స్వీట్స్ (ఉషారాణి నూతలపాటి )
రసగుల్లా
రసగుల్లా అంటేనే నోట్లో లాలాజలం ఊరుతుంది కదండీ ! మరే నోట్లో వేసుకో గానే ,తియ్యగా, మెత్తగా గొంతులోకి జారే ,రసాలూరే ‘రసగుల్లా’ నిజానికి బెంగాలీ తీపివంట. అయినా దేశమంతా ప్రఖ్యాతిపొంది , అందరి చేతా ‘ఆహా’ అనిపించుకుంది . చూడ్డానికి ,తినడానికీ తెలికగావుందే రసగుల్ల ,చెయ్యడమూ తేలికే..! మరి ఎలాచేయ్యాలో చూడండి. కావలసిన పదార్ధాలు : చిక్కటి పాలు 1 లీటరు , పంచదార అరకిలో ,నిమ్మరసం 1 పెద్దకాయ రసం , చిటికెడు కుంకుమ పువ్వు , పిస్తా పప్పు కొద్దిగా. (పిస్తా ,కుంకుమ పువ్వు కావాలనుకుంటేనే వాడవచ్చు.) చేయువిధానం : ముందుగా పాలని బాగా మరగనివ్వాలి. పాలు కాగినంతసేపు మీగడ కట్టకుండా కలుపుతూనేవుండాలి .బాగా మరిగినతరువాత స్టవ్ కట్టేసి , నిమ్మరసం లో ఒక స్పూన్ నీళ్ళు కలిపి , ఆ నిమ్మరసాన్ని పాలల్లో కొద్ది,కొద్దిగా కలుపుతూ వుండాలి .పాలు విరిగేవరకు అలా కలుపుతూ వుంటే పాలు విరిగిపోతాయి . విరిగిన పాలని అలాగే కలిపితే పాలు బాగా విరిగి , నీరు,విరుగు (చెనా ) స్పష్టంగా వేరుపడతాయి . చిల్లుల పళ్ళెం లో పల్చని బట్టవేసి అందులో పాలవిరుగు వెయ్యాలి . చెనా మీద బాగా నీటిని ధారగా పొయ్యాలి ,అప్పుడే నిమ్మరసం పులుపు కూడా పోతుంది. బట్టలోంచి నీరు మొత్తం దిగిపోతుంది. బట్టను మూటలా చేసి ,తేలికగా వత్తితే మిగిలిన నీరు కూడా బయటికి వస్తుంది. 2 గంటలసేపు ఆమూటను వేలాడదీస్తే మొత్తం నీరు దిగిపోయి ,చెనా మిగులుతుంది. ఇప్పుడు స్టవ్ పైన మందపాటి పాత్రను వుంచి అరలీటరు నీరు పోసి, అందులో చక్కర వేసి , కరిగేవరకూ కలుపుతూ వుండాలి . బాగా కరిగిన తరువాత చక్కెరపాకాన్ని కొద్దిగా చల్లారనివ్వాలి . చెనా (పాలవిరుగు) ని ఒక పెద్ద ప్లేట్ లో కానీ ,చపాతీ పీటమీద కానీ వేసుకొని , మృదువుగా ,ఉండలు లేకుండా 5.6 నిముషాలసేపు కలపాలి. మృదువుగా ,వుండచేస్తే తేలికగా వుండకట్టేలా తయారు అవుతుంది. మొత్తం చెనాని సమానభాగాలుగా చేసి ,గుండ్రగా ఉండలు చెయ్యాలి. ఒక వెడల్పు పాత్ర స్టవ్ పై వుంచి లీటరు నీరు పోసి మరగనివ్వాలి. మరుగుతున్న నీటిలో చెనావుండలు వేసి మూత పెట్టాలి. 7 ,8 నిముషాలపాటు అలాగే మరగనివ్వాలి .చెనావుండలు బాగా ఉడికి సైజ్ పెద్దగా అవుతాయి వాటిని పాకంలో వేసి చల్లారాక ,ఫ్రిజ్ లో వుంచి చల్లబరచాలి.పాకంలో కావాలనుకుంటే కుంకుమ పువ్వు (శాఫ్రాన్ )వేసుకోవచ్చు.పిస్తా సన్నగా తరిగి రసగుల్లాలమీద అలంకరించుకుంటే అద్భుతః .పాకంలో 2 చుక్కలు వనిల్లా ఎసెన్స్ (కావాలనుకుంటే )లేదా రోజ్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. మంచి వాసనతో రుచిగావుంటాయి. P.S. : ఒక్కోసారి పాలు విరిగిపోతాయి.అప్పుడు కూడా ట్రై చెయ్యవచ్చు. కానీ మరీ పాడయిన పాలు చేదువస్తాయి జాగ్రత్త !!
