ఆమని వీణానాదం – ఈమని శంకరశాస్త్రి
- భావరాజు పద్మిని
ఆయన వేళ్ళలో రాగాలు చివురులు తొడుగుతాయి. ఆయన సృజనకు తొందర పడిన కోయిల ముందే కూస్తుంది. పాశ్చాత్య, శాస్త్రీయ సంగీత రీతుల్ని వీణలో మేళవించి, అన్ని రకాల తంత్రీ వాయిద్యాలను అలవోకగా వీణలో పలికించగల ఆయన ప్రతిభకి ఆమని పులకించి, ఆనందనాట్యం చేస్తుంది. వీణా వాయిద్యాన్ని తన నవ్యతతో ప్రపంచ స్థాయిలో నిత్యవసంతంలా నిలబెట్టిన ఆ వైణీక బ్రహ్మ, ‘పద్మశ్రీ’ ఈమని శంకరశాస్త్రి గారు. సంగీత ప్రపంచంలో త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షితులు వంటి మహామహులంతా వీణ వాయించినవారే ! వీణ నాదం సున్నితమైనది. గతంలో (మైక్ లు లేనప్పుడు)ఎక్కువ మంది ప్రేక్షకులు ఉన్న పెద్ద సభల్లో వీణానాదం వినబడక వీణకు ఒక సమయంలో ప్రాముఖ్యత కరువయ్యింది. అలాగని తీగలను గట్టిగా మీటితే, వీణలోని మాధుర్యం లోపిస్తుంది. దీనితో వీణా వాద్యం, మిగతా వాయిద్యాల సరసన నిలబడలేక, చిన్న సభలకు, ఇష్టాగోష్టులకు మాత్రమే పరిమితం అయ్యేది. సంగీత ప్రపంచంలో వీణా వాదనను తిరిగి అన్ని వాద్యాల స్థాయిలో నిలబెట్టడమే కాక దానికి కొత్త ఊపిరిని పోసి, నూతన జన్మనిచ్చి స్వతంత్ర, సంపూర్ణ, సమగ్ర ఘన వాద్యంగా నిలిపిన ఘనత మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గారిదే. భారతదేశంలో కాంటాక్ట్ మైక్‌ను మొదటగా వీణకు వాడి, వీణానాదంలో నయగారాలు తెచ్చిన మొట్టమొదటి వైణికుడు ఈమని శంకరశాస్త్రి. 1922, సెప్టెంబరు 23న, తూర్పుగోదావరి జిల్లా దాక్షారామంలో జన్మించిన శాస్త్రిగారు, వారి తండ్రిగారైన అచ్యుతరామశాస్త్రి గారి దగ్గర వీణ అభ్యసించి ఈ వాద్యాన్ని పూర్తిగా తెలుగువీణగా రూపుదిద్దారు. ఈయన విధానం ఎవ్వరికీ అనుకరణగా ఉండదు. అచ్యుతరామశాస్త్రిగారు పాత పద్ధతిలో వీణను సితార్ లాగా నిలువుగా పట్టుకుని వాయించేవారు. శంకరశాస్త్రిగారు తండ్రి వద్దనే వీణ నేర్చుకున్నారు. తన మూడో ఏటనే సంగీతంలో ప్రతిభ కనబరిచిన శంకరశాస్త్రికి సంగీతం వృత్తిగా పనికిరాదని ఆయన తండ్రి అనుకున్నప్పటికీ అదే జరిగింది. కాకినాడ పిఠాపురం కాలేజీలో డిగ్రీ పుచ్చుకున్నాక ఆయన వైణికుడుగానే జీవితం ప్రారంభించాడు. 1940లో తిరుచ్చి రేడియో కేంద్రంలో మొదటగా వీణ కచేరీ చేశాక ఆయనకు పేరు లభించసాగింది. 1942-50 మధ్యకాలంలో, మద్రాసు జెమినీ స్టూడియోల్లో సాలూరు రాజేశ్వరరావుకు సంగీతంలో సహాయసహకారాల్ని అందజేశారు. సీతారామ కల్యాణం (రావణుడు వీణ వాయించే ఘట్టం), వెంకటేశ్వర మహత్యం (సరస్వతి “వాచస్పతి” రాగం వాయించే సీను) మొదలైన కొన్ని తెలుగు సినిమాల్లో శాస్త్రిగారి వీణ వినబడుతుంది. గాత్ర ధర్మాల నన్నింటితోనూ వీణను నింపడమే కాక, గాత్రం కన్నా ఎక్కువగా దానిలో మాధుర్యం నింపి సంగీత ప్రపంచాన్ని అమృతపానం చేయించిన సంగీత జగన్మోహిని యొక్క పుంభావమూర్తి శ్రీ ఈమని శంకరశాస్త్రి గారు. వీణను బహిర్వస్తువుగా కాక, అంతరాత్మగా భావించి దానితో లయించిన నాదయోగి