నీకు నీవే - నాకు నేనే - అచ్చంగా తెలుగు

నీకు నీవే - నాకు నేనే

Share This
నీకు నీవే -  నాకు నేనే 
 -  కె. కళ్యాణ్ కృష్ణ కుమార్


"ఏరా సుబ్రావ్.. నిన్నటి దాకా చీకేసిన మామిడి ముట్టెలా దిగులుగా వుండేవాడివి.. షడెన్ గా సంబరాల రాంబాబులా కనిపిస్తున్నావ్.. ఏంటి సంగతి.. ఏదైనా స్పెషలా? " అడిగాడు రమేశ్.
"ఏముందిరా..! ఇంట్లోంచి అలిగెళ్ళిన సుబ్బడి పెళ్ళాం తిరిగొచ్చిందిరా..! అందుకని మనోడు.. తెగ సంబర పడిపోతున్నాడు" అని సతీష్ సమాధానం చెప్పాడు.
"ఎలా వచ్చిందిరా.. అంత తేలికగా మీ ఆవిడ రాదే..!?/ పెద్ద మొండి ఘటం కుడానూ.. మనం ఒకసారి రాజీ కెళ్తే.. వచ్చిన వాళ్లని  ఉతికి ఆరేస్తా..! అని అరిస్తే కదూ మనం ఆవూరిలో పరుగు మొదలెట్టి  ఒంగోలు దాకా ఉరికింది" గుర్తు చేసుకున్నాడు రమేశ్.
"ఆ.. ఆ మేడం తిరిగొచ్చిందట .. ఎలా వచ్చిందో సుబ్బడినే అడుగు" అన్నాడు సతీష్.
ఇక ఉండబట్టలేని రమేశ్ " ఏరా సుబ్రావ్ ఏంటి కథ అంత సులువుగా ఎలా వచ్చిందిరా మీ ఆవిడ..ఎవరు చెప్పినా ససేమిరా అన్న ఆమె అంత సులువుగా ఎలా వచ్చింది.. " బిత్తరపోయి ప్రశ్నించాడు రమేశ్..  సుబ్రావ్ ని .
" సింపుల్ రా.. వారం నుంచి నా సెల్ ఫోన్ ఆపేశా.. తిట్టడానికి అవకాశం లేదనుకుందో ఏమో పరిగెత్తుకుని మావూరు వచ్చి " మీరు ఎలా చెబితే అలా నడుచుకుంటా.. ఇంట్లోంచి వెళ్ళి పోతే.. మానాన్న పట్టించుకోక మీరు పట్టించుకోక పోతే..ఎట్లా..?? జయమాలినిలా  పుట్టింటోళ్ళు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశాడంటూ పాడుకోవాలా " అంటూ కళ్ళు వత్తుకుంటూ  నట్టింట్లో కూలబడ్డది.  మాయమ్మ బోయి ఓదార్చి ఇంట్లోకి తెచ్చి కన్నీళ్ళు తుడిచి ఎర్రనీళ్ళు తిప్పింది."  అని సెలవిచ్చాడు సుబ్రావ్
" అచ్చా  అయితే ఈ రోజు నీ జీవితంలో మరువలేని మధురానుభూతులు నిండిన రోజురా..!  పార్టీ చేసుకోవాల్సిందే..! అని ఒత్తిడి చేసే సరికి.. గుండెలో ఎక్కడో గుచ్చుకుంటునంట్లు.. బుర్రలో ఏదో కెలుకుతున్నట్లు, వెనకాలెవరో పిలుస్తున్నట్లు ఉన్నా... పట్టించుకోకుండా నాలుగు కాళ్ళకు తన కాళ్ళను చేర్చి.. ఆ కాళ్ళను నేరుగా కె.బి రెస్టారెంట్ వైపు నడిపించాడు సుబ్రావ్.
*****************************************************
సుబ్రావ్ కు కాంతం కు ఏడాది క్రితం పెళ్ళైంది...సుబ్రావ్ అక్క కూతురే కాంతం .వయసులో వారిద్దరికీ ఎక్కువ తేడాలేదులేండి..! చదువుకున్న ఇద్దరికీ తమకు తామే గొప్ప అనే ఫీలింగ్ వాళ్ళ కాలేజీ రోజుల దగ్గర నుంచి అబ్బింది. మేనరికం చేసుకోనని సుబ్రావ్ మారాం చేస్తున్నా.. అందరూ కలిసి సుబ్రావ్ కు మేనకోడల్ని కట్టబెట్టారు. "నాకిష్టం లేదు మర్రో అన్నా.. మీ అమ్మా వాళ్ళు నిన్ను కట్ట బెట్టార"ని తొలిరేయే కూసేశాడు సుబ్రావ్.