ఫ్రూట్ కస్టర్డ్
ఈ కాలం పిల్లలకి పాలుతాగడం ,పండ్లు తినడం బోర్. పిజ్జాలూ ,నూడుల్స్, ఐస్క్రీం లూ అంటే చాలా ఇష్టం. ఇవేవీ ఆరోగ్యానికి మంచివి కావు. పళ్ళు ,పాలు పిల్లలకి అలవాటు చెయ్యాలన్నా, మంచి చిరుతిండి ఇవ్వాలన్నా ,ఆరోగ్యవంతమైన డిజర్ట్ ఫ్రూట్ కస్టర్డ్. పిల్లలు స్కూల్కి వెళ్ళాక చేసి ఉంచితే స్కూల్ నుండి రాగానే పెద్ద కప్పునిండా ఇవ్వవచ్చు . ఇష్టంగా తింటారు. కడుపుని౦డుతుంది . మనకు మంచి ఆహారాన్ని ఇచ్చిన తృప్తి కలుగుతుంది. పళ్ళలో వున్న విటమిన్స్ ,పీచు ఏమాత్రం నష్టపోకుండా చిన్నారులకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.ఫ్రూట్ కస్టర్డ్. బాగా బొద్దుగా .వోవర్ వెయిట్ వున్న పిల్లలకి మాత్రం చక్కర తక్కువగా వేసుకోవాలి అంతే.ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా .. కావలసిన పదార్ధాలు : 1. పండ్లు 5,6 రకాలుచిన్నగాముక్కలుచెయ్యాలి. [మామిడి,అరటి,యాపిల్,కమలా,ద్రా
క్ష,బొప్పాయి,దానిమ్మ.] నీరు వుండే పండ్లు అనగా పుచ్చకాయ లాంటివి పనికి రావు.2. బాదం ,జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ చిన్నముక్కలుగా చేసుకోవాలి. 3.పంచదార అరకిలో ,4. చిక్కటి పాలు ఒక లీటరు , 5.విక్ ఫీల్డు కస్టర్డ్ పౌడర్ 5 sp. చేయువిధానం : పాలు బాగా మరగ నివ్వాలి. మరుగుతున్నప్పుడే అందులో చక్కెరవేసి బాగా కలుపుతూ వుండాలి. ఒక కప్పులో అరగ్లాసు చల్లని పాలు తీసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలపాలి.వేడి పాలల్లో వేస్తే ఉండలు కట్టి ,గట్టిపడతాయి. పొరపాటున కూడా అలా చేయరాదు. కస్టర్డ్ కలిపిన చల్లటి పాలను జాగ్రత్తగా పోస్తూ, బాగా కలుపుతూ వుండాలి. లేకపోతే అడుగున ఉండలు కట్టి మాడిపోయి , కాటు వాసన వస్తుంది. పదార్ధం పూర్తిగా పాడయిపోతుంది . బాగా కలుపుతూవుంటే పాలు చిక్కగా అవుతాయి. స్టవ్ కట్టేసి , కలుపుతో,(మీగడ కట్టకుండా ) చల్లారనివ్వాలి. చల్లారాక ఫ్రిడ్జ్ లో ఉంచాలి. పండ్లని బాగా కడిగి ,శుభ్రం చేసి ,పొట్టు తీసి చిన్నముక్కలు చేసుకోవాలి. అరటి పండ్లు మాత్రం తినడానికి ముందు మాత్రమే కలపాలి.నల్లబడతాయి . పండ్ల ముక్కలమీద అరచెంచా నిమ్మరసం కలిపి ఫ్రిజ్ లో ఉంచితే చల్లగా వుంటాయి . 2,3 గంటలతరువాత కస్టర్డ్ లో పళ్ళముక్కలు ,డ్రై ఫ్రూట్ ముక్కలూ కలిపి , అందమైన గాజు బౌల్ లో పిల్లలకి అందించండి. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కాబట్టి ,ఎండలు బాగా వున్నాయి కాబట్టి ,స్కూల్ నుండి రాగానే చల్లగా మాంగో ఫ్రూట్ కస్టర్డ్ ఇస్తారుకదూ..
No comments:
Post a Comment