నవ్వుల పంట .... అల్లు - రావుల జంట.
- రచన : కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
నవ్వులరేడొకరు.. ఆగ్రహ సూరీడొకరు.. హాస్యపు జల్లొకరు వాచక రాజొకరు నవ్వుకు నవ్వు తెప్పించేదొకరు కథకే ఒణుకు పుట్టిస్తారొకరు... బయపడే వాడిని గిలిగింతలెట్టే కామెడియనొకరు నవ్వే వాడికి చెమటపట్టించే వికృత విలనొకరు నటనలోనే వారు జీవించేరంట.. నిర్మాతల వరమంట ఆ జంట.. వెండితెరపై వారిద్దరి జంట .. నోట నవ్వుల పంట .... అల్లూ,రావులనే వారే ఆ జంట నటులంట.. అలా మరెవరూ మహిలో లేరంట.. ఆ జంట ఇపుడు జీవించిలేరంట.. వారి పూసిన నవ్వులే నిత్య సుమాలంట. - కరణం జులై, ఆగస్టులలో వారి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..!!! అప్పం.. అప్పం.. బప్పం బప్పం.. ముత్యాలూ వత్తావా అంటూ వయ్యారంగా ఒళ్ళు వంకలు తిప్పుతూ నవ్వించే హాస్య శిఖరం అల్లూరామలింగయ్య..!
తెనాలి రామలింగడే మళ్ళా పుట్టాడా అనేంతటి స్థాయిలో హాస్యం పండించిన వ్యక్తి రామలింగయ్య. రామలింగడు రాతలో హాస్యం పూయిస్తే.. రామలింగయ్య నటనలో హాస్యం జల్లులు కురిపించారు.
" నీ తస్సరవల నాబొడ్డు.." " సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ!ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.... ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోసనుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది?" అనే డైలాగ్స్ వింటుంటె గుర్తొచ్చే నిండైన రూపం రావు గోపాలరావు ది. గాడ్ ఫాదర్ లేకుండ తనకంటూ ఒక మాడ్యులేషన్... తనదైన నటన.. విలనిజం .. తనదైన ఇమేజ్ తో ప్రేక్షకులను కట్టిపడేసిన నటులు.. రావుగోపాలరావు.
ఎన్నో చిత్రాలలో వీరిద్దరూ కలిసి నటించి ప్రేక్షకుల పొట్ట చెక్కలు చేసిన ఈ జంట నిర్మాతలకు బంగారు కాసులు కురిపించింది. ప్రేక్షకులనోట ముత్యాలు రాల్చింది. యముడికి .. చిత్రగుప్తుడిలా.. రావుగోపాలరావుకి ..అల్లూరామలింగయ్య అట్ల అన్నంత రీతిలో కలిసి మెలిసి నటించిన ఈ జంట నటులిద్దరి వర్ధంతి కొద్దిరోజుల తేడా కావడం గుర్తించాల్సిన విషయం.
అల్లురామలింగయ్య గురించి .. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో 1922 అక్టోబర్ 1న వెంకన్న, సత్తెమ్మల దంపతులకు అల్లు రామలింగయ్య జన్మించారు. చదువు పై ఆయనకు శ్రద్ధ లేదనే చెప్పాలి.. స్నేహితులతో కలిసి మిమిక్రీ చేస్తూ ఆటపట్టించడం ఆయనకు చిన్ననాట సరదా..! నాటకాలు విపరీతంగా చూసే అల్లు రామలింగయ్యకు నటనంటే మక్కువ ఎక్కువైంది. దీంతో నాటకాల వాళ్ళెవరైనా సరే.. స్నేహం చేయడం పాత్ర కోసం వాళ్ళని అడగడం . అనుకోకుండా ఒక రోజు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకండా వేసాడు. తనకున్న కాస్త నటనావగాహనతో తన వేషం మెప్పించాడు. అలా మొదలైనంది ఆల్లు నట జీవితం. అప్రతిహతంగా తన చివరి క్షణాల వరకూ కొనసాగింది. అల్లు గురించి ఇక్కడ మరొక ముఖ్య విషయం చెప్పుకోవాలి.. ఆరోజుల్లో గాంధీజీ పిలుపునందుకుని క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కి కూడా వెళ్ళారు అల్లు రామలింగయ్య. నాటకాలలో అల్లు రామలింగయ్య నటనను చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952 లో పుట్టిల్లు చిత్రంలో శాస్త్రి తరహ పాత్రను అల్లుచే వేయించాడు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి ' వద్దంటే డబ్బు ' లో అల్లుకు అవకాశం ఇచ్చారు. సినిమా చాన్సులు వస్తుండటంతో రామలింగయ్య తనతన భార్య కనకరత్నం , పిల్లలు అరవింద్ (నిర్మాతగా స్థిర పడ్డారు), నవభారతి, వసంత లక్ష్మి, సురేఖ (ఈవిడ నటుడు చిరంజీవి భార్య), లతో మదరాసుకు మకాం మార్చాడు. అల్లు తన కుటుంబాన్ని పోషించేందుకు చాలా కష్టాలు పడ్డారు. హొమియో వైద్యం నేర్చుకున్న అల్లు ఏమాత్రం తీరిక దొరికినా ఉచితవైద్యలందించేవారు. అల్లు హాస్యపు జల్లునేకాదు కామెడీ విలనిజాన్ని కూడా చక్కగా రక్తికట్టించారు.. అల్లు రామలింగయ్య నటించిన చిత్రాలలో ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గవి మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్,ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం మొదలైనవి వున్నాయి. ముత్యాలముగ్గు సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన కుమారుడు ఆకస్మికంగా మరణించినా బాధను మనసులో అణుచుకుని షూటింగ్ లో పాల్గొన్న గొప్ప నటుడు అల్లు.1116 చిత్రాలలో నటించాలనే వారి కోరిక తీరకుండానే1030 చిత్రాల అనంతరం పరమపదించారాయన. సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసాడు. ' మనుషులంతా ఒక్కటే ' చిత్రంలో 'ముత్యాలు వస్తావా అడిగిందీ ఇస్తావా అనే పాట అప్పట్లో పెద్ద హిట్.
నిర్మాతగా అల్లు : అల్లు రామలింగయ్య నిర్మాతగా గీతా ఆర్ట్స్ బానర్ ని నెలకొల్పి ' బంట్రోతు భార్య ' దేవుడే దిగివస్తే , బంగారు పతకం చిత్రాలను నిర్మించాడు. చాలాకాలం తర్వాత అల్లు 90 దశకంలో ' డబ్భు భలే జబ్బు ' చిత్రం తీసాడు. రేలంగి, రమణారెడ్డి, కుటుంబరావు, బాలకృష్ణ వంటివారి కాలంతో మొదలు ఈతరం హాస్యనటులు వరకూ కొనసాగిన ఏకైక హాస్యనటుడు అల్లునే. ' అవార్డులు రివార్డులు : అలుపెరగక అర్ధశతాబ్ధకాలం పటు ప్రేక్షకులను నవ్వించిన నవ్వుల రారాజు.. తొలి నాటి కమెడియన్ల నుంచి నేటి తరం కామెడియన్లందరితో కలిసి నటించిన ఏకైక హాస్య నటుడు అల్లు సేవలు గుర్తించిన భారత ప్రభుత్వం 1990 లో ' పద్మశ్రీ ' అవార్డు తో గౌరవించింది. రేలంగి తరువాత ' పద్మశ్రీ' అందుకున్న హాస్యనటుడు అల్లునే. తన విశేష ప్రతిభతో అనేకానేక పాత్రలలో జీవించిన అల్లు తెలుగు ప్రేక్షకుల కళ్ళను తడిచేస్తూ... 2004 జులై 30 న హైద్రాబద్ లో కన్నుముశారు. సినీకళామతల్లి సైతం కన్నీరు మున్నీరైయ్యేంతగా ఆ తల్లి చరణాలకు సేవ చేసిన నటుడు అల్లు రామలింగయ్య.