అంత వరకూ  తొలిరేయి హాయి మహిమ  అని పాడుకున్న కాంతం కు చిర్రెత్తు కొచ్చింది. సర్దుకుని.. " పోన్లే మావా.. నీకు నేను.. నాకు నీవు .. ఒకరికొకరం నువ్వు నేను" అని సాగదీస్తూ, గారం పోతూ పెదవి కొరికి కిక్కెక్కిస్తూ.. తన బుర్రకు తోచిన తిమ్మరి తింగరి, టక్కరి వయ్యరాలన్నీ పోయినా.. ప్రవరాఖ్యుడిలా సుబ్రావ్ కరగలేదు.
తర్వాత కాంతం వాళ్ళ అమ్మకు విషయం తెలిసి సుబ్రావ్ కు తలంటే సరికి  రెండవ రోజు తొలిరేయి జరుపుకోక తప్పింది కాదు ..
ఆ తర్వాత కాపురం కు వచ్చిన చిన్నదానికి అత్త ఉరఫ్ అమ్మమ్మ చోద్యం నచ్చ లేదు. కాంతం హై క్లాస్ కాకున్నా కొద్దిగా క్లాస్  అనుకోవచ్చు. తుడుచుకునే టవల్ కూడా ఎక్కడ  పడితే అక్కడ పడేసే అలవాటున్న సగటు స్త్రీ అన్నమాట.!
అయితే కాస్త చాదస్తం ఎక్కువున్న అత్త.. మాత్రం అలాంటి తప్పుల గురించి విడమర్చి చెప్పాల్సింది పోయి చిచ్చుబుడ్డిలా రేగేది. దీంతో కాంతం కి అరికాలి మంట మొదలైంది.
" వదిన చూడు.. ఎంచక్కా ముంబయి వెళ్ళి మొగుడితో కాపురం చేసుకుంటుందో..."  అని కాంతంకి తన వదిన గుర్తొచ్చినప్పుడల్లా ముంబాయి లోని అన్న పెండ్లాంకి పొరబోతుండేది.
" వేరు కాపురం మస్త్ మజా" అనేది కాంతం ఫీలింగ్. దూరంగా ఉంటే మనసులు దగ్గరౌతాయనే  నమ్మే వ్యక్తిత్వం కాంతంది.
ఇదిలా వుండగా-  'పెళ్ళైపోయింది .. సర్దుకు పోదాం' అన్న కనీస జ్ఞానం కూడా లేని సుబ్రావ్ " తాను ఎత్తుకుని పెంచిన దాన్నే తనకి కట్టబెట్టారంటూ " రోజూ స్నేహితుల దగ్గర చెప్పి వాపోతుండేవాడు.
ఒకరోజు  అత్తగారు ఊరెళ్లడంతో వంట చేసేందుకు వంటింట్లోకి వెళ్ళింది కాంతం. వెళ్ళిన వయ్యరి కాంతం కోడిగుడ్డుతో ఆంలెట్ వేసేందుకు సమాయత్తమైంది. అప్పటీకే ఆకలి అని వర్రీ అవుతున్న సుబ్రావ్ ని "కర్రీ చేయడంలో హెల్ప్ చేయొచ్చుగా" అంటూ వగలు ,సెగలు, పొయ్యి పొగలు తో చెప్పేసరికి.. ఏ మూడ్ లో ఉన్నాడో మన మూడ్ లెస్ సుబ్రావ్ వెళ్ళి ..ఏడ్వకుండా కన్నీళ్ళు తెచ్చుకునేందుకు  కత్తి ఉల్లిపాయలు చేతికి తీసుకున్నాడు. అప్పుడు తెలీదు సుబ్రావ్ కి కాసేపట్లో మరో ప్రపంచ యుద్దం జరగబోతోందని....
అంతలో పొయ్యి దగ్గరున్న కాంతం ఎంచక్కా సరసాలు చాలు శ్రీవారూ వేళకాదు అని పాడుకుంటూ గుడ్డు పగులగొట్టేందుకు రెడీ అయ్యింది.
