అసలు ఆరోజు ఏం జరిగింది..?
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్.
ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల నిస్వార్ధ త్యాగ ఫలితమే, ఈనాడు మనం స్వేచ్చగా కాస్త గాలి పీల్చుకోగలుగుతున్నాం.. మనదైయుండి మనదని చెప్పుకోలేని దౌర్భాగ్యపు శృంఖలాలను తెంచిన, దార్శినికుల కష్టార్జితమే , మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం. 67 సంవత్సరాల క్రితం సంపాదించుకున్న మన ఆస్తిని ఎంతవరకూ పరిరక్షించుకుంటున్నామో అనే విషయం వారివారి చిత్తానికే వదిలేస్తూ.. ఆరోజునే మనకు స్వాతంత్ర్యం ఎందుకిచ్చారు బ్రిటీష్ వారు..? మొదటి నుంచి అదే రోజు నిర్ణయించారా..? లేక వేరే రోజా..? అసలు ఆగస్టు పదిహేను జ్యోతిష్య రీత్యా మంచి రోజు కాదా..? అదే నిజమైతే మరి ఎందుకా రోజునే నిర్ణయించారు? స్వాతంత్ర్యం కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన గాంధీజీ ఆ రోజు ఢిల్లీ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల సభలో పాల్గొనలేదా..? అయితే ఎందుకు ?
అసలు ఆరోజు ఏంజరిగింది..? మరుగునపడ్డ అనేక నిగూడాలను అచ్చంగా తెలుగు పాఠకుల కోసం అందించే ప్రయత్నమే ఈ వ్యాసం లక్ష్యం. స్వాతంత్ర్యం ఇవ్వాలన్న మంచి బుద్ధి బ్రిటిష్ వారికెందుకు పుట్టింది..? గాంధీ జీ బహుజనులను మేల్కొలపడంలో ముందడుగు వేశారు. తన ప్రసంగాల ద్వారా.. స్వాతంత్ర్య పోరాటాన్ని అహింసాయుతంగా గల్లీ గల్లీలోకి తీసుకెళ్ళి నరనరం పోరాటం అనే ఏక లక్ష్యంతో పనిచేసేలా సమాయత్తం చేశారు. మరోవైపు నేషనల్ అర్మీ గా పిలువబడ్డ, అజాద్ హింద్ ఫౌజ్ , సుభాష్ చంద్ర బోస్ ఆధ్వర్యంలో అనతి కాలంలో ఊహించని స్థాయిలో బలోపేతమయి బ్రిటిష్ పక్కలో బల్లెంలా మారటం. రెండవ ప్రపంచ యుద్ధానంతరం 1945 నాటికి బ్రిటిషర్లు ఆర్ధికంగా దివాళా అంచున ఉండటం, వారి దేశాన్నే పాలించుకోలేని స్థితిలో భారతదేశాన్నీ పాలించడం కనాకష్టంగా తోచడం. లండన్ నగరంలో లేబర్ పార్టి ఘనవిజయం సాధించడమే గాక, ఇండియాకు స్వాతంత్ర్యం ఇస్తేనే బ్రిటిష్ ప్రభుత్వాన్ని గౌరవిస్తామని వారు ఆంక్షలు ప్రకటించడం. ' ALL TROUBLES COMPETE A CHANCE ATONE' అన్న ఆంగ్ల సామెత ని గుర్తు చేస్తూ, అంగ్లేయుల పాలనకు కష్టాలన్నీ ఒక సారి చుట్టుముట్టి, మనుగడ పెద్దసవాల్ గా మారింది. ఇండియా కు స్వాతంత్ర్యం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించడమే గాక, స్థితి గతులను దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 1947 న లార్డ్ మౌంట్ బాటన్ ను చివరి వైశ్రాయ్ గా భారత్ కు పంపింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. అధికార బదలాయింపు కు కృషిచేయటమే ఆయనను ఇండియాకి పంపడానికి ముఖ్యకారణం.
