అందని ద్రాక్ష
- - రచన : కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
సుయ్... ఢాం... ఢాం.. ఢాం టప్..టప్..టప్...ఢాం సుయ్.. ఢాంఢాం ఢ..ఢ..ఢ..ఢాం అర్ధరాత్రి.. ఆకాశమంతా వెలుగుపూలు.. వెలుతురు పరచినట్లు... కోలాహలం... ఎక్కడో పెద్ద పెద్దగా జిందాబాద్ లు..జై..జై..నినాదాలు... " అమ్మ..! అవేంతమ్మా.. అలా అక్కల మెరుస్తున్నాయ్.. అంత పెద్ద కాకరపొత్తులు.. ఆకాశం వైపు చూస్తూ కళ్ళు మిరమిట్లు గొలుపుతుండగా .. మెరుపుల బాణాసంచాల .. కోలాహలాల ధాటికి నిద్రకళ్ళు నలుపుకుంటూ...ఆకాశం వైపు ఆనందంగా చూస్తూనే ఉన్న అమ్మ వందనం కొంగు పట్టుకు లాగై అడిగాడు ఆరేళ్ల భరతయ్య. " అరె పెద్ద పండగరయ్య" అని చెప్పింది పిల్లాడ్ని సంకెత్తుకుంటూ.... ఆకాశంలో మెరుపులను కళ్లల్లో నింపుకుంటూ అంది వందనం.
"పెదపండగ అయిపోనాదన్నవ్ గా అప్పులెప్పులో.." " అంతకన్న పెద్దపండగరా..కొడకా ఈయాల" కొడుకును సమాధానపరిచేందుకు చెప్పింది వందనం. " దీపాలి ఇంకారాలేదన్నవ్ గా .., నే పిల్లిపిసర అడిగితే.. ఆల్లెందుకు మరియాల డాంబులెందుకేత్తున్నారే.." పిల్లాడి ప్రశ్నల పరంపరకు ఆనందంలో మనసు పరవశం లో ఉర్రూతలూగుతున్న వందనం విసుక్కోకుండా సమాధానం చెబుతూనే ఉంది. అంతలో అటుగా ఖద్దరుగట్టిన యువ గుంపు... " వందేమాతరం" అంటూ వెళ్తోంది. "వందేమాతరం" అని వంతపాడుతూ సంకలో భరతయ్యను గట్టిగ వడిసిపట్టి కొంగుకు కట్టుకుని.. వాళ్లెనకే అడుగులేసింది వందనం .. అర్ధరాత్రి అన్న స్పృహ కూడా అప్పుడు లేదు వందనం కి.
అ క్షణం ఆమె కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతున్నాయ్.. ఆ.. ఆనంద భాష్పాలు వినువీథిలో పాలపుంత లై మెరుస్తున్నాయ్.. "వందేమాతరం" భారత్ మాతాకీ జై గాంధీజీకి జై పండిట్ నెహ్రూకి జై... సుభాష్ బోసుకు జై... అమ్మ గొంతుతో జై అంటూ శ్రుతి కలిపాడు భరతయ్య. రోమాంచితమైన మేనును మరచి గొంతెత్తి పాడుతున్నారు..అందరితో కలిసి.. జనగణమణ అధినాయక జయహే.. తల్లి కొడుకులు వచ్చిరాని భావనల పెదాల కదలికలతో..... మువ్వన్నెల ఝంఢా రెపరెపలకు అందరూ కలిసి "జై హింద్" అంటూ ముగించి ఎవరి దారికి వారు తిరుగుముఖం పట్టారు. "తెల్లారి పోతోంది పద కొడుకా" అంటూ అప్పటికి ఇంటి నుంచి చాలా దూరం వచ్చిన వందనం ఇంటి వైపుకు కొడుకును భుజానికెత్తుకుని పరుగులాంటి నడకతో అడుగులేసింది. "అమ్మ ఏం పండగమ్మ ఇది" .. మనకింత సంబరమైతాంది. మరి ఇంత పెద్ద పండక్కి అయ్యరాలే..!
