మహావిష్ణువుకి మనోవైకల్యమా ? - అచ్చంగా తెలుగు

మహావిష్ణువుకి మనోవైకల్యమా ?

Share This

  మహావిష్ణువుకి మనోవైకల్యమా ?

 పిస్కా సత్యనారాయణ 

 ' తొలి ఏకాదశి ' పండగని ' శయనైకాదశి ' అనికూడా అంటారు. ఈరోజు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదని చెబుతారు.

ఈ పవిత్ర పర్వదినాన ఆ ఆదినారాయణుని ఆశీర్వ వర్షం అందరిపైనా కురవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. మరి, ఈ సందర్భంగా ఆ పరంధాముణ్ణి ప్రస్తుతించే వొక పద్యప్రసూనం యొక్క సురభిళ పరిమళాలను ఆఘ్రాణిద్దామా!..... శ్రీనాథకవిసార్వభౌములచే విరచితమైన 'శృంగారనైషధం ' కావ్యములోని అష్టమాశ్వాసంలో వుంది యీ చిన్ని పద్యం ! చూడడానికి యిది చిన్నదే! అందులోనూ భగవానుని స్తుతిపరంగా చెప్పినది. 'ఇటువంటిదానిలో యేమంత చమత్కారం వుంటుందబ్బా!' అని పాఠకులు అనుకునే అవకాశం లేకపోలేదు. మరి, మహాకవుల ప్రతిభ అక్కడే వుంది. అల్పమైనదానిలోనే అనల్పార్థాన్ని పొదిగే ప్రజ్ఞాశీలురు కనుకనే ఆ మహానుభావులు యీనాటికీ మనకు స్మరణీయులైనారు. మొదట పద్యాన్ని చిత్తగించండి...
తే. అమరపతిసూను నిర్జించి తార్కిఁ గూడి దైత్యమర్దన! రామావతారవేళ నా మనఃక్లేశ ముడుగనే యార్కి నణచి తమరపతిసూను గూడి కృష్ణావతార!

         ముందుగా పద్యభావాన్ని వివరిస్తాను. అమరపతిసూనుడు అనగా దేవతలకు అధిపతియైన ఇంద్రుని కుమారుడు అనేది స్పష్టమే కదా! పోతే, ఆర్కి అంటే అర్కుని (సూర్యుని) సుతుడు.

రాక్షసాంతకుడవైన ఓ విష్ణుదేవా! రామావతారములో నీవు సూర్యసుతునితో చెలిమి చేసి ఇంద్రకుమారుడిని వధించావు. ఆ మనోబాధను బాపుకొనడానికే కాబోలు, కృష్ణావతారములో ఇంద్రనందనునిచేత సూర్యపుత్రుని సంహరింపజేశావు.... ఇదీ పై పద్యము యొక్క తాత్పర్యము. 

  ఇక్కడ మనకు ఇద్దరు ఇంద్రకుమారులు, ఇద్దరు సూర్యసుతులు దర్శనమిస్తున్నారు. రామావతారములో వారు వాలిసుగ్రీవులైతే, కృష్ణావతార కాలములో ధనంజయ రాధేయులు.

ఈ పద్యములో ' మనఃక్లేశము ' అనే మాటను వుపయోగించారు కవీశ్వరులు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన ఆ జగద్రక్షకునికి మనఃక్లేశమేమిటి?!.....ఎందుకని?!..... ఈ ప్రశ్నలకు సమాధానం యీ పద్యములోనే వాడబడిన ' దైత్యమర్దన ' అనే సంబోధనలో లభిస్తుంది మనకు! మహాకవులు యే పదాన్ని కూడా వ్యర్థంగా పోనివ్వరు. ఇక్కడ ' దైత్యమర్దన ' అనే సంబోధన సాభిప్రాయం. దైత్యమర్దనుడనగా రాక్షసులను మర్దించినవాడు. మరి, అలాంటి బిరుదు కలవాడు యిక్కడ చేసినదేమిటి?......రామావతారములో సూర్యపుత్రుడైన సుగ్రీవునికి అండగా నిలబడి, ఇంద్రకుమారుడైన వాలిని అనగా దేవాంశసంభూతుడిని వధించాడు. దైత్యమర్దనుడని పేరెన్నికగన్న తాను దేవాంశతో పుట్టినవాడిని సంహరించడం సరియైనదేనా?!.......అందుకే ఆ మనోవైకల్యం !------- ఏదైనా పొరపాటు జరిగితే బాధపడి, దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం సర్వసహజం. అందుకే స్వామి పై తప్పును దిద్దుకొనడం కొరకు కృష్ణావతారములో సరిగ్గా అందుకు విపర్యయాన్ని ఆచరించాడట! అనగా, ఇంద్రనందనుడైన పార్థునిచేత సూర్యసూనుడైన కర్ణుడిని అంతమొందింపజేయడం ! ఇదీ కవిగారి చమత్కారం !........ శ్రీరాముడు వాలివధ కావించడం, శ్రీకృష్ణుడు అర్జునునిచేత అంగరాజును సమయింపజేయడం మనందరికీ తెలిసిన సంగతులే! ఐతే, ఆ రెండు కార్యాలను యీ విధంగా వొక అందమైన రూపములో అనుసంధించడం మాత్రం ఆ కవిసార్వభౌములకే సాధ్యం. వారి కల్పనాచమత్కృతిని ఆస్వాదిస్తూ ఆనందవారాశిలో తేలియాడగలగడం మన అదృష్టం!

No comments:

Post a Comment

Pages