దైవతత్వము- సంగీతము - అచ్చంగా తెలుగు

దైవతత్వము- సంగీతము

Share This

దైవతత్వముసంగీతము

-ఎస్.కె. మధురిమ

హిందు ధర్మ ప్రకారం ప్రతీ మనిషి యొక్క జీవిత గమ్యం మోక్ష ప్రాప్తికై సాధన చెయ్యడం. లౌకికమైన జీవితం గడుపుతున్నప్పటికీ   ఐహికమైన సుఖాలకై పాటుపడుతూ సుఖ దుఃఖాలతో ఈ ప్రయాణం ఇలా సాగిస్తూనే అంతరంగాలలో నిరంతరం మోక్ష సాధనకై కూడా ప్రయత్నించాలి.

అయితే  శాస్త్ర ప్రకారం  ప్రశ్నించుకుంటే  మోక్షమనగా ఏమిటి అంటే "నిరాకారుడైన పరమాత్మని చేరుకోవడమే"

ఆకారమే లేని వాడిని చేరుకోవడం ఎలా అంటే ? ఆకారమైతే లేనివాడు కానీ ఆయన అంతా నిండి  ఉన్నాడు. అంతా  ఆయనే, ఆయనే అంతా. అంతా ఆయనే  అయినప్పుడు , కొంత  అయిన మనం కూడా  ఆయనలో భాగమే కదా. మరి ఇంకెక్కడికీ చేరుకోవడం?అంటే  మోక్షసాధన అనగా మనలోనే ఉన్న ఆ పరమాత్మని  తెలుసుకునే  ప్రయత్నం .

మన చుట్టూ గాలి నిండి ఉన్నా ఆ గాలిని మన కళ్ళతో  చూడలేము,అలానే మనలోనే ఉన్న ఆ దివ్యజ్యోతిని దర్శించుకోవాలంటే  మనకి కొన్ని అర్హతలు కావాలి. ఆ అర్హతని సంపాదించుకోవాలంటే సాధన చెయ్యాలి. ఆ సాధన ను మన పురాణాలలో ఇతిహాసాలలో ధర్మశాస్త్రాలలో పలు విధాలుగా తెలియ చెప్పారు, వాటినే క్లుప్తంగా నవ విధ భక్తి మార్గాలు అన్నారు.

వాటిలో దైవము యొక్క తత్వమును , దైవత్వమును తెలుసుకునే సులభమైన ఒక సాధనం సంగీతం.

"ఏకం సంగీత విజ్ఞానము చతుర్వర్గ ఫలప్రదం" - శివసర్వస్వము

ధర్మార్థ కామ మోక్షములైన చతుర్వర్గాలకీ సత్ఫలము, శ్రేయస్సును కలుగజేసేది ఈ సంగీతం.

"సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం 

 ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతమ్"

భారతీయ సంస్కృతిలో  విద్యలకు అధిదేవత వీణ పాణి  అయిన శారదాదేవి స్తనములు సంగీత సాహిత్యములని ఈ  రెండింటిలో సంగీతం ఆపాత మధురం అనగా వినినంతనే మధురమై తోచుననీ అర్థము అందుకే

  శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానం రసం ఫణిహిః

ఇక సాహిత్యం అలోచనామృతమని అనగా అలోచించిన కొలదీ అమృతమైన విశేషార్థమై యుండునని భావము

భగవంతుని భక్తుని అనుసంధానం చేసేది భక్తి. ఆ భక్తిని ప్రదర్శించడానికి  చేసే వివిధ ఉపచారాలన్నిటినీ కలిపి  పూజ లేక ఉపాసన అంటాము. సంగీతమనగా నాదోపాసన, నాదముతో చేసే పూజ.

నాదమనగా  " కారం  ప్రాణనామానం  ,  కారమనలంవిదుః   జాతః ప్రాణాగ్ని సంయోగాత్తే ననాదో అభిధీయతే  " -- సంగీత రత్నాకరం

ప్రాణమునకు ""  బీజాక్షరము "" కారము అగ్ని బీజాక్షరము ప్రాణాగ్ని  సంయోగము వలన నాదము ఏర్పడుచున్నది. ఈ నాదోపాసన పరమాత్మునికి ఎంత ప్రీతి కరమైనదంటే స్వయంగా నారదునితో ఇలా అ న్నాడు.

"నాహం వాసామి వైకుంఠే యోగినం హృదయే , మద్ - భక్త యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారదా"

నా భక్తుడు ఎక్కడ భక్తితో గానం చేస్తాడో  అక్కడ తిష్ఠ వేసుకుని కూర్చుంటాను అన్నాడు. భగవంతుడు భక్తునికి దాసుడు. ఇంకా లోతుగా వెళితే భక్తుని యొక్క గానామృతానికి ఆయన దాసుడు. భగవంతుని కొఱకు భక్తుని అన్వేషణ ఎలా ఉంటుందో నిజమైన  భక్తుని కొఱకు భగవంతుడు కూడా  అన్వేషిస్తాడు.ఆ భక్తునికి ఎన్నో పరీక్షలు పెట్టి ఆపరీక్షలలో నెగ్గేలా కూడా తానే చేస్తాడు. ఎందుకంటే తన ఉనికిని చాటి చెప్పేది అలాంటి నిజ భక్తులే అని అతనికీ తెలుసు, ఇదే దైవతత్వము.

