విజయాల చందమామ – చక్రపాణి - అచ్చంగా తెలుగు

విజయాల చందమామ – చక్రపాణి

Share This
విజయాల చందమామ చక్రపాణి
-      పరవస్తు నాగసాయి సూరి
 తెలుగు సినిమాకు విజయా సంస్థ రూపంలో కొత్త నడకలు నేర్పిన క్రాంతదర్శి... తెలుగు సాహిత్యానికి చందమామ రూపంలో కొత్త బాటలు వేసిన మార్గదర్శి... వ్యంగ్యంతో కూడిన హాస్య ఒరవడికి శ్రీకారం చుట్టింది ఆయనే... యువతకు ప్రత్యేక పత్రిక ఉండాలన్న సంకల్పంతో తొలి అడుగు వేసిందీ ఈయనే... భాషవేత్తగా, రచయితగా, పత్రికా సంపాదకునిగా, నిర్మాతగా, దర్శకునిగా... ఇలా ఏ రంగంలోనైనా ఆయన ముద్ర ప్రత్యేకం.... తెలుగు సినిమాను, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, ఈ నాడు ఎంతో మందికి అన్నం పెడుతున్న మార్గాల్ని నిర్మించి వెళ్ళిన ఆ పేరు... చక్రపాణి.   సినిమా అనగానే మనకు తెరమీద కనిపించే నటులే కళ్ళ ముందు కదలాడుతారు. కేవలం కొంత మంది తెరవెనుక విజేతలు మాత్రమే గుర్తుండి పోతారు. ఆ జాబితాలో ముందు వరుసలో నిలిచే పేరు... చక్రపాణి. విజయా ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా ఎందరో అగ్రనటులకు సినీజీవితాన్ని ప్రసాదించారాయన. అంతేనా... చందమామ పేరుతో పత్రికను ప్రారంభించి... ముందు తరాలకు తెలుగు సాహిత్యాన్ని అందించే దిశగా తొలి అడుగు వేశారు. చక్రపాణిగా కలం పేరుతో సుప్రసిద్ధులైన ఆలూరు వెంకట సుబ్బారావు... 1908 ఆగష్టు5న గుంటూరు జిల్లా తెనాలిలో ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. జాతీయోద్యమ ప్రభావంతో హైస్కూలు విద్యకు సైతం స్వస్తి చెప్పారు. అయినా స్వయంకృషితో హిందీ, బెంగాలి, సంస్కృత, ఆంగ్ల భాషల్లో పాండిత్యం సంపాదించారు. సినిమా మీద ఉన్న ఆసక్తితో మద్రాసుకు పయనమయ్యారు. 1941లో పి.పుల్లయ్య నిర్మించిన ధర్మపత్ని కోసం మాటలు రాశారు. బిఎన్. రెడ్డి రూపొందిస్తున్న స్వర్గసీమకు మాటలు రాయడానికి చెన్నై వెళ్లారు. 1944లో నాగిరెడ్డిని కలవడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. 1949లో విజయా ప్రొడక్షన్స్ స్థాపించి సినిమాలు తీయాలని నిర్ణయించారు. షావుకారుతో ప్రారంభమైన వారి ప్రస్థానం... తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 35 సినిమాలతో విజయవంతంగా సాగింది. షావుకారు, పాతాళభైరవి, మాయాబజార్, గుండమ్మకథ, మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడులాంటి అజరామరమైన చిత్రాలు నిర్మించి తెలుగు సినీ పరిశ్రమను అగ్రస్థానంలో నిలిపారు. ధర్మపత్ని, స్వర్గసీమ, షావుకారు, పెళ్లిచేసిచూడు, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాలకు కథల్ని అందించారు. వ్యంగ్యంతో కూడిన సునిశిత హాస్యాన్ని ఇష్టపడే చక్రపాణి... మిస్సమ్మ, గుండమ్మ కథల్ని తీర్చి దిద్దిన తీరు నభూతో నభవిష్యతి. శరత్ బెంగాలి నవల దేవదాసును తెలుగులోకి అనువదించడంలో చక్రపాణి కృతకృత్యులయ్యారనే చెప్పాలి. శరత్ తెలుగు వాడే అనుకునేంతగా వినోదావారి దేవదాసుకి కథనందించారు. కేవలం సినిమాలే కాదు నాగిరెడ్డి, చక్రపాణి కలిసి పిల్లల కోసం చందమామ కథల పుస్తకాన్ని ప్రారంభించారు. ఇది సాధించిన విజయం తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొడవటిగంటి కుటుంబరావుతో కలిసి తెనాలిలో యువ మాసపత్రికను సైతం ప్రారంభించారు. మాట ధీటుగా ఉన్నా మనసు వెన్న అని చక్రపాణి గురించి తెలిసిన వారు చెబుతుంటారు.ఎన్నో కళాఖండాలను అందించిన చక్రపాణి గారి ఆఖరి చిత్రం శ్రీరాజరాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్. నడివయసులో భార్య, కుమారుడు దూరమైనా... క్షయ వ్యాధి తీవ్రంగా బాధిస్తున్నా.. పట్టుదలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించి మెప్పించారు. 1975 సెప్టెంబర్24న తుదిశ్వాస విడిచారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం చక్రపాణి చిరస్మరణీయుడు, తెరస్మరణీయుడు. అంతే కాదు ఔత్సాహికులకు క్రాంతదర్శి కూడా.

No comments:

Post a Comment

Pages