వలస పక్షులు
భావరాజు పద్మిని
వలస పక్షులు... కష్టకాలంలో ఆహారం కోసం, ప్రతికూల పరిస్థితుల నుండి మార్పు కోసం, అనేక వేల మైళ్ళు ప్రయాణించి, బ్రతుకు మీద ఆశతో వస్తాయి. అలలు అలలుగా, గుంపులుగా తరలి వస్తాయి. తమ కిలకిలా రావాలతో ప్రకృతికే నూతన శోభను తీసుకువస్తాయి. తమ సంతతిని వృద్ధి చేసుకుని పోషించుకుంటాయి. చివరకు ఎక్కడినుంచి వచ్చాయో అక్కడికే తిరిగి చేరుకుంటాయి. తమ సందడితో అలరించిన మనసుల్లో శూన్యాన్ని నింపి వెళ్తాయి. పల్లెల నుంచి పట్నాలకు ఉపాధి కోసం వలస వచ్చే ఇటువంటి వలస పక్షులు ఎన్నో..... అలా వలస వచ్చినదే సింహాద్రి కుటుంబం. లిఫ్ట్ కోసం నిరీక్షిస్తూ ఏదో ఆలోచిస్తున్నాను. ఇంతలో ‘అమ్మ గారండి లిఫ్ట్ వచ్చేసినాదండి’ అంటూ సందడిగా వచ్చారు ఇద్దరు పిల్లలు. పెద్దపాపకు నాలుగేళ్ళు, చిన్నదానికి ఏడాదిన్నర వయసు ఉండవచ్చు. ఆ నాలుగేళ్ల పాప, తన చెల్లిని చంకనేసుకుంది. మాసిన బట్టలు వేసుకున్నా కళగా వున్నారు. వాళ్ళ మాటలు చిలక పలుకుల్లా ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. వాళ్ళ నవ్వులు, మల్లెపువ్వులంతా స్వచ్చంగా ఉన్నాయి. వాళ్ళ చూపులు అమాయకంగా, నిష్కల్మషంగా వున్నాయి. ‘కొత్త వాచ్మాన్ పిల్లలా?’ అడిగాను నేను. ‘’అవునండి, సింహాద్రి మా నాన్న’, కాస్త సిగ్గుపడుతూ, కాస్త గర్వంగా చెప్పిందా పిల్ల. ఆ పిల్ల కవళికలకు మురిసిపోతూ, లిఫ్ట్ రావడంతో మౌనంగా నిష్క్రమించాను. సింహాద్రి బ్రతుకుతెరువు కోసం విజయనగరం దగ్గరి కొల్లాయివలస గ్రామం నుంచి వచ్చాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలసి ఉండడానికో చిన్న గది, కరెంటు, మూడు వేలు జీతం మాట్లాడుకున్నారు. ఆ పైన భార్య ,భర్త ఇస్త్రీ చేసుకుంటూ, కార్లు తుడుచుకుంటూ, ఇళ్ళలో పని చేసుకుంటూ అదనపు ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంటద్దె ఖర్చులేదు కనుక మూడు వేలు తినడానికి సరిపోయినా, ఓ నాలుగైదు వేలు మిగుల్చుకోవచ్చని వాళ్ళ అంచనా. అయితే, ఇక్కడే వాళ్లకు తెలియని చిన్న మెలిక వుంది. వాచ్మాన్ పెళ్ళాం అన్నవరం మా అసోసియేషన్ ప్రెసిడెంటమ్మ ఇంట్లో, ఆవిడ స్నేహితురాళ్ళు ముగ్గురిళ్ళలో తప్పనిసరిగా పని చెయ్యాలి. ఏ సమయంలో అయినా వాళ్లకు అందుబాటులో వుండాలి. అయిదింటికే ప్రొద్దుటే లేచి వచ్చి వాళ్ళ ఫ్లాట్స్ ముందు ముగ్గులు పెట్టాలి. ఇంటికి ఆరొందలు చప్పున తీసుకుని ఇంటెడు చాకిరీ చెయ్యాలి. డోర్ మ్యాట్ల, కర్తైన్లు, దుప్పట్లు