"లావొక్కింతయు లేదు"
- నాగజ్యోతి సుసర్ల
కాంతికి విపరీతమైన ఉక్రోషం గా ఉంది. వచ్చిన చుట్టాలందరి ముందూ మొగుడు కిరీటి తనను నిరసనగా ఎక్కిరించటం జీర్ణించుకోలేక పోతోంది.
తన అన్నయ్యకు పెళ్ళి కుదిరింది. తమతో పాటే అన్నయ్య ఉండడంతో పెళ్ళివారు తమ ఇంటికే వచ్చి అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. ఆ తరువాత పెళ్ళి కూతురు చీరలు కొనటానికి అందరూ కలిసి షాపింగ్ కు వెళ్ళాలని అనుకుంటున్న సమయములో అందరి భోజనాలు అయ్యాయి,మరి నేను కూడా తిన్నాక బయలుదేరుదాము అంది కాంతి."ఆ నువ్వొక పూట తినకపోతే ఏమీ సన్నబడి పోవులే " అన్నాడు కాంతి మొగుడు ఎక్కిరింతగా.
వచ్చిన వారిలో ఉన్న పెళ్ళి కూతురూ ,ఆ అమ్మాయి స్నేహితురాలు కిసుక్కున నవ్వుకున్నారు.మరి వాళ్ళిద్దరూ కాస్త సన్నగా ఉన్నారు."మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు" అన్నట్టు కాంతి కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి.
పెళ్ళికి ముందు తను కూడా మెరుపు తీగలా ఉందనే కిరీటి కోరి వరించాడు.పెళ్ళయి ఆరేళ్ళు అయ్యాక ఇద్దరు పిల్లలు పుట్టాక తను కాస్త ఒళ్ళు చేసింది. పిల్లల పనులతో ఆపసోపాలు పడుతూ తన గురించి తను శ్రద్ధ పెట్టలేదు . ఆమాట కొస్తే తల్లి అయిన ప్రతివాళ్ళూ అంతో ఇంతో ఓళ్ళు చేయటం పెద్ద విడ్డూరం ఏమీ కాదు.అయినా చూసిన చుట్టాలంతా చక్కగా కళగల మొహముతో నిండు గా ఉన్నానంటారు తనని. ఇదుగో ఈయనే మొన్నీ మధ్య తన ఆడపడుచు వచ్చివెళ్ళిన దగ్గర్నుంచీ ఇలా తెగ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు తన మీద.
మొన్ననే తన ఆడపడుచు అమెరికా నుండి ఇండియా ట్రిప్ కు వచ్చింది .ఆ ట్రిప్పు లో తమ ఇంటికి కూడా వచ్చింది.పాపం అమెరికా లో ఉంది ఆంధ్రా వంటకాల కోసం జిహ్వ తహ తహ లాడుతూ ఉంటుందని నాలుగు రకాల వంటలతో మృష్టాన్నభోజనం పెట్టింది తను.
ఇహ ఆడపడుచు గారె తీసి గట్టిగా పిండి గారెల్లో ఇంత ఆయిలా? అంది,పూర్ణం బూరె కొరికి బూరెల్లో ఇంత బెల్లం వేసుకుంటారా? అంది...పులిహోరలో ఇంత పులుపా? చక్కెర పొంగలిలో ఇంత నెయ్యీ,చక్కెరా వేసుకుంటారా ?కాంతీ...ఇహ కూరలన్నీ ఇలా వేయిస్తారా అంటూ పెట్టని వంక పెట్టకుండా పెట్టి...అయినా కాంతీ మా పేరుచెప్పి నువ్వు తినేస్తున్నావేమో ఇంత లావయి పోయావు అనేసింది అని వూరుకోక ఓరేయ్ కిరీటీ ! నీ భార్య ఇలా పెరిగి పోతుంటే చూస్తూ ఊరుకుంటావేమిరా?మీ పెళ్ళప్పుడు ఇద్దరూ ఎంత బావున్నారు ? ఇలా రక రకాలు చేసుకుని తిని ,ఆ పిల్ల పెరిగిపోతోంది ..తరువాత వచ్చే రోగాలకు నీ ఇల్లు గుల్లవుతుందిరోయ్ ..నీకసలే డబ్బు విలువ బాగా తెలుసు,రోగాలకు అంతా ఖర్చుపెట్టేస్తావా ఏమిటీ? అంటూ చిన్న ఉపన్యాసం దంచింది. అంతే అప్పటినుండీ కిరీటి ,కాంతిని నిరసిస్తూనే ఉన్నాడు.