ఇక్కడెవ్వడూ సరసాలు పోవట్లేదు కానీ, వయ్యరం చాలించు.. అయినా గుడ్డు అటు తిప్పి పగుల కొడతావేంటీ.. గుడ్డు పెద్ద వైపు ఎడమ చేత్తో పట్టుకుని చివర కుడి వైపుకు గుడ్డు పగుల కొట్టాలి.. ఆమాత్రం "నీయమ్మ" నేర్పలేదా అని నొక్కి అన్నాడు. నాయమ్మ కాక ముందు "నీయక్క" అన్న విషయం మర్చిపోవద్దంటూ అంటూ సేం పించ్ విసిరింది కాంతం.
" నేనే కరెక్టు ..గుడ్డు ఇలాగే పగులకొట్టాలి..    పెద్ద సైజు ఎడమవైపు వైపు.. చిన్నసైజు కుడి వైపు వైపు పగులకొడితే చేతికి దెబ్బ తగులుతుంది తెలుసుకొనుడి ..మొగుడీ.." అని కాస్త సీరియస్ గా చెప్పింది కాంతం.
" నీకు చెబితే అర్ధం కాదా" అంటూ బి.పి ప్రోధి చేసుకున్నాడు సుబ్రావ్.. అంతే.. చేతిలోని గుడ్లు నేలకేసి కొట్టింది కాంతం. చేతిలోని కత్తి నేలకేసి విసిరాడు సుబ్రావ్... పొయ్యి మీద పెనం క్రిందకు తోసింది కాంతం.. బండమీద బిందె లో నీళ్ళు పారబోసి.. బిందె క్రిందకు నెట్టి అక్కడ నుంచి జారుకున్నాడు సుబ్రావ్.
జరిగిన విషయం ని మరలా సుబ్రావ్ తన ఫ్రెండ్స్ అయిన రమేశ్, సతీష్ లకు విన్నవించుకున్నాడు. " గుడ్డు పగులకొట్టే దగ్గర కొట్టూకున్నారా.. మీ మొఖాలు మండా..! అదేదో ఇంగ్లీషు కథలా వుందిరా మీ కాపురం. వెనకటి కెపుడో గుడ్డు కోసం రాజ్యాల మధ్య యుద్దాలు జరిగాయట.  సరే మీరు మాట్లాడుకుంటే రోజూ కొట్టుకుంటారు గానీ, కొద్ది రోజులు చీటీల్లో వ్రాసి ఇచ్చి పుచ్చుకొండి..కొంతకాలం గొడవలు సద్దుమణుగుతాయ్.. " అని ఫ్యామిలీ కౌన్సిలర్ లా సలహా పారేశారు ఫ్రెండ్స్.  తెలిసి చెప్పినా.. బలిసి చెప్పినా ఫ్రెండ్స్ చెప్పిన సలహా పనిచేయడం మొదలైంది.
నేరుగా ఇంటికెళ్ళిన సుబ్రావ్ భార్య కాంతం కు కొన్నిఖాళీ కాగితాలు ఇచ్చి ఒక కాగితం పై .. " ఇక మనం ముఖతా మాట్లాడుకోం...నీకేదైనా అవసరం వస్తే ఈ చీటి మీద వ్రాయి.. మన మధ్య  గొడవలు రాకుండా వుంటాయ్ " అని రాసి ఇచ్చాడు.
ఇక ఆరోజు మొదలు ఇద్దరి మధ్య మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్ లేవ్.. ఏది కావాలన్నా సుబ్రావ్ చీటీ వ్రాసిస్తే,, కాంతం చేసి పెట్టేది. కాంతం కు ఏది కావాలన్నా చీటీ వ్రాసిస్తే..సుబ్రావ్ తెచ్చిచ్చేవాడు. ఇట్లా నెలలు గడిచి పోతున్నాయ్..
ఒకరోజు అర్జెంట్ గా ఇంటర్వూకి వేరే ఊరు వెళ్లాల్సిన పనిపడిన సుబ్రావ్ కాంతం ను "ఉదయాన్నే 5.30 ని లకు లేపు" అని చీటి వ్రాసిచ్చాడు.
ఉదయం 8.30 కి లేచిన సుబ్రావ్ కి తాను ఎక్కాల్సిన ట్రైను కి జీవితకాలం లేటుగా లేచాడని అర్ధమై " కడుపుకు అన్నం తింటున్నావా.. గడ్డి తింటున్నావా.. బంగారం లాంటి ఉద్యోగం సంకనాకి పోయింది నీవల్ల" అని పెళ్ళాం పై కస్సున లేచాడు సుబ్రావ్.