తొలుత ఖరారైన తేదీ ఏదీ..? ఈ ప్రణాళికలో భాగంగా బ్రిటన్ నుండి అధికారాన్ని ఇండియా కు బదిలీ చేయడానికి తొలుత 1948 జూన్ నెల ను నిర్ణయించి, అందుకై ప్రయత్నాలు మొదల్లు పెట్టారు వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్ ఎన్నో సార్లు చర్చలు జరిపినప్పటికీ మహమ్మద్ అలి జిన్నాకు , జవహర్ లాల్ నెహ్రూ కు మధ్య పొంతన కుదరక పోవడంతో అవి విఫలమయ్యయి. అదే సమయంలో జిన్నా ప్రత్యేక దేశం కోరటంతో దేశంలో ని పంజాబ్, పశ్చిమ బెంగాల్ లలో మత ఘర్షణలు రేగాయి. దీంతో లా అండ్ ఆర్డర్ పరిస్థితి చేజారింది. ఇది లార్డ్ మౌంట్ బాటన్ ఊహించని పరిణామం. దీనితో తప్పని పరిస్థితిలో అధికార బదలాయింపు తేదీని ముందుకు మార్చాల్సి తప్పింది కాదు బాటన్ కు.. జూన్ 1947 న దేశ విభజనపై, నిర్ణయించే విషయమై జరిగిన అతి ముఖ్య సమావేశంలో జవహర్ లాల్ నెహ్రూ, మొహమ్మద్ ఆలీ జిన్నా, అబ్దుల్ కలాం ఆజాద్, మాస్టర్ తారాసింగ్, బి.ఆర్.అంబేద్కర్, లు పాల్గొని విభజకు అంగీకరించారు. జూన్ మూడున మౌంట్ బాటన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో హిందుస్థాన్ కు అధికార బదలాయింపు అనే అంశం దాదాపు సంవత్సరం ముందుకు జరపాల్సి వచ్చింది. అంటే 1948 జూన్ నెల లో రావాల్సిన స్వాతంత్ర్య సమ్మోహన ఘట్టం 1947 కు మారింది. ఈ ప్రత్యేక సమావేశాన్నే ' జూన్ మూడు మౌంట్ బాటన్ ప్రణాళిక ' గా చరిత్రలో నిలిచి పోయింది.
పంద్రాగస్టునే ఎందుకు ? ఆఖరి క్షణాలలో కూడా బ్రిటిష్ వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ తన ఇష్టాన్నే మనపై రుద్దేందుకు యత్నించారని చరిత్ర చెబుతోంది. లార్డ్ మౌంట్ బాటన్ దృష్టిలో ఆగస్టు పదిహేను అనేది అదృష్టాన్ని కలిగించే రోజు... అది అతని భావన. దానికీ కారణం లేకపోలేదు... రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ కమాండెంట్ గా పనిచేసిన మౌంట్ బాటన్ కు జపాన్ సైన్యం , తన మిత్రదేశాల సైనికులతో సహా 1945 ఆగస్టు 15 వ తేదీన లొంగిపోయింది. అందుకని 1947 వ సంవత్సరంలో , అదే రోజున భారత దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు లార్డ్ మౌంట్ బాటన్. దీంతో భారత్ నాయక శిబిరంలో ..సంతోషం వెల్లి విరిసింది.. ఇదే విషయాన్ని దేశప్రజలకు తెలిసేలా చేసింది..
మరి అర్ధరాత్రి ఎందుకు..? కానీ...
