న్యూ బాంబే టైలర్స్ – పుస్తక పరిచయం
- రమా దేవి
రచయిత పరిచయం : ఖదీర్ బాబు తన మొదటి కధ ' పుష్పగుచ్ఛం' ను 1995 లో వ్రాసారు. దర్గామిట్ట కతలు,నూరేళ్ల తెలుగు కథ.పోలేరమ్మబండ కతలు, పప్పుజాన్ కథలు,బాలీవుడ్ క్లాసిక్స్మన్ చాహే గీత్- పాటలు ప్రసిద్దుల పరిచయాలు, న్యూ బాంబే టైలర్స్ (కథల సంపుటి ),బియాండ్ కాఫీ (కథల సంపుటి) మొదలైనవి ఈయన రచనలు. ఆంధ్రజ్యోతిలో చాలా కాలం డెస్క్ లో పని చేసి, సాక్షి ప్రారంభించినప్పటినుండి సీనియర్ న్యూస్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. నూతన తరం తెలుగు కథకులలో ఖదీర్ బాబుది ప్రత్యేకమైన స్థానం.
న్యూ బాంబే టైలర్స్ – (కథల సంపుటి ) గత శతాబ్దాపు చివరి దశకం ప్రారంభంలో మన జీవితాల్లోకి ఒక ఉప్పెనలా తోసుకొచ్చిన ప్రభుత్వ ఆర్థిక విధానాలలోని మార్పు …. పాలకులు జాతిభద్రతను సైతం మరిచిపోయి బహుళజాతి కంపెనీలను ప్రేమించడం, దేశ ఆర్థిక భద్రతను అంతర్జాతీయ ద్రవ్యసంస్థలు నియంత్రించడం …. దానికకటి అనుబంధంగా జరిగిపోయిన గాథ పరిణామాలు మన వ్యక్తిగత జీవితాలను, సమాజాల్నీ కూడా అతలాకుతలం చేసిన క్రమంలో ఆ మార్పులన్నీ కూడా ఈ కథల్లో ప్రతిబించిస్తూ వచ్చాయి….
ఖదీర్ బాబు వ్రాసిన న్యూ బాంబే టైలర్స్ కథల పుస్తకం లో ప్రతీ కథ మనసుకు తాకుతుంది.ఇందులోని చాల కథలు విడి విడిగా ప్రచురింపబడినవే. కొన్ని కథలు చదువుతున్నప్పుడు, అక్కడక్కడైనా, అక్షరాలు మానవావతారం ఎత్తి మనల్ని ఒక ఉద్వేగానికి గురిచేస్తాయి. ఇలాంటి అనుభూతి ‘న్యూబాంబే టైలర్స్’ కథల్లో తరచుగా కలుగుతుంది.ఈ కథా సంపుటం లోని మొదటి కథ న్యూ బాంబే టైలర్స్ . ఈ కథ పేరునే పుస్తకానికి పేరుగా పెట్టారు.
ఈ పుస్తకం లో మొత్తం 12 (published, 2012) కథలు ఉన్నాయి. 1.న్యూ బాంబే టైలర్స్,2.దావత్,3.జమీన్, 4. దూద్ బఖష్, 5.కింద నేల ఉంది, 6. ఒక వంతు, 7. రాత్రిపూట,
8. ఢాఖన్, 9. ఒక సాయంత్రం అదృష్టం, 10. పెండెం సోడాసెంటర్, 11. ఖాదర్ లేడు, 12.గెట్ పబ్లిష్డ్.
