గండికోట -- రచన-- చెరుకు రామ మోహన్ రావు
'బాలనాగమ్మ' సినిమా గుర్తున్నవారికి మాయల మరాఠీ, లేక మాయల ఫకీరు గుర్తుంటాడు. అతను గండికోట ప్రాంతములో ఉండేవాడని కథలో వినిపిస్తుంది. ఆటను వుండినాడో లేదో గానీ గండికోట మాత్రం వుంది. అక్కడ కోట కూడా వుంది. ధ్వంసమైన రాజభవనాలు దేవాలయాలు కలిగివుంది. మొక్కవోని మసీదులను నిలుపుకొని వుంది . రంగనాథ,మాధవరాయ దేవాలయములు ఎంతో పెరుపొందినవి, తప్పక చూడదగినవి. భోగపుసాని భవవనము పావురాల గోపురము, ధాన్యాగారము, రక్తపు మడుగు, జుమ్మా మసీదు నేను బాల్యమున చూసినవి. ఇప్పుడది టూరిస్ట్ స్పాట్ అయినదని విన్నాను. శత్రువులను చంపిన కత్తులు కడుగుటవల్ల అమడుగులో నీరు ఎప్పుడూ ఎర్రగా ఉండేవి. దేవాలయాలు ధ్వంసమైనా శిల్పకళ చూసి తీరవలసినది. ఇక జుమ్మా మసీదు గోడలు పాలరాతి గోడలు లాగా చాలా నునుపుగాను తెల్లగాను వుంటాయి. మెట్లపై, పై అంతస్తు చేరుటకు ఎక్కుతూవుంటే, ద్రష్టి పైవైపుకు సారించితే ఇంకొక అంతస్తుకు మెట్ల బాట ఉందన్న భ్రమ కలిగించుతుంది. నిజానికతువంటిది లేదని నేను చెప్పకుండానే మీకు అర్థమైపోయి వుంటుంది. గండి కోట లోయ చూడవలసిన దృశ్యము. ఆ అందము నా మాటల కందదు. మైలవరం డాము ఇక్కడికి 3 కిలోమీటర్లే. గండికోట ప్రాజెక్ట్ ఎందఱో రాయలసీమ వాస్తవ్యులు కన్న కల. కలను కల్లగా జేసిన ఘనత నాటి పాలకులదే. ప్రాజెక్ట్ 'ఢాం' అనింది గానీ ప్రక్కన dam మిగిలింది. నాకు తెలిసిన మేరకు గండి కోటను గూర్చి నాలుగు మాటలు చెబుతాను. గండికోట కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక దుర్గం. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. దట్టమైన అడవుల మధ్య ఎంతటి బలమైన శతృవు దాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, శత్రుదుర్భేద్యంగా వుంటుంది. విజయనగర సామ్రాజ్య స్థాపకుడు బుక్క రాయలు క్రీ. శ. 1356లో మిక్కిలినేని రామానాయుడను యోధుని గండికోటలో సామంతునిగా నియమించినాడు. ఆతని తరువాత ఎందఱో రాజులు ఆ కోటనేలినారుకానీ చివరి పాలకుడైన చినతిమ్మా నాయుని కాలములో అది ముస్లిముల వశమయ్యింది.మీర్ జుంలా పారశీక (ఇరాన్) దేశమునకు చెందిన ఒక తైల వర్తకుని కుమారుడు. గోలకొండ రాజ్యముతో వజ్రాల వ్యాపారము చేస్తున్న ఒక వర్తకుని వద్ద గుమాస్తాగా పనిచేసి, వజ్రాల గురించి జ్ఞానము సంపాదించి భారతదేశము చేరినాడు. స్వయముగా వజ్రాలవ్యాపారిగా మారి, గనులు సంపాదించి, ఎన్నో ఓడలు సమకూర్చుకొని గొప్ప ధనవంతుడయ్యాడు. తదుపరి గోలకొండ సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా ప్రాపకము సంపాదించి దర్బారులో వజీరు స్థానానికి ఎదిగినాడు . విజయనగర సామ్రాజ్యములోవజ్రాల గనులున్న రాయలసీమపై ఈతని కన్ను పడింది. విజయనగర రాజులకు విశ్వాసపాత్రులైన పెమ్మసాని నాయకులు పాలిస్తున్న గండికోట జుమ్లా ఆశలకు పెద్ద అడ్డుగా నిలచింది. గోలకొండ దర్బారులో మంత్రిగానున్న పొదిలి లింగన్న ప్రోద్బలముతో క్రీ.