భారతీయ జ్యోతిష్య శాస్త్రవేత్తలు 1947 ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్ర్యం ఇవ్వడాన్ని, అధికార బదలాయింపుని నిర్విద్వంగా తోసి పుచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో తేదీ మార్చాల్సిందే నని పట్టుబట్టారు... ఆగస్టు పదిహేను దుర్ధినం అని, దేశవ్యాప్తంగా సుఖసంతోషాలతో వెల్లివిరియాల్సిన రోజు సుమూహూర్తాన జరగాలన్నది వారి అభిమతమని బల్లగుద్ది చెప్పారు.. ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. దీంతో కథ మొదటికొచ్చింది... వచ్చే స్వాతంత్ర్యం ఎక్కడకు వెనక్కి పోతుందో అని నాయకుల గుండెలు గుభేల్ అన్నాయి. ధైర్యం చేసి వైశ్రాయ్ ని ఒప్పించేందుకు నెహ్రూలాంటి వారు కొంత ధైర్యం చేసినప్పటికీ లార్డ్ మౌంట్ బాటన్ తాను తీసుకున్న నిర్ణయాని మార్చుకునే ప్రశక్తిలేదని ఖరాఖండిగా చెప్పేశారు.
అటు పండితులు - ఇటు మౌంట్ బాటన్ ల మొండి పట్టుదలతో బిగుసుకు పోవడంతో ఏంచేయాలో పాలు పోని నాయకులు సందిగ్ధంలో పడ్డారు. చివరకు జవహర్ లాల్ నెహ్రూ పండితులతో చర్చించి.. అర్ధరాత్రి ముహూర్తం ఏదైనా ఉందేమో చూడమని సూచించారు.
దీంతో జ్యోతిష్య శాస్త్రవేత్తలు ఆగస్టు 14 - 15 మధ్య అనగా ఆంగ్ల కాలమానం ప్రకారం రోజు.... అర్ధరాత్రి 12 గంటలకు మొదలౌతుంది (12am) . భారత కాలమాన ప్రకారం దినారంభం సూర్యోదయానంతరం మొదలౌతుంది.
ఇదే ప్రాతిపదికన ఇరువురిని సంతోషపరుస్తూ.. ' అభిజిత్ లగ్నాన ' అధికార బదిలీ జరుపుకునేందుకు పండితులు అంగీకరించారు.. ఆంగ్ల సంవత్సరం 1947 ఆగస్టు 15 , 00.15 కి ముందు 24 నిమిషాలకు మొదలై.... తరువాత 24 నిమిషాలకు పూర్తవ్వాలని అంటే ... ఆగస్టు 14 అర్ధరాత్రి 11.51(pm) కు మొదలై - ఆగస్టు 15 00.39 (12.39 am) కి పూర్తవ్వలని ప్రధాని కాబోయే నెహ్రూ తన ప్రసంగాన్ని 12 గంటలకు పూర్తిచేసి తదుపరి (శంఖం పూరించాలని)..' శంఖారావం ' చేయాలని నిర్ణయించారు. దీంతో జ్యోతిష పండితుల వైపు ఉపశమనం కలిగినా.. మరొక వైపు ససేమిరా..! అంటున్న మౌంట్ బాటన్ ను ఒప్పించే పనిని మరలా తన భుజస్కందాలపై వేసుకుని పటేల్ తో కలిసి, వైశ్రాయ్ ని ఒప్పించారు నెహ్రూ... తొలి గవర్నర్ జనరల్ గా కూడా మౌంట్ బాటన్ భారత్ లో వున్నన్నాళ్ళు కొనసాగేందుకు అంగీకరించారు. ( తనకు తానుగా ఇండిపెండెంట్ ఇండియా గవర్నల్ జనరల్ గా ప్రకటించుకుని, జూన్1948 వరకూ బ్రిటిష్ ప్రభుత్వ చివరి వైశ్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ .. స్వతంత్ర్య భారత్ తొలి గవర్నర్ జనరల్ గా కొనసాగారు.) మహోజ్వల ఘట్టం లో గాంధీ గారి జాడేదీ..?