ప్రశ్నలు మింగినోడిలా ఒకదాని తర్వాత మరొక ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు భరతయ్య. " పద కొడక ఇంటికి బోయి కళ్లాపు జల్లి ముగ్గెట్టాల వడివడిగా నడుస్తోంది చమట బిందువు ఆమె నుదుటి నుంచి నాసిక మీదుగా పెదాలని తాకుతూ ఎదపై జారింది. కాస్త రొప్పు తీసుకుని.. " మీ అయ్య వస్తాడు కొడుకా..! మనకి ఈయాల నుంచి స్వతంత్రం వచ్చేసినాది. మనం ఇప్పుడు ఎవల్లకీ బానిసలం గాము." ఆమాట అనేటప్పుడు గర్వం తొణికిసలాడింది వందనం గొంతులో..! " యాడబోయిండమ్మ అయ్య.." మళ్ళీ అదే ప్రశ్న చిన్నోడి నుంచి.
"పోలీసోల్లు నూక్కబోయిండ్రు కొడుకా మీ అయ్యని.. బిటీసు దొరలు కర్కశులు.. ఆల్లు మీ అయ్యని అన్నాయంగా జైల్లెట్టారు. " " ఇప్పుడు మనదేశం మనదయిపాయె. అందుకే మీ అయ్య, ఆ వెంకప్ప, పోలిగాడు అందరూ వచ్చేత్తారయ్య.. ఇంక మనం సంతోసంగా బతికేయొచ్చు " చెప్పుకుంటూ పోతున్న వందనం ని మధ్యలో అడ్డుకున్నాడు భరతయ్య. "అయ్యనెందుకెత్తుకెళ్ళారే .. ఆ పోలీసోల్లు.."
" ఏంలేదు భరతా..! నీ సిన్నప్పుడు పాలిత్తాంటే.. పాలకు శిస్తుకట్టాలంటూ దొర అడ్డుబెట్టిండు.. ఆ నా కొడుకు ఆయాల నన్ను..నన్ను.. ఆమెకు కళ్ళెరుపోక్కాయ్.. చెయ్యిబట్టిండు కొడుకా..! ఆ ఇషయం తెలిసి మీఅయ్య ఉడికిపోయిండు. ఆ దొరగాని నరికి తెత్తానని ఆ దొర కొంప గోడ దూకిండు... ఆడ మీ అయ్యని పట్టుకుని దొంగతనం జేసినాడని జెల్లెట్టిరి కొడుకా..! చెబితే అర్ధం కాని వయసు భరతుడిదన్న ధ్యాసే మరచి చెప్పేస్తూ పోతోంది వందనం.. అన్యమస్తకంగా....! కళ్ళు ఒతుకుంటూ.. ఆయాల జరిగింది గుర్తొచ్చి, విషాదం.. ఈయాల స్వాతంత్ర్యం వచ్చిందన్న సంబురం.. వందనం ను గందరగోళానికి గురిచేశాయి.. ఇంటి కొచ్చి " వందేమాతరం " అని ఓసారి పెద్దగా అరచి చీకటి తెరలు తొలగక ముందు.. ఆకాశంలో మిలమిలా మెరిసిన తారజువ్వని చూస్తూ అలాగే ఉండి పోయింది.
************
ఒరేయ్ ఇయ్యాల సుబాసు చంద్రబోసు కు పూజ సెయ్యలరా..! మనకి స్వాతంత్ర్యం వచ్చిన రోజు కదా..! మనోల్లందరూ ఆయన పండగసెయ్యాల. పిల్లల్ని కూనల్ని పిలుసుకు రండ్రా.! పిలుస్తున్నాడు ఆదర్శ్ అనే సెటిల్మెంట్ గ్రామంలో పెద్దకాపుగా వున్న 73 భరతయ్య. దొరలకాలంలో దొంగతనాల కేసులో జైలుకళ్ళిన వాళ్ళ రీహాబిలిటేషన్ సెంటరే ఆ ఆదర్శ్ గ్రామం.. దీన్నే సెటిల్మెంట్ గ్రామం అని ఇక్కడోళ్ళనే సెటిల్మెంటోళ్ళని పిలుస్తుంటారు. భరతయ్యంటే ఇక్కడి వాళ్లకి వల్లమాలిన ప్రేమ. అభిమానం..
