భైరవ కోన-6 (జానపద నవల ) - అచ్చంగా తెలుగు

భైరవ కోన-6 (జానపద నవల )

Share This

భైరవ కోన-6  (జానపద నవల )

-      భావరాజు పద్మిని

(జరిగిన కధ: సదానందమహర్షి గురుకులంలో శిక్షణ పూర్తి చేస్తాడు భైరవపురం రాకుమారుడు విజయుడు. భైరవారాధన విశిష్టతను తెలుసుకుని, గుహ్యమైన గుహలోని భైరవ-భైరవి శక్తుల కృపను పొందడానికి వెళ్తున్న విజయుడిని అడ్డగిస్తాడు కరాళ మాంత్రికుడు. అతడిని జయించి, భైరవ కృపతో ఒక దివ్య ఖడ్గం, వశీకరణ శక్తి  పొందుతాడు విజయుడు. ఆశ్రమానికి తిరిగి వెళ్ళే త్రోవలో ఒక కోమలిని చిరుతపులి నుంచి రక్షించి, ఆమె ఎవరో తెలీకుండానే ఆమెతో ప్రేమలో పడతాడు విజయుడు. ఆమె కూడా అదే భావానికి గురౌతుంది... ఆమె కుంతల దేశపు రాకుమారి ప్రియంవద అని, ఆమెను తీసుకువెళ్లేందుకు వచ్చిన చెలుల ద్వారా తెలుసుకుంటాడు విజయుడు. విజయుడికి కరాళుడి గురించి చెప్పి, ఇక రాజ్యానికి తిరిగి వెళ్ళమని అనుమతిస్తూ,కర్తవ్య బోధ చేస్తారు మహర్షి.)

