దాశరధి సినీ గీత -3 - అచ్చంగా తెలుగు

దాశరధి సినీ గీత -3

Share This
 

దాశరధి సినీ గీత -3

- మామిడి హరికృష్ణ

  'ష 'అక్షరాన్ని పునరుక్తి గా వాడి పదాల గారడీ చేసారు. అలాగే అదే పాటలో ... " మేనాలోన ప్రియుని చేరవెళ్ళింది నా చెలిమీనా నింగి దాటి ఆనంద సాగరం-పొంగి పొరలె నా లోన " అని మీనా మేనా లోన అని గమ్మత్తయిన ధ్వని ప్రయోగాలను చేసి పదాల కూర్పులోనే ఒక లయని కూర్చారు దాశరధి.ఈ తరహ ప్రయోగం ఆనాటి యువతకు ఎంతగానో నచ్చింది. ఇక,దాశరధి కుటుంబ విలువలకి ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చే మనసున్న మానవుడు.అందుకే ఆయన గీతం కథ లాంటి పాటగా మారింది.చిన్న పిల్లడికి చెప్పే ' అనగనగా కథ 'లాగా అన్నదమ్ముల అనుబంధం లోని మార్పులను,కలలు కల్లలైన దృశ్యన్ని దాశరధి పాట తేటతెల్లం చేసింది. కలతలు లేని పండంటి కాపురం తీరు తెన్నులను వివరించినంది. 'ఒక్క మాటపై ఎపుడూ నిలిచారు వారు ఒక్క బాటపై కలిసి నడిచారు వారు అన్నంటే తమ్ములకు అనురాగమే అన్నకు తమ్ములంటే అనుబంధమే ' అని కుటుంబం లోని అన్నదమ్ముల మధ్య ఉండాల్సిన సంబంధ-బాంధవ్యాలను వివరించారు. 'ఒక్క మాట-ఒక్క బాట-అనురాగం-అనుబంధం 'మనుషులలోని ఐక్యతను పెంచే లక్షణాలుగా ఆయన నిర్ధారించారు.(పండంటి కాపురం-1972). దాశరధి బాల్యం అంతా ఖమ్మం జిల్లా మధిర లోనె గడిచింది.ఆయనకు బాల్యం నుండే శ్లోకాలన్నా,పద్యలన్నా,వల్లమాలిన ప్రేమ ఉండేది. భగవద్గీత లోని సంస్కృత శ్లోకాలన్నింటిని చిన్నప్పుడే  కంఠతా పట్టిన దాశరధి,వాటి స్పూర్తితో స్వయం పద్యాలను ఆశువు గాను,అలవోకగాను అల్లేవాడట. ఆయనలోని ఆ 'కైకట్టే తనమే ‘ ఆ తర్వాత కావ్య రచనల్లో ,సినీ పాటల సృజన లోనూ కనిపించింది.ఆ సాహితీ ప్రజ్ఞ అలతి అలతి పదాలతో గీతాలను రచించే శక్తి దాల్చింది .అయితే ప్రతి కవి ఒక మాతృమూర్తే, ఓ స్త్రీ మూర్తే. కవి మేధస్సు లోనుంచి జనించే "చిన్ని చిన్ని కన్నయ్యలు"!అందుకే మాతృత్రపు లక్షణాలు ప్రతి కవిలో కనిపిస్తాయి. ఆ కవి పాటలో ప్రతిఫలిస్తాయి. దాశరధి గీతాలలో కూడా ఇవి ప్రస్పుటించాయి. " చిన్ని చిన్ని కన్నయ్య-కన్నులలో నీవయ్య నిన్ను చూసి మురిసేను-నేను మేను మరిచేను ఎత్తుకుని ముద్దడి-ఉయ్యాలలూపేను జోలి పాట పాడేను-లాలి పాట పాడేను." అని కవికి-కవితకీ మధ్య మాతృపుత్రుల సంబంధం ఉంటుందని, అన్యోపదేశంగా వివరించారు.(భద్రకాళి-1976.)   దాశరధి కవితా ప్రతిభ అనన్యసామాన్యమైంది. దానికి యావత్ సాహితీజగత్తు నీరాజనాలర్పించింది.ఆయన రాసిన కవితా పుష్పకం (1960)కావ్యం రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డుని గెల్చుకుంది. కాగా ఆయన రాసిన "తిమిరంతో సమరం(1973)" కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని గెల్చుకుంది.ఈ అవార్డులు దాశరధి కవిత్వానికి అందిన ప్రేమలేఖలే అని చెప్పాలి. వాటికి స్పందించిన దాశరధి-- "రాసాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్నీ నీలో భువిలోన మల్లికలాయె దివిలోన తారకలాయె నీ నవ్వులే" అని కవితా సరస్వతికి ప్రత్యుత్తరమిచ్చారు. "అందాల పయ్యెద నేనై ఆటాడనా కురులందు కుసుమం నేనై చెలరేగనా నీ చేతుల వేణువు నేనై పాట పాడునా నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా" అని తానే కవిత్వంగా రూపొందించారు.