సౌందర్యాతిశయం నీవు !
(చిత్రం : చిత్రకారులు ఉదయ్ కుమార్ మార్లపుడి )
- శశి బాల
ఏ పువ్వు చూసినా
కనిపించేది నీ దరహాస రేఖలే
ఏ కలకూజితాల కలకలలు విన్నా
వినిపించేది నీ హాస లాస్య గమకాలే
ఏ నాట్యం చూసినా తెలిసేది
నీ మేని వంపుల శృంగార భంగిమలే
ఏ నాదం విన్నా మైమరపించేది
నీ మధుర స్వర వీణాధునీ కలిత రాగాలే
ఏ మెరుపు చూసినా కనులు
మిరుమిట్లు గొలిపేది నీ తనూ విలాసమే
ఏ తెమ్మెర వీచినా మనసుని మత్తేక్కించేది
నీ మేని సుగంధ పరిమళమే
ఏ తూపులు ఎద తాకినా గుచ్చి బాధించేది
నీ చూపుల కొ (ఓ ) ర తనమే
ఏ తుమ్మెద ఝుమ్మని వాలి గ్రోలినా
విరి తేనెల ధిక్కరించు నీ అధరసుధారస సంపదే
ఏ మన్మధుడైనా పొరబడితే
అది రతిని మించిన నీ సౌందర్యాతిశయమే
ఏ కోమల కుసుమం తాకినా తెలిసేది
నీ లలిత లావణ్య కర స్పర్శనా మహత్యమే
విరించి నిన్ను సృశించిన పిదప
ఒక్క క్షణం తదుపరి సృష్టినే మరచేనేమో
ఇంతెందుకు ప్రియా నీవొక శృంగార రసాధి దేవతవు !
No comments:
Post a Comment