శ్రీధరమాధురి -7 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి -7

Share This

శ్రీధరమాధురి -7

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజి అమృత వాక్కులు )


తరతరాలుగా మనకు కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు వారసత్వంగా ఉన్నాయి. అయితే, కొన్ని కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. అది సద్గురువులు సూచించి, మన తప్పులు దిద్దుతారు. అటువంటి కొన్ని నమ్మకాలు, ఆచారాల గురించి గురుదేవులు చెప్పిన అమృత వాక్కులు....

 

  • నేను బ్యాంకు లో పని చేసేటప్పుడు, బెంగళూరు లో ఒక విషయం గురించిన విచారణ నాకు అప్పగించారు. వ్యక్తిగతంగా నాది  తప్పొప్పులు ఎంచే ధోరణి కాదు. కాని దైవం ప్రణాళికలు వేరుగా ఉంటాయి.నన్ను తప్పనిసరిగా తీర్పు చెప్పే కుర్చీలోకి తోసారు. ఆ సమయంలో నేను బెంగుళూరు లో మా అంకుల్ ఇంట్లో ఉండేవాడిని.మరికొన్ని సార్లు నేను అమిత చాందసులైన మధ్వబ్రాహ్మడైన నా మిత్రుడి కుటుంబంతో ఉండేవాడిని. ఆ రోజు ఆదివారం. మాములుగా నేను పళ్ళు తోముకోలేదు. బెడ్ కాఫీ కై నిరీక్షిస్తున్నాను. ఆ ఇంటి పెద్దావిడ చాలా మంచి కాఫీ చేసేది. నేను ‘ద హిందూ’ అనే పుస్తకం చదువుతున్నాను.నా మిత్రుడి తండ్రి పూజ పూర్తిచేసారు. నిజానికి, ఆయన తడి పంచె నుంచి ఇంకా నీరుకారుతోంది. వాళ్ళు తడి ‘మడి’ బట్టతో పూజ చేస్తారు. శుభ్రత కోసం, క్రమశిక్షణ కోసం, వారు అలా చేస్తారు. ఆయన వెలుగుతున్న హారతి పళ్ళెం తీసుకువచ్చి, నాకు ఇచ్చారు. నేను చందనం, కుంకుమ తీసుకుని, నుదుట పెట్టుకున్నాను. “నువ్వు స్నానం చేసావా?” అని ఆయన అడిగారు. నేను,”ఇవాళ ఆదివారం. ఇంకా పళ్ళు కూడా తోముకోలేదు. ఇప్పుడే బెడ్ కాఫీ త్రాగాను. ఆహారం కూడా స్నానం చెయ్యకుండా తీసుకోవాలని అనుకుంటున్నా,’ అన్నాను. ఆయన, ‘ నారాయణా ! నువ్వు వేద పండితుడివి, మతం గురించి చాలా మాట్లాడతావు. కాస్త స్నానం చేసి తినలేవూ ?’ అంటూ మందలిస్తూ పోసాగారు. చివరికి ఆయన ‘నీ వంటి వారికి మొక్షార్హత కాని, ఆత్మ సాక్షాత్కారం కాని లభించదు,’ అన్నారు. నేను నవ్వుతూ,’ అంకుల్, మీరు బకెట్లు బకెట్లు నీటిని కుమ్మరించుకున్నారు. కాని, మీరు పూజాగదిలో దైవం ముందు నిల్చున్నప్పుడు, మన దేహంలోనే  ఒక అటాచ్డ్  బాత్రూం కం టాయిలెట్ ఉంటుంది కదా ! దాని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచడం ఎలా ? ఒకవేళ ఈ ఆలోచన మనకు కలిగినట్లైతే మనం పూజ చెయ్యగలమా ? గుళ్ళోకి వెళ్లగలమా ? దేవుడు ఇటువంటి వ్యవస్థను మనుషుల దేహాల్లో ఎందుకు ఏర్పరిచాడంటారు?’ అని అడిగాను. తర్వాత మరోసారి నేను వారిని ఉదయం 9 గంటలకు దర్శించినప్పుడు, ఆయన స్నానం చెయ్యకుండా హాయిగా దినపత్రిక చదవసాగారు. నేను ఆయన వంక ఆశ్చర్యంగా చూసాను. ఆయన ‘ నేను పూజ గదిలోకి వెళ్ళినప్పుడల్లా కడుపులో ఉన్న అటాచ్డ్ టాయిలెట్ గుర్తుకొచ్చి, బయటికి వచ్చేస్తున్నాను. అందుకే నేను తీవ్రమైన  పూజలు మానేసాను,’ అన్నారు. నేను కాస్త ఇరుకున పడ్డాను. ఏం చెయ్యను... అంతా దైవసంకల్పం, నాకు వేరే దారి లేదు మరి.