ఇందులోని కొన్ని కథలు సంక్షిప్తంగా మీ కోసం: న్యూ బాంబే టైలర్స్: ఈ కధా సంపుటం లోని మొదటి కధ న్యూ బాంబే టైలర్స్ . ఈ కధ పేరునే పుస్తకానికి పేరుగా పెట్టారు. కావలి లోని పీరుభాయి అనే కుర్రాడు బాంబే వెళ్లి అక్కడి కొత్త ఫాషన్స్ నేర్చుకుని కావలి వచ్చి అక్కడి రైల్వే రోడ్ లో బాంబే టైలర్స్ అనే పేరుతో ఒక దర్జీ దుకాణం తెరిచి డబ్బు సంపాదించుకుంటున్న తరుణంలో పులిమీద పుట్రలా ఆ ఊరు చివర కొత్తగ కొన్ని రేడీమేడ్ దుస్తుల కర్మాగారాలొచ్చి స్థానిక దర్జీల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం కలుగచేస్తాయి. దర్జీలు దుకాణాలు మూసివేసి ఈ రేడీ మేడ్ ఫాక్టరీలలో కూలీలుగా చేరిపోతుంటారు. మెల్లగా ఈ ప్రభావం బాంబే టేలర్స్ పై కూడా పడి తండ్రీ కొడుకులు రేడీ మేడ్ కర్మాగారంలో కూలీలుగా చేరటానికి వెళ్లినప్పుడు, వారి పేర్లకు బదులుగా కొన్ని అంకెలుతో వారిని పిలవాల్సొస్తుంది. అంతే కాదు; ముందే కత్తిరించిన కొన్ని బట్టలు ఇచ్చి, కుట్టి తీసుకు రమ్మంటే, పీరుభాయి అది అవమానంగా భావిస్తాడు. బలుసాకైనా తిని బ్రతుకుతా కాని ఈ పని నా వల్ల కాదు అని ఉద్యోగం నిరాకరిస్తాడు. ప్రపంచీకరణ దుష్ఫలితాలను చక్కగా వివరిస్తుందీ కధ. దావత్: ముస్లిం స్త్రీల కథ … ముస్లింల పెళ్ళి విందుల్లో మగవాళ్ళు పూర్తిగా విందుభోజనం చేసేవరకూ స్త్రీలు కాచుకుని ఉండడం … ఒక్కొక్కసారి మిగలకపోవడం … స్త్రీల ఆకలినీ, స్త్రీలమీద ఒత్తిడినీ కూడా చాలా విపులంగా చిత్రించిన కథ ఇది … అంతా దాన్ని ముస్లింల పెళ్ళి విందుని చిత్రించిన కథగా భావించినప్పటికీ నిజానికది ముస్లిం స్త్రీవాద కథ … జమీన్: ఈ సంపుటి లోని జమీన్ కధకు 1999లో దాని కళాత్మక కాల్పనిక చిత్రణకై కధ అవార్డ్ వచ్చింది. సంక్షిప్తంగా జమీన్ ఇతివృత్తం: ఇది ఇద్దరు బాల్యమిత్రుల కధ. కసాయి కొడుకు హుసేన్, మాలపల్లె లో నివసించే బ్రమ్మయ్య ల మధ్య అనుబంధం ఎక్కువే. చీరాల లో ఉండే హుసేన్‌కు తన స్వస్థలమైన కావలి లో చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశ , ఆ కోరిక తీరడానికి తన స్నేహితుడి కొడుకే అడ్డుగా నిలిచి స్థలం అమ్మకానికి తన తీవ్ర అసమ్మతిని తెలియపరుస్తాడు. ఇది తండ్రీ కొడుకుల మధ్య తీవ్ర అగాధాన్ని సృష్టించటంతో వికల హృదయంతో ఖిన్నుడయిన హుసేన్ చీకటిలోనే తన ఊరు చీరాలకు తిరుగు ప్రయాణం కట్తాడు. ఒక తరం లోని స్నేహం మరొక తరానికి వైరంగా ఎలా మారిందో, అలా మారడాన్ని పాఠకుడు కూడా సమర్ధించాలా.. వద్దా అన్న మీమాంసలో పడేస్తుంది ఈ కథ. కింద నేల ఉంది: అనేక రకాలుగా తన అస్తిత్వాన్ని కోల్పోయిన ఒక తల్లి తన ఒక్కగానొక్క కొడుకైనా మనిషిగా బతకాలని తాపత్రయ పడి ఆ అస్తిత్వపు మూలాలకోసం వెతకడం ముఖ్య కథాంశం. ‘నేల విడిచి సాము చెయ్యటం’ అని మనలో వాడుక – మూలాలు మరిచి పోవద్దు