని అంటూ పేపర్ స్టేట్ మెంట్లిస్తున్నారు.
సుప్రజతో ఇంకో సినిమా కూడా ప్లాన్ చేస్తున్నాడు భైరవమూర్తి . మిగతా చిత్రాల్లో కూడా సుప్రజనే
హీరోయిన్ గా తీసుకున్నారు .ఒక హిందీ చిత్రం కూడా ఒప్పుకుంది.
మూగమనసు చిత్రం అందరికీ ఒక టర్నింగ్ పాయింట్ అయ్యింది . ఆ టర్నింగ్ పాయింట్ కి కారణం
ఒకవిధంగా రేటు పెంచేసిన శృతిశ్రీ . మూగమనసు చిత్రం హిట్టవడం చూసి తట్టుకోలేక ,ఒకరోజు వాళ్ళ పిన్ని తో గొడవపడింది .
'ఇప్పుడుచూడు . ఒక్క సినిమా హిట్టవగానే 50 లక్షలనుండి కోటి రూపాయలకి నా రేటు
పెంచేసావు నాకు తెలియకుండా . ఇంకో అమ్మాయితో తక్కువ బడ్జెట్ సినిమా తీసి విపరీతమైన లాభాలు
గడిస్తున్నాడు ఆ డైరెక్టరు . ఇది సినిమా రికార్డుకేరికార్డు బ్రేక్ . నాకు రావాల్సిన పేరు ఎవరో అనామకురాలు
దొబ్బేసి పెద్ద స్టారైపోయింది .'
'ఈ మాత్రానికే ఎందుకే అరుస్తావు? మీ అమ్మ పొతే నీ చిన్నప్పట్నించీ పెంచాను . నీ బాగోగులు నాక్కాక ఎవరిక్కావాలి ? నీ డిమాండ్ ని బట్టి నేను ఎక్కువ డబ్బడగడం తప్పా ? కోట్లలో సినిమాలు తీసి వాళ్ళు లాభాలు ఆర్జిస్తుంటే నీకు అడిగిన డబ్బు ఇవ్వలేరా ? పోన్లే ,ఇప్పుడొచ్చిన నష్టం ఏం లేదు . ఈ సినిమా కాకపొతే ఇంకో సినిమా . చీర కట్టుతో తీసిన ఈ సిన్మా హిట్టయ్యింది . కాబట్టి ,మీదియావాళ్ళని పిలిచి , నేను ఎక్స్ పోజింగ్ కి వ్యతిరేకిని అంటూ స్టేట్ మెంటియ్యి. వాళ్ళిచ్చిన రెమ్యునరేషన్ కే అటు ఇటు గా ఒప్పుకో . మళ్ళీ నీ కాళ్ళ దగ్గరికోస్తాయి సినిమాలు .'
సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో వీరమ్మ కూతురు సీతామహాలక్ష్మి అనబడే హీరోయిన్ సుప్రజ
పదేళ్ళ తన తమ్ముడికి గుండె చిల్లుపడింది ,ఆపరేషన్ చెయ్యాలి ,రెండు లక్షలు ఖర్చవుతుందని చెప్పిన
డాక్టర్లకి రెండు లక్షలు ఇచ్చి ఆపరేషన్ చేయించింది .
తల్లి వీరమ్మని , తమ్ముడిని తీసుకొని పెద్ద తిరుపతి కాలి నడకన వెళ్లి , వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకొంది . దారి పొడవునా అభిమానులు ,పత్రికా విలేఖరులు ,టీవీ చానెల్స్ వాళ్ళు చుట్టుముట్టారు .
'మీరెందుకు ఇంటర్వ్యూ ఇవ్వరు ? మా నించి తప్పించుకు తిరగుతారెందుకు ? ఇంత పెద్ద స్టారై
వుండి, అంత నిరాడంబరం గా ఎలా వుంటారు ? మీరెందుకు మూగదానిలా మాట్లాడరు ? కొంప తీసి నిజంగా
మూగవారేనా ? నిజంగా మూగవారైతే , నిజంగా కూడా డబ్బింగ్ చెప్పించుకోండి , అసిస్టెంట్ ని పెట్టుకొని .'