(దైవం పేరుతో, ఆచారాల పేరుతో ఇతరుల్ని ద్వేషించవద్దని, నిందించవద్దని,  గురుదేవుల భావం .)

 

 

  • ఆమె – గురూజి, నేను గురుపౌర్ణమికి వచ్చేలా దీవించండి, ఆ సమయంలో నాకు నెలసరి వస్తుందేమో అని కలతగా ఉంది.

నేను – నీకు సాదర స్వాగతం. నీకు నెలసరి వచ్చినా, రాకున్నా, నీవు నా పాదాలు తాకవచ్చు. నేను ఇవన్నీ నమ్మను. ఇది దైవసంకల్పం. హఠాత్తుగా, స్వాభావికంగా ,అప్పటికప్పుడు,  క్రమరహితంగా జరుగుతుంది. ఇది మనిషి చేసింది కాదు. నిజానికి ఈ సమయంలో స్త్రీకి మరింత ప్రేమ, ఆప్యాయత కావాలి. తాను ఈ క్రమంలో ఎంతో బాధకు గురౌతుంది. ఇది అర్ధం చేసుకుని, ఆమెకు సహకరించడంలో కాస్తంత మానవత్వం ప్రదర్శిద్దాం. ఇటువంటి పద్ధతులు కేవలం ఎవరో చెప్పారని, ఏదో అంటారని, దేవుడు సంతోషించడని పాటించకండి. దైవం మీ మూర్ఖత్వం చూసి నవ్వుతారు. ఒక స్త్రీ ని నిరాదరించకండి. ఆమె బాధ మీకు ఎంతో శోకాన్ని తెచ్చి పెడుతుంది. స్త్రీ ప్రకృతితో చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఆమె సృష్టిని చేస్తుంది. ఆమెకు ఆ విధమైన వరం ఇవ్వబడింది. ఆమెను గౌరవించండి. మతం పేరుతో స్త్రీని నిరాదరించకండి. మనలో ప్రతి ఒక్కరం , ఆలయాలకు కూడా మనతో పాటు అటాచ్డ్ బాత్రూం తీసుకు వెళ్తామని మరువకండి. మీరు తిరుమల క్యూ లో గంటల పాటు నిల్చున్నప్పుడు , అది లోపల పేరుకుంటుందని మరువకండి. గోవిందా... గోవిందా...

  • దృష్టి ...                     

ఎవరూ వాలిని ఎదుర్కోలేరు. అతన్ని చంపేందుకు సైతం రాముడంతటి శక్తివంతుడు దాక్కోవలసి వచ్చింది. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. మన దృష్టి ద్వారా మనం అనుకూల లేక ప్రతికూల శక్తిని పంపిణీ చెయ్యగలం. ఇదంతా ఆ సమయంలో వారి మనఃస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. నిజానికి, మహర్షి రాజర్ నన్ను ఇతరుల వంక తదేకంగా చూడవద్దని, కాసేపు ప్రక్కకు మళ్ళించి, మరలా చూడమని, చెప్పేవారు. నిజానికి మేము తిన్నగా కూర్చోము.  ఇతరులకు అభిముఖంగా కూర్చున్నప్పుడు కొంత ప్రక్కకు వంపుగా తిరిగి కూర్చుంటాము. ఇటువంటప్పుడు పిల్లలను అందమైన ఫాన్సీ దుస్తుల్లో అలంకరించిన ఫోటోలు పోస్ట్ చేస్తే, ఫలితం ఎలా ఉంటుందో ఊహించండి. మనలో అందరూ అన్నివేళలా అనుకూల లేక ప్రతికూల ఆలోచనలు కలిగి ఉంటారని నేను అనట్లేదు. మనం మన పిల్లల్ని అతిగా పబ్లిసిటీ కి గురి చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా లో ఫోటోలు చూడడం ద్వారా, లేక వ్యక్తిగతంగా కూడా ఈ శక్తిని పంపిణీ చెయ్యవచ్చని మా నమ్మకం. నిజానికి ఆధ్యాత్మికంగా రుగ్మతలు కుదర్చడంలో,  మేము చికిత్స చెయ్యాల్సిన వ్యక్తిని నేరుగా కలవలేనప్పుడు, లేక వారితో కొన్ని గంటల పాటు కూర్చోలేనప్పుడు, మేము వారి ఫోటో అడుగుతాము. ఈ విషయంలో ఏది చెయ్యాలో, చెయ్యకూడదో, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకో, ఈ విషయంలో మాత్రం మా ఆలోచనలు సంప్రదాయబద్ధమే !