మహోజ్వల ఘట్టం.. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య రెపరెపలు టపటప నేలజారి .. మువ్వన్నెల ఝంఢా రెపరెపలు.. శాంతి కపోతాల రెక్కల ఢంకారవాల మధ్య .. తన అద్బుతమైన ప్రసంగాన్ని పూర్తిచేసిన తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ.. 'శంఖారావం ' చేశారు. Tryst with Destiny' గా ఆయన చేసిన ప్రసంగం చరిత్ర పుటల్లో నిలిచి పోయింది. నెహ్రూ ప్రసంగం పూర్తికావటంతో , ఆసేతు హిమాచలం మురిసిపోయింది.. ఆనందంతో తబ్బిబ్బయ్యింది. .. దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.. "జనగణ మణ అధినాయక జయహే "ధ్వానాలతో.. "వందేమాతరం" అంటూ నినాదాలతో.. బాణాసంచాల మోతలతో.. ఖద్దరు దుస్తుల చిందులతో.. నృత్యాలు.. పాటలు.. చిన్న పెద్ద, మతాలకతీతంగా ఆనందపు హోరు ప్రపంచ నలుమూలలకు తాకేంతగా సంబురాలు జరుగుతున్నాయ్.. ముఖ్యంగా డిల్లీలో స్వతంత్ర్య సంబరాల హడావుడి అంతా ఇంతా కాదు... పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మొదలు చిన్నచితకా దేశ స్థాయి నాయకులందరూ, భారతీయ స్వతంత్ర్య వేడుకలలోపాల్గొని, మన అచ్చంగా తెలుగు మేథావి పింగళి వెంకయ్య తీర్చిన ఝంఢా ని ప్రధానిగా ఎన్నికైన పండిట్ నెహ్రూ ఎగురవేస్తుంటే ఆ సుందర మనోహల దృశ్యాన్ని చూసి తరించారు... (తొలి స్వాతంత్ర్య వేడుకల కలర్ క్లిప్ ను చూసి తరించండి.)
కానీ.. అంతటి సంబురంలో అలుపెరగని స్వతంత్ర్య పోరాట యోధుడు, అహింసకు ప్రతి , జాతిపితగా కీర్తించబడ్డ గాంధీజీ హాజరు కాలేదు.. అంటే ఆయనకు స్వాతంత్ర్యం సముపార్జన ఇష్టం లేదా..?.. ముమ్మాటికీ కాదు... మరి ఆ సమయంలో గాంధీ జీ ఎక్కడ అనే సందేహం రావడం సహజం. ఆ సమయంలో గాంధీజీ కలకత్తాలో ఉన్నారు... చరఖా తిప్పుకుంటూ, ఉపవాస నిరసనతో, ప్రార్ధనలతో కాలం గడిపారు.. ఒకవైపు ఢిల్లీలో స్వతంత్ర్య వేడుకలు ఘనం గా జరుగుతుంటే.. మరొక వైపు బెంగాల్ లో హిందు - ముస్లిం ఘర్షణలు చెలరేగాయి. హిందు ముస్లింల మధ్య శాంతి నెలకొల్పేందుకు గాంధీజీ స్వతంత్ర్య వేడుకలకి దూరంగా గడిపారు..నిద్రాహారాలు పట్టించుకోక, హిందు ముస్లిం నాయకులతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. స్వతంత్ర్య వేడుకలకి గాంధీ గారి నిరాకరణ కేవలం ఆయన విషాదంలో వుండటమే నన్నది అనేక మంది వ్యాఖ్యాతల ద్వారా తెలుస్తోంది. సోదరులు తన్నుకు చస్తుంటే.. స్వరాజ్యం పేరుతో సంబురం చేసుకోవడం సరికాదనేది ఆ రోజున గాంధీ జీ ముఖ్య ఉద్దేశ్యం.
గాంధీ జీ ఆగస్టు 15 1947 న, లండన్ లోని తన స్నేహితుడైన అగతా హారిస్ (Agatha Harrison) కు వ్రాసిన లేఖలో ఏడు విషయాలను ప్రస్తావించారు. ఇది అగతా హారిస్ వ్రాసిన లేఖకు ప్రత్యూత్తరంగా గాంధీజీ వ్రాయడం జరిగింది. అందులో ఆయన ప్రస్తావించిన వాటిలో అతి ముఖ్యమైన విషయాలు ఇవి.
1. సంబురాలు జరుపుకోవడం లో నా విధానం, 'దేవునికి కృతజ్ఞతలు తెలపడం మాత్రమే..!'