ఇక రావు గోపాలరావు సంగతి గమనిస్తే.. రావు గోపాలరావు సంక్రాంతి పండుగ రోజున 1937లో కాకినాడ దగ్గరి గంగన పల్లి జన్మించారు. రావు గోప్పాలరావు నటాకరంగం పై తన నట జీవితాన్ని ప్రారంభించారు. స్వంత నాటక కంపెనీ, అస్దోసియేటెడ్ అమెచ్యూర్ ద్రామా కంపెనీ స్థాపించి ఎన్నో నాటకాలాడారు. ఎస్ వి రంగారావు గారు రావు గోపాలరావు నటన చూసి మెచ్చి , 1966 లో భక్త పోతన చిత్రం తీస్తున్న గుత్తా రామినీడుకు రావు గోపాలరావుని పరిచయం చేశారు. ఆ సినిమా తో పాటు , బంగారు సంకెళ్ళు, మూగ ప్రేమ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అనంతరం హీరో కృష్ణ నటించిన జగత్ కిలాడీలులో ప్రతి నాయకుడి పాత్ర ను పోషించిన రావు తిరిగిచూడలేదు. బాపు దర్శకత్వంలోని ముత్యాల ముగ్గు విడుదల తొ రావు గోపాలరావు దశ తిరిగింది. కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో ఆయన నట జీవితం గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు. వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు జనం హృదయాలను మరోసారి కొల్లగొట్టుకున్నారు. గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులో వున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. తన రావు గోపాలరావు చిత్రంలో పరకాయప్రవేశం పై ప్రయోగాలు చేసే ప్రొఫెసర్ పాత్రలా గా తాను నటించే టప్పుడు ఆ పాత్రలో పరకాయం చేయడం గోపాలరావు స్టైల్.రావు గోపాలరావు మరియు చిరంజీవి కలయికలో ఎక్కువ చిత్రాలు వఛ్ఛాయి. అవార్డులు రివార్డులు: గోపాలరావు కళా సేవను గుర్తించి, 1990 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) ప్రదానం చేసింది. ఈయన కుమారుని పేరు రావు రమేశ్. ఇతను కూడా మంచి నటుడుగా పేరు తెఛ్ఛుకున్నాడు.మగధీర, కొత్త బంగారు లోకం, గమ్యం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. కళా సంస్థలు నట విరాట్ బిరుదును ప్రధానం చేశాయి. 1987 లో నాగయ్య అవార్డ్ ను గోపాల్రావు గెలుచుకున్నారు. 1982 లో తెలుగుదేశం పార్టీలో చేరి ఆంధ్ర ప్రదేశ్ విధాన సభ సభ్యులుగా 1984 -85 మధ్య సేవలందించారు.1986 ఏప్రిల్ 3 నుంచి రాజ్యసభ సభ్యునిగా 1992 ఏప్రిల్ 2 వరకు పనిచేశారు. 1966 నుంచి సినీ కళామ తల్లికి అంతకు ముందు నుంచే నాటకకళకు నిర్విరామ సేవలందించిన రావుగోపాలరావు తన 57 వ ఏట ఆగస్టు 18 1994 న పరమపదించారు.
జంట నటులు .. జంటకవులు మనకు తెలుసు.. అదే స్థాయిలో జంట నటనతో మెప్పించి .. ప్రేక్షకులను కట్టి పడేసే మహత్తర హాస్యాన్ని రక్తి కట్ట్టించిన జంట అల్లు - రావు లది. ఒకరు హాస్య విలను.. మరొకరు హాస్య వైద్యుడు.. వెరసి ప్రేక్షకుని నోట ముత్యాల పంట పండేది... " చూడు కైలాసం .. ఈ ఊరు మొత్తనికి మన ఇద్దరమే మొగుళ్ళం.. ఈ ఊరిని నంజుకున్నా.. , పంచుకున్నా..? నమిలినా, మింగినా, ఊసేసినా మన ఇద్దరమే చేయాలి. తప్ప.... మూడో వాడు మన మధ్యకి రాకుడదు.. ఓకె" అని రావు గోపాలరావు అన్నట్లు.. ఈ సినిమా ఊరిని ఈళ్ళిద్దరే పంచుకున్నారు.. నంజుకున్నారు.. హాస్య ప్రహేళికతో ఉర్రూతలూగించారు.. మూడో వాడికి అవకాశం ఇవ్వలన్న ధ్యాస నిర్మాతలకు పుట్టకుండా