భరతయ్య తండ్రిపై అకారణం గా బ్రిటీషోళ్ళు దొంగ ముద్ర వేస్తే.. కొడుకు బోస్ , పోలీసులు పెట్టిన దొంగతనం కేసులో జైల్లో మగ్గి పోతున్నాడు... మనమడిని చదివిస్తూ కాలం గడుపుతున్నాడు భరతయ్య. అంతా సూరిగాడింటి దగ్గరున్నరు తాతా..! " భరతయ్య అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడో బుడతడు.. సూరిగాడి కోసం ఆయన పిల్లలు పెండ్ల్లం ఏడుస్తున్నారు.. ఏమైందక్క అడిగాడు మాతరం.. మాతరం భరతయ్య మనుమడు. ఆదర్శ్ గ్రామంలో అందరికీ చేదోడు వాదోడుగా ఉంటుంటాడు.. ఆ గ్రామంలో కొద్దో గొప్పో చదువుకున్నోళ్లలో ఒకడు మాతరం.
" ఏంజెప్పేది మాతరం ..నిన్న అర్ధరాత్రి పోలీసోళ్ళొచ్చి మీమావను కొట్టి తీసుకెళ్ళరయ్యా..! మేం దొంగతనాలు మానేశామయ్య అన్నా.. పట్టించుకోకుండా.. "మీరు దొంగతనాలు మానేస్తే ఎట్టగరా..మేం బ్రతికేది.. మా టార్గెట్లు పూర్తయ్యేది .". అని చితక్కొట్టి "వెళ్ళి దొంగతనాలు చెయ్యండి లేకుంటే ఎవరి పేర్లయినా దొంగబంగారం అమ్మినట్లు చెప్పండి" అంటూ హూంకరించారయ్యా..!
"నేను అలా చేయను మా పిల్లలు, ఈడుకొచ్చారు.. దొంగతనాలు చేయదలచుకోలేద"న్నాడయ్యా.. దానికి .... పోలీసోళ్ళు వాళ్లతో తెచ్చిన గంజాయి జేబులో బెట్టి " గంజాయమ్ముతావారా.. దొ.ల.కొ "అని పచ్చిగా తిడుతూ ఆడోళ్లమని కూడా చూడకుండా అడ్డుకున్న మమ్మల్ని కూడా కొట్టి.. మీ మావను ఈడ్చుకెళ్ళారయ్యా..!" ఏకరవు పెట్టింది సూరి పెండ్లాం.
"సరే నేను తాతకు చెప్పి కనుక్కుంటాలే.. ఏడ్వమాకు మనకిదేం కొత్తకాదుగా.. !" సర్ధి చెప్పాడు మాతరం. స్వాతంత్ర్య దినోత్సవం రోజుకావడంతో భరతయ్యకు సన్మానంచేసి.. ఆయనకిష్టమైన సుభాష చంద్రబోస్ పటం ఇద్దామని పిల్లలంతా కూడబలుక్కుని ఏర్పాట్లు చేసేందుకు అక్కడి స్కూల్ లో రంగుకాగితాలు అతికిస్తున్నారు. స్వతంత్ర్య అవతరణ చూసిన గొప్పోడు మావూరి పెద్దకాపు భరతయ్య అని ప్రపంచానికి చాటి చెప్పేందుకు హడావుడి చేస్తున్న కుర్రకారు ఊర్లో చానల్ వాణ్ణి పిలిచారు. " ఎవరో పుట్టిన రోజులకి, ఇండిపెండెన్స్ డేలకీ ఊరక టివిలో చూపించరు. " అని వాదులాడుతున్నాడు అక్కడికి టివి కవరేజ్ కొచ్చిన రిపోర్టర్ శ్రీను.
