దేవకీనందన శతకము - వెన్నెలకంటి జన్నయ్యమంత్రి - అచ్చంగా తెలుగు

దేవకీనందన శతకము - వెన్నెలకంటి జన్నయ్యమంత్రి

Share This

దేవకీనందన శతకము - వెన్నెలకంటి జన్నయ్యమంత్రి

- దేవరకొండ సుబ్రహ్మణ్యం

కవిపరిచయం:

దేవకీనందన శతకకర్త వెన్నెలకంటి జన్నయ్య ఆపస్తంబసూత్రుడు. హారీత గోత్రజుడు. తండ్రి సిద్ధమంత్రి. తల్లి సూరమాంబిక. ఇతనితాత సూరనసోమయాజి సర్వతోముఖమను యజ్ఞము చేసిన మహాదాత. శైవాచారపారాయణుడు. ఇతనితండ్రి శ్రుతిశాస్త్రములందు నిష్ణాతుడు. అనేక క్రతువులను చేసిన ధన్యాత్ముడు. సూరమాంబిక పేరయనన్ననార్యుడనే కవికి సోదరి. జన్నయ్య కవి సోదరుడు మంత్రిభాస్కౌడు.

15వ శతాబ్దపువాడయిన జన్నయ్యమంత్రి మహాదాత. ఈతనిభార్య అచ్చమాంబ. వీరికి  సిద్ధన్న, భైరవన్న అని ఇద్దరు సంతానము. ఇందు సిద్ధన్న విక్రమార్క చరిత్ర వ్రాసిన కవి. ఈ సిద్ధన్న కుమారుడు తిప్పన్న. జన్నయ్యమంత్రి రెండవకుమారుడైన భైరవన్న గురించి వివరాలు తెలియలేదు. ఇప్పటివరకు దొరికిన వివరాలనుబట్టి వీరివంశంలో తాతలు, తండ్రులు, కొడుకులు, మనుమలు కూడా వేదాచార సన్నులై క్రతువులు చేస్తు, ఒకప్రక్క మంత్రులై రాజ్యాంగములు నడుపుతు, పరొకప్రక్క కావ్యములు వ్రాయుచు వెన్నెలకంటి వారు ఆంధ్ర బ్రాహ్మణకుటుంబములలో అత్యధికకీర్తి ప్రతిష్టలు సంపాదించుకొన్నరనటంలో సందేహమే లేదు. ఇతని నివాసస్థలంపై కూడా ఎటువంటి సమాచారం లభించలేదు.

శతకపరిచయం:

భక్తిరస ప్రధానమైన దేవకీనందన శతకములో "కృష్ణా! దేవకీనందనా" అనే మకుటంతో సరిగా నూరు పద్యాలున్నాయి. శార్ధూల, మత్తేభ వృత్తాలలో అలరారే ఈశతకాంతంలో కందపద్యంలో ఫలశృతి ఇవ్వబడింది. కృష్ణలీలలను వర్ణించే భక్తిరస ప్రధానమైన శతకమే అయినప్పటికీ అక్కడక్కడా అధిక్షేప, నీతి పద్యాలుకూడా మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు

మ. కరి నేలింది హుళక్కి ద్రౌపదికి కోకల్ మెచ్చి యిచ్చింది ద

బ్బర కాకాసురునిం గటాక్షమునఁ జేపట్టిం దబద్ధం బహో

శరణన్నన్ బగవాని తమ్మునికి రాజ్యంబిచ్చుట ల్కల్లయి

త్తఱి నన్నేలిన నిక్క మీకథలు కృష్ణా దేవకీనందనా

మ. అనుకూలాన్విత యైనభార్యయును ధర్మార్థంబునైనట్టి నం

దనులున్ సజ్జను లైనసోదరులు నెన్నంగల్గు సంపత్క్రియా

ఘనుఁడైనట్టి మహానుభావుఁడె భవత్కారుణ్యదృగ్జాలభా

జనుఁ డప్పుణ్యుని జూచినన్ శుభము కృష్ణా దేవకీనందనా

శా. గాట్రాలన్ బలుకానలన్ గుహల గంగాసింధుదేశంబులన్

వట్రాఠావుల దేహమెల్ల జెదరన్ వర్తించినన్ మేరువున్

చుట్రా యేఁబదిమార్లుమెట్టిన మనశ్శుద్ధుండు గాకుండినన్

చట్రావానిప్రయాసమంతయును గృష్ణా దేవకీనందనా

ఈశతకంలో 15, 19, మరియు 82 వంతి కొన్ని పద్యములు సంస్కృతపద్యాలకు అనుసరణగా కనిపిస్తాయి. 72 వ పద్యం

శా. చీమల్ పుట్టలు పెట్టుచుండ నవి విస్తీర్ణంబు గావించినన్

పాముల్ జృరినరీతి లోభిజనసంపన్నార్థరాసుల్ వృథా

భూమీపాలుర పాలుగాక చనునా పుణ్యంబులేలొల్లరో

సామాన్యంబు ధనాధినాథులకుఁ గృష్ణా దేవకీనందనా

సుమతీశతక పద్యానికి అనుసరణగా కనిపిస్తుంది.

ఇదేవిధంగా పోతన్న కృతనారాయణ శతకంలోని పద్యాలతో పోల్చదగిన పద్యాలు కూడా ఈశతకంలో మనకు కనిపిస్తాయి. క్రిందిపద్యాలలో పోలికలు చూడండి.