అందుకెనేమో నిరంతరం రామ నామ జపం తప్ప ఏమీ తెలియని త్యాగరాజ స్వామి ఇంట్లోనే రామ పంచాయతనం మాయం అయ్యేలా చేసాడు.అలా మాయం అయినందువలనే కదా ఆ అన్వేషణలో అమృతతుల్యమైన ఎన్నో కీర్తనలు ఆయన గళం నుండీ జాలువారాయి. ఈ దైవతత్వమును తెలుసుకోవాలంటే మనిషి అంతరంగాలలో నిండు గా ఉండవలసింది దైవత్వము.ఆ దైవత్వాన్ని ఈ కలియుగంలో నింపగలిగే ఏకైక సాధనం సంగీతం.

ఈ దైవత్వాన్ని ప్రతీ జీవిలో జన్మతహ భగవంతుడు నింపాడు.కానీ తాను పెరుగుతున్న కొద్దీ ఆ దైవత్వాన్ని  అన్వేషించే ప్రయత్నము కూడా పెరుగుతూ రావాలి. అందుకై సత్సంగము, సేవాభావము, సుశ్రవణము  మొదలైన మంచి గుణములు పెంపొందించుకొనిన మనలోని దైవత్వాన్ని తెలుసుకోగలుగుతాము.

సంగీతము వేరు మనం వేరు కాదు. మన జీవితంలోని ప్రతీ ఘటన, సంఘటన సంగీతంతో పెనవేసుకున్నవే. పుట్టగానే శిశువు ఏడుపు ఒక పాటే కదా. ప్రతీ  శిశువు వినే తొలి పాట అమ్మ పాడే లాలి పాట, ప్రతీ మనిషి జీవితంలో వివాహం ఒక మరపురాని ఘట్టం అందులో ప్రతీ విశేషానికీ ఒక విశేషమైన పాట ఉన్నది కదా.

 మాతృమూర్తి పడే ప్రసవవేదన  కూడా సంగీతమే........

ఇలా తన జీవన యానం సాగించిన మనిషి ఆ పరమాత్మ దగ్గరికి అంతిమప్రయాణం చేస్తున్నప్పుడు తనవారంతా మౌనంగా రోదిస్తూ ఉంటారే అది కూడా సంగీతమే. జీవితం ఒక కీర్తన, పుట్టుక పల్లవి అయితే మన జీవితంలో వివిధ ఘట్టలు చరణాలు, కీర్తనకి ముక్తాయింపు మన జీవితానికి ముగింపు.

సంగీతానికి శృతి లయ అనేవి రెండు ప్రధాన అంశాలు. శృతిర్మాతాః లయ పితాః  అన్నారు.

జీవితం కూడా అంతే శృతి లయలు లేకుండా సాగితే రంజకంగా ఉండదు. మన శరీరంలో కూడా నిరంతరం ఏన్నో వ్యవస్థల్లో ఏన్నో పనులు జరుగుతూ ఉంటాయి  వాటిని జాగ్రత్తగా గమనిస్తే ఒక లయ బద్ధంగా జరుగుతూ ఉంటాయి.

ఒక ఉదాహరణకి ఒక రకమైన రక్త నాళాలలోంచి చెడు రక్తం గుండెకు చేరాలి, అక్కడ చెడు రక్తం మంచి రక్తం గా మారాక  గుండె నుంచీ ఒక రకమైన రక్త నాళాలనుండీ వివిధ శరీర భాగాలకు ప్రసరణ కావాలి. జాగ్రత్తగా గమనిస్తే ఇంతకన్నా లయబద్ధమైన చర్య ప్రపంచంలో ఇంకేముంది. ఈ తాళం ఒక్క లిప్త పాటు తప్పినా ఇక మనిషి జీవితమనే పాట ఆగిపోయినట్టే కదా.

మనిషి జీవితంతో, మనిషి జీవితంలో మొదలు నుండీ చివరి దాకా పెనవేసుకుపోయినది శ్రావ్యమైన సంగీతం ఒక్కటే. అంటే దైవత్వము మనిషి గుండె నిండానే కాదు ఒంటి నిండా కూడా నిండి ఉందన్నమాట.అయితే కలియుగంలో దైవత్వం ఉన్నచోట దానవత్వం కూడా ఉంటుదన్నమాట సత్యం, కానీ దైవత్వమును పెంపొందించుకుంటూ ఉంటే ఇక దానవత్వానికి చోటే ఉండదు.

ఇలా దైవత్వముతో పరిశుధ్ధుడైన మనిషి పరిపూర్ణుడవ్వడానికీ ఆ భగవంతుడే సహకరిస్తాడు. ఇలా పరిపూర్ణుడైన పరిశుధ్ధాత్మ ఆ పరమాత్ముని చేరే ప్రయాణమే మోక్షం.అంటే దైవతత్వాన్ని తెలుసుకోగలగడమే మోక్షం. ప్రపంచంలో ప్రతీ మనిషి ఇలా ఉండగలిగితే ప్రపంచయుధ్ధాలు  వచ్చేవి కావేమో.అశాంతి అంటే ఏంటో కూడా తెలియదేమో.

 రండి మనమందరం  సంగీతమనే సాధనతో దైవత్వాన్ని మదినిండా నింపుకుని ఆ దైవతత్వాన్వేషణకై ప్రయాణం సాగిద్దాం.

సర్వే జనాః సుఖినో భవంతు.

No comments:

Post a Comment

Pages