శర్వాణి అమృతవాణి - శ్రీపాద పినాకపాణి - అచ్చంగా తెలుగు

శర్వాణి అమృతవాణి - శ్రీపాద పినాకపాణి

Share This

శర్వాణి అమృతవాణి - శ్రీపాద పినాకపాణి

భావరాజు పద్మిని.

వృత్తిరీత్యా ఆయన డాక్టర్. ఎందరికో వైద్య విద్యలో గురువులు, భవరోగాలకు చికిత్స చేసారు.

ప్రవృత్తి రీత్యా ఆయన శర్వాణి ముద్దుబిడ్డ. కర్ణాటక సంగీతంలో పేరొందిన ఎంతో మంది సంగీత శిఖామణులకు  ఆయన గురువు, పూజ్యనీయులు. తన గానంతో, సంగీత రచనల భాండాగారంతో మూసపోసినట్లుండే సంగీత రాగాలకు  చికిత్స చేసారు.

ఆయనే సంగీతకళానిధి, పద్మభూషణ్ డా.శ్రీపాద పినాకపాణి గారు. ఆయన సంగీత మహాసాగరం అవతలి ఒడ్డు చూచినవారు. అందుకే తెలుగింట సంగీత విద్యా బోధనలో ఉన్న లోపాలను ధైర్యంగా ఎత్తి చూపి, తమిళ నాట లాగే శాస్త్రీయ సంగీతం తెలుగునాట పరిమళించాలని ఆకాంక్షించారు పినాకపాణి గారు.

శ్రీపాద వారు శ్రీకాకుళం జిల్లా ప్రియాగ్రహారంలో 1913 ఆగస్ట్ 3వ తేదిన కామేశ్వరరావు, జోగమ్మ దంపతులకు జన్మించారు. వారితండ్రి విద్యాశాఖలో ఉన్నత పదవులు నిర్వహించారు, 13 నాటకాలు రచించారు. సంగీత ప్రియులు. పినాకపాణి గారు 5 -6 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఆయన తన అక్కగారికి సంగీతం బోధించిన బి. యెన్. లక్ష్మణరావు గారి పాఠం వింటూ తనూ గొంతు కలిపెవారట ! అలా పినాకపాణి గారు స్వరకల్పనతో నేర్చుకున్న తొలి కృతి - "గజానన సదా యనుచు" (థోడి).మరికొంత ఎదిగాకా హిందుస్థానీ విద్వాంసులు ఇందుబాల, వ్యాస్, బాలగంధర్వ వంటి వారి ’78 ఆర్.పి.ఎం. రికార్డులు ‘ విని యధాతధంగా పాడుతుంటే, ఆయన సహజ గాయకుడు అని తేలిపోయింది.

కాకినాడలో సరస్వతీ సంగీత సభలు జరుగుతున్నప్పుడు ఆ 10 రోజులూ పినాకపాణి గారు తండ్రితో పాటు సంగీత కచేరీలకు వెళ్తూ, కూడా తెచ్చుకున్న పుస్తకంలో వారి రచనలను, పాట, స్వరం తో సహా రాసుకుని, ఇంటికి వెళ్లి సాధన చేసేవారట . ఇది వారి గురువు లక్ష్మణరావు గారిని ఆకర్షించింది.

 పినాకపాణి గారు డాక్టర్ చదువుకై వైజాగ్ వెళ్ళినప్పుడు, వారిని ప్రొఫెసర్ ద్వారం వెంకటస్వామి గారికి పరిచయం చేసారు లక్ష్మణరావు గారు. శని, ఆది వారాల్లో వారి వద్ద సంగీత పాఠాలు చెప్పుకుంటూ, 1939వ సంవత్సరలో లో విశాఖపట్నం ఆంధ్ర వైద్యకళాశాల నుండి ఎం.బి.బి.ఎస్. పట్టా తీసుకున్నారు. 1945వ సంవత్సరంలో జనరల్ మెడిసన్లో ఎం.డి. పూర్తి చేసారు.

నాయుడు గారి శిష్యరికంలో ఉన్నత స్థాయి సంగీత విద్యను, తంజావూరు బాణీలో అభ్యసించారు పినాకపాణి గారు. అయినా సంగీతం వింటూ, నోట్స్ రాసుకునే అలవాటును కొనసాగించారు. అలా మైసూరు చౌడయ్య ఇంట్లో  శ్రీపాద బాలంబాళ్ పాటను విని, ఇష్టపడి, ఇరుపక్షాల అంగీకారంతో  ఆమెను వివాహం చేసుకున్నారు.