2.హారిసన్ బ్రిటిష్ పార్లమెంట్ లోని భారత స్వాతంత్ర్యం బిల్లులోని విషయాలను చదివారా? అని తన ఉత్తరంలో అడిగిన ప్ర్రశ్నకు సమాధానంగా ' చదవటానికి నాకు స్రైన సమయం దొరకలేదు. ' అని అభిప్రాయపడ్డారు.
3. 'ఐనా ఇప్పుడు నాకు అనుకూలంగా కానీ , వ్యతిరేకంగా కానీ , మాట్లాడేవారెవరున్నారు చెప్పు ' అని ప్రశ్నించాడు.
4. వెస్ట్ బెంగాల్ గవర్నర్ సి. రాజగోపాలాచారి తనను అభినందించగా , హిందూ , ముస్లిం లకు మధ్య శాంతి జరగనిది తనకు తృప్తి లేదని, హృదయంలో మార్పురానిదే, రాజకీయ స్వతంత్ర్యం సుద్ధ దండగని తన అభిప్రాయం తెలిపారు.
5. కమ్యునిస్ట్ యాక్టివిస్ట్స్ గాంధీజీ ని కలువగా కమ్యునిస్టులైనా , సోషలిస్టులలైనా తారతమ్యాలు మరచి, కష్టపడి తెచ్చుకున్న స్వరాజ్యాన్ని భద్రపరుచుకోవాలని సూచించారు.
6. కమ్యునిష్టుల తర్వాత ఒక విద్యార్ధి బృందం హైదరీ భవనంలో గాంధీగారి సలహా కై సంప్రదించగా, విద్యార్ధులు సరైన రీతిలో దేశభవితకై ఆలోచించాలని, తప్పులు చేయరాదని, ఒక విద్యార్ధి మరొక విద్యార్ధిని మత ప్రాతిపదికన చూడరాదని, ఈ స్వాతంత్ర్యం దేశం లోని ప్రతి ఒక్కరిదని సూచించారు.
7. రాష్ బగన్ మైదాన్ , చెలియగావ్ ప్రసంగంలో హిందువులను, ముస్లింలను మిత్రభావంతో కలిసి మెలిసి ఉన్నందుకు అభినందించారు. సాధారణ పౌరుల యొక్క బాధ్యతలను, గుర్తు చేశారు.
అదే రోజు ఉదయం నూతన భారత గవర్నర్, బ్రిటిష్ అధికారుల నుండి స్వీకరించిన భవనంలోకి కొందరు భారతీయులు బలవంతం గా చొచ్చుకొని పోయి,అక్కడి పూల మొక్కలను, ఎన్నో వస్తువులను, ధ్వంసం చేసిన సంఘటన గూర్చి విచారం వ్యక్తం చేస్తూ.. "స్వతంత్ర్యం అంటే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం కాద"ని మందలించారు. ఇలాంటి అనేక విషయాలనుగాంధీజీ ఆ లేఖలో ప్రస్తావించారు.. కానీ ఈ ఏడు విషయాలు ప్రతిఒక్కరూ తెలుసుకుని మసలుకోవలసినవి.. నిత్యసత్యాలైనవి. అందుకే ఎందరో మహానుభావుల త్యాగాలను కీర్తిద్దాం.. ఏ క్రికెట్టు పోటీల సమయంలో మాత్రమే గాక స్వతంత్ర్య భావాలను నిత్యం గుర్తుచేసుకుంటూ .. దేశభక్తిని ప్రతి ఒక్కరిలో పెంపొందేలా కృషి చేయాల్సిన అవసరాన్ని అందరం గుర్తిద్దాం. ముఖ్యంగా పిల్లలలో దేశమంటే మట్టికాదని చెబుతూ .. ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని అని గర్వంగా తలెత్తుకు చెబుదాం . అందుకోసం అందరం హుందాగా నడుచుకుందాం.
**** జై హింద్.. బోలో భారత్ మాతాకీ జై.. జై బోలో స్వాతంత్ర్య సమర యోధులకు జై *****
No comments:
Post a Comment