ప్రేమైక కులం
- గంటి సుజల
"దొడ్డమ్మ వస్తోందిరా..! ఇన్నాళ్ళ తరువాత మనం ఎందుకు గుర్తు వచ్చామో తెలియదు. ఎందుకు వస్తోందో తెలియదు" అంది కవిత కొడుకుతో. "పోనీలే అమ్మా..! నా పెళ్ళితో మీ ఇద్దరి మధ్య బంధాలు తెగిపోయాయి. ఇన్నాళ్ళకు చెల్లెలు కావాలనిపించిందేమో దొడ్డమ్మకు" అన్నాడు వాసు. "మనం ఉండగా మీ దొడ్డమ్మ రారేమో కదా ! ఆవిడ ఉన్నన్నాళ్ళూ మనం వేరే చోట ఉందామా !" అంది వాసు భార్య నీలిమ. "మీరెక్కడికీ వెళ్ళక్కరలేదు. మీరుండడం అభ్యంతరం అవుతే ఆవిడ మన ఇంట్లో ఉండక్కర్లేదు. ఆవిడ చాదస్తం మూలంగానే కదా, ఇన్నాళ్ళూ ఆవిడ్ని కాదనుకున్నాను. నా పిల్లలు నాకు ముఖ్యం" అంది కవిత. "రాక రాక వస్తున్న ఆవిడ్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అత్తయ్యా ? ఆవిడ ఎన్నాళ్ళు ఉంటుంది ? మహా అయితే వారం పది రోజులే కదా ? నేను, వాసు హోటల్లో ఉంటాము" అంది నీలిమ. "పోనీ మీ అమ్మా వాళ్ళింట్లో ఉందాము" అన్నాడు వాసు. "వద్దండీ. మనం అక్కడ ఎందుకు ఉన్నామన్న ఆరా వస్తుంది. ఇంటిగుట్టు ఎవరికీ తెలియకూడదు. చివరికి మా అమ్మయినా సరే. ఇది మన ఇంటి విషయం" అంది నీలిమ. కోడలి సంస్కారానికి ముచ్చట పడింది కవిత. ఆ అమ్మాయిలో ఉన్న ఆ వివేకానికి, పరిస్థితుల్ని అర్థం చేసుకునే విధానానికి ముచ్చటపడుతూ ఉంటుంది. కూతురి కన్నా ఎక్కువగా చూసుకునే కోడలు దొరకడం తను చేసుకున్న అదృష్టం అని తరచూ అనుకుంటుంది కవిత. నీలిమ, వాసుల ది ప్రేమ వివాహం. వాసుగా పిలవబడే అతని పేరు వాసుదేవ్. నీలిమ అతనితో పాటు ఎం.బి.ఎ చేసింది. రెండవ సంవత్సరంలో ఉండగా ఆమె ఆకర్షణ లో పడ్డాడు. అతనికి తెలియకుండానే అయస్కాంతంలా ఆమె పట్ల ఆకర్షితుడవడం కోర్స్ పూర్తి అయ్యేసరికి ఆమె తన జీవిత భాగస్వామినిగా చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. అతని నిర్ణయం విన్న నీలిమ ఆలోచనలో పడింది. అతనికి తన మీద ఉన్నది ఆకర్షణా లెక నిజమైన ప్రేమా..! ఒకవేళ నిజమైన ప్రేమ అనుకున్నా, తమ కులాలు వేరు. పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా ! ఇరువైపుల వారు ఒప్పుకుంటే కానీ తమ పెళ్ళి సాధ్యం కాదు. దానికి కారణం పెద్దవాళ్ళను ఎదిరించి చేసుకోవడం తనకు ఇష్టం ఉండదు. ఎన్నో ఆశలు పెట్టుకుని, కళ్ళల్లో వత్తులు వేసుకుని పెంచిన తల్లిదండ్రుల్ని కాదని తమకిష్టమైన జీవిత భాగస్వామిని ఎన్నుకుని వారికి దూరంగా వెళ్ళి వాళ్ళను క్షోభపెట్టడం మూలంగా జీవితంలో తాము బాగుపడేదానికన్నా, వాళ్ళ దు:ఖం తమను వెన్నాడుతూ ఉంటే తాము సుఖంగా ఉండలేమన్నది నీలిమ అభిప్రాయం. అందుకే వాసు "మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలని ఉంది. నా మీద మీ అభిప్రాయం ఏమిటని" అడిగినప్పుడు, "పెళ్ళంటే నూరేళ్ళ పంట అని పెద్దవాళ్ళు అంటారు. మీకు నా మీద ఉన్నది ఆకర్షణో లేక ప్రేమో ముందుగా నిర్థారించుకోమ్డి. నిజం చెప్పాలంటే, నేను ఇప్పటిదాకా పెళ్ళి గురించి ఆలోచించలేదు. నాకు పెళ్ళి పట్ల కొన్ని నిర్దుష్ఠమైన అభిప్రాయాలు ఉన్నాయి. మన ఇద్దరి పెద్దల ఆమోదం తోనే మన పెళ్ళి జరగాలి. మీరంటే ఇష్టం లేకపోయినా అయిష్టం మాత్రం లేదు. నాకు కొంచెం ఆలోచించుకునేందుకు సమయం కావాలి. మీరు మీ తల్లిదండ్రుల అభిప్రాయం కనుక్కోమ్డి. నేను కూడా మా వాళ్ళతో మాట్లాడుతాను" అంది. నీలిమ మాటలు తోసిపుచ్చలేకపోయాడు. తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు తనకు ఉన్నాఅమ్మా నాన్నలను కాదని, వారి మనసు నొప్పించడం లాంటివి చెయ్యడం కానీ వాసుకు కూడా ఇష్టం లేదు. ముందుగా నీలిమ గురించి తండ్రితో చెప్పాడు. తల్లి చాదస్తంతో వద్దంటుందన్న భయం. కవిత శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబం లోంచి వచ్చింది. పూజలు, పునస్కారాలు కొంచెం ఎక్కువే. అందుకే తల్లి కులాంతర వివాహం ఒప్పుకోదన్న భయం అతనిలో ఉంది. అందులో వాసు ఒక్కడే కొడుకు. తల్లిగా అతని పెళ్ళి పట్ల ఎన్నో కోరికలు ఉండవచ్చు. అతని ఆలోచనకు విరుద్ధంగా, అభ్యంతరం తండ్రి నుంచే వచ్చింది. "ఇలా కులాంతర వివాహాలు మన ఇంటా వంటా ఎవరూ చేసుకోలేదు. బంధువుల్లో మనం తలెత్తుకుని తిరగలేము" అంటూ గొడవ పెట్టాడు. "మీరు కూడా ఏమిటి నాన్నా ? ఈ రోజుల్లో ఇవన్నీ ఎవడు పాటిస్తున్నాడు ? ఈ కులాలూ, మతాలూ అన్నీ ట్రాష్. అందరూ మానవులు" అన్నాడు. "అదే నిజమైన పక్షంలో నీ అప్లికేషన్ లో నీ కులం పేరు ఎందుకు అడుగుతున్నారు ? రాజ్యాంగంలో కులం అన్న కాలమ్ తియ్యలేదు కదా ! ప్రతీ వాడూ తన కులం కోసం పాటు పడుతున్నప్పుడు, మనం ఎందుకు మానుకోవాలి ? ముందుగా అప్లికేషన్ లో కులం అన్నది తియ్యమను. అప్పుడు నేను కూడా నా కులం గురించి మర్చిపోతాను" అన్నాడు. "నేను నా పెళ్ళి గురించి అడుగుతుంటే, మీరు రాజ్యాంగం గురించి మాట్లాడుతారేంటి ? అది నేను, మీరు చెయ్యలేము కదా ! ముందు మీ చేతుల్లో ఉన్నది చేయండి. అలా అందరూ చేస్తేనైనా కొన్నాళ్ళకు మార్పు వస్తుందేమో ! చూద్దాం. "ఏమిటి చూసేది ? నేను పుట్టక మునుపు నుంచి ఇది ఇలా జరుగుతూనే ఉంది. సంఘ సంస్కర్తలు పుడుతూనే ఉన్నారు. కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతూ ఉన్నాయి. కానీ రావాల్సిన మార్పు రావటం లేదు". "ఏమిటి ? అబ్బా కొడుకూ ఘర్షణ పడుతున్నారు ? మళ్ళీ రాజకీయాల్లోకి దిగారా ? అయితే ఇంక ఈ రోజుకు భోజనాలు అక్కర్లేదన్న మాట" అంటూ నవ్వుతూ అక్కడికి వచ్చింది కవిత. "బైట రాజకీయాలు కాదోయ్ మన ఇంటి రాజకీయాలే" "మన ఇంట్లో రాజకీయాలేమున్నాయ్ ?" అంది మీరు చెప్పండి అన్నట్లుగా తండ్రి వైపు చూసాడు. కొడుకు సంజ్ఞలు కవిత చూసింది. "ఏమిట్రా నాన్నగారికి సంజ్ఞ చేస్తున్నావు. చిన్నప్పుడు ఏది కావాలన్నా నన్నే అడిగేవాడివి కదా ! నాన్నగార్ని అడగడానికి భయపడి నన్ను అడగమనేవాడివి అలాంటిది ఇప్పుడీ కొత్త పధ్ధతి ఏమిటి ? ధైర్యం గా చెప్పు. ఏదైనా ప్రేమ వ్యవహారమా ! " అంది. తల్లి ఆవులిస్తే పేగులు లెక్కపెట్టేటట్లుగా ఉంది, ఇంక నాన్చకుండా అసలు విషయం చెప్పడం మంచిదనుకుని, గొంతు సవరించుకుని, "అమ్మా, మరేమో నేను, నా క్లాస్ మేట్ నీలిమను ఇష్టపడుతున్నాను. ఆ ఆమ్మాయిలో నా జీవిత భాగస్వామిగా కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి" అన్నాడు వాసు. అప్పటిదాకా ఏదో చిన్న విషయం అనుకుని నించుని మాట్లాడుతున్నది మంచం మీద కూర్చుంది. బాసింపట్టు వేసుకుని కూర్చుని "మీకిద్దరికీ ఎన్నాళ్ళనించి పరిచయం ?" అంది "రెండేళ్ళ నుంచీ" అన్నాడు. "అంటే మీరిద్దరూ రెండేళ్ళ నుంచీ ప్రేమించుకుంటున్నారా ! ఒకర్నొకరు బాగా అర్థం చేసుకున్నారా !" అంది కవిత. "నేను ఇష్టపడ్డాను. రెండేళ్ళనుంచీ ఆ అమ్మాయిని గమనిస్తున్నాను. నాకు సరి జోడి అనిపించింది. వారం క్రితం ప్రపోజ్ చేసాను." "అంటే వన్ సైడ్ లవ్ స్టోరీ అన్నమాట. ఇంతకీ ఆ అమ్మాయి ఒప్పుకుందా ! లేదా ! లేక నువ్వు ప్రపోజ్ చేసావ్ కాబట్టి ఒప్పుకుంటుందన్న ధీమానా ! ఆ అమ్మాయి ఏమంది ?" "ఆ అమ్మాయి ఒప్పుకున్నట్లు చెప్పలేదు. ఇంకా తనకి పెళ్ళి మీద ఏ అభిప్రాయం లేదంది. నేనంటే అయిష్టం కూడా లేదంది. తనకి ఆలోచించడానికి కొంచెం సమయం కావాలంది. అన్నిటికన్నా ముఖ్యం ఇరువైపులా పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్ళి చేసుకుందామంది. అందుకే మీతో చెప్పి మీరు ఒప్పుకుంటే..." "మేం ఒప్పుకోకపోతే చేసుకోరా !" "నీలిమ చేసుకోదు" అన్నాడు వాసు. అంటే వీడు చేసుకుందుకు రెడీ అన్నమాట అని మనసులో అనుకుని భర్త వైపు చూసింది, మీ అభిప్రాయం ఏమిటన్నట్లు ? భార్య చూపులు అర్థం చేసుకుని "నాకైతే ఇష్టం లేదు. కులాంతర వివాహం మన బంధువుల్లో ఎంత చిన్నతనం " అన్నాడు. "మీకే ఇష్టం లేదా ? మీ కిష్టమైతే బంధువులెవరండి ? వాళ్ళందరూ మన ఇష్ట ప్రకారం చేస్తున్నారా ! అసలు మీకిష్టమవునో కాదో చెప్పండి" "నాకైతే ఇష్టం లేదు. ఇప్పటిదాకా మన కుటుంబంలో ఇలాంటివి జరగలేదు. అందరూ మనను వెలివేస్తారు. నీకు కూడా ఇబ్బంది అవుతుంది కవితా. నీ మడి ఆచారం అన్నీ మంటగలిసిపోవూ ? ముఖ్యంగా మీ వాళ్ళందరూ మరీ నిష్ఠాపరులాయిరి. అందుకే వద్దంటున్నాను" అన్నాడు సూర్యారావు. "నా మడులూ ఆచారాలూ నావి. మా వాళ్ళ సంగతి ఇక్కడ అనవసరం. ఇది వాడి జీవితానికి సంబంధించిన విషయం. రోజులు మారాయి. పెద్దవాళ్ళు చూసిన సంబంధాలే చేసుకునే రోజులు తగ్గిపోతున్నాయి. వాడి జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు వాడికి ఉంది. జీవితాంతం కలిసి బతకవలసిన పిల్ల ఎలా ఉండాలో వాడ్నే నిర్ణయించుకోనివ్వండి, మనం ఎంచిన పిల్ల వాడికి నచ్చక వాడు జీవితాంతం కుమిలిపోవడం కన్నా వాడు మెచ్చిన పిల్లైతే వాడు మనని దోషుల్ని చెయ్యకుండా సుఖంగా కాపురం చేసుకుంటాడు. అంతే కదా నాన్నా !" అంది కవిత. "అది కాదు కవితా. ఆ అమ్మాయి అలవాట్లు అవీ మనకి సరిపడకపోవచ్చు. నీ మడీ, తడీ ఆ అమ్మాయికి నచ్చక పోవచ్చు. ఆహారపు అలవాట్లు అవీ భిన్నంగా ఉంటాయి కదా ! అందుకని." "అన్నీ తెలుసుకుని మన ఇంట్లో ఆ అమ్మాయి మనగలుగుతుందంటే నాకభ్యంతరం లేదు. కాదు, నా అలవాట్లు నేను మార్చుకోను అని ఆ పిల్ల అనుకుంటే, వాళ్ళు వేరే ఉంటారు. తరచూ మనం కలుసుకోవచ్చు. మనసులు పంచుకుందుకు ఆచారాలు అడ్డు రావు కదా ! నా కొడుకుతో బాటు ఆ పిల్లను కూడా ఆదరిస్తాను. ఎవరి అలవాట్లతో వాళ్ళు హాయిగా బతకొచ్చు. అసలు అడ్జెస్ట్ అవవలసింది వాళ్ళిద్దరూ. ఒకే కులంలో పుట్టినా అందరి అలవాట్లూ ఒకలాగా ఉండవు. మీతో కాపురం లో నేను ఎంత నన్ను నేను మార్చుకోవాల్సి వచ్చిందో మీకు తెలుసా ! అవడానికి మన ఇద్దరం ఒకే జాతి వాళ్ళం. మీ ఇంటి అలవాట్లు వేరు. మా ఇంటి అలవాట్లు వేరు. కాల క్రమేణా మనిద్దరం ఒకరి కోసం ఒకరం మారాము. అదే దాంపత్యం అంటే. ఏమంటావురా కన్నా" అంది కొడుకు వైపు చూసి. తల్లి మాటలు ఆమె వివరించిన విధానం చూసి తన అమ్మేనా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అమ్మను అసలు తను అర్థం చేసుకోలేదు. తల్లి కన్నా తండ్రి బాగా అర్థం చేసుకుంటాడనుకుంటే ఇక్కడ తల్లి ఆలోచనా విధానంలో తమ అందర్నీ మించిపోయింది. నిజమే అమ్మ చెప్పిన దాంట్లో ఎంతో నిజముంది. బహుశా నీలిమ కూడా అమ్మలాగే ఆలోచిస్తుందేమో. అలా అయిన పక్షంలో తనంత అదృష్టవంతుడు ఇంకెవరూ లేరు అనుకున్నాడు. ఏమీ మాట్లాడకుండా తన వైపు