(శ్రీదేవి-1970) విశ్వమంతా ప్రేమమయం, ప్రేమ భావన సార్వజనీనం. అందుకే ప్రపంచంలో సాహిత్యమంతటా ప్రేమ భిన్న-విభిన్న రూపాలలో దర్శనమిచ్చింది. ఈ ప్రేమ భావనని నిర్మల శృంగారభరితంగా తీర్చిదిద్దడంలో దాశరధి చూపిన ప్రజ్ఞ అజరామరం. స్త్రీ-పురుషుల మధ్య ప్రేమ కళ్ళతో మొదలవుతుందనీది పూల వానంత రసరమ్యం గా ఉంటుందని దాశరధి పాట వెల్లడించింది. "పెరిగి తరిగెను నెలరాజు వెలుగును నీ మోము ప్రతిరోజు ప్రతిరేయి పున్నమిలె నీతో ఉంటే"అని ప్రకృతిని ఆలంబనగా చేసుకుని మూడు లైన్లలో ప్రేమ భావనను సునిశితంగా వివరించారు. మొదటి వరుసలో ప్రకృతి ధర్మాన్ని వివరించి,రెండో వరుసలో స్త్రీ స్వభావాన్ని వర్ణించి, మూడో వరుసలోకి వచ్చేసరికి స్త్రీకి ప్రకృతి ధర్మాన్ని ఆపాదించి ఆమె సమక్షం తనకు నిత్య పున్నమి అనే భావనని అందంగా ఊహించాడు.(నోము-1974) దాశరధిది సాంప్రదాయ కుటుంబం. సనాతన ఆచారాలకు నిలయం. దీనివల్ల ఆయనలో భక్తి భావన,ఈశ్వరాధన కూడా పాదుకుంది. అదే సమయంలో మనిషి కష్టాలకు కారణం అవుతున్న సాంప్రదాయాలు-కట్టుబాట్ల మీద ధిక్కారధొరణి, తిరుగుబాటు వైఖరి కూడా ఆయనలో మొదలైంది. ఈ సంఘర్షణలో నుండి ఆయనకు దేవుడనే భావన లో కొత్త కోణం కనపడింది. అందుకే ఆయన తన పాటల్లో దేవుడిని రారమ్మని పిలిచాడు. దీనులను కాపాడడానికి కృష్ణుడు మాత్రమే తగిన వాడని భావించాడు. ఏ యుగానికైనా,ఏ తరానికైనా దేవుడు మరలా జన్మిస్తే కాని ప్రజల కష్టాలు తీరవని నమ్మాడు. ""రారా కృష్ణయ్యా...రారా కృష్ణయ్యా.. దీనులను కాపాడ రారా కృష్ణయ్యా"" అంటూ దేవుడి అవసరాన్ని చెప్తూ ఆర్ద్రంగా ఆహ్వనించాడు.(రాము-1976). ఇక దాశరధి సృజన భక్తిగీతాల రచనలో కూడా తనదైన శైలి లో పల్లవించింది.తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి పై ఆయన రాసిన సినీగీతాలు నేటికీ,ఏనాటికీ భక్తి భావనలతో పొంగిపోతూ అక్షరాలలో అర్చననూ,పదాలలోనే  శ్రీవారి పాదసేవను స్ఫురించాయి. "నడిరేయి ఏ జాములోనో” తిరుమల మందిర సుందరుడు దిగి వచ్చేనురా అను ఆయన పాటలు భక్తికి బాటలు వేసాయి. "మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ పతిదేవ ఒడిలోన మురిసేటి వేళ స్వామి చిరునవ్వున వెన్నెలలు కురిసేటి వేళ విభునికి మా మాట వినిపించవమ్మా.." అని నవ విధ భక్తి మార్గాలలో నివేదనకు దాశరధి పాట కొత్త మార్గాన్ని చూపించింది.(రంగులరాట్నం-1966).   అలాగే "పాల కడలిలో శేషశయ్య పై పవళించిన శ్రీపతివో వెండి కొండపై నిండు మనసుతో వెలిగే గౌరీ పతివో ముగ్గురమ్మలకీ మూలపుటమ్మగా భువిలో వెలసిన ఆదిశక్తివో"అని తిరుమల మందిర సుందరునిలోనే  సమస్త దేవతలను చూసే భక్తి పారవశ్యాన్ని దాశరధి పాట కళ్ళకు కట్టించింది. దేవదేవుని "సుమధుర కరుణాసాగరుని"గా కీర్తించింది.(మెనకోడలు-1972). నవరసాలలో గుండెని తడి చేసే శక్తి శోక రసానిదే.!పాటలలో శోక తప్తమైనవే విషాద గీతాలు.