ఎం.డి. పూర్తి చేసిన పిమ్మట డా. శ్రీ పాద రాజమండ్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా ప్రభుత్వ సేవలో చేరారు..1951 నుండి 1954 వరకు విశాఖ పట్నం లో వైద్యకళాశాలలో సివిల్ సర్జన్ గా పని చేసారు.. 1957లో కర్నూల్ వైద్యకళాశాల కు బదిలీ అయ్యారు. అక్కడే కళాశాల ప్రిన్సిపాల్ గా, సూపరింటెండ్ గా పని చేసి 1968 లో పదవీ విరమణ చేసారు..కర్నూలు లో స్ధిర నివాసం ఏర్పర్చుకున్నారు.

పదవీ విరమణానంతరం, త్యాగరాజాది వాగ్గేయకారుల రచనలు, గీతాలు, స్వరజతులు, స్వరపల్లవులు, తాన పద వర్ణములు, కృతులు, పల్లవులు, జావళీలు మొదలైన సంగీత రచనలు ఏరికూర్చి, పుస్తకరచనకు శ్రీ కారం చుట్టారు..సంగీత సౌరభం పేరుతో తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రచురించిన నాలుగు సంపుటాలలో వీరు స్వర పరచిన అన్నమాచార్య కృతులు 108, త్యాగరాజాది వాగ్గేయ కారుల కృతులు 607, ముత్తు స్వామి దీక్షితుల కృతులు 173, పదములు 44, జావళీలు 40, తానవర్ణములు, 56, తిల్లనాలు, 10 మొత్తం 1088 సంగీత గుళికలు ఉన్నాయి . పాణినీయం, ప్రపత్తి, స్వరరామం, అభ్యాసం, నా సంగీత యాత్ర పుస్తకాలు రచించారు. వీటికై 12 ఏళ్ళు కృషి చేసారు.

డాక్టర్ శ్రీపాద పినాకపాణి నిరంతర పరిశ్రమతో, సంక్లిష్టమైన, విషయాలను సమన్వయించి నిశితంగా పరిశీలించి, విశ్లేషించి రాగ యుక్తంగా శిష్యులకు నేర్పేవారు. గమకానికి యెంతో ప్రాదాన్యం ఇచ్చారు. సంగీతానికి రాగమే జీవనము. వర్ణము, కృతి పదము, జావళీ ఏ రచన గానం చేసినా, ఒక రాగస్వరూపమును స్వరగమకాది భూషణములతో అలంకరించి మనోహరంగా చిత్రించేవారు. సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి, ఓలేటి వేంకటేశ్వర్లు, నూకల చినసత్యనారాయణ, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది బ్రదర్స్, ప్రసిద్ద సినీ గాయని ఎస్. జానకి, ఇలా ఎందరో మహామహులు ఆయన వద్ద సంగీతం నేర్చుకున్నారు. వారందరూ శ్రీపాద వారి గురించి అనే ఒకే మాట – ఆయన గురువులకే గురువని. నిశ్శబ్దంగా, నిర్విరామంగా ఇలా సంగీతానికి తొంభయ్యేళ్ళకి పైగా కృషి చేసిన మహానుభావుడు పినాకపాణి గారు.

బిరుదులు/ పురస్కారాలు :

శాస్త్రీయ సంగీత విద్వాంసుల సమక్షంలో "ఓ హో" అనిపించుకున్న మహనీయుడు పినాకపాణి గారు పలు మన్నలను, పురస్కారాలను అందుకున్నారు.

-      సంగీత నాటక ఎకాడమి అవార్డు (1977)

-      ఆంధ్రా విశ్వవిద్యాలయంచే 'కళాప్రపూర్ణ' అవార్డు (1978)

-      సంగీత కళానిధి గౌరవం (1983)

-      భారత ప్రభుత్వం నుండి పద్మ భూషణ్ పురస్కారం (1984)

-      గుప్తా అవార్డు (1993)

-      సంగీత నాటక అకాడమీ ఠాగూర్ ఫెలో గౌరవం (2011 )

-      తెలుగు విశ్వవిద్యాలయం లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం (2005)

భావి సంగీత కళాకారులకు, గురువులకు  ఆయనిచ్చే సందేశం...

"వినగా, వినగా, వినికిడి తో రాగాలు పాడగలిగిన అనుభవం వస్తుంది. అందుకనే సంగీతం యదావిధిగా నేర్చుకున్న విద్యార్ధులకు కూడా రాగం పాడే శక్తి రావడంలేదు. ప్రసిద్ధ రాగాలను వ్రాసిచ్చి, వాటిని కంఠోపాఠంగా వచ్చే వరకు చెప్పి, పాడించాలి. విద్వాంసులు పాడే రాగాలాపనలను నిరంతరం వింటూ ఉండడం అన్నిటికంటే ఎక్కువ అవసరం. స్వరకల్పన పాడుతూ పాడించినట్లే రాగం కూడా గురువు నేర్పించాలి. బాగా సాధన చెయ్యండి. పేరు ప్రఖ్యాతుల కోసం పరుగులు తియ్యకండి. సంగీతాన్ని శుద్ధంగా ఉంచండి. కర్ణాటక సంగీతం అమరం."

No comments:

Post a Comment

Pages