చూస్తున్న కొడుకుతో "ఇంతకీ నా కాబోయే కోడల్ని ఎప్పుడు చూపిస్తావు ?" అని అడిగింది. మనసులో 'యాహూ' అని పాడేసుకున్నాడు. అసలు ఒప్పుకోదనుకున్న అమ్మ ఇంత త్వరగా ఒప్పుకోవడం ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది. "ఒక్క విషయం కన్నా..! దాంపత్యం అన్నది నూరేళ్ళ పంట. పెళ్ళికి ముందున్న ఆకర్షణ పెళ్ళయ్యాక పెరగాలి కానీ తరగకూడదు. ముందుగా మీరిద్దరూ బాగా మాట్లాడుకుని ఒకర్ని ఒకరు బాగా అర్థం చేసుకోండి. ఆ అమ్మాయిని ఒకసారి మనింటికి తీసుకురా. ఎందుకంటే, తన ఇల్లు వదిలి వేరే కొత్త చోటుకు వస్తోంది. నీతో బాటు నీ వాళ్ళను కూడా ఆ అమ్మాయి అర్థం చేసుకుంటే బాంధవ్యాలు పటిష్ఠంగా ఉంటాయి. ఆ అమ్మాయికి మననించి ఏం కావాలో కూడా తెలుసుకుంటే చాలా మంచిది" అంది. "మా మంచి అమ్మ, బంగారు" అంటూ ముద్దు పెట్టుకున్నాడు. కొడుకు బైటికి వెళ్ళాక " అన్నీ ఆలోచించుకునే ఈ నిర్ణయానికి వచ్చావా ! దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఆలోచించావా ?" అన్నాడు సూర్యారావు. "ఏ పరిణామాలైనా ఎదుర్కొందుకు నేను సిధ్ధమే. నా కొడుకు సుఖం నాకు ముఖ్యం. మనం కాదంటే వాడు ఎదురు తిరగడం, మనకు చెప్పకుండా పెళ్ళి చేసుకోవడం ఇవన్నీ ఎందుకండీ ? మనం ఒప్పుకోలేదన్న విషయం జీవితాంతం ముల్లులాగా వాడి మనసులో మెదలడం నాకిష్టం లేదు. పెళ్ళిళ్ళు స్వర్గంలో అవుతాయంటారు కదా ! విధాత వాళ్ళిద్దరికీ ముడి పెడితే మనమెవరమండీ ఆపడానికి. వాడి కళ్ళల్లో ఆ సంతోషానికి వెల కట్టగలరా !" అంది కవిత. ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉంది కాబట్టి మారు మాట్లాడలేదు అతను. ఇరుపక్షాల వాళ్ళు ఒప్పుకున్నారు. నీలిమ తల్లిదండ్రులు ముందు కొంత భయపడ్డారు. వాళ్ళ అనుమానాలు వాళ్ళకు ఉన్నాయి. ఆచారాలు పధ్ధతుల్లో చాలా తేడాలు ఉంటాయి. ప్రతీ ఆడపిల్ల తల్లిదండ్రులూ పిల్లను ఇచ్చే ముందు అత్తవారింట తమ పిల్ల ఎలా మసులుతుందో అన్న భయం ఉండనే ఉంటుంది. పూర్వకాలంలో అయితే చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేవారు కాబట్టి, ఊహ వచ్చేసరికి అత్తగారింటికి వెళ్ళిపోయిన ఆడపిల్ల ఆ ఇంటి అలవాట్లు తొందరగానే అవగాహన చేసుకునేది. తరువాతి కాలంలో కొంచెం పెద్ద అయ్యాక, పెళ్ళిళ్ళు అయినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినా కొద్ది రోజులకు అలవాటు పడేవారు. కానీ మగపిల్లలతో సమానంగా చదువుకున్న ఆడపిల్లలు మేం ఎందుకు అడ్జెస్ట్ అవ్వాలీ ? అన్న స్థితిలో ఉన్నారు. అందుకే కవిత నీలిమతో మాట్లాడాలని నిర్ణయించుకుంది. కవితతో మాట్లాడిన నీలిమ, తల్లిదండ్రులకు భయపడాల్సిన పనిలేదని చెప్పింది. పెళ్ళికి ముందు నీలిమను తల్లి దగ్గరకు తీసుకు వచ్చాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో వాసు కు కూడా తెలియదు. బైటికి వచ్చాక, వాసు "ఏం మాట్లాడుకున్నారు ?" అని అడిగితే, "మీ అమ్మగారు గ్రేట్ వాసూ" అంది. అమ్మనడిగితే "నీలిమ మంచి పిల్లరా !" అంది అసలు జరిగిన విషయం నీలిమను తీసుకుని వాసు వచ్చాక, పిల్లను చూసి చక్కగా ఉంది అనుకోకుండా ఉండలేక పోయింది. వాసు వైపు తిరిగి "మేం ఇద్దరం మాట్లాడుకోవాలి. నువ్వు అలా బైటికి తిరిగి రా" అంది. నీలిమలో ఏదో తెలియని భయం. 