ఈ విషాద గీతాలలో సైతం దాశరధి తనదైన ప్రత్యేక బాణీని వినిపించారు. మనిషిలోని దు:ఖ భావనకి ప్రకృతి పరిణామాలతో ముడిపెట్టి ఆయన రాసిన పాటలు అలాంటివే. ఆయన పాట విడిపోయిన మల్లె తీగ లోని సుగంధ రాహిత్యాన్ని ,తీగ తెగిన వీణా పాడేపాటలోని నైరాశ్యాన్ని హృద్యంగా అక్షరీకరించింది.   " మనసులోని మమతలన్నీ మాడిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన" అని మనిషిలోని ఆవేదనకు మూలం మమతలు లుప్తం కావడమే, అవే 'కార్యకారణ ' (Carese and effect) సంబంధాన్ని  దాశరధి గీతం బైటపెట్టింది. అంతటితో ఆగక, ఆ ఆవేదన తీవ్రత, దాని తాలూకు పర్యవసానాన్ని "నిప్పురగిలి రేగు జ్వాల నీళ్ళ వలన ఆగును నీళ్ళలోనే జ్వాల రేగ మంట ఎటుల ఆగును" అనే మీమాంశాత్మకత లేవనెత్తింది. పరిష్కారమే సమస్యగా మారిన విరోధభావనని దాశరధి తన పాటలో ఆవిష్కరించారు. (పూజ- 1979)   అణువులో వుండే శక్తి ఐన్ స్టీన్ కి తెలుసు, అక్షరంలో వుండే శక్తి దాశరధికి తెలుసు. పరమాణూవులో ఉండే సామర్ధ్యం ఓట్టోహాన్ కు తెలుసు, పదానికుండే పవర్ దాశరధికి తెలుసు, పద్యాన్ని పదునైన ఆయుధంగా, గేయాన్ని గన్ లా మలచడంలో దాశరధి సిద్ధ హస్తుడు. అవే గేయాలతో గాయపడ్డ హృదయాలకు స్వాంతన చేర్చుకోవడం లో కూడా ఆయన అంతే  సిద్ధహస్తుడు.. "ఉత్తేజం- ఉద్వేగం-ఉద్యమం" అనే త్రినేత్రాలలో జీవనం సాగించిన, దాశరధి నిత్యసానుకూల దృక్పధికుడు. అందుకే నిరాశపహరుల గుండేలని, సైతం, తన పాటలతో ఓదార్చగలిగాడు.   " ఆశ నిరాశలు దాగుడుమూతల ఆటేలే ఈ లోకం కష్టసుఖాల కలయికలోన ఉన్నదిలే మాధుర్యం- జీవిత మాధుర్యం " అని జీవిత సత్యాన్ని చెపుతూ, ఇదంతా సహజమే తప్ప అసహజమో, అసాధారణమో కాదనే వాస్తవాన్నివివరించి, " నీ హృదిలోని వేదనలన్ని నిలవవులే కలకాలం వాడిన మోడు పూయకమానదు వచ్చును వసంత కాలం" అని (ఆరాధన-1976) ఆశావాద దృక్పదాన్ని నింపుతాడు. మనిషి అంతరంగ మస్తిష్కంలో జరిగే అంతర్మదనానికి, ప్రకృతిలో జరిగే సహజ పరిణామాలకే సామ్యత (similarity) ని చూపించి, పామరులను, శ్రోతలను, ప్రజలను నమ్మించి జీవితం మీద ఆశను చిగురింపజేయడం దాశరధి పాటలలోని, ప్రయోజకత్వం అని అర్ధమౌతుంది.   కవిగా , అనువాదకుడిగా, బహుభాషా విద్వాంసుడిగా, ఉద్యమకారుడిగా, ఉపాధ్యాయుడిగా, ప్రభుత్వ ఆస్థాన కవిగా, ఎన్నెన్నో పాత్రలను పోషించి, తెలంగాణా ప్రజా ఉద్యమానికి కవితాస్త్రాలను అందించి, జీవితంలో , అన్ని పార్శ్వాలను అనుభవించిన, దార్శనికుడు, - దాశరధి. అందుకే ఆయన రాసిన దాదాపూ 2000 పై చిలుకు సినీ గీతాలలో ఆయన జీవన రేఖలు జలతారు దీపాలలాగా దోగాడుతూ కనిపిస్తాయి.   జీవితానుభవాలలోంచి, జీవితదర్శనంలోంచి, వచ్చిన గీతాలు కావడం వల్ల వాటికి సార్ధకత వచ్చి, వాటిని విని, చదివిన పాఠకులు, శ్రోతలను, సైతం, ఆ జీవనానుభవాలను, తమ జీవితాలతో ఆధ్యాత్మీకరణం (Identify)  చెందే అవకాశాలు ఏర్పడ్డాయి.  అవన్నీ ప్రజల హృదయాలతో, వారి భావాల సమూహాలతో , వారి ఆలోచనా వ్యూహాలతో, మమేకం అయ్యాయి.   మొత్తం మీద, దాశరధి, సినీ సాహిత్య క్షేత్రాన్ని అంతా కలియ తిరిగి, కలదిరిగి, సంచరించిన తర్వాత నాకు అనిపించిందేమిటంటే,   " మనందరం అర్జునులం దాశరధి ఒక్కడే గీతాచార్యుడు"!!     -------------x--------------          

No comments:

Post a Comment

Pages