 

  • నాగ్ -   చెడు దృష్టి నిజంగా ఉంటుందా లేక భ్రమా ?

నేను - చెడ్డ దృష్టి లేక మంచి దృష్టి అనేది వదిలేద్దాం ...

మామూలుగా మేము గురు కటాక్షం అంటాము... గురువు యొక్క దృష్టి మనపై పడనివ్వండి. అదొక వరం.

గురువారాలు తిరుమలలో ‘నేత్ర దర్శనం’ ఉంటుంది. మిగతా రోజుల్లో తిరునామం దేవుడి కళ్ళను కప్పేస్తుంది. కాని, గురువారం దైవం గురువు రూపంలో ఉంటారు, అందుకే ఆయన దృష్టి మనపై పడాలి... కటాక్షం కలగాలి...

రాముడు ఎందుకు దాక్కుని వాలిపై దాడి చేసాడు ? ఎందుకంటే, వాలికి ఎదురుగా ఎవరు నిల్చున్నా, వారి శక్తిలో 50 % వాలికి బదిలీ అవుతుంది. అందుకే అతన్ని సంహరించేందుకు రాముడు దాక్కోవాల్సి వచ్చింది.

భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ శక్తి ఉంటుందని ఎల్లప్పుడూ నమ్ముతున్నదే ! కాబట్టి, కొందరి దృష్టి కి అనుకూల ప్రభావం, మరికొందరి దృష్టికి ప్రతికూల ప్రభావం ఉంటుంది.

కాని, నాకు సంబంధించినంత వరకూ, ‘బురీ నజర్ వాలా, తూ భి జీతే రహో!’

అంతా దైవానుగ్రహం, దయ.

మీ భార్య కడుపుతో ఉన్నప్పుడు, ఆమెను ఎక్కువగా బైటకు తీసుకువెళ్లకండి. ఆమెకు దగ్గరగా సంరక్షిస్తూ ఉండండి. కడుపులోని పిండం ఇతరుల దృష్టిని తట్టుకోలేదు. చూసేవారంతా పవిత్రంగానే చూడాలని లేదు. మనలోనే అనేకమంది వాలి (రామాయణం) ఉన్నారు. ఒకసారి అటువంటి వారు చూస్తే, ఆ ప్రభావం పిండం పై పడుతుంది. ఈ రోజుల్లో నేను అనేకమంది గర్భం తొలి దశలోనే అందరికీ చెప్పడం, వారిని ఇంటికి  ఆహ్వానించి పార్టీ లు ఇవ్వడం చూస్తున్నాను. ఇవన్నీ పిండంపై ఎటువంటి ప్రభావం చూపుతాయనేది, దైవానికే తెలుసు. ఈ రోజుల్లో పిల్లలు ఆటిసం, డౌన్స్ సిండ్రోమ్, గుండెలో చిల్లు వంటి అనేక అవకారాలతో పుడుతున్నారు. వీటన్నిటి మూలాలు గర్భవతిగా ఉన్నప్పుడు జరిగిన అతిగా బహిర్గతం చెయ్యడం వంటి చర్యల్లో ఉంటాయి. నిశ్చయంగా మొదటి 5 నెలలూ గర్భం నిలబడేదాకా, ఇవన్నీ చెయ్యకూడదు. వింటున్నారా ?