వెంటనే కాంతం చిరాగ్గా మొఖం పెట్టుకుని ప్రక్కకు జరగమని భర్తకు సైగ చేసి, దిండు క్రింద నుంచి ఒక చీటి తీసి సుబ్రావ్ చేతిలో పెట్టింది..  దాన్లో "5.30 నిమిషాలు అయ్యింది ఇక లేవండి " అని వ్రాసుంది. దీంతో సుబ్రావ్ కు మతిపోయినంత పనైంది. తన్నుకొస్తున్న కోపాన్ని ఆపుకోలేక  " నాటకాలుడుతున్నావా.." అని కాంతం పైకి చెయ్యెత్తాడు సుబ్రావ్.. " నాకూ చేతులున్నాయ్" అనేసింది గుంటూరు మిర్చి తో చేసిన ఆవకాయ  మూడు తరాలుగా తింటున్న కాంతం .
లాభం లేదు పరిస్థితి చేయిదాటి పోతోందని గ్రహించి అక్కడ నుంచి చల్లగా జారుకున్నాడు సుబ్రావ్.
ఉసూరుమంటూ వీథుల్లో రాళ్ళను పవన్ కళ్యాణ్ లా నెట్టుకుంటూ నడుచుకెళ్తున్న సుబ్రావ్ కు ఎదురుగా నడుచుకెళ్తున్న భూమిక లాంటి అమ్మాయి ఎదురైంది...ఓ చిరునవ్వు రువ్వింది.
ఎవరో తెలియక పోయినా ఎక్కడో చూసినట్లనిపించి తనలోని బాధను దాచుకుని మొఖాన నవ్వు పులుముకున్నాడు సుబ్రావ్.
కొంచెందూరం దాటి వెళ్ళిన ఆ అందాల యువతి తనవైపు చూస్తుందా లేదా అనే సంశయంలో వెనక్కి తిరిగి చూసిన సుబ్రావ్ మతి పోగొట్టేలా తననే చూస్తూ నడుస్తోంది ఆమె. అంతటితో ఆగని ఆ అమ్మాయి..తన ఎడమ చేయి పైకెత్తి మూడు వేళ్ళు సుతారంగా కదిలించింది. (హాయ్ అని సైగ చేసింది).. చూస్తూ ఉండగానే కంటి చూపు దాటేసింది. సుబ్రావ్ కు ఒకసారి  గుండెజారి గల్లంతయ్యింది. నూనె బాండి లోంచి ఎగిరి పూలబుట్టలో పడ్డట్టైయ్యింది. తనను తాను నమ్మలేక పోతున్నాడు. అదో రకమైన ఆనందానుభూతిలో ఓలలాడుతో ఫ్రెండ్స్ దగ్గరకు చేరుకున్నాడు. మగధీర సిన్మాలో హీరోలా  వేళ్ళు ఊపుతూ వస్తున్న సుబ్రావ్ ను కదిలించి ఈ లోకంలోకి తెచ్చారు రమేశ్.. సతీష్ లు.  " ఏమైందిరా..!" అడిగారు . " మస్త్ పోరి... నవ్వి..చెయ్యి ఊపి వెళ్ళిందిరా..!" ఏవరో తెలీదు కానీ ఎక్కడో చూసినట్లుందిరా..! " అని " గాల్లో తేలినట్లుందే.. గుండె జారినట్లుందే.." అని లీలగా పాటకూడా మొదలెట్టాడు సుబ్రావ్.
అంతలో సతీష్ అందుకుని "కొంపదీసి మీ అక్కో, మీ ఆవిడో  ఏర్పాటు చేసిన సి.ఐ.డి ఏమో బావోయ్.. జర జాగ్రత్త" అన్నాడు. దెబ్బకు మత్తుదిగిన వాడిలా ఫేస్ పెట్టాడు సుబ్రావ్. కనీసం ఈ మాత్రం ఆనందానికి కుడా నోచుకులేదు.. చీ దీనెమ్మ.. ఇదీ ఒక జీవితమేనా అనుకుంటూ బాధను దిగమింగాలని ఫ్రెండ్స్ తో కలిసి కాస్త.. వేడి నీటిని కెబి రెస్టారెంట్ లో దిగమింగాడు. మరి కాస్త .. ఇంకాస్త.. కొద్దిగా.. ఇలా పెగ్గు పెగ్గు కలిసి మగ్గు అయినట్లు పీకల దాకా తాగి వెయిటర్ ..వెయిట్ చేసే టైం లేదన్నాక తప్పదన్నట్లు ఇంటికి బయలు దేరారు.