అంటూ వ్యంగ్య ప్రశ్నల వర్షం కురిపి౦చారు .
మనసులో వెంకటేశ్వరస్వామిని ధ్యానం చేసుకొని ,అప్పుడు నోరు విప్పింది సుప్రజ .
'నేను మీరనుకున్నట్టు మూగదాన్ని కాదు .కానీ ,మూగతనం సినిమాలకి అడ్డుకాదు .
డబ్బింగ్ ఎలాగూ వుంటుంది కాబట్టి . ఇక పొతే , నా పన్నెండేళ్ళ తమ్ముడు గుండె జబ్బుతో బాధపడుతున్నాడు.
నాన్న చిన్నప్పుడే ఏక్సిడెంట్ లో పోయారు . మా అమ్మ ఎంత పెద్ద స్టార్ హోటల్లో పనిచేస్తున్నా , తెచ్చే జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది.. అనుకోకు౦డా సినిమా ఛాన్సు వచ్చింది .ఏదో చిన్న వేషం ఇమ్మని అడిగింది అమ్మ . కాని అమ్మ పనిచేసే హోటల్లో బస చేసే డైరెక్టర్ గారు తన చిన్న సినిమాకి పెద్ద హీరోయిన్ నే చేసారు.
అందులో నాదేలాగూ మూగ వేషం . నాకలల్లోనూ ,ఊహల్లోనూ నాకెలాగూ డబ్బింగ్ పెట్టారు . ఉన్నతంగా మన భారతీయ సంస్కృతి ,సంప్రదాయాలతో ,దేశంలోని ఎన్నో చారిత్రక కట్టడాలను చూపిస్తూ, వాటి గురించి వివరిస్తూ ఇంకా ఎన్నో దేవాలయాలు ,ఎన్నో సుందర దృశ్యాలతో ఆ చిత్రం తీసారు . అది చాలా పెద్ద హిట్టయిందని మీ కందరికీ తెలిసిన విషయమే . ఆ చిత్రం, మొత్తం సినీ ప్రపంచాన్నే ఒక మలుపు తిప్పింది .మిగతావాళ్ళు కూడా అటువంటి చిత్రాలనే తీయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రేక్షకులు కూడా అవే కోరుకుంటున్నారు . ఇకపోతే , ఈ సినిమా వల్ల వచ్చిన డబ్బుతో నా తమ్ముడికి గుండె ఆపరేషన్ చేయించాను . నా తమ్ముడికి ఆపరేషన్ చేయించడానికి కావలసిన డబ్బు చేతికందాలని ,ఆ ఆపరేషన్ సక్సెస్ అయి తన ఆరోగ్యం కుదుట పడేదాకా మౌనదీక్ష పాటిస్తానని ,కాలినడకన కొండకి వస్తానని స్వామికి మొక్కుకున్నాను . ఆ స్వామి నా మొరాలకించాడు . అందుకే నాకు 'మూగమనసు ' చిత్రం లో హీరోయిన్ వేషం లభించి ,కావలసిన డబ్బు చేతికందింది .నా తమ్ముడికి ఆపరేషన్ చేయించి ,వాడికి ఆరోగ్యం చేకూరాక ,స్వామీ దర్శనం చేసుకొని ,మొదటి మాటలు మీతోనే మాట్లాడుతున్నాను.' అంది సుప్రజ .
'అయితే మీరింక సినిమాల్లో నటించారా ?' అడిగారు విలేకరులు .
'నటిస్తాను .కానీ డబ్బుకోసంకాదు. సినిమాల్లో మంచి పాత్రలు వేసి ,ఆ వచ్చిన డబ్బుతో ,ఎందరో నా తమ్ముడిలాంటి వాళ్ళకి ,డబ్బులేక ,వైద్య సహాయం అందక బాధ పడుతున్న వాళ్ళకి చేయూతనిచ్చి ,వాళ్ళని ఆదుకుంటాను . ఈ దేశ పౌరురాలిగా అది నా అందమైన బాధ్యతగా స్వీకరిస్తాను. డబ్బు సంపాదించాలని అందరికీ వుంటుంది . కాని కొంత సంపాదించగానే ఇంకా ఇంకా సంపాదించాలనే డబ్బు జబ్బు వాళ్ళని పట్టి పీడిస్తుంది . ఆ జబ్బులో పది మనశ్శాంతి పోగొట్టుకుంటారు గాని , వాళ్ళు సంపాదించినది సమాజసేవకు ,మంచి పనులకు వినియోగించరు . డబ్బు సంపాదించడం తప్పుకాదు.