శా. మౌళిం బించపుదండ యొప్పుగ నటింపంగౌను శృంగారపున్

శ్రీ లెంచంగను పిల్లఁగ్రోవిరవమున్ జేకోలముం జెక్కుచున్

గేలన్ మెచ్చొనరింపఁ గోపకులతోఁ గ్రీడారసస్ఫూర్తినీ

వాలంగాచువిధంబు నేఁదలఁతుఁ గృష్ణా దేవకీనందనా (దేవకీనందన శతకము -16వ పద్యం)

మ. కేలన్ గోలయుఁ గూటిచిక్కము నొగిం గీలించి నెట్టంబుగాఁ

బీలీపింఛముఁ జుట్టి నెన్నడుమునన్ బింఛావళిన్ గట్టి క

ర్ణాలంకార కదంబగుచ్ఛ మధుమత్తాలీ స్వనం బొప్ప నీ

వాలన్ గాచిన భావమిట్టిదని నే వర్ణింతు నారాయణా (నారాయణ శతకము - 48వ పద్యం)

మ. లలనాకుంచితవేణియుం దడవ మొల్లల్ జాఱ కస్తూరికా

తిలకంబుం గఱఁగంగఁ లేఁతనగవున్ దీపింప నెమ్మోమునన్

దళుకుల్ చూపెడి చూపు లుల్లసిల నానారీతులన్ వేణుపు

స్కలనాదంబుల పెంపుఁజూపుదువు కృష్ణా దేవకీనందనా (దేవకీనందన శతకము - 18వ పద్యం)

మ. లలితాకుంచిత వేణియుం దడవిమొల్లల్ జార ఫాలస్థలిన్

దిలకం బొప్పలరంగఁ గుండలౌచుల్ దీపింప లేఁ జెక్కులన్

మొలకనవ్వుల చూపు లోరగిల మే న్మువ్వంకలన్ బోవఁగా

నలి గైకొందువుగాదె నీవు మురళీనాట్యంబు నారాయణా (నారాయణ శతకము-53వ పద్యం)

ఈశతకంలోని పద్యాలు ఇందులోనూ జానకీపతి శతకంలోనూ కూడా కనిపిస్తాయి.

దేవకీనందన శతకంలోని ప్రతిపద్య భక్తిరసపూరితమై, సులభమై, చదివేవారి మనసులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ప్రతిపద్యం ఒక ఆణిముత్యం. మచ్చుకి మరికొన్ని మీముందు ఉంచుతున్నాను.

శా. నీడల్ దేఱెడుచెక్కుటద్దములతో నిద్దంపుఁ గెమ్మోవితో

కూడీకూడని చిన్ని కూకటులతో గోపార్భకశ్రేణితో

వ్రీడాశూన్యకటీరమండలముతో వేడ్కన్ వినోదించుచు

న్నాఁడా శైశవమూర్తి నేఁదలఁతు గృష్ణా దేవకీనందనా

శా. అందెల్ చిన్నిపసిండిగజ్జయులుమ్రోయన్ మేఖలాఘంటికల్

క్రందైమ్రోయఁగ రావిరేక నుదుటన్ గంపింప గోపార్భకుల్

వందారుల్ గన వెన్నముద్దలకునై వర్తించు మీబాల్యపుం

జందంబా దివిజుల్ నుతించుటలు కృష్ణా దేవకీనందనా

మ. ఇల గోవర్ధన మెత్తితీవనుచు బ్రహ్మేంద్రాదులెంతో నినుం

బలుమాఱున్నుతులొప్పఁ జేసెదరు పద్మాక్షా కుచాగ్రంబునం

జులక న్నెత్తినరాధనెన్న రిదిగో సొంపొంద సత్కీర్తి ని

శ్చలపుణ్యంబునఁ గాక చొప్పడునె కృష్ణా దేవకీనందనా

మ. తినదే చెట్టున నాకు మేఁక గుహ గొందిం బాము నిద్రింపదే

వనవాసంబునఁ బక్షులున్ మృగములున్ వర్తింపవే నీటిలో

మునుకల్ వేయవె మత్స్యకచ్చపములున్ మోక్షార్థమౌముక్తికిన్

మనసేమూలము నీదుభక్తిలకు కృష్ణా దేవకీనందనా

శా. బాలక్రీడలఁ గొన్నినాళ్ళు పిదపన్ భామాకుచాలింగనా

లోలాభ్యున్నతిఁ గొన్నినాళ్ళు మఱియిల్లున్ ముంగిలిం గొన్నినా

ళ్ళీలీలన్ విహరించితిన్ సుఖఫలం బెందేనియున్ లేదుగా

చాలన్ నీపదభక్తిఁ జేసెదను కృష్ణా దేవకీనందనా

మ. అరయన్ *శాంతనుపుత్త్రుపై విదురుపై నక్రూరుపైఁ గుబ్జపై

నరుపై ద్రౌపదిపైఁ గుచేలకునిపై నందవ్రజస్త్రీలపైఁ

బరఁగం గల్గు భవతృపారసము నాపైఁ గొంతరానిమ్ము మీ

చరణాబ్జంబుల నమ్మినాఁడ హరి కృష్ణా దేవకీనందనా

(* చందనగంధిపై అని పాఠాంతరము)

మ. కరి నేలింది హుళక్కి ద్రౌపదికి కోకల్ మెచ్చి యిచ్చింది ద

బ్బఱ కాకాసురునిం గటాక్షమునఁ జేపట్టిం దబద్ధం బహో

శరణన్నన్ బగవాని తమ్మునికి రాజ్యంబిచ్చుట ల్కల్లయి

త్తఱి నన్నేలిన నిక్క మీకథలు కృష్ణా దేవకీనందనా

ఇలాంటి అద్భుతమైన శతకం పూర్తిగా చదివితే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. మీరుచదవండి. మీ మిత్రులతో చదివించండి.

No comments:

Post a Comment

Pages