ఆధ్యాత్మిక పరిచయం-ఆత్మతత్వం..
..... విసురజ
మానవ జీవితం యొక్క ఆధ్యాత్మిక పరిచయం ఆత్మ ద్వారానే జరుగుతుంది. మన సనాతన, పురాతన గ్రంధాలలో, ఉపనిషద్ లలో ఆత్మని గురించి విస్తృతంగా చెప్పబడినా, అవన్నీ చదవినా ఆ విషయం జ్ఞానులకు సైతం అర్డం కాకుండా వుంటుంది. మృత్యువుకు సమీపంగా వెళ్లి వచ్చిన వారి అనుభవాల ద్వారా, పునర్జన్మల గురించి వెలుగులోకి వచ్చిన కధలు ఆత్మ, ఆత్మ యొక్క ఉనికిని గురించి భయాన్ని/నమ్మకాన్ని/అయోమయాన్ని బలపరుస్తున్నాయి...
ఎక్కడో అరుదుగా, ఏ కొందరికో మాత్రమే ఆత్మ దర్సనం ఆపై ఈ వాస్తవికత యొక్క అనుభవాన్ని పొందే అవకాశం కలుగుతుంది . ప్రతి ఆత్మ కడ ప్రయాణం "శ్రీ పరమాత్మ"లో లీనమవటమే. కానీ, ఆ ప్రయాణం కేవలం మానవ శరీరం యొక్క భౌతిక రూపం ద్వారానే సాధ్యమవుతుంది, కారణమేమిటంటే మనిషికే ఆ దేవదేవుడు ఈ సదవకాశం అందిచ్చాడు. మానసిక, శారీరక బాధలు జీవికి ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకు కొనసాగేటప్పుడు ఎదురయ్యే అవాంతరాలు..ఇవన్నీ మనల్ని మనం తెలుసుకోనేటందుకు అవసరమయ్యే ఆధారాలు మాత్రమే. చాలా సార్లు మనం దూకుడుతనం లేకుండా వ్యవహరించి అలాగే కరుణ, దయ, కృతజ్ఞత, శాంతి లక్షణాలతో సావాసం చేస్తే అంతర్ముఖంగా మనల్ని మనం తరచి చూసుకోగలుగుతాము... ఇంకా స్పష్టంగా పేర్కోనాలంటే జీవి మరణానంతరం ఆత్మ ఈ మానవ శరీరాన్ని వదిలి తిరిగి తన మూలానికి చేరువవుతుంది. ఆ ఆత్మకి తన స్వగృహానికి చేరుకున్నందులకు కొంత సంపూర్ణత చేకూరినప్పటికి, వివిధ జన్మల్లో తన ఉనికి, కర్మలకు సంబందించిన "కర్మల ఫలం" మాత్రం ఆపై వెంటాడుతూనే ఉంటుంది. పూర్వ జన్మల కర్మకు సంబందించిన వాసనల నుంచి ముక్తి పొంది పరిశుద్దమవ్వాలనే లక్ష్యమే అట్టి ఆత్మకు మరల జన్మను పొందేటందుకు కారణమవుతుంది. ఆ కారణం చేతనే తిరిగి, ఆ ఆత్మ భూమి పైన మరో కొత్త శరీరంలో చేరుతుంది. అటువంటి ప్రతి జన్మకు ఆ ఆత్మ ద్వారా పూర్తి గావించవలసిన ఒక విశిష్టమైన కర్మ ఉంటుంది, తద్వారా గత జన్మల కర్మ లోపాల నుంచి విముక్తి పొంది శాశ్వతంగా తిరిగి ఆ "శ్రీపరమాత్మ" లో విలీనమవటనే ముఖ్య ఉద్దేశ్యం ఉంటుంది. కాని, మానవ జన్మ ఆ ఆత్మకు ఎన్నెన్నో అవరోధాలను, సవాళ్ళను విసురుతుంది. ఇంద్రియాసక్తి, భోగలాలసత్వం, భౌతిక పరమైన అంశాల పట్ల మక్కువ ఆ ఆత్మను తన పునర్జన్మ యొక్క వుద్దేశ్యాన్ని పూర్తిగా మరిపింపచేస్తుంది. ఈ విధమైన ఆధ్యాత్మిక విస్మృతి భౌతిక రూపంలో వున్న ఆత్మ ప్రయాణాన్ని మందగింప చేస్తుంది, మరదే అట్టి ఆత్మ అంతిమ ప్రయాణమునకు అవరోధాలు కలుగచేసే... ఈ భూమి పైన మనిషి జన్మ ఎత్తటంలోనే ప్రతి మనిషి యొక్క ప్రత్యేకమైన కర్తవ్యం వున్నది. ప్రస్తుత తరుణంలో వేగవంతమైన మరియు ఒత్తిళ్ళతో కూడిన ఈ జీవితంలో కొంచెం నెమ్మదించి, కొంత తత్వ చింతన గావించి అస్సలు జన్మరహస్యాన్ని చేధించటం, ఆపై బ్రతుకు ఉద్దేశ్యాన్ని కనుగొనటం అత్యంత అవసరం. మన అంతరంగ స్వీయతత్వంతో ఏకత్వం కావటానికి వీలైన ఏకాంత క్షణాలను సృష్టించుకోవాలి, ధ్యానం ద్వారా మన నిజమైన ప్రవ్రుత్తిని కనుగొనగలగాలి, మన అంతరంగ ధ్వనిని వినగలగాలి, దాని ద్వారా మన జీవిత ముఖ్య ప్రయోజనాన్ని మనం కనుగొనాలి. ఒకసారి ఆ ప్రయోజనాన్ని కనుక్కున్ని, దాన్ని పొందేందుకు ప్రయత్నం ఆరంభించిన తర్వాత జీవితంలో ఎంతో శాంతి, ఆనందం, బలాన్ని అనుభవించగలము. మన ఆత్మజ్ఞానాన్ని పొంది తన ముఖ్య ఉద్దేశ్యం కొరకు ప్రయాణం ఆరంభించిన తర్వాత మానవ ప్రయాణం అర్ధవంతంగా, అద్భుతంగా మారుతుంది. తన మూలాల్ని చేరుకునేందుకు జీవి యొక్క అనంత ప్రయాణంలో యిదే ఆత్మ పురోగతికి సహాయపడుతుంది...
No comments:
Post a Comment