తూలుతూ.. తిటూకుంటూ.. ఈరోజు నీకుందే అని పెళ్ళాన్ని గుర్తు చేసుకుంటూ ఇంటి తలుపు తట్టాడు. కిర్రున తలుపు తెరుచుకుంది. ఎదురుగా కాంతం. సర్రున ఎడమ పక్కకు జరిగింది. వెనుకే అక్క/ అత్త. ఆమె గుర్రున చూస్తూ కుడి వైపుకు జరిగింది. ఆ వెనుక అమ్మ. ఎండ దెబ్బ తగిలిన వాడిలా ఒణికి పోయాడు సుబ్రావ్.! తాగినదంతా దిగిపోయింది. ఎంతలా అంటే బాధ తట్టుకోలేక తాగా అని చెప్పినా వాళ్ళు నమ్మలేనంతగా మత్తు దిగిపోయింది సుబ్రావ్ కి.
"ఏరా..! అమ్మాయిని కొట్టావంట.. ఒళ్ళు బలిసిందా..!" అక్క సౌండ్ స్టీరియో ఫోనిక్ లా వినపడింది. ఒళ్ళు ఒక్కసారిగా జలదరించింది సుబ్రావ్ కి. " లేదు.. నేను కొట్టలేదు అంటున్న సుబ్రావ్ మాటలు భయంతో బయటకు రాలేదు. "ఒంటరి పిల్లను చేసి చేయిచేసుకోవడానికి.. నీకు చేతులెలా వచ్చాయిరా..! ఏబ్రాసీ... అసలే ఒంటరి పిల్ల కూడా కాదు.." అని అమ్మ లంకిణిలా అందుకునే సరికి సుబ్రావ్ పై ప్రాణంపైనే పోయింది. ఈ పరిస్థితుల్లో మందుతాగిన విషయం తెలిసిందనుకో మటాషే .. ఎలాగొలా కవర్ చేసుకోవాలని.. " సారీ ఇంకెప్పుడూ జరగదంటూ " గదిలోకి జారుకున్నాడు సుబ్రావ్..!
"ఒరేయ్ అమ్మయిని నేను ఊరు తీసుకెళ్తున్నా... డెలివరీ తరువాత పంపుతా..! ఇక్కడుంటే  నువ్ అమ్మాయిని బ్రతక నివ్వవు " అంటున్న అక్క మాటలు ఎక్కడో నూతిలోంచి వినిపిస్తున్నాయ్ మత్తుగా నిద్రోతున్నసుబ్రావ్ కి.
మత్తు దిగి చూసే సరికి ఇళ్ళంతా ఖాళీ పెళ్ళాంలేదు.. అక్క లేదు.. అమ్మలేదు.. నెమ్మదిగా లేచి కాస్త ఓపిక తెచ్చుకుని మొఖం కడుక్కుని, తలుపులు వేసి చాయ్ తాగేందుకు బయటకు వెళ్లాడు. హంగోవర్ కప్పి పుచ్చుకుంటూ సూరి టీస్టాల్ కి వెళ్ళి టీ చెప్పి పక్కకు తిరిగే సరికి ఎదురు గా మేడమీద నైటిలో నిన్నటి చిరునవ్వులు విసిరిన అమ్మాయి  దర్శనమిచ్చింది. తనదైన స్టైల్ లో  మరో నవ్వు రువ్వి లోపలకెళ్ళింది. మత్తు వదిలిన సుబ్రావ్ ఇంటికెళ్ళి , చకచకా రెడీ అయ్యి.. మల్లీ సూరి టీస్టాల్ చేరుకున్నాడు.. అరగంట గడిచినా.. కనపడని తన నవ్వుల రాణి పేరన్న ఈ రోజు కనుక్కోవాలని అనుకుని పైకే చూస్తూ ఉన్న తన పై ఒక కాగితపు ఉండ పడింది.. అందులో ఓ ఫోన్ నెంబర్ .. ప్రత్యక్షమైంది. ఆ నెంబర్ కి కాల్ చేయటంతో ఆమె పేరు శిల్పిక అని బిటెక్ థర్డ్ ఇయర్ విద్యార్ధి అని తెలిసింది. అప్పటి నుంచి ఇద్దరూ టాకింగ్స్.. చాటింగ్స్.. వాట్స్ యాప్ మెసేజింగ్స్.. వీడియో కాలింగ్స్..ఇక ఒకటేమిటీ  మోడీ ప్రచారంలో సోషల్ మీడియా ఎలా వాడుకున్నారో గానీ వీళ్ళిద్దరినీ చూస్తే.. మోడీ కూడా షాక్ తినాల్సిందే..!