శ. 1650లో పెద్ద సైన్యముతో మీర్ జుంలా గండికోటపై దండెత్తాడు. అతనికి సహాయముగా ఆధునిక యుద్ధతంత్రము తెలిసిన మైల్లీ అను ఫ్రెంచ్ ఫిరంగుల నిపుణుడున్నాడు. ఎన్నోరోజులు భీకరయుద్ధము జరిగినను కోట వశముకాలేదు. ఫ్రెంచివారి ఫిరంగుల ధాటికి కోట గోడలు బీటలు వారినాయి . క్లాడ్ మైలీ అతి కష్టముమీద మూడు భారీ ఫిరంగులను కొండ మీదికి చేర్చి కోటగోడలు బద్దలు చేయుటలో కృతకృత్యుడైనాడు . యుద్ధము మలుపు తిరిగింది. యుద్దము ముగిసిన ఎనిమిది రోజులకు ప్రముఖ వజ్ర వ్యాపారి టావెర్నియర్ గండికోటలో నున్న మీర్ జుంలాను కలిసినాడు . ఆ సందర్భమున తిమ్మానాయుని శౌర్యపరాక్రమము గురించి విని తన పుస్తకములో ఎంతో గొప్పగా పొగిడినాడు. తిమ్మానాయుని బావమరిది శాయపనేని నరసింహ నాయుడు వీరోచితముగా పోరాడుతూ కోట సంరక్షణ గావిస్తూ అసువులు బాశాడు. చెల్లెలు పెమ్మసాని గోవిందమ్మ , అన్న వారిస్తున్నా వినకుండా కాసెగట్టి, అశ్వారూఢయై తురుష్క, ఫ్రెంచ్ సైనికులతో తలపడింది. భర్త మరణమునకు కారకుడైన అబ్దుల్ నబీ అను వానిని వెదికి వేటాడి సంహరిస్తుంది. అదే సమయములో నబీ వేసిన కత్తి వేటుకు కూలి వీరమరణము పొందింది. కోటలో వందలాది స్త్రీలు అగ్నిప్రవేశము చేసినారు. ఎండు మిరపకాయలు పోగులుగా పోసి నిప్పుబెట్టి ఆందులో దూకి చనిపోయినారని చెబుతారు. హతాశుడైన చినతిమ్మ రాయబారమునకు తలొగ్గక తప్పలేదు. గండికోటకు బదులుగా గుత్తి కోటను అప్పగించుట ఒప్పందము. కోట బయటకు వచ్చిన నాయునికి పొదిలి లింగన్న కుతంత్రముతో విషమునిప్పిస్తాడు. అదే సమయములో గుత్తికోటకు బదులు హనుమనగుత్తి అను చిన్న గ్రామానికి అధిపతినిచేస్తూ ఫర్మాను ఇవ్వబడింది. మోసము తెలుసుకున్న చినతిమ్మ ఫర్మాను చింపివేసి బాలుడైన కొడుకు పిన్నయ్యను బంధువులకప్పగించి రాజ్యము దాటిస్తాడు. నాయునికి విషప్రభావము వల్ల మరణము ప్రాప్తిస్తుంది . మీర్ జుంలా గండికోటలోని మాధవస్వామి ఆలయము ధ్వంసం చేసి పెద్ద మసీదు నిర్మిస్తాడు . దేవాలయానికి చెందిన వందలాది గోవులను చంపించుతాడు. కోటను ఫిరంగుల తయారీకి స్థావరము చేస్తాడు. గండికోటపై సాధించిన విజయముతో మీర్ జుంలా మచిలీపట్నం నుండి శాంథోం (చెన్నపట్టణము) వరకు అధికారి అవుతాడు. బంధువుల సాయముతో మైసూరు రాజ్యము చేరిన పిన్నయ నాయుడు తమిళదేశానికి తరలించబడతాడు. గండికోట లోని అరువదియారు ఇంటిపేర్లు గల కమ్మ వంశములవారు చెల్లాచెదరైపోయి పలు ప్రాంతాలలో స్థిరపడతారు. వారిలో చాలామంది గంపలలో వస్తువులు పెట్టుకొని అడవులూ, కొండలు దాటుతూ కావేటిరాజపురం, మధుర, గుంటూరు, తిరుచినాపల్లి మొదలగు ప్రాంతాలకు పోతారు. వీరికే 'గంపకమ్మవారు', 'గండికోట కమ్మవారు' అను పేరులు వచ్చాయి. మధుర చేరిన పెద వీరప్ప నాయుడు నాయకుల ఆస్థానములో పదవులు పొంది తదుపరి సింహళ దేశ యుద్ధములలో విజయాలు సాధించి పెడతాడు. వీరి వారసులు మధుర సమీపములోని కురివికులం, నాయకర్పట్టి మొదలగు జమీందారీలకు అధిపతులయ్యారు.మూడు శతాబ్దములు విజయనగర రాజులకు సామంతులుగా పలు యుద్ధములలో తురుష్కులపై విజయములు సాధించి, హిందూధర్మ రక్షణకు, దక్షిణభారత సంరక్షణకు అహర్నిశలు శ్రమించి, రాయలవారి ఆస్థానములో పలుప్రశంశలు పొంది, చరిత్ర పుటలలోనికెక్కిన యోధానుయోధులు గండికోట నాయకులు.
చూడతగ్గ స్థలముల చిత్రములు (గూగుల్ సౌజన్యంతో )
No comments:
Post a Comment