నాలుగు రోజుల తరువాత సందు చివర ఉన్న జిమ్ లో ఒక సంవత్సరానికి మెంబర్షిప్ కార్డ్ తెచ్చి కాంతి చేతికి ఇచ్చి ..ఇది పాతిక వేలు విలువ కలది...నువ్వు ఒక సంవత్సరములో మళ్ళీ మెరుపుతీగ అవ్వాలి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ..పర్సనల్ ట్రైనర్ తో సహా పెట్టాడు కిరీటి.
జిమ్ లొ వ్యాయామం చేస్తూ ,వాళ్ళు చెప్పిన డైటింగ్ చేస్తూ,పిల్లల పనులు కూడా చేయలేనంతగా నీరసించి పోయింది కాంతి.
ఒక నెల రోజులు గడిచాక ఒక రోజు కాంతి మొహం నిండా ఆనందం నింపుకుని "ఏమండోయ్ శ్రీ వారూ ! మా జిమ్ లో ఒక కొంటె కోణంగి ఉన్నాడు ,నాకు భలే ఫ్రెండ్ అయ్యాడు ,మీకెందుకు మేడం ఈ జిమ్‌లూ గిమ్‌లూ , బంగారు బొమ్మలా ఉన్నారని ఒకటే పొగడ్తలు, రోజూ నే వచ్చేదాకా ఉండి బాయ్ చెప్పి కానీ వెళ్ళడు తెలుసా అంటూ చెప్పింది కిరీటి తో...
అంతే కిరీటి గుండెలో గుండ్రాయి పడ్డ ఫీలింగ్ వచ్చేసింది...రెండు రోజుల తరువాత అదికాదోయ్ కాంతీ నాక్కూడా చిరుబొజ్జ వచ్చేస్తోంది నాకూ వ్యాయామం కావాలి అంటూ కిరీటి కూడా జిమ్ లో చేరాడు. కాంతి ఫ్రెండ్ చులాగ్గా ట్రెడ్మిల్ మీద నడుస్తూ కాంతి తో కబుర్లు చెప్తుంటే సదరు కిరీటి ఉడికిపోయాడు.
పైగా అతను ఉన్నవాడు ఉండక కాంతి గారి లాంటి చక్కని కుదురైన భార్య దొరికితే నేను జిమ్ ల చుట్టూ తిప్పనండీ ,కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను అంటూ కిరీటి దగ్గిర చెప్పాడు .అలాగే కాంతి కూడా అబ్భా ఆ అబ్బాయ్ ట్రెడ్ మిల్ మీద ఎంత స్పీడ్ గా నడుస్తాడో...దాదాపు మీ వయసే అయినా,బొజ్జా గిజ్జా లేకుండా ఎంత చక్కగా ఉంటాడొ కదా అంటూ ఆ స్నేహితుడిని పొగడటం మొదలెట్టింది కిరీటి దగ్గర.
ఈ గోలంతా భరించలేక కిరీటి నీకు జిమ్ వద్దూ ,ఏమీ వద్దు కాస్త బొద్దుగా ఉన్నావ్ అంతేగా ,అయినా నాకిలాగే నచ్చుతున్నావే కాంతీ! అంటూ రాజీ పడిపొయ్యాడు .అంతే కాక ఆడపడుచు అమెరికానుండి ఫోన్ చేసి కాంతిలావు తగ్గటం గురించి హెచ్చరిస్తే " అక్కా!కాంతి నాకు సన్నజాజి లా కన్నా బొండు మల్లె లా గే నచ్చుతోందే ఏమిటో ... కాంతి ఆరోగ్యానికి ఢోకా రానంతవరకూ అది బొండుమల్లె చెండులా ముద్దుగా ఉంటే నాకదే సంతోషం చెప్పి ఫోన్ పెట్టేశాడు..అంతే కాదు ఇంక ఎవ్వరి ముందూ కాంతి ని ఒక్క మాట కూడా ఎక్కిరింతగా అనకూడదని నిర్ణయించుకుని కాంతి కి క్షమార్పణలు చెప్పేశాడు..చక్కటి మల్లెపూల దండ కాంతి తలలో తురిమి మరీ....
కాంతి మొహం లో విజయ ధరహాసం...తనకు ఈ సలహా ఇచ్చిన తన అన్నయ్యకూ జిమ్ లో సహాయ పడిన తన అన్నయ్య స్నేహితునికీ మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది కాంతి.
ఇప్పుడు కిరీటికి ,కాంతి "లావొక్కింతయు లేదు ,అందము రెట్టింపై నిలిచె తనముందు "అన్నట్టుగా ఉంది.
(గమనిక: ఏ వయసు తో పాటు వచ్చే మార్పులను ఆ వయసులో హుందాగా స్వీకరించగలగాలి ..లేకపోతే కొన్ని కొన్ని ఇబ్బందులు తప్పవు సుమా అని చెప్పటమే ఈ కధ ముఖ్యోద్దేశం)
No comments:
Post a Comment