సీతారామతత్త్వము - అచ్చంగా తెలుగు

సీతారామతత్త్వము

Share This

 సీతారామతత్త్వము     

డా. వారణాసి రామబ్రహ్మం 

భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యము ఒక ఎత్తు, ఇతిహాసములు  ఒక ఎత్తు.   రామాయణము, మహా భారతము, మహా భాగవతము మన భారతీయ సంస్కృతికి, నాగరికతకు చిహ్నములు; ప్రతీకలు కూడాను. రామాయణము ఆదికావ్యము. వాల్మీకి ఆదికవి. మునిపుంగవుడు, కవికోకిల అయిన వాల్మీకి మహర్షి మనకు ఆదర్శ మానవ సంబంధాలు అందమైన కావ్య రూపంలో అందించాడు. రామాయణము నందలి   పాత్రలు అన్నీ  ఆదర్శ ప్రాయములే. శ్రీ రాముడు ఆదర్శ పుత్రుడు; సోదరుడు; భర్త; స్వామి; పాలకుడు; దైవము. సీతాదేవి ఆయనకు తగ్గ ధర్మపత్ని. భర్తతో అడవులకు వనవాసము వెళ్లి, సతతము ఆయనతోనే ఉండడానికి, భర్త తోనే వాదించిన ప్రేమమూర్తి; భర్తృ స్నేహము, ప్రేమ, తనతోడి జీవనము  తప్ప అన్యము అక్కర లేని సాధ్వి. శ్రీ రామ చంద్రుడు ఎంత వారించినా; తన తండ్రి జనక మహారాజు భర్తతో సుఖదు:ఖములలో,  అన్ని వేళలా కలిసి ఉండమని వివాహము చేసాడని; అందుకని శ్రీరామునితోడి జీవితమే, అడవులలోనైనా తనకు స్వర్గమని అనునయముగా, అధికారికముగా, హక్కుగా పొంది భర్తతోనే అన్నివేళలా కలిసి బ్రతికిన సాధ్వీలలామ.

సీతారాములు ఆదర్శ దంపతులు. ఒకరిని విడిచి ఒకరు క్షణమైన జీవించి ఉండలేని ఆప్యాయతామూర్తులు. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, స్నేహము, ఆత్మీయత, ఆపేక్ష అద్వితీయము. సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయినపుడు శ్రీరామచంద్రుడు అనుభవించిన వియోగ వ్యథ మన మనసులను ఆర్ద్రము చేస్తుంది. సుందరకాండలో సీతాదేవి ఆంజనేయస్వామితో, తనకు రామునికి గల పరస్పరానురాగాములను, ప్రేమను ఎంతో విశదముగా వివరిస్తుంది. ఆమెను గాయపరిచన కాకాసురుని సంహరించడానికి బ్రహ్మాస్త్రము  వేసిన అనురాగమూర్తి శ్రీరామచంద్రుడు.  సీతారాములు ఇద్దరు కూడా హనుమంతులవారితో తమ మధ్య గల స్నేహమును, ప్రేమను మనసార వెళ్ళడించుకున్నారు. ఆ విధముగా హనుమతులవారు ధన్య జీవి.వారి ఆ మమతానురాగాములు మనకు ఎంతో ముచ్చట గొలుపుతాయి. మనకు దాంపత్యజీవనములో అనుసరణీయములు  కూడా. నదులు ప్రవహిస్తున్నంతవరకు, సముద్రములున్నంతవరకు, పర్వతములు నిలిచి ఉన్నంతవరకు రామాయణము నిలిచి ఉంటుంది. సీతారాముల పరస్పరానుగాగము ఆదర్శవంతముగా   నిలుస్తుంది. సీతారామతత్వము అద్వైతతత్వము.అర్ధనారీశ్వరతత్వము. చిన్ని చిన్ని కారణములకే విడాకులు తీసికొనే ప్రస్తుత పరిస్థితులలో, కష్టమైనా, సుఖమైనా ఒకరినొకరు అనుమానించినా, మాటలుఅనుకొన్నా, పరస్పరానురాగము చెక్కుచెదరనీయని వివేకవంతులు సీతారాములు మనకు పూజ్యనీయులు.అనుసరించదగినవారు. వివాహబంధము భార్యాభర్తల మధ్య స్నేహము, సౌమనస్యములను పెంపొందించి పిల్లలకు, కావలిసిన వారికి, పైవారికి,  అందరకు  దాంపత్య ప్రతీక కావాలిగాని, ప్రతి చిన్న కారణానికి తుపుక్కున తెగిపోయే దారపుముడి కాదని ప్రకటించేలా మనందరమూ జీవించాలి. అప్పుడే వాల్మీకి మహర్షి రచనకు సార్ధకత చేకూరుతుంది. అలా జీవించేలా సీతారాములు మనలను ప్రేరేపించెదరుగాక! సర్వే జనాః సుఖినో భవంతు!

No comments:

Post a Comment

Pages