'ఆవిడ నాతో ఏం మాట్లాడుతారు ?' అని "కూర్చో అమ్మా... కాఫీ తాగుతావా ! టీ తాగుతావా !" "ఏం వద్దండి" "మొహమాటం ఎందుకమ్మా ? ఎలాగా ఈ ఇంటికి రావాలని నిర్ణయించుకున్నావు కదా ! అయినా ఇంటికెవరైనా వస్తే కాఫీ, టీ లు ఇవ్వడం మామూలే కదా !" "సరే ఆంటీ, మీకేదిష్టమైతే అదే, నాకేదైనా ఫరవాలేదు" అంది. లోపలికి వెళ్ళి రెండు కప్పుల్లో కాఫీ తీసుకువచ్చి, నీలిమకు ఒకటిచ్చి, తానొకటి తీసుకుంది. "ఇప్పుడు చెప్పమ్మా, నీ వివరాలు. మీరు ఎంత మంది ? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ?" అంటూ తాను అడగదలుచుకున్న వాటికి ఉపోద్ఘాతం గా అంది కవిత. వివరాలు చెప్పింది నీలిమ. మామూలు మాటలు అయ్యాక అడిగింది. "పెళ్ళి మీద నీ అభిప్రాయం ఏంటి ? వాసు గురించి పూర్తిగా తెలుసుకున్నావా ? నేను ఇలా అడుగుతున్నందుకు ఏమీ అనుకోకు. పెళ్ళి అనేది బొమ్మలాట కాదు. ఎంత మనం నాగరికత వైపు అడుగులు వేస్తున్నా మనం మన సాంప్రదాయాల్ని మర్చిపోకూడదు. ప్రేమ పెళ్ళిళ్ళు తప్పని నేను అనను. ఏ పెళ్ళిలోనైనా ఇద్దరి మధ్యా అవగాహన కావాలి. ప్రేమ పెళ్ళిళ్ళు విఫలమవడానికి కారణం పెద్దవాళ్ళ సపోర్ట్ లేకపోవడం. మా జీవితం మా ఇష్టం అనుకున్నా కొన్నాళ్ళు పోయాక ఇద్దరికీ తన వాళ్ళు కావాలనిపిస్తుంది. అక్కడి నుంచి గొడవలు మొదలవుతాయి. మీరు ఒక వ్యక్తిత్వం వచ్చాక పెళ్ళి చేసుకుంటే సర్దుకుపోవడం కొంచెం కష్టం. అందులో భర్తే కాకుండా భర్త తాలూకు వాళ్ళతో కూడా అడ్జెస్ట్ అవడం అంటే అంత సులువైన పని కాదు. అందులో భిన్న అలవాట్లు ఉన్నప్పుడైతే మరీ కష్టం. కాబట్టి బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో. నాకు వాసు ఒక్కడే కొడుకు. మాతో కలిసి ఉండగలిగితే నాకు అభ్యంతరం లేదు. కాదు, మేం విడిగా ఉంటామన్నా నాకు అభ్యంతరం లేదు. నీ అలవాట్లు మానుకోమని నేను చెప్పను. కొద్ది రోజులు మాతో ఉండి కూడా నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు. నిర్ణయించుకోవాల్సింది నీకు కావాల్సినది అబ్బాయి ఒక్కడేనా, లేక అతని వాళ్ళు కూడా కావాలా అన్నది". "నాకు నా భర్త తో పాటు అతని వాళ్ళు కూడా కావాలి ఆంటీ. అందుకే వాసుతో చెప్పాను. ఇద్దరి వైపు పెద్దవాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్ళి జరుగుతుందని. ఇంక వాసు గురించి తెలుసుకోవడానికి రెండేళ్ళుగా చూస్తున్నాను. మనిషి మంచివాడే. మా అమ్మా నాన్నా తెచ్చిన సంబంధంలో కూడా కొన్ని గంటల్లో ఒక మనిషిని గురించి అంచనా వేసి నిర్ణయం తీసుకుని పెళ్ళి చేసుకుంటాను కదా ! దానికన్నా వ్యక్తిగా అతని అలవాట్లు, అతని నడవడీ రెండేళ్ళై చూస్తున్నాను. నేను కోరుకున్నవాడి కన్నా నన్ను కోరుకున్నవాడ్ని చేసుకుంటే సుఖపడతానని నా నమ్మకం. నా మూలంగా మీరు మీ కొడుక్కి దూరం అవడాం నాకిష్టం లేదు" అంది. కవిత కోడల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించింది. కొన్నాళ్ళు కలిసి ఉన్నాక చూద్దాములే అనుకున్న నీలిమ అత్తగారి ప్రేమలో తనను తాను మర్చిపోయి, ఆవిడ అలవాట్లు తన అలవాట్లుగా చేసుకునేంతగా మారిపోయింది. వాసు పెళ్ళి విషయం తెలిసిన కవిత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు గొడవ పెట్టారు. అందులో రెండవ అక్క అయితే ఈ ప్రేమ పెళ్ళిళ్ళు ఎన్నాళ్ళు నిలుస్తాయిలే. ఏడాదిలో విడాకులయిపోతాయి. అయినా నీకిదేం పొయ్యేకాలమే ! మనలో నీ కొడుక్కి పిల్ల దొరకదనా ? మనమేమిటి మన కులమేమిటి ? భ్రష్ఠు పట్టి పోతున్నారే ఇంక మీకు మాకు చెల్లు మన సంబంధాలు తెగిపోయినట్లే" అంది. అలా సంబంధాలు