శ్రీ ఈమని శంకరశాస్త్రిగారు. హిందుస్ధానీ బాణీని అనుకరించినా, పాశ్చాత్యబాణీలను తన సంగీతంలో చేర్చుకొన్నా, వీణా వాద్యాన్ని ‘తెలుగు వీణ’ గా ప్రతిష్టించి సంగీత క్షేత్రంలో వీణ అంటే తెలుగువాళ్లది అన్న గౌరవాన్నీ, సత్కీర్తినీ శ్రీ ఈమని శంకరశాస్త్రి గారు కల్గించారు. వీణా వాదంలో ఎంత వైవిధ్యాన్ని తేవాలో అంత వైవిధ్యాన్ని వారు సృష్టించగలిగారు. ఓ సారి సితారాగా, ఇంకొక్క సారి సరోద్గా, మరికొన్ని సార్లు గిటార్ గా , గోటు వాద్యంగా - తంత్రీ వాద్యాల వ్యక్తిత్వాల నన్నింటినీ తన వీణలో మూటకట్టి తన వీణను మెరిపించి నాదయోగ సిద్ధుడైనారు శ్రీ శంకరశాస్త్రి గారు. ఈనాడు వాద్యవిద్వాంసులు చేస్తున్న ప్రయోగాలకు ఆద్యులు శంకరశాస్త్రిగారే. గమకాలు వేయడంలో, స్వర కంపనంలో, రాగాలాపనలో, స్వరప్రస్తారంలో, తానం వేయటంలో, ఒక మెట్టు నుంచి మరో మెట్టుకు స్వరాలు వేస్తున్నప్పుడు నిశ్శబ్దం వచ్చేలా చేయడంలో, స్వరనాదంలో హెచ్చుతగ్గులు ప్రదర్శించడంలో... సంగీతంలోని అన్నివిభాగాలలో ఎన్నో కొత్త మార్గాలను సృష్టించారు. సంగీతంలో ఉన్న గమకరీతులకు తోడు, మరో ఏడు రీతులను సృష్టించిన స్రష్ట శాస్త్రిగారు. హృదయంలో మ్రోగే అనాహతాన్ని తన మీటుల నడుమని నిశ్శబ్దంలో ' మ్రోగించే ' వారు శ్రీ శంకర శాస్త్రిగారు. దీన్ని వారు మ్యూజికల్ సైలెన్స్ అన్నారు ! దీన్ని అనుభవించి ఆలాపనలో ఈ నిశ్శబ్ద స్థితిని చూపలేని సంగీత కళాకారుడు ఎవ్వరికీ ఏ అనుభవాన్నీ ఇవ్వలేడు. భారతదేశంలోనే కాంటాక్ట్ మైక్‌ని ( పికప్) మొదటగా వీణకు వాడి వీణా నాదంలోనూ, మీటులోనూ నాజూకులూ నయగారాలు తెచ్చిన మొదటి వైణికులు శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు. లలిత సంగీతంలో శాస్త్రీయ వాసనలనూ, శాస్త్రీయ సంగీతంలో లాలిత్యపు ఘుమఘుమలనూ నింపిన ప్రయోగశీలి శాస్త్రి గారు. ఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో వాద్య బృంద సంగీత దర్శకుడుగా, జెమినీ స్టూడియో ( వాసన్ గారిది) లో కొన్ని హిందీ సినిమాలకు, తెలుగు సినిమాలకు సంగీత దర్శకుడుగా నిలబడ గల్గటానికి ఈ ప్రయోగశీలమే కారణం. టెన్సింగ్ నార్కే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినాడన్న వార్తకు స్పందించి ఆదర్శ శిఖరారోహణ మన్న గొప్ప వాద్య బృంద ( orchestra) సంగీతాన్ని శాస్త్రి గారు సృజించి ప్రసారం చేయించారు. దీన్ని విన్న శ్రోతలందరూ దేన్నో అధిరోహిస్తున్నట్లుగా అనుభూతిని పొందుతారు. భ్రమర విన్యాసం అన్నది ఇట్లాంటి మరొక సంగీత రచన వీరు చేశారు. ఇదీ అంతే. విన్నవాళ్లు భ్రమర ఝుంకారాన్ని అనుభవిస్తారు. ఎవరైనా వీణను చిన్నచూపు చూస్తే సహించేవారు కాదు. శంకరశాస్త్రిగారు వీణ మీద వేగంగా వాయించడం చూసిన కొందరు, ‘‘అయ్యా! మీరు వీణ వదిలేసి వయొలిన్ పట్టుకున్నట్లు ఉందే’ అన్నారట. ఆయన రౌద్రనేత్రులయ్యారట. వీణ మీద వేగంగా వాయించడం చాలా కష్టం. వయొలిన్ మీద స్వరాలు పక్కపక్కనే వేయవచ్చు, అదే వీణ మీద ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్లాలి. దానిని శాస్త్రిగారు సాధించారు. రవిశంకర్ సితార్, అంజద్ అలీఖాన్ సరోద్... వాటి వేగంతో పోటీ పడ్డారు. వారితో జుగల్బందీ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత అభిమానులను అలరించారు. కచేరీలు చేస్తున్నప్పటికీ ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు సంగీతసాధన చేసేవారు. సాధన చేయకుండా ఎప్పుడూ కచేరీ ఇచ్చేవారు కాదు. గమక విన్యాసంలోనూ, రాగ ప్రస్తారంలోనూ ఆయనది అద్వితీయమైన ప్రతిభ. ఆయన పలికించిన తానం అనితరసాధ్యం. మూడో తీగనూ, నాలుగో తీగనూ బొటనవేలితో మీటుతూ మంద్ర, అనుమంద్ర స్థాయిల్లో స్వరాలను అత్యద్భుతంగా వాయించేవారు. మామూలుగా ఉండే మూడు తాళం తీగలే కాక మరొక రెండు ఏర్పాటు చేసి, వాటిని రాగంలోని స్వరాలకు శ్రుతిచేసి మొత్తం మీద ఒక ఆర్కెస్ర్టావంటి ప్రభావాన్ని కలిగించేవారు. కేవలం ఒక్క వీణతోనే గానమూర్తి మొదలైన రాగాలను ఎంతో డ్రమటిక్‌గా, పెద్ద సింఫొనీ స్థాయిలో వాయించేవారు. సందర్భాన్నీ, అవసరాన్నీ బట్టి ఆయన తన కుడి చేతి పొజిషన్‌నూ, తీగను మీటే స్థానాన్నీ నాలుగైదు రకాలుగా మార్చేవారు. సూర్దాస్ భజనలకూ, ఇతర గీతాలకూ ఆయన పహాడీ మొదలైన హిందూస్తానీ రాగాల్లో మంచి స్వరరచనచేశారు. ఆయన రేడియోలో అనేక గీతాలకు లలిత సంగీతం సమకూర్చారు. శాస్త్రిగారు తన కచేరీలలో వీణ బుర్రమీద చేత్తో దరువు వేస్తూచిన్న జాజ్ పద్ధతి స్వర రచనలనూ వాయించేవారు. కదనకుతూహలం రాగంలో రఘువంశ కృతిని ద్వారంవారి పద్ధతిలో వెస్టర్న్ కార్డ్ విశేషాలను ప్రదర్శిస్తూ వాయించేవారు. ఆయన వీణ మీద పలికించలేని శబ్దం ఉండదేమో అనిపించేది. శంకరశాస్త్రిగారు గుంటూరులో నాలుగున్నర గంటల పాటు వీణ కచేరీ చేసి, ఆ జ్ఞాపకాలను ఇంకా అందరూ స్మరించుకుంటూండగానే, అదేరోజు రాత్రి రైల్లో ప్రయాణిస్తూ ఆయన ప్రాణాలు సంగీతంలో లయమైపోయాయి. విశేషమేమంటే... ఆ సమయంలో ఆయన పక్కన వీణ సజీవంగా ఉంది. ఆయనకు తన వీణతో మాట్లాడుకోవడం అలవాటు. ఆ వీణతో... ‘‘నేనెప్పుడు చెబితే అప్పుడు తీసుకెళ్లు’’ అనేవారట. ఆయన... వీణను సజీవ పదార్థంగా చూసేవారు. ఈమని శంకరశాస్త్రి గారి శిష్యుల్లో ముఖ్యుడు చిట్టిబాబు. చిట్టిబాబు గురువుగారు వాయించే శైలిని చాలావరకూ అభివృద్ధి చేశారు. రామశాస్త్రి, పాలగుమ్మి విశ్వనాధం, పి.బి.శ్రీనివాస్ వంటివారు ఈయన శిష్యులలో మరికొందరు. 1974 లో భారత ప్రభుత్వం ఆయన్ను ‘పద్మశ్రీ’ అవార్డుతో సన్మానించారు. భావి సంగీతజ్ఞులకు ఆయన ఇచ్చే సందేశం...”ప్రామాణికమైన రాగ పరిజ్ఞానం కలిగిన ఏ సంగీతజ్ఞుడైనా తన కృషితో, అనుభవంతో వాద్యపటిమను పెంపొందించుకుని, ప్రచారం చెయ్యాలి. నేను నా సాధనతో సాధించిన రాగభావాన్ని ఈ పధ్ధతి ప్రకారమే విస్తృతం చేసాను...’ నాటికీ, నేటికీ వసివాడని నిత్యవసంతంలా ఆయన వీణ తెలుగు వారి గుండెల్లో మ్రోగుతూనే ఉంది, ఉంటుంది. ఆ అమర వీణా నాదం క్రింది లింక్ లో వినండి...
No comments:
Post a Comment