" అదేందన్న మేం పేదోళ్లం .. మా ముసిలోడు అడిగిండు వచ్చేఏడాదికి ఉంటాడో.,. పోతాడో అని సంబరం చేసుకుంటుంటే..ఎప్పుడైనా మిమ్మల్ని అడిగామా దొంగలని జెప్పి అందరూ ఇంటర్వూలు ఎన్నిసార్లు దీసుకోలేదన్నా మీరు.. పెద్దపండగ రోజు తాత కు సన్మానం జేస్తుంటే .. ఏందన్న శీనన్న నువ్వు" ఏదో చెప్పబోతున్న మాతరం ను అడ్డుకుని " ఇదిగో మాతరం స్వీట్లకు, డబ్బుల్రాలా.., రంగు కాగితాలకి.. సన్మానం చేసేదానికి, దండకి డబ్బుల్రాలా.. ఏందిరో వీడియో దీసి టివోలో చూపించే నాదగ్గర కొచ్చేసరికి ఇయ్యడానికి ఏడుస్తున్నారే..!" ఐదొందలు చేతిలో బెడితే తీస్తా లేకుంటే లే..!" ఖరాఖండిగా చెప్పిన శ్రీను ని చితక్కొడదామని చూస్తున్న కుర్రోళ్ళని సైగ చేసి వారిని వారించి, శ్రీనుది గ్రేట్ రిపోర్టర్ కు మూడొందలిచ్చి సర్ధుకోమని చెప్పి "గంటలో స్టార్ట్ చేస్తాం వచ్చేయన్న " అని పంపాడు మాతరం.
"తాత కోరిక తీర్చాలిరా..! .. ఆణ్ణి కొట్టీ ఉపయోగంలేదు.. స్వతంత్ర్యం మనదేశానికే పెద్దపండగ.. ఈ సంబురాన్ని తాత నేరుగా చూసిండు.. ఆయన్ని తాకితే అదే మనకు పదివేలు.. "మాతరం చెప్పుకుపోతున్నాడు. ' రేయ్ ఎవడ్రా ఇక్కడ మైకెట్టిన దొంగనాయాలు " అక్కడికి లాఠీతో చేరుకున్న కానిస్టేబుల్ బాషా..! ఆడియో ప్లేయర్ మీద లాఠీతో కొట్టి ..రేయ్.. మిమ్మల్నే ఎవడ్రా ఇక్కడ.." అరుస్తున్నాడు .
అప్పటిదాకా అరేంజ్ మెంట్స్ చూసుకుంటున్న కుర్రాళ్ళు పరిగెత్తుకొచ్చారు. " సారు మా భరతయ్య తాతకి సన్మానం చేస్తున్నాం ఆయన మనవడు మాతరం ఏర్పాటు చేశాడు సారూ..!" అని చెప్పారో లేదో. "అయితే ఆ మాతి గాణ్నే పిలవండి వాడికి ఈ సందులో మైకు పెట్టుకోడానికి పర్మిషన్ ఎవడిచ్చాడో ఇప్పుడే తేలాలి.." బాషా అరుపులకు పరిగెత్తుకొచ్చి " స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు సారూ.. మాతాత కి సన్మానం చేస్తున్నాం.. పిల్లలు ఎంజాయ్ చేస్తారని దేశభక్తి పాటలు మైక్ లో పెట్టాం.. అంతే " అన్నాడు మాతరం
"ఒరేయ్ మాతిగా... మనూరి ఎమ్మెల్యేవా.. ఏదైనా పార్టీ ప్రెసిడెంటువా. నీ ఇష్టం వచ్చినట్లు మైకులు..కరెంటు వాడుకోడానికి.. మైక్ పెట్టుకోవడానికి డిఎస్పి పర్మిషన్, పొల్యూషన్ బోర్డ్ పర్మిషన్, చుట్టుపక్కలోళ్ళు ఇబ్బందిలేదంటూ ఎన్ ఓ సి ఇలాంటి వన్నీ కావాలిరా. లేదంటే వెయ్యి ఫైను.. అదీ లేదంటీ ఐదొందలు ఫైను.. అదీలేదంటే ఎట్టా.. మాతరం జేబులో చెయ్యెట్టి డ్బ్బులాక్కుని, అందులో ఐదొందలు తీసుకుని మిగిలినవి మాతరం జేబులోకుక్కి .." ఇదిగో ఇట్టా" అని తూలుతూ వెళ్ళిపోయాడు బాషా అప్పటికే తప్పతాగి మరలా త్రాగేందుకు అదికూడా స్వాతంత్ర్యం రోజు.