తెగిపోయాయన్న మనిషి ఇప్పుడు ఎందుకు వస్తోందో అర్థం కాలేదు. కవిత అక్క మీనాక్షి మర్నాడు ట్రైన్ లో దిగింది. వాసు స్టేషన్ కు వెళ్ళి కార్లో దొడ్డమ్మను తీసుకు వచ్చాడు. దారి పొడుగునా ఆవిడ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఇంటికి చేరాడు. ఇంటి ప్రాంగణంలోకి కారు రాగానే గూర్ఖా గేట్ తెరిచాడు. అందమైన ఆ బంగళా వైపు ఆశ్చర్యంగా చూస్తూ బాగానే సంపాదిస్తున్నట్లున్నాడు అనుకుంది మనసులో. లోపలికొచ్చిన అక్కగార్ని "బాగున్నావా అక్కా ? ఇన్నాళ్ళకు మేం గుర్తొచ్చామన్నమాట" అంది. "ఏదోలే అలా అయిపోయింది అవన్నీ మనసులో పెట్టుకోకు. ఇప్పుడు వచ్చాను కదా..!" అంది. "కాఫీ తాగుతావా ! స్నానం చేసి తాగుతావా !" అంది. స్నానం చెయ్యకుండానే తాగుతాను. ఏమిటో నీరసంగా ఉంది" అంది. "అలాగే" అంటూ లోపలికి వెళ్ళి గ్లాసుతో కాఫీ తెచ్చింది. "ఇంకా పాతకాలం వాళ్ళలా గ్లాసులో తాగుతున్నారేమిటే, మీ ఇంట్లో పింగాణీ కప్పులు లేవా ! మోహన్ ఇంట్లో అంతా పింగాణీ సామాను వాడతారు" అంది మీనాక్షి. మోహన్ ఇంకో చెల్లెలి కొడుకు. "ఏమో నీకు ఆచారం కదా ! తాగవని కొత్త గ్లాసులో తెచ్చాను" అంది. "అదేమీ లేదు, కాలంతో బాటు మనమూ మారాలి" అంది. ఆహా, ఈ విషయం ఇన్నాళ్ళకు తెలిసిందా అనుకుంది మనసులో కవిత. ఇంతలో కవిత మనుమడు "నానమ్మా" అంటూ వచ్చి కొత్త వాళ్ళను చూసి ఆగిపోయాడు. "రా రా, నేను నీ పెద్ద నాన్నమ్మను. మీ నాన్నమ్మకు అక్కను" అంటూ దగ్గరకు రమ్మన్నట్లుగా చెయ్యి చాపింది. వాడు సిగ్గుపడుతూ దగ్గరకొచ్చి నించున్నాడు. "అచ్చు వాసుగాడి పోలికే. చిన్నప్పుడు వాడు కూడా ఇలాగే ఉండేవాడు. అదేమిటే నీ కోడలేది ? కనబడదేమిటి ?" అంది. "పైన మేడమీద ఉంది. ఏదో పనిలో ఉంది. ఇవ్వాళ ఆఫీస్ వెళ్ళదుట. ఇంట్లోనే ఉండి పని చేసుకుంటుంది. నీకు ఇబ్బందవుతుందని, కిందకు రానంది. నువ్వు ఉన్నన్నాళ్ళూ, నీ ఆచారానికి భంగం కలగడం ఇష్టం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము. వంట మనిషి ఉంది నీకిష్టమైతే ఆవిడ వండినది తిను. మనవాళ్ళే. కాదంటే, నన్ను వండమంటే నేను వండుతాను" అంది కవిత. "ఆ పిల్ల అలా దూరంగా ఉండడం ఎందుకూ ? వాసును కట్టుకున్నాక, అది మన పిల్ల కాదూ ! నాకలాంటివేమీ లేవు. వచ్చి మామూలుగా ఉండమను. నాకేమీ స్పెషల్ గా చేయవద్దు. మీతో పాటే నేను" అంది. కవితకి అర్థం కాలేదు. ఏమితీ అక్కయ్యలో ఇంత మార్పు. ఏదైనా అద్భుతం జరిగి అక్కయ్య ఇలా మారిందా ! ఏం జరిగి ఉంటుంది ? అక్కయ్యలో ఈ మార్పు ఎలా సాధ్యం ? మీనాక్షి తనకభ్యంతరం లేదని చెపుతున్నప్పుడు నీలిమను కిందికి రమ్మని పిలిచింది. నీలిమ కిందకు వచ్చి "నమస్కారం దొడ్డమ్మా" అంటూ ఆవిడ పాదాలకు దణ్ణం పెట్టింది. నీలిమను లేవనెత్తి అక్కున చేర్చుకుని "మా వాసు చాలా అదృష్టవంతుడు. అందుకే నీలాంటి మంచి పిల్ల భార్యగా వచ్చింది. నా చెల్లెలు కూడా అదృష్టవంతురాలే. నీలాంటి కోడలు దొరికినందుకు. మా చుట్టాలందరిలో నీ చర్చే. కోడలంటే, కవిత కోడల్నే చెప్పుకోవాలని" అంది మీనాక్షి. "అదేం కాదు, నేను అదృష్టవంతురాల్ని. అమ్మ లాంటి అత్తమ్మ దొరికినందుకు. కదా అమ్మా...!" అంది. "మీరిద్దరూ అదృష్టవంతులే. మీతో బాటు నేను కూడా" అంది మీనాక్షి. కవిత కి ఇదంతా కలో నిజమో అర్థం కావటం లేదు. అక్కయ్యలో ఇంత మార్పు నమ్మశక్యం కావటం లేదు. చెల్లెలి కళ్ళలో కదులుతున్న సందేహాల్ని అర్థం చేసుకోలేనంత