  • దృష్టి దోషాన్ని తప్పించుకునేందుకు కొన్ని పద్ధతులు... ప్రయత్నించండి...

 

  1. 1.    మీరు ఎవరినైనా కలిసినప్పుడు అనుమానం వస్తే, వారి వంక 20 సెకండ్ల  కంటే ఎక్కువ సేపు చూడకండి. వారితో మాట్లాడుతూ, 20 సెకండ్లు  మరోప్రక్కకు చూసి మరలా వారిని 20 సెకండ్ల  పాటు చూడండి. మరలా చూపు మరల్చండి. ప్రతీ 20 సెకండ్లకు దృష్టి మరలుస్తూ ఉండండి.

  2. 2.    మీకు అనుమానం వచ్చిన వ్యక్తికి అభిముఖంగా తిన్నగా కూర్చోకండి. ఒక ప్రక్కకు తిరిగి, వంపుగా కూర్చుని, మాట్లాడేటప్పుడు క్రింద చెప్పిన విధంగా పాటించండి.

  3. 3.    మీరు అనుమానించే వ్యక్తిని, ఇంటికి లేక ఆఫీస్ కు పిలవాల్సి వచ్చినప్పుడు, ముందుగా వారికి మంచినీళ్ళు(చల్లటివి/మామూలువి/గోరువెచ్చనివి ) ఇవ్వండి. వారు  వెళ్ళగానే మీరు నీళ్ళు త్రాగండి. దృష్టిని నివారించేందుకు నీరు మంచి ఉపకరణం.

  4. 4.    సందేహాస్పదమైన వ్యక్తులు మిత్రులు/సంబంధీకులు ఇంట్లో ఒక్క రోజు కంటే ఎక్కువ ఉంటే, ఇంటిని కడగడం మంచిది. లేదా వారు వెళ్ళగానే ఇంటిని తడి బట్టతో తుడవండి.

  5. 5.    వారు ఇచ్చే ఆహారం తీసుకోకండి.

అంతా దైవానుగ్రహం, దయ.

  • ఎవరో చనిపోయారు. పెద్దాయన ముసలి వయసులో చనిపోయారు. ఇప్పుడు 10 రోజులు ఎవరూ, ఏదీ ముట్టుకోకూడదు. ఇంట్లో ఎవరూ వంట చెయ్యకూడదు. సంబంధీకులు ఎవ్వరూ దీపం పెట్టకూడదు. పండుగలు జరుపుకోకూడదు. అర్హత ఉన్న ఇతరులే వండి పెట్టాలి. ఆ రోజుల్లో అంతా చనిపోయిన వారిని గురించి విచారించేవారు. ఆ వ్యక్తిని గురించి 10 రోజులు ఘనంగా మాట్లాడుకునేవారు. ఆ వ్యక్తి కలుపుగోలుతనం, నిజాయితీ, ప్రేమ, అతను జీవితంలో చేసిన మంచి పనుల గురించి పిన్నాపెద్దా అంతా చర్చించేవారు. వారు గతించిన వారి జ్ఞాపకాల్లో బ్రతికేవారు. అందుకని వంట పని, ఇంటి పనులూ, ఇతరులు చేసేవారు. మరి ఇప్పుడో... ఎవరైనా చనిపోగానే , మీరు ఉపశమనం పొందుతారు. చనిపోయినవారి మంచిని గురించి మాట్లాడేందుకు ఎవరికీ సమయం లేదు. నేడు, నిజానికి  మీరు అదొక లోటుగా భావించరు. ఎందుకంటే, కుటుంబంలో ఎందరో సంపాదిస్తున్నారు. ఇంకా, నేడు మీరు పనికొచ్చినంత వరకూ అంతా మిమ్మల్ని గౌరవిస్తారు, మీకు సుస్తి చేస్తే, అంతా ఏదో వంకతో తప్పుకు తిరుగుతారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, మీరు ఇంకా సంప్రదాయం పేరుతో ఎప్పుడో చెప్పిన విషయాలనే పాటించడం సబబు కాదు.