సంపాదించిన డబ్బు సద్వినియోగ పరుచుకోవడమే మానవతా ధర్మ. సాటి మనిషికి సాయం చేసినప్పుడే
ఆ డబ్బుకి సార్ధకత .డబ్బు ఎంత సంపాదిన్చామన్నది కాదు గొప్ప. ఆ డబ్బుతో ఎన్ని మంచి పనులు
చేసామన్నదే గొప్పతనం. అందుకే నేను సంపాదించే డబ్బు సమాజంలోని పెదపిల్లలకి విద్య , వైద్యం ,తిండి బట్ట కొరకు వినియోగిస్తాను .'
విలేకరులు ఆమె చెప్పినది విని ఆనందించి , ఇన్నాళ్ళూ మూగదానిలా అన్నందుకు
క్షమించమని అడిగారు.
పేపర్లో విలేకరులకు ఇచ్చిన సుప్రజ ఇంటర్వ్యూ చదివి శృతిశ్రీ ' కొంతమందికి నష్టం కలిగించే పనులే ,మరికొందరికి లాభం చేకూరుస్తాయేమో ! ' అనుకుంది .
విధి అంటే ఇదేనా? ఆ విధికికారణాలేమిటి ? కారకులెవరు ?అమాంతం తన రేటు పెంచేసిన పిన్నా ? రేటు పెంచిన కారణంగా తక్కువ బడ్జెట్ తో 'మూగమనసు ' సినిమా తీసిన డైరెక్టర్ భైరవమూర్తా ?
పెద్ద స్టార్ హోటల్లోస్వీపరుగా పనిచేస్తూ ,'మా అమ్మాయికి సినిమాలో చిన్న వేషం
ఇయ్యండయ్య ' అని అడిగిన వీరమ్మ కారణమా ?
'నీ సినిమాకు డబ్బు పెట్టుబడి పెట్టను ' అంటూ వెళ్ళిపోయినా నిర్మాత నాగరాజు కారణంగానే 'మూగమనసు ' అనే మంచి చిత్రం బయిటికొచ్చిందా ?
లేక సుప్రజ తమ్ముడికి గుండె జబ్బు పెట్టిన ఆ భగవంతుడే కారణమా ?
ఆ గుండె ఆపరేషను కోసం మౌన దీక్ష పాటించి కాలినడకన స్వామి సన్నిధికి వస్తానని
మొక్కుకున్నందు వల్ల ఆమె మొరాలకించినతిరుపతి వేంకటేశ్వరస్వామి కారకుడా ?
'మూగమనసు ' అనే మంచి చిత్రం రావడానికి వీళ్ళందరూ కారకులేనా ?
అందుకే మొక్కు తీర్చాక ఆ వేంకటేశ్వరస్వామి ఇంకా సంతోషించి నందువల్లెనేమో ,'మూగమనసు ' చిత్రానికి నంది అవార్డు ,జాతీయ అవార్డు కూడా వచ్చింది .
కానీ ఇంకోవిషయం ఏమిటంటే ......
తక్కువ బడ్జెట్ తో తీసిన భైరవమూర్తి తీసిన సినిమా 'శత'దినోత్సవం చేసుకుంటే , నాగరాజు శృతిశ్రీ ని పెట్టి తీసిన సినిమా కేవలం 'జత' దినోత్సవం మాత్రమే చేసుకుంది !!
మళ్ళీ రేటు పెంచేసిన పిన్ని మీద కోపం వచ్చి శృతి శ్రీ మనసు మూగగా రోదించింది ! *****************************
No comments:
Post a Comment