అని అదొక సున్నితమైన హెచ్చరిక. మన మూలాలు నేలలోనే ఉన్నయ్యి అని కథ పేరుతోనే సూచించిన రచయిత వర్తమాన జీవితంలో ఎన్ని విధాల మనం ఆ మూలాలకి దూరమవుతున్నామో కథలో పాత్రల ద్వారా సహజంగా, సమర్ధవంతంగా చెప్పించారు. కథకుడు జరుగుతున్న కథలో లీనం కాకుండా ఒక సాక్షిలాగా కథ చెప్పటంతో మనమొక డాక్యుమెంటరీ చూస్తున్నట్టు ఉంటుంది. పెండెం సోడాసెంటర్: మహమ్మద్ ఖదీర్ బాబు రాసిన ‘పెండెం సోడాసెంటర్‘ గ్లోబలైజేషన్ దారుణ విపరిణామాలను చర్చించిన మరో మంచి కథ. నమ్మిన ఆదర్శం కోసం సర్వనాశనానికి సైతం వెరవని చంద్రయ్య, అతడి కొడుకు క్రిష్ణమూర్తులను మనం నిజ జీవితంలో చూడగలమా? వట్టి వేళ్లు, నిమ్మకాయ, అల్లంలతో తయారైన పానీయాలు, షర్ బత్ లకుతోడు దేశభక్తులందరికీ అడ్డాగా నిలిచింది పెండెం సోడా సెంటర్. కోకోకోలా, పెప్సీలు దేశంలోకి రావడాంతోటే ఆడ్రసులు లేకుండా పోయాయి. ఈ కథ భారతదేశంలో నిలువనీడకూడా లేకుండా మట్టికొట్టుకుపోయిన అనేక చిన్న, సన్నకారు చేతివృత్తుల వారి అందరి జీవితాలను మనకు గుర్తుకు తెప్పించి హృదయాన్ని బరువెక్కిస్తుంది. ఖాదర్ లేడు: బజారులో పెద్ద అంగడి వ్యాపారాలు వేరు, రోడ్ పక్కన చిన్న చిన్న వ్యాపారు వేరు. ఈ చిన్న వ్యాపారస్తుల జీవితాల గురించే ఈ కథ. వీళ్ళ పెట్టుబడులంతా చూస్తే వెయ్యి, రెండు వేల కంటే ఎక్కువ కాదు. ఆరోజుకి గడిస్తే చాలు అని జీవిస్తూ ఉంటారు. నెల్లూరులో ట్రంకు రోడ్ ఉన్నట్టే కావలిలో కూడా ఒక ట్రంక్ రోడ్ ఉంది. ఊరిలో ఎవరికి ఏమి కావాలన్నా ట్రంకు రోడ్ కి రావలసిందే. బైసాని వెంకటసుబ్బయ్యకి తండ్రి ద్వారా సంక్రమించిన అంగడి ఈ ట్రంక్ రోడ్ మీదనే ఉంటుంది. రోడ్ కి రెండు వైపులా ఉన్న మార్జిన్ లో చిన్నా, చితకా వ్యాపారస్థులు ఉంటారు. ఖాదర్ కి కూడా ఇలాంటి మార్జిన్ షాపే ఉంటుంది. కొన్ని సైకిళ్ళు అద్దెకి ఇచ్చుకుంటూ రిపేర్లు చేస్తూ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు ఖాదర్. ఒక రోజు ట్రంకు రోడ్ వెడల్పు చేసే పనిలో మార్జిన్ షాపులన్నిటినీ పీకేస్తారు అధికారులు.ఖాదర్ షాపు పూర్తిగా పీకి పారేస్తారు. ఖాదర్ ఎటు వెళ్ళాడో తెలియదు, బజారులో కనిపించిన వాళ్ళనంతా అడుగుతూ ఉంటాడు. చదవడానికి అరగంట పట్టినా పూర్తి చేసాక దీని జ్ఞాపకాలు చాలా సేపు వెంటాడుతాయి. గెట్ పబ్లిష్‌డ్ : మొదటిసారి మహ్మమ్మద్ ఖదీర్ బాబు రచన “గెట్ పబ్లిష్‌డ్’! 36 పేజీల చిన్న పుస్తకం. ఏ పత్రికలోనూ రాకుండా, డైరెక్ట్ కథానికగా ప్రత్యేక బుక్‌లెట్‌గా వచ్చింది. ఇపుడు అదే కథ ఈ పుస్తకంలో చేర్చారు.
ఇందులోని చాలా కథలు జీవితమంతా మరచిపోనివ్వకుండా మనసుని అంటి పెట్టుకుని ఉంటాయి అనడంలో సందేహమే లేదు.కొన్ని కంట తడి పెట్టిస్తే, కొన్ని ఆలోచింపచేసేలా వుంటాయి. మొత్తానికి అన్ని కథలూ బాగున్నాయి.
No comments:
Post a Comment