  • గురూజి, ఇవాళ ఏకాదశి, నేను ఉపవాసం చేస్తున్నాను.

      నేను – ఓహ్, ఇవాళ తొలి ఏకాదశా ? నువ్వు ఉపవాసమా ? అయితే, నేను విందు భోజనం చేస్తాను.

  • ఆ రోజుల్లో అంతా బాగా తినేవారు. బాగా ఉపవసించేవారు. అందుకే వ్యవస్థను శుభ్ర పరిచేందుకు ఏకాదశి పేరుతో 15 రోజులకు ఒకసారి ఉపవాసం చెయ్యమనేవారు. ఇవాల్టి బిజీ జీవితాల్లో మీరు సరిగ్గా తినరు. తిన్నా, చాలాసార్లు ఏదో చిరుతిండి తింటారు. ఒక్క రోజు మీరు కడుపునిండా తిన్నా, సరిపడక ఇబ్బంది పడతారు. మనం చిరుతిళ్ళకు అలవాటు పడ్డం కనుక , మన శరీరానికి మంచి ఆహారం ఒక గ్రహాంతర వాసి. నేను శాస్త్రాన్ని గుడ్డిగా పాటించను. ‘శాస్త్రాయచ సుఖాయచ ..’ అన్నారు. అంటే, శాస్రం అందరి సౌఖ్యం కోసమే వచ్చింది. ముందే మనం సరిగా తినకపోవడంతో  ప్రతీ రోజూ ఏకాదశే ! రోజులు మారే కొద్దీ శాస్త్రం కూడా నిపుణుల మెరుగైన సూచనలతో మారుతుంది. మనం శాస్త్రాలను గుడ్డిగా పాటించలేము, అవి కూడా కాలంతో పరిణామం చెందాయి. అలా జరగకపోతే,  మనమంతా ఆకులు కట్టుకుని, అడవులకు తిరిగి వెళ్ళాలి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.

  • కోతి ఉపవాసం ...

ఒక ఆలయంలో ఒక కోతి ఉంది. ప్రతి పౌర్ణమికి పూజారి ఉపవాసం చేసేవాడు. రాత్రి చంద్రుడిని చూసాకా, ఆయన భోజనం చేసేవారు. అది చూసిన కోతి, తనూ ఉపవసించాలని నిర్ణయించుకుని, మొదలుపెట్టింది. ఒక గంట గడిచాకా కోతి  ... ఉపవాసం ముగిసాకా ఎలాగూ నేను తినాలి కదా, అనుకుని, కొట్టుకు వెళ్లి, రెండు అరటిపళ్ళు తెచ్చుకుని, ప్రక్కన పెట్టుకుని, కూర్చుంది.

మరో గంట గడిచింది ... కోతి... ఉపవాసం ముగిసాకా ఎలాగూ నేను తినాలి కదా, అందుకే అరటిపళ్ళు ఒలిచి పెట్టుకుంటా, అనుకుని, తొక్కతీసి, ఉపవాసం అవ్వగానే తినేందుకు వీలుగా పెట్టుకుంది.

ఇంకో గంట గడిచింది... కోతులకు నోట్లో ఒక సంచి(కోశం ) ఉంటుంది. అవి తింటుండగా, ఆహారాన్నిఆ సంచి లో దాచుకుంటాయి. అందుకే కోతి ఇలా అనుకుంది – ఉపవాసం అవ్వగానే నేను ఎలాగూ తినాలి, అందుకే అరటిపండుని నోట్లో వేసుకు నమిలి సంచిలో పెడతాను. ఉపవాసం అవ్వగానే నేను తేలిగ్గా మింగేయ్యచ్చు !

మరో గంట గడిచింది... కోతి ... మనుషులే ఉపవాసం చెయ్యాలి, నేను కోతిని. నేనెందుకు ఉపవసించాలి ? ఇలా అనుకుని, అది వెంటనే అరటిపండును మింగేసింది.

మనలో చాలా మంది ఉపవాసం పేరుతో చేసేది ఈ ‘కోతి ఉపవాసమే !’

 ******** 

No comments:

Post a Comment

Pages