అన్నీ ఉతకాలి. కూరలు తరగాలి, ఇల్లు సర్దాలి. అంతెందుకు, ఏ పని చెప్పినా కాదనకుండా చెయ్యాలి. లేకపోతే వాళ్ళ ఉద్యోగం పీకి పంపేస్తారు. అన్నవరం పరిస్థితి ఇలా ఉంటె, ఆమె భర్త సింహాద్రిది మాత్రం తక్కువ పనేమీ కాదు. అయిదు ఫ్లోర్లు ఊడ్చి, చెత్త తియ్యాలి. సెల్లార్, పార్కింగ్, మెట్లు అన్నీ ఊడ్చి, వారానికోసారి కడగాలి. పొద్దుటే కార్లు, స్కూటర్లు తుడవాలి. వచ్చే పోయే వాళ్ళను గమనించాలి. సంతకాలు పెట్టించాలి. అందరి దగ్గరా తెచ్చిన ఇస్త్రీ బట్టలు సమయానికి అందించాలి. ఇన్ని పనులు ఇద్దరు చిన్న పిల్లలతో ఎలా చెయ్యగలరు? ఇదే నా మీమాంస. *************************************** ఆ రోజు బయట నుంచి వస్తుండగా అన్నవరం చాలా నీరసంగా నడుస్తోంది. ఏమయ్యిందని అడిగితే, ‘పాణం బాలేదమ్మా. జొరంగా వళ్ళు నొప్పులుగా వుంది. అయినా అమ్మగారు కసిరి నా పని చేసి వెళ్లి పడుకో అని ఇంటర్కం ఫోన్లో ఫోన్ చేసినాదమ్మా. ఇదిగో వెళ్తున్నా. ఇవాళ వంట కూడా చెయ్యలా’ అంది. నాకు తన పరిస్థితికి జాలీ వేసింది. ఇంటికి తీసుకువెళ్ళి టీ, టిఫిన్, జ్వరం మాత్రలు ఇచ్చాను. పిల్లలకు బిస్కట్టులు ఇచ్చాను. ఆ మాత్రానికే సంతోషించి, దణ్ణం పెట్టి వెళ్లిపోయిందామె. ఎవరో గొడవ పడుతున్నట్టు గట్టిగా అరుపులు వినిపించాయి. ఇస్త్రీ బట్టలు తీసుకోడానికి వెళ్ళిన నేను అలాగే ఒక పక్కగా నిలబడి చూడసాగాను. ‘నా బట్టలు చేసి ఇమ్మంటే, ఇప్పుడు కుదరదు, అంటావా? ఎంత పొగరు నీకు? నీ అంతు చూస్తా, నువ్వీ బిల్డింగ్ లో ఎలా ఉంటావో చూస్తా!’ అని బెదిరిస్తున్నాడు ఒకాయన. నివ్వెరపోయి చూస్తోంది సింహాద్రి కుటుంబం. ఆతను వెళ్ళాకా, ‘చూడండమ్మా, పనెక్కువగా వుంది. ఇప్పటికిప్పుడు బొగ్గులు కాల్చి, ఇస్త్రీ చెయ్యాలంటే ఎలా? నా తప్పేమీ లేకుండానే గొడవపడుతున్నారు. పెద్దోళ్ళు, ఏం చెప్పాలమ్మా?’ అన్నాడు. ‘చూడు సింహాద్రి, మీకు కొత్తేమో కానీ, ఇక్కడ ఇలాంటివి మామూలే. అందరు మనుషులూ ఒక్కలా ఉండరు కదా. వీటన్నింటికీ అలవాటు పడాలి. చూసీ చూడనట్టు పోవాలి. అంత దూరం నుంచీ శ్రమపడి వచ్చారు. వచ్చినందుకైనా సర్దుకుపొండి’, అని చెప్పాను. ************************************** పార్క్ లో ఆడుతున్న పిల్లల్ని పైకి తీసుకెళ్లేందుకు క్రిందకు దిగాను. సింహాద్రిని గదమాయిస్తోంది ప్రెసిడెంటమ్మ. మొక్కలకు సరిగ్గా నీళ్ళు పోయ్యట్లేదు. సెల్లార్ లోని ఎగుడుదిగుడుల్లో నీళ్ళు నిలిచిపోతున్నాయి. మైంటేనెన్సు ఖాతా సరిగ్గా లేదు. అదీ ఇదీ. ‘సరిగ్గా పని చెయ్యకపోతే పొండి, అన్నీ చేస్తామని ఒప్పుకుని, ఇలా గలీజు పని చేస్తారా? ఈ ఒక్కసారికి ఊరుకుంటున్నా. ఇంకోసారిలా జరిగిందో, జాగ్రత్త!’ ఇద్దరు మనుషులు. నలభై కాపురాలుండే అపార్ట్ మెంట్. ఎన్ని పన్లని చేస్తారు. కాంతిహీనమైపోయాయి వాళ్ళ మొహాలు. కసిరి, విసిరి చెప్పేకంటే, నెమ్మదిగా చెప్తే వాళ్ళే చేసుకుపోతారు. కాని, అలా కసిరితే కానీ వీళ్ళ అహం తృప్తిబడదు. రానురానూ, మనుషులకు విచక్షణ, మానవత్వం కరువవుతున్నాయేమో అనిపించింది. ************************************* ‘పనికిమాలిన మనుషుల్ని తెచ్చి, మా నెత్తిన పెట్టారు. రోజూ చూసే మనుషులు కూడా గుర్తుండరా మీకు? అంత చేతకాని వాళ్ళు, పనికి ఎందుకొచ్చినట్టు? మా ఖర్మ కొద్దీ తగిలారు...’ నోటికొచ్చినట్టు తిడుతోంది వర్ధిని గారు. నన్ను చూడగానే, ‘చూడండి, నిన్న అర్ధరాత్రి మా ఇంటాయన వస్తే, తలుపు తియ్యలేదుట. నువ్వెవరో నాకు తెలీదు, పైనుంచి ఇంటర్కాంలో ఫోన్ చేయిస్తే గాని, గేటు తెరవనని మొండికేసాట్ట. పాపం మా ఆయన, ఆ చలిలో, నాకు ఫోన్ చేసి, లేపి, క్రిందకు ఫోన్ చేయించి, గేటు తెరిపించారు. ఇంతింత డబ్బు వీళ్ళ మొహాన ధార పోస్తున్నాం. బుర్ర తక్కువ మనుషులు. ఇంకోసారి ఇలా జరిగిందా, జాగ్రత్త!’ అంటూ అరిచి, విసవిసా వెళ్ళిపోయింది. ఒకటా రెండా నలభై కుటుంబాలు. భద్రత కోసం ఫోన్ చెయ్యమంటే తప్పేమిటి? అర్ధరాత్రి రావడం తప్పుకాదు, నిద్రలో కూడా, వాళ్ళను గుర్తు పట్టకపోవడమే తప్పు. వాళ్ళ కళ్ళలో నీళ్ళు. ‘మా ఇంటాయన పల్లెత్తు మాటంటే పడేవాడు కాదమ్మా, అంత పౌరుషం. హాయిగా చెట్టూ పుట్టా మధ్య తిరిగే మేము, పోలంగట్లెంటా, చెరువు కట్టల మీదా ఊసులాడుకునే మేము, చెడుపు కాలం పట్టి, ఈ పనికొచ్చాము. అక్కడ తిండికి కరువేమో గానీ, అభిమానానికి కాదమ్మా. ఎందుకొచ్చామో అనిపిస్తోంది. మా ఊరు, నోరారా పలకరించే మనుషులు గుర్తొస్తున్నారు’, అంటూ భోరున ఏడ్చేసింది అన్నవరం. పిల్లలు బెదిరిపోయి చూస్తున్నారు. భారమైన మనసుతో వాళ్ళను ఓదార్చి వెళ్లాను. ***************************************** సింహాద్రిని పట్టుకు చావగొడుతున్నారు, ఓ నలుగురు మగాళ్ళు. వాళ్లకి నాయకుడు మా క్రింద ఫ్లాట్ సురేష్ గారు. బయటకు వెళ్లి వచ్చిన నేనూ, మా వారూ అడ్డుపడి, ‘అసలేం జరిగింది?’ అని అడిగాము. ‘మా బండి పోయిందండి, రాత్రి ఇక్కడే పార్క్ చేసాము. క్రొత్త బండి, డెబ్భైవేలు పోసి కొన్నాము. ఈ చవటలని కాపలా పెడితే ఇంతే, ఇవాళ నాది పోయింది, రేపు మీది పోతుంది. చేతగాని చచ్చినాళ్ళు పనికెందుకు రావాలి? ఈ ఊరోళ్ళు అంతా ఇంతే. వేడిని, వీడి కుటుంబాన్నీ పోలీసులకి అప్పగిస్తే గాని, వీళ్ళ తిక్క కుదరదు, కొట్టండిరా,’ అన్నాడు. కాళ్ళా వేళ్ళా పడుతోంది సింహాద్రి కుటుంబం. ఇంతలో ఆయన మేనల్లుడు, రయ్యిమంటూ, ఆయన బైక్ వేసుకొచ్చాడు. ఈయన బండి కొన్నప్పుడు, అతనికొక స్పేర్ కీ ఇచ్చాట్ట. ఫ్రెండ్ కి ఆక్సిడెంట్ అవడంతో, చెప్పాపెట్టకుండా క్రింది నుంచే బైక్ వేసుకెళ్ళిపోయాట్ట. తప్పంతా తనదేననీ, ఆ గందరగోళంలో తోచలేదనీ, అన్నాడు. వెంటనే నేను, ‘సురేష్ గారు, చూసారా? సరిగ్గా విచారించకుండా, తొందరపడి సింహాద్రిని కొట్టారు. ఇప్పుడు మీరు కొట్టిన దెబ్బలు కానీ, అన్న మాటలు కానీ వెనక్కి తీసుకోగలరా? విచక్షణ మరచి, వాళ్ళ మనస్సును, శరీరాన్ని గాయపరిచారు. ఇప్పుడేమి సంజాయిషీ ఇస్తారో చెప్పండి?’ అని అడిగాను. సిగ్గుతో తల వంచుకున్నారు వాళ్ళు. ‘సింహాద్రీ, ఇంతకాలం మిమ్మల్ని సర్డుకుపోమ్మని చెప్పాను. నాదే తప్పు. ఇకపై మీరిక్కడ ఉండొద్దు. ఇక్కడ మనుషులు పెద్ద, మనసులు చిన్న. ఈ ఇరుకు మనసుల మధ్య మీరు ఇమడలేరు. వీళ్ళకు తమ అవసరాలు గడుపుకోవడం కావాలు, తమ అహాన్ని చూపేందుకు మనుషులు కావాలి. వెట్టిచాకిరీ చేసే అమాయకులు కావాలి. తమ స్వార్ధం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఈ కరడుకట్టిన మనసులు కరిగించడం, ఈ మూసుకుపోయిన మనసు గదుల్లో మానవత్వం నింపడం, మీ వల్ల, మీ పిల్లలవల్లైనా కాదు. పచ్చటి మీ పల్లెల్లో స్వేచ్చ వుంది. స్వచ్చమైన ప్రకృతి ఒడి వుంది. ‘అమ్మా ఆకలి’ అంటే తమకున్నదాంట్లోంచి కొంచెం పంచి పెట్టే మానవత ఉంది. అవన్నీ ఇక్కడ దొరకవు. వలసపక్షులు ఎన్నో వేల మైళ్ళు ప్రయాణించి వచ్చి, వేటగాడి వలలో చిక్కుకున్నట్టు, ఎంతో దూరం నుంచీ బ్రతుకు మీద ఆశతో వలస వచ్చి, ఈ పంజరంలో ఇరుక్కున్నారు. వెళ్ళండి, వెళ్లి మీ వాళ్ళందరికీ చెప్పండి, పట్నం వలస రావద్దు. ఇక్కడి మనుషుల్ని నమ్ముకుంటే మిగిలేది కన్నీరే! డబ్బు కోసం బానిస బ్రతుకులు బ్రతికేందుకు రావద్దని, జీవితాల్ని అమ్ముకోవద్దనీ గట్టిగా చెప్పండి’, అన్నాను ఉబికివచ్చే కన్నీటిని ఆపుకుంటూ. మర్నాడు దిగులుపడ్డ మొహాలతో, బెంబేలెత్తిన పిల్లల్ని ఓదారుస్తూ మూటాముల్లె సర్దుకుని వెళ్ళిపోయింది సింహాద్రి కుటుంబం.
No comments:
Post a Comment