అమాయకురాలు కాదు మీనాక్షి. అందుకే చెల్లెలి వైపు తిరిగి, "నా లోని మార్పు నీకు ఆశ్చర్యం కలిగిస్తోందన్న విషయం నాకు తెలుసు. దానికి కారణాలు నీకు కాక ఎవరికి చెప్తాను ? ఇలాంటి ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువ కాలం నిలవవని నేనన్న మాటలకు నువ్వెంత బాధపడి ఉంటావో నేనిప్పుడు అర్థం చేసుకోగలను. అప్పుడు నా కళ్ళకు అహంకారపు పొరలు కమ్ముకుపోయాయి. యద్భావం తద్భవతి అన్నట్లు నా ఆలోచనలు ఎలా ఉండేవో అలాగే నా జీవితం లో జరిగేవి. ఎప్పుడూ నా ఆలోచనలు సక్రమంగా జరగలేదు. అందుకే నాకు దేవుడు బాగా గుణపాఠం నేర్పాడు. ఇప్పుడందరూ అంటూ ఉంటారే పాజిటివ్ థింకింగ్ అని, అది జీవితంలో చాలా అవసరం అని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను" అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, "తరువాత మాట్లాడుకుందాం అక్కయ్యా. ప్రయాణం లో అలసిపోయి ఉంటావు. భోంచేసి కాస్త నడుం వాల్చు. సాయంకాలం మాట్లాడుకుందాములే" అంది. ఎంత కోడలు మంచిదయినా అక్కగారు ఆమె ముందు చిన్నపోవడం ఇష్టం లేదు. ఆవిడ మనసులోని బాధ తాపీగా చెప్పనివ్వడమే మంచిదని అప్పుడు ఆమెని ఆపింది. భోజనం చేసి ఎన్నో ఏళ్ళుగా నిద్ర లేనిదానిలా నిద్ర పోయింది మీనాక్షి. అక్కగారు లేవడం చూసి కాఫీ తెమ్మని పురమాయించింది వంటమనిషికి. కాఫీ తాగాక ఇప్పుడు చెప్పు, అన్నట్లుగా అక్కగారి వైపు చూసింది. తనతో పంచుకుంటే ఆమె కడుపులో భారం కొంత తగ్గుతుందన్న ఉద్దేశ్యంతో. మీనాక్షి చెప్పిన కథ : మీనాక్షికి ఒక కొడుకు, ఒక కూతురు. కూతురికి మంచి సంబంధం చూసి పెళ్ళి చేసింది. కొడుక్కి కూడా బంధువులమ్మాయి తో తను కోరుకున్నట్లుగా రంగరంగ వైభోగంతో పెళ్ళి చేసింది. అత్తగారిగా అన్ని ముచ్చట్లూ జరిపించుకుంది. సాంప్రదాయమైన కుటుంబంలోని పిల్లను తెచ్చుకుందని తనంత అదృష్టవంతురాలు లేదని మురిసిపోయేది. భర్త ఉన్నన్నాళ్ళూ ఆవిడ ఇష్టారాజ్యంగా జరిగింది. అతను కాలం చేసాక, ఆమె స్థితి దిగజారడం మొదలుపెట్టింది. ఇంటి పెత్తనం మెల్లిగా కోడలు తన చేతిలోకి తీసుకుంది. అప్పటిదాకా సాంప్రదాయాలు, కట్టుబాట్లు అంటూ మారుమోగే ఇల్లు, నాగరికతను సంతరించుకోవడం మొదలుపెట్టింది. ఇన్నాళ్ళూ తాను కోల్పోయిన స్వేఛ్ఛ పొందాలనుకుంది మీనాక్షి కోడలు. ఇన్నాళ్ళూ అత్తగారి రాజ్యంలో బందిఖానాలో ఉన్నట్లుగా కోరికలకు సంకెళ్ళు వేసిన ఆమెకు మనసులో అత్తగారి పట్ల ద్వేషాన్ని పెంపొందింపజేసింది. దానితో అత్తగారి పట్ల కసి పేరుకుపోయింది. సమయం దొరకగానే విజృంభించింది. మీనాక్షి జీవితం మహారాణి నుంచి నౌకరాణిగా మారింది. కొడుకు పెళ్ళాం కూచి అయిపోయాడు. పిల్లలకు మంచిదంటూ ఇంట్లోకి కోడిగుడ్లు రావడం మొదలయ్యింది. మీనాక్షి జీవితం నరకప్రాయమై పోయింది. అలవాటు లేని వాసనలతో కడుపులో తిప్పినట్లుగా ఉండేది. ఒక్కోరోజు తిండి తినబుద్ధి అయ్యేది కాదు. మంచినీళ్ళు తాగి కాలం వెళ్ళబుచ్చేది. ఒకరోజు చిన్న చెల్లెలి దగ్గర తన గోడు చెప్పుకుని "కవిత ఎలా భరిస్తోందే ? ఆ పిల్ల రోజూ ఇవన్నీ తింటుందేమో కదా !" అంది. "అదేమీ లేదు. కవితక్క చాలా అదృష్టవంతురాలు. అక్క ముందే చెప్పింది, తన కోసం ఆ అమ్మాయి తన అలవాట్లు మానుకోవాల్సిన అవసరం లేదని, కానీ తమతో కలిసి ఉంటే, ఇంట్లో అలాంటివి పనికిరావని, బైట తింటే తనకు అభ్యంతరం లేదని. కానీ నీలిమ కూడా చాలా మంచి పిల్ల అక్కా. అక్క