కష్టజీవి శ్రీకృష్