నటించారు.. కాదు కాదు జీవించారు.. నటనని జుర్రేసుకున్నారు.. నంజేసుకున్నారు. అలా కొన్నేళ్ల పాటు వీరి జంట ఉంటే బొమ్మ వందరోజులు పరిగెత్తినట్టే అన్న సెంటిమెంటూ సాగింది. రావు గోపాలరావు పూర్తి ఆగ్రహం తో.. రౌద్ర రూపంతో ప్రతినాయకుడిగా భయకంపితులని చేస్తుంటే.. హాస్య విలనుగా సెటైర్ లతో ఆ సీన్ లో ప్రేక్షకుడికి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి హాస్య చతురత కూడిన డైలాగ్స్ తో రక్తి కట్టించడం అల్లూ పని.. ఇక ఇద్దరూ ఉంటే ఆ సీన్ ఆద్యంతం పండిపోతుంది. అల్లు : చిత్తం.. దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డను.... తమరు కసురుకోనంతే ఒక ముక్క విసురుతానండయ్య.. రావు : కసురుకోను .. విసురు అల్లు : కాలు కాలిన పిల్లిలా మీరలా ఎందుకు తిరుగుతున్నారో అర్ధం కావటం లేదండయ్యా..! రావు : శాం..భ.. వి విడుదలైందయ్యా..! అల్లు : అయితే మనకేం పోద్ది నాటెంకి..? రావు : నీకేమీ పోదు.. అది నా మీద పగబట్టిందయ్యా .. రేయ్ ఉత్తరం.. దక్షిణం.. తూర్పు పడమర.. అన్ని దిక్కులు కాపలా కాయండి.. ఏ దిక్కున శాంభవి కనిపించినా ముక్కలు ముక్కలుగా నరికేయండి. అల్లు : ఇకవేళ పై నుంచి ఏమైనా దిగితేనండీ..?? రావు : భయపెట్టేమాటలు అన్నవంటే కపాలం కుక్కలకేస్తారా నక్క.. అల్లు : ఈ పాటికే లోన కొచ్చిందేమో ఈపాలి చూడరూ.. ఇలా ఆగ్రహంతో ఊగుపోతున్న రావు ను చిరాకు పుట్టేలా సెటైర్లు వేసి ప్రేక్షకులకు నవ్వు పుట్టించే వారు అల్లు.
నవ్వుల పూవులు పూయించిన హాస్య జంటలలో ఒక్కటిగా ప్రసిద్ధి పొందింది.. తరువాత కాలానికి అదే తరహా బాట వేసినదీ అదే జంట. ఎన్.టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి తొలితరం కథానాయకులతో పాటు చిరంజీవి వంటి అగ్రహీరోలందరి తో తమ హాస్యాన్ని.. రౌద్రాన్ని పండించి మెప్పీంచిన ఘనులు వీరిద్దరు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఈస్ట్ మన్ కల్ర్ మీదుగా రంగుల వెండి తెర వరకూ తమ నటనను పంచిన నటాగ్రజులు వీరిద్దరు. వయసులో వీరిద్దరికీ మధ్య పదిహేనేళ్ళ తేడా వున్నప్పటికీ.. రూపం దృష్ట్యా.. వాచకం దృష్ట్యా రావు గోపాలరావే పెద్దవానిగా.. లేదా.. యజమానిగా, నాయకుడిగా నటించారు. అయితే నటనే తన ప్రాణం అనే అల్లు తనకిచ్చిన పాత్రకు హస్య తళుకులద్ది న్యాయం చేసేవారు. వీరిద్దరూ పోటాపోటీ నటనతో ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయేవారు.. 90వ దశకంలోనే.. వీరి కాంబినేషన్ ఒక సెన్సెషన్.. వీరిద్దరూ జంట నటులుగా అత్యధికంగా చిరంజీవి కథానయకునిగా వరుస చిత్రాలు వచ్చాయి. 'దొంగమొగుడు ' , గూండా., రాజావిక్రమార్క, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, గాంగ్ లీడర్ అవంటి చిత్రాలన్నీ సూపర్ హిట్ అవ్వడం తో వీరి జంటకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలాంటి జంట ఇప్పుడు లేకపోయినా..వెండితెరపై నిత్యం ఎక్కడో ఒకచోట కనిపిస్తుండటంతో వారు లేరన్న భావన నేటి ప్రేక్షకులలో ఏ ఒక్కరికీ కలగదంటే అతిశయోక్తి కాదేమో..! వీరి అరుదైన కాంబినేషన్ లో ని మరికొన్ని వీడియో క్లిప్ లు...
No comments:
Post a Comment