ప్రేమలో ఆ పిల్ల పూర్తిగా మన కట్టుబాట్లలో తనను మలుచుకుండి. వాళ్ళిల్లు ఒక అందమైన రంగుల హరివిల్లు" అని చెప్పింది. దానితో మీనాక్షిలో అంతర్మథనం ఆరంభమయ్యింది. కవిత కులం కాని పిల్లను చేసుకుందని శాపనార్థాలు పెట్టింది. ఎంత మంది మహాత్ములు చెప్పలేదు ? కులం కన్నా గుణం ప్రధానం అని. అయినా ఈ మనుష్యుల తత్వాలు మారవు. దేముడిదే కులం ? ఎవరో మహానుభావుడు చెప్పినట్లు, భగవంతుని ప్రేమించేవారికి ఏ కులమూ లేదు. ప్రేమగుణం లేని బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాలేడు. భక్తి ద్వారా అంటరాని వాడు కూడా పరమ పవిత్రుడు కాగలడు. గుళ్ళో రోజూ పురాణం వినడానికి వెడుతుంది కానీ విన్నవన్నీ అమలు చేస్తోందా ? భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు "చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశ:" అన్నాడు. అంటే - మొదట వారి గుణాలను బట్టి, తరువాత వారు చేసే పనుల బట్టి నాలుగు వర్ణాలు (కులాలు) సృష్టించబడ్డాయని దాని అర్థం. పనుల బట్టి నిర్దేశించిన కులాలు ఇప్పుడు లేవు. చాలా మంది తమ కుల వృత్తులు మాని మిగిలిన వ్త్తులలోకి దిగిపోయారు. ఏ ఉద్దేశ్యంతో కులాలు సృష్టించబడ్డాయో, అది జరగడం లేదు. మనుష్యుల మధ్య అంతరాలు పెంచడానికి, రాజకీయ నాయకులు ప్రజలతో ఆడుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. భగవంతుణ్ణి నిత్యం పూజిస్తూ ప్రేమైక తత్వాన్ని అర్థం చేసుకోలేదు. ప్రేమైక తత్వాన్ని అమలు పరచిన నాడు, తన, పర, కులం, మతం అన్న వాటికి అర్థం మారిపోతుంది. అంతర్మథనం తో పులుగడిగిన ముత్యం లాగా అయింది మీనాక్షి. దాని పర్యవసానమే చెల్లెలింటికి రాక. అక్క నోట అంతా విన్న కవిత "ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు. అదే పదివేలు. చిన్నప్పటినుంచీ అలవాటైన ఆచారాలు వదలలేకపోయి ఉండవచ్చు కానీ నా ఆచారాలకోసం నా బిడ్డ సుఖాన్ని పణంగా పెట్టలేను కదా ! తల్లిగా వాడి సుఖం క్షేమం కోరుకున్నాను. నా అదృష్టవశాత్తు నా కోడలు కూడా మంచి పిల్ల. ప్రేమ ప్రేమను పెంచుతుంది, అని నేను నమ్మిన నా సిధ్ధాంతం నా జీవితంలో నిజమైంది అక్కా !" అంది కవిత. ముక్తాయింపు : మీనాక్షి విషయం అత్తగారి ద్వారా తెలిసిన నీలిమ "ఆవిడ్ని మనతోనే ఉండనియ్యండి. కొన్నాళ్ళు తేరుకున్నాక కావాలంటే, ఆవిడ వాళ్ళింటికి వెడతారు" అంది. అలా కవిత ఇంట్లోనే ఉండిపోయింది. భర్త పోయాక మనశ్శాంతి దొరికిందనుకున్న ఆమెను కాన్సర్ మహమ్మారి ఆక్రమించుకుంది. దేముడు నాకు తగిన శిక్ష వేసాడు అని కుమిలిపోయింది. అవసాన దశలో నీలిమ ఆవిడకు కన్న కూతురిలా సేవ చేసింది. అసహాయంగా కళ్ళనీళ్ళతో తనవైపు చూస్తున్న ఆవిడను చూస్తుంటే నీలిమ కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. తనకేమీ కాని పిల్ల తన కోసం కన్నీళ్ళు పెట్టుకోవడం మీనాక్షి హృదయాన్ని కదిలించింది. తను చేసుకున్న కాస్త పుణ్యం మూలంగా చివరి దశలో వీరి దగ్గరకు చేరిందని అనుకోకుండా ఉండలేకపోయింది. ఆవిడ కోరిక మేరకు చివర్లో తులసి తీర్థం ఆవిడ నోట్లో నీలిమే పోసింది. కులమే గొప్పదనుకున్న మీనాక్షి, ప్రేమ కులం కన్నా గొప్పదనుకుంటూ మరుజన్మ అంటూ ఉంటే, మనసున్న మనిషిగా పుట్టించు అనుకుంటూ కన్ను మూసింది. ********************************************************************************
No comments:
Post a Comment