****************

అది ఎత్తైన కొండ మీద ఉన్న ఒక సుందరమైన భవంతి. ఆ భవంతి రాజగురువు ‘ప్రజ్ఞాశర్మ’ ది. అక్కడ యెర్రని వస్త్రాలలో, నుదుట త్రిపుండం ధరించి,  ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తోంది రాకుమారి చిత్రలేఖ. ఆమె అర్ధనిమీలిత నేత్రాలు అరవిచ్చిన కలువల్ని తలపిస్తున్నాయి. పద్మం వంటి ఆమె ముఖం నుంచీ జాలువారే నల్లని కురులు, పద్మంపై వాలిన తుమ్మెదల గుంపును తలపిస్తున్నాయి. ఆమె కేవలం రుద్రాక్షలను ఆభరణాలుగా ధరించింది. ఆమె వదనంలో దివ్య వర్చస్సు ప్రస్ఫుటం అవుతోంది. ఆమెను చూసిన వారు ఎవరికైనా, వెంటనే అమ్మవారు స్ఫురణకు వస్తుంది. ఆమె ముందున్న హోమగుండం గత 30 రోజులుగా వెలుగుతూనే ఉంది. ఆమె రాజగురువు ఆదేశానుసారం మండల దీక్షలో ఉంది. ఆమె జాతకరీత్యా రాబోయే విపత్తును ఎదుర్కునేందుకు ఆమె చేత “ మహా చండీ హోమం “ చేయించసాగారు రాజగురువు. ఆయన ఆమెను గత నెల రోజులుగా గమనిస్తూనే ఉన్నారు. మణిమయమైన ఆభరణాలు ధరించే ఆమె, ఇప్పుడు కేవలం రుద్రాక్షలు ధరిస్తోంది, పట్టుపీతాంబరాలను వర్జించి, నార చీరలను ధరిస్తోంది, హంసతూలికా తల్పం పై పవళించే ఆమె, కటిక నేలపై శయనిస్తోంది. అతి సుకుమారమైన రాకుమారికి తన వారి కోసం, తన దేశ క్షేమం కోసం, ఎంతటి ఓర్పు, గుండె నిబ్బరం. అవును, రాజసం ఆమె రక్తంలోనే ఉంది కదా ! మంత్రజపం పూర్తి కావడంతో నెమ్మదిగా కన్నులు తెరచి, తన వంక ఆశ్చర్యంగా చూస్తున్న రాజగురువును గమనించి, ఆయన వద్దకు వెళ్లి పాదాభివందనం చేసింది చిత్రలేఖ ! “సుఖీభవ ! ఇష్టకామ్యార్ధ సిద్ధిరస్తు ! శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు !”అంటూ ఆమెను మనసారా దీవించారు రాజగురువు. “ గురువర్యా ! మీరు నాకు పితృ సమానులు. చిన్నతనం నుంచి మీ వద్ద ఉన్న చనువు వల్ల నా మనసులో కలిగే సందేహాలను మీ ముందు వెలిబుచ్చుతున్నాను. ఈ ‘మహా చండీ యాగం’ ప్రాముఖ్యత ఏమిటి ? ‘నుదుటి రాత చెరగదు...’ అంటారు కదా ! అటువంటప్పుడు ఈ హోమాలు, జపాలు, దీక్షలు ఎందుకు ? దయచేసి తెలియచెయ్యగలరు ...” తన దర్భాసనంపై ఆసీనులయ్యి, దయాదృక్కులతో చూస్తూ, రాకుమారిని ఎదురుగా కూర్చోమని సైగ చేసి, ఇలా చెప్పసాగారు ఆయన... “శ్రీ చక్ర సంచారిణి యైన జగన్మాత జగత్తునంతయు పోషించుచూ చరాచర సృష్టికి మూల కారణమై అంతటా వ్యాపించి సర్వ ప్రాణులలో శక్తి స్వరూపం లో చిచ్ఛక్తి అయి, చైతన్యమై, పర బ్రహ్మ స్వరూపమై ప్రకాశిస్తూ వున్నది. ఆది తత్త్వమును స్త్రీ మూర్తిగా భావించి చేయు ఉపాసనల్లో చండీ ఉపాసన ఒకటి. గుణ త్రయములకు ప్రతీక అయిన మహాకాళీ, మహాలక్ష్మీ, మహాసరస్వతీ రూప కలయక  చండీ. జగన్మాత సాత్విక రూపం లలిత అయితే, తామస రూపం చండీ. "చండీసమదైవం నాస్తి" అన్ని పురాణాలు చెపుతున్నాయి. సమాజాన్ని దుష్టశక్తులు, ఆరోగ్య రుగ్మతలు, ఆర్థిక నష్టం తదితర సమస్యల నుంచి కాపాండేందుకు సర్వశక్తి స్వరూపిణి అయిన చండీ దేవిని ప్రసన్నార్థం చండీయాగం తలపెట్టడం హైందవ సనాతన ధర్మంలో అనాదిగా వస్తున్న ఆచారం. చండీహోమము అనగా దుర్గా సప్తశతి అనే 700 శ్లోకాలచే హోమము చేయడము. ఇందు 700 శ్లోకమలు 3 చరిత్రలుగా విభజించి ఉన్నాయి. అమ్మవారి ప్రీతిపాత్రమైన పౌర్ణమి తిధియందు త్రిదేవిసహీత, త్రిశక్తి అయిన చండిపరాదేవతను ఆరాధించి చండిహోమము ఎవరైతే జరిపించుకుంటారో ఆ కుటుంబమంతా శత్రుభీతిపోవటంతోపాటు, పుత్ర పౌత్రాదులతో సుఖముగా జీవిస్తారని శ్రీ దేవి భాగవతమందు చెప్పబడినది.  ఈ యాగానికి అనుబంధంగా గణపతి హోమము,నవగ్రహ హోమములాంటి యాగాలు అనుసంధిస్తారు. యాగ సమయం లో అమ్మకు ప్రీతి పాత్రంగా పూజలు,నివేదనులు ,ఆహుతులు జరుపుతారు.  తల్లి కరుణవల్ల సమస్త దుష్కర్మలు నశించి,జయము సంపదలు,శుభాలు ప్రాప్తిస్తాయి. అందుకే నీచేత ఈ యాగం చేయించాలని సంకల్పించాను. చేసిన కర్మలే ఫలాలను ఇస్తున్నాయి. కర్మఫలం తప్పనప్పుడు ఇంకా ఈ జపాలు, హోమాలు ఎందుకు అని నీ రెండవ సందేహం కదూ... నీకు సులువుగా అర్ధమయ్యేలా చెప్తాను. మండుటెండలో మనం నడిచేటప్పుడు పాదరక్షలు ధరిస్తాము, వానలో గొడుగును వేసుకుంటాము. అంటే... ఎండ, వాన మనం అనుభవించాల్సిన కర్మలే అయినా, వాటి తీవ్రతను,ప్రభావాన్ని ఆయా వస్తువుల వాడకం ద్వారా తగ్గిస్తున్నాం. అలాగే మనకు రాబోయే కష్టాల తీవ్రతను తగ్గించేందుకు, ప్రాణ గండాలు తప్పించేందుకు, ఈ జపాలు, హోమాలు అన్నీ గురువుల, మునుల ద్వారా నిర్దేశింపబడ్డాయి. కష్టకాలం గడిస్తే, ఆ వ్యక్తి సుఖజీవనం గడుపుతాడు, సమాజానికి ఉపయోగపడతాడు. అందుకే దయామయులైన ఋషులు మనకు కర్మలకు ప్రాయశ్చితంగా ఇటువంటి పరిహారాలను చెప్పారు. చండీ మాత రక్ష ఒక కవచంలా నిన్ను కష్టకాలంలో ఆదుకుంటుంది తల్లీ. అవగతమయ్యిందా ? ఇక నీ సందేహాలు వీడి, పూర్ణ విశ్వాసంతో, భక్తితో నీ దీక్షను పూర్తి చెయ్యి. శుభం భూయాత్... “  అంటూ ముగించి సంధ్యానుష్టానం కోసం కదిలారు రాజగురువు. ఆయనకు వినమ్రంగా నమస్కరించి, తిరిగి దీక్షలో లీనమయ్యింది చిత్రలేఖ .

*********************

శ్వేతాశ్వంపై వాయువేగంతో పయనించసాగాడు విజయుడు. ఇంతలో ఎదురుగుండా ఏదో పొగ కమ్మినట్లు అయ్యింది. దూరంగా మంటలు చెలరేగసాగాయి . విజయుడు నిల్చున్న భూమి నెమ్మదిగా చీలసాగింది. శ్వేతాశ్వం బెదిరి సకిలించసాగింది .అది రాక్షస మాయ అని వెంటనే పసికట్టాడు విజయుడు. ఇంతలో ఒక విచిత్రమైన అరుపు వినవచ్చింది... (సశేషం...)

No comments:

Post a Comment

Pages