ముందు తనకి పెళ్ళైందని చెప్పటానికి సుబ్రావ్ తటపటాయిస్తే.. " నీకు పెళ్ళైందని నాకు తెలుసు రాజా..!' అని శిల్పిక చెప్పేసరికి కాస్త తేరుకున్నాడు సుబ్రావ్.
వీళ్ళిద్దరి కహానీ చల్లగా ఐస్ క్రీం పార్లర్ వరకూ పాకింది. ఒకసారి ఇద్దరూ ఐస్ క్రీం తింటుండగా తన భార్య రాక్షసి , అక్క శంకిణి అని, అమ్మ లంకిణి అని శిల్పిక దగ్గర సింపతీ కొట్టేసేందుకు చెప్పేశాడు. కాస్త వర్కవుట్ అయినట్లు.. శిల్పిక సుబ్రావ్ రెండు చేతుల మీద చేతులు వేసి "డోంట్ వర్రీ జీవిత మన్నాక కష్టాలు గులాబీ అన్నాక ముళ్ళు తప్పవు.. స్దరే నే వెళ్తా.. హాస్టల్ వార్డెన్ మళ్ళీ గోల పెడుతుంది" అని పర్స్ మీద చెయ్యి వేసిందో లేదో .. " ఎందుకూ నేను పే చేస్తా.. " అంటూ సుబ్రావ్  వెయిటర్ ని కేకేశాడు.
"సరే..! అన్నట్లు ఈ రోజు నో ఫోన్.. నో చాటింగ్ " అంది శిల్పిక . ఏ.. ఏ.. ఏ.. అన్నాడు సుబ్రావ్. " ఫోన్ లో బాలెన్స్ నిల్" అని చెప్పింది. ఏమనుకున్నాడో ఏమో ఒక  ఐదువందలు రీ-చార్జ్  చేయమని తన ఖాతా కొట్టు శ్రీను కి ఫోన్ చేశాడు సుబ్రావ్.
********************************************
హాస్టల్ లో శిల్పికను  ఆమె  ఫ్రెండ్ వనిత నిలదీసింది..పెళ్ళైన వాడితో డేంజరే వద్దు అని అనుభవశాలి నీతులు మొదలెట్టింది. " నాకు టైం పాస్.. వాడికి మెంటల్ టెన్షన్..లైట్ తీస్కో " అని వెళ్ళిపోయింది బాత్రూంలోకి శిల్పిక.
ఇలా రోజులు.. నెలలు గడిచి పోతున్నాయ్.. ఒకరంటే ఒకరు ఉండలేనట్లు మారి పోతున్నారు.. అంతలో ఒక రోజు ఫోన్ వచ్చింది సుబ్రావ్ కి. " నీకు అమ్మయ్ పుట్టింది చవటాయ్ ... " వచ్చితగలడు ముంబాయ్ కి "అంది  అక్క..!
తప్పేదేముంది.. శ్రమకు తగ్గ ఫలితం అనుకుంటూ ముంబాయి బయలుదేరాడే గానీ ఏకోశాన భార్య , పిల్లలు ఎలా ఉన్నారో అన్న ఆదుర్ధ లేదు సుబ్రావ్ కి.
అంతా శిల్పిక మయం.. మాటలు.. పలుకులు.. ఊసులు.. అంతా అదే లోకం.. ఒకటిన్నర రోజు ప్రయాణం అంతా చాటింగ్ లతో.. కబుర్ల తో పూర్తిచేసి ముంబాయ్ చేరాడు. ఇంటికెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి పెళ్ళాం కాంతాన్ని , పాపని చూసి  అక్కా వాళ్ల ను పలకరించాననిపించుకున్నాడు...