"అన్న ఎంతమంది వస్తారే ఇట్టా.. ప్రతి వాడూ వచ్చి రూల్స్ మాట్లాడుతూ.. పైసలడుగుతాడు..నువ్వేమో ఆల్లని బ్రతిమాలి డబ్బులిచ్చేత్తావు. పొద్దుటి నుంచి, కరంటోడు, పొల్యూషనోడు, ఫైరాఫీసోడు, వీఅర్ ఓ , ఫుడ్ ఇన్స్ పెక్టరు, ఏందన్న ఇది.. వరస పెడుతూనే ఉన్నారు.. ఇప్పుడేమో ఈ తాగుబోతు బాషా గాడు..,ఆ రిపోర్టర్ గాడు... ఈ రోజు మనకొక్కళ్ళకే పండగాన్నా..ఈళ్ళ కి పండగ్గాదా..! ఏందో ఇట్టా అందరూ బెదిరిస్తుంటే ఎందుకన్నా ఈ బ్రతుకు ..చీ దీనెమ్మ జీవితం " అంటూ వాగేస్తున్నాడు కామేశం కొడుకు సుదేశ్.
" ఒరేయ్ మనం దొంగలం అని ముద్రేసి వెతికి తెచ్చి ఈడబెట్టారు. మనకీ మంచి రోజులు రాకపోతాయా..! పద తాత ఎదురు చూస్తు ఉంటాడు.. ఆ టివి శ్రీను గాణ్ని ఫోన్ చేసి పిలవండి. అని హడావుడి చేశాడు మాతరం. " ఆ రోజు పెద్దపండగని మాయమ్మ చెప్పింది.. అందరూ టపాసులు కాలుస్తున్నారు.. 'వందేమాతరం' అని అమ్మ అరుత్తాంటే నేను అరిసా..! వేలమంది రోడ్డెక్కి గాంధీజీకి, నెహ్రూజీకి, సుభాష్ జీకి జై అంటూ ఊరేగింపులు చేశారు.. ఆయాల ఆ పండగ సూణ్ణీకి రెండు కళ్ళు చాలవురయ్యా.. సెప్తే సాలదు. ఇప్పటీకీ కళ్ళల్లో మెదలతానే ఉందారోజు.. " సన్మానం కి ముందు భరతయ్య తన జ్ఞాపకాలను మైక్ ముందు నెమరువేసుకుంటుండగా.. ఊరు ఊరంతా తరలి వచ్చింది..
నోరెళ్ళబెట్టుకుని ఆయన చెప్పే ప్రతి ముక్కా వింటున్నారు శ్రద్ధగా ఆ గ్రామస్తులు. ఆ రోజు పంద్రాగస్టు 1947 కళ్ళముందు కదులాడుతుండగా అమ్మతో పరిగెత్తి ఆకాశంలో ఎగురుతున్నా మువ్వన్నెల ఝండా కు బుజ్జి చేత్తో సెలూట్ చేసిన క్షణాలు గుర్తొచ్చి.. ఆనందభాష్పాలు వర్షిస్తున్నాయి.. భరతయ్య కంట్లో..! అప్పట్లో అయ్య కోసం ఎదురు చూస్తూ మాయమ్మ కూకున్న రోజు నాకింకా గుర్తే..! దేశమంతా సంబురాలు సేసుకుంటుంటే మేం మాత్రం మా అయ్య కోసం ఎదురు చూస్తున్నాం. ఆళ్లని బ్రిటీషోళ్ళు రైల్లో పెద్దూరు తెస్తున్నారని తెలిసి అందరం ఆడికి బయలుదేరాం. మా అయ్యని .. ఇంకో ముగ్గురిని బ్రిటీషు పోలీసులు రైలు దించి అందరికీ ఎల్లొత్తాం అని షేకాండిచ్చి, కౌగిలించుకుని సెల్యూట్ చేసి మరీ ఎల్లారు ఆ పోలీసోల్లు.. అప్పట్లో కొందరు దొరలు గలీజోళ్ళు గానీ, పోలీసోళ్ళు మాత్రం సాయం చేసే మంచోళ్లే ఎక్కువ. అందరిని గౌరవంగా సూసేటోళ్ళెక్కువ. మానాయనోళ్లని జైల్లో చిన్న దెబ్బకూడా ఎయ్యలేదంట. సమరయోధులని సాదరంగా అందరితో చూసే వాళ్లంట. " కన్నీళ్ళు కట్టలు తెగుతుండగా ఉత్కంఠతో చెవులు రిక్కరించి మరీ వింటున్నారు గ్రామస్తులు..
" అప్పుడు స్వాతంత్ర్యం కోసం ఎందరో తమ ప్రాణాలను పణంగా పెట్టారు.. స్వాతంత్ర్యం కోసం కలలు కన్నారు.. సాధించినంత వరకూ నిద్రారాలు ఒక్కరికీ లేవు.. అంతగా కష్టించి దాశ్యశృంఖలాలను తెంచేస్తే.. మనం ఇప్పుడు ఆ ఫలాలు అనుభవించకుండా.. లంచాలు. అబద్దాలు,, అభద్రతతో గడుపుతున్నాం.." అని భరతయ్య చెబుతుండగా .. పెద్ద పోలీసు వ్యాన్ వచ్చి స్కూల్ ముందాగింది... పోలీసులు స్కూల్ చుట్టుముట్టారు.. హడావుడి గా లోనికి చొచ్చుకెళ్ళిన పోలీసధికారి.. భరతయ్య సన్మానం చూస్తున్న సుధేశ్ ను, మరో ఇద్దరిని చొక్కా పుచ్చుకుని గుంఒపులోంచి బయటకు లాక్కెళ్తున్నారు.. ఒక్కసారిగా ఆ ప్రాంతం రణరంగంగా మారింది.
"మావోళ్ళు రాత్రి పట్టుకెళ్ళిన సూరి వీళ్లందరి పేర్లు చెప్పడ్రా.. అందుకే తీసుకెళ్తున్నాం..మా కళ్ళు కప్పి ట్రైనింగ్ క్లాసులు నడుపుతున్నార్రా.." గర్జిస్తున్నాడు డిఎస్పి నరహరి. ఏంజరుగుతోందో తెలుసుకుండే లోపు గందరగోళం మధ్య తోపులాట. పోలీసులని అడ్డుకోబోయిన మాతరం ను దూరంగా నెట్టేశారు పోలీసులు..హడావుడికి షాక్ తిని .. తేరుకున్న భరతయ్య., పోలీసులని బ్రతిమాలుతున్నాడు...
అయ్యా.. వదిలేయండయ్యా.. ఈయాల పెద్దపండగయ్యా.. నా మొఖం చూసి వదిలేయండయ్యా.. ! ఆళ్ళు దొంగలు కాదయ్యా.. వదిలేయండయ్యా. నేను సత్తె ప్రమాణకంగా సెబుతున్నా ఆళ్లకేం తెలీదయ్యా..! బ్రతిమాలుతున్న భరతయ్యను ఒక్కవిసురు విసిరాడూ డిఎస్పి నరహరి. అంతే తూలి క్రిందపడబోయి అక్కడే ఝండా వందనానికై కర్రకు కట్టి వున్న త్రాడు చేతికి తగులుకుని వెల్లికిల పడిపోయాడు భరతయ్య.. ఆయన చేతికి చుట్టుకున్న తాడు క్రిందకు రావడంతో ఝంఢా పైకెళ్ళి రెపరెప ఎగిరింది... క్రింద కుప్పకూలిన భరతయ్య ఆకాశం లో ఎగురుతున్న ఝండాని చూస్తూ యెడమ చేత్తో సెల్యూట్ చేస్తూ ప్రాణం విడిచాడు... ఝండాలో పూలు ఒక్కసారిగా వర్షంలా భరతయ్యపై కురిశాయి.. అక్కడున్న వారందరి కళ్ళు జలజలా వర్షించాయి.
(ఎందరో త్యాగధనుల ఫలం అందని ద్రాక్షాగా మిగిలింది.. కొందరు స్వార్ధపరులైన నల్లదొరల కోరల్లో చిక్కి శల్యమౌతోంది.. మనదేశం గురించి మనవాళ్ళు విదేశాల్లో ఘనం గా చెప్పుకోవాలంటే.. మనం సమాజంలో మార్పు రావాలి.. అందుకోసం అందరం ఐకమత్యంగా కృషిచేయాలి .- కళ్యాణ్)
No comments:
Post a Comment