అంతలో ఫోన్ తో బయటకు వెళ్లడం.. మెసేజ్ చదువుతూ నవ్వుకోవడాన్ని పసిగట్టింది గట్టిదైన కాంతం.  తను లేని సమయంలో సుబ్రావ్ ఏదో గ్రంధచర్యం నడుపుతున్నాడని  అనుమానం మొదలైంది కాంతంకి.
అక్కడే.. బాలసారె పూర్తి చేశారు. వచ్చిన పంతులు అమ్మాయిని , బిడ్డని  రెండు రోజుల్లో తీసుకెళ్ళాలి.. లేకుంటే మరో మూడు నెలలు తీసుకెళ్లడానికి లేదనే సరికి సుబ్రావ్ కి పంతుల్ని మర్డర్ చేయాలన్నంత కసి పుట్టినా.. నవ్వు మాటున నొక్కేశాడు .
"ముంబాయి వెళ్ళి వస్తా.. వచ్చాక షికారు గా బీచ్ కెళ్దామని " పాపం శిల్పిక కి వరమిచ్చాడు సుబ్రావ్. ఇప్పుడు ఆ కలలన్నీ కల్లలేనా అని బుంగ మూతి పెట్టుకున్నాడు. చాటింగ్ కూడా అన్యమస్తకంగ పూర్తి చేశాడు. రెండో రోజు తల్లి కూతురు, తల్లికి తల్లి అంటే అక్క కం అత్తను.. తోల్కొని.. బామ్మర్ధికి బై చెప్పి రైలెక్కాడు సుబ్ర్రావ్. " ఏంటి బావా అలా వున్నావ్.. డబ్బులేమైనా కావాలా " అన్న బామ్మర్ధితో కాస్త ప్రశాంతత కావాలని అన్నాడు.  బామ్మర్ధి భార్యకు మాత్రం " వెళ్ళొస్తా చెల్లెమ్మా..!" అని చెప్పాడు. నెమ్మదిగా చాటింగ్ మొదలెట్టాడు.. శిల్పికతో.. ఒక వారం ఆగి బీచ్ కి వెళ్దాం అని బ్రతిమాలుకున్నాడు. అంతలోనే రెండు రోజులు పూర్తయ్యి ఒంగోలు రానే వచ్చింది.
ఇంటి కెళ్లారు... చిరాగ్గా ఉండి ఏదో ఆలోచిస్తూ బాత్రూంలోకి స్నానానికి వెళ్ళాడు సుబ్రావ్.. కాంతం , కాంతం వాళ్ళ అమ్మ, వాళ్లతో తెచ్చిన సామాను సర్దుకుంటూ వంటకు రెడీ అవుతున్న సమయంలో  సుబ్ర్రావ్ సెల్ ఫోన్ వైబ్రేషన్ సౌండ్ తో అలెర్ట్ చేసింది. ఏముందిలే అని సెల్ తీసుకుని చూస్తే.. 'స్టార్ ' అనే పేరు నుంచి మెసేజ్ వుంది. అసలే కాస్త అనుమానం ఉన్న కాంతం సెల్ లాక్ తీసి మెసేజ్ చదివేసరికి మొఖంలో రంగులు మారిపోయాయి.. ' అమ్మా ' అంటూ ఒక కేక పెట్టేసరికి ఒక్క అంగలో కూతురు దగ్గరకు చేరుకున్న సుబ్రావ్ అక్క, కూతురు చేతిలో సెల్ తీసుకు చూసి నిశ్చేష్టురాలైంది. . అందులో " మొత్తం మీద రాక్షసి తగల బడిందా..!" అన్న శిల్పిక పంపిన మెసేజ్.
అదేసమయంలో బాత్రూంలో " జోరుగా హుషారు గా షికారు పోదుమా" అని పాడుకుంటూ మరో కొద్దిగంటలలో శిల్పికని చూడబోతున్నానన్న సంతోషం లో   జోరుగా స్నానం చేస్తున్నాడు సుబ్రావ్ .
బాత్రూం లోంచి వచ్చిన సుబ్రావ్ ను ఎగిరి తన్నింది కాంతం.. "ఏం మొగుడివిరా,, నువ్వు.. పెళ్ళాం ఊరెళితే సెటప్ తెరిచేశావా..దొ.నా మొగుడా.. అది కూడా నన్ను  దాని దగ్గర రాక్షసిని చేస్తావా.." అంటూ అమ్మవారి అవతారం ఎత్తింది. బిత్తరపోయిన సుబ్రావ్ పారిపోదామనుకునే లోపు ఊహించని రీతిలో అక్క చెంప చెళ్ళుమనిపించింది. అసలు ఊహించని ఈ పరిణామానికి కళ్లల్లో వస్తున్న నీటిని ఆపుకుని "ఎందుకు కొడుతున్నారు ఇద్దరూ కలిసి" భయం దాచి ధైర్యం కూడ గట్టి అడిగాడు సుబ్రావ్..!
సెల్ విసిరి పిచ్చి మొఖాన  కొట్టి  చూసుకో నీ నిర్వాకం.. నీ ' స్టార్ ' నిర్వాకం అని అరుస్తూ ... లగేజీ  వెంటనే సర్ధుకుని అమ్మ, కూతురు మనుమరాలు ముగ్గురూ ఆటో ఎక్కేసి వాళ్ల వూరు ప్రయాణం కట్టారు.
ఆ పోవడం పోవడం ఎన్నో రకాల రాజీ ప్రయత్నాలు చేశాడు సుబ్రావ్.. ససేమిరా.. ! అంది కాంతం తన కాళ్ల పై తాను నిలబడాలనుకుంది,.. ఇలాంటి వాణ్ణి కట్టావా అంటూ అమ్మను ఆడిబోసుకుంది. పుట్టిన ఆడపిల్లకూ ఇలాంటి కష్టాలు దాపురిస్తాయఏమో .. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాం అంటూ బెదిరించింది. రాజీ చేయడానికి వెళ్ళిన రమేశ్ , సతీష్ లను "రాలగొడ్తా.. " అని రోకలి తో వెంటపడింది. " నీకు నీవే - నాకు నేనే " బ్రతుకుదాం అని కాంతం తేల్చేసరికి కళ్ళూ తేలేసిన సుబ్రావ్  చేసేదేమీలేక ఇంటికి వచ్చి ఉన్న పనికి వెళ్తున్నాడు.. అయినా కాంతం రోజూ ఉమాసారా..(ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం , రాత్రి) ఫోన్ చేసి సుబ్రావ్ ను ఆడిపోసుకుంటూనే ఉంది. ఏం చేయాలో పాలు పోని సుబ్రావ్ నెలరోజుల తర్వాత ఫోన్ నెంబరు తీసి పారేశాడు.
అసలు ఫోన్ ఎందుకు పనిచేయట్లాదా అన్న అనుమానం ఎక్కువై తిరిగి సుబ్ర్రావ్ ఇంటికి కి వచ్చిన కాంతం  సుబ్రావ్ చేత.. తాగను.. తిరగను ఎవ్వరితో మాట్లాడను అని ఒట్టేయించుకుని పసికందుతో సహా నట్టింట్లో కాలెట్టింది.  మరో రెండు గంటలకి కూతుర్నెతుక్కుంటూ కాంతం అమ్మ అక్కడకు చేరుకుంది.. అంతలో తీర్ధయాత్రలకెళ్ళిన సుబ్రావ్ తల్లి కుడా ఇంటికి చేరుకుంది.
ఫ్రెండ్స్ పోరు పడలేక భార్య .. తిరిగొచ్చిందనే సంతోషంలో కాస్త ఎక్కువ తాగేశాడు సుబ్రావ్.. కాంతం ని తిట్టుకుంటూ శిల్పికను అన్యాయంగా దూరం చేసిందిరా రాక్షసి అని మదన పడుతూ.. గుటకల మీద  గుటకలు స్వాహా చేసి ఇంటి కెళ్లాడు.
టక్..టక్..టక్ తలుపు తీసిన కాంతం.. ఎదురుగా గుర్రున చూస్తూ  ముక్కు మూసుకుని కుడి వైపుకు తప్పుకుంది..
వెనుకనే కాంతం అమ్మ.. ఉరఫ్ సుబ్రావ్ అక్క.. అలియాస్ అత్త..గుర్రుమంటూ ఎడమవైపుకు జరిగింది..
వెనుక సుబ్రావ్ అమ్మ.....
గుటకలు మింగాడు సుబ్రావ్..  కళ్ళు తేలేశాడు
అంతలో " ఒరేయ్ నువ్ మారవురా..?" ఒకటే సౌండ్.. త్రీ - ఇన్ - వన్ - స్టీరియో లాగా...!
" చచ్చన్రోయ్" సింగిల్ డిటిఎస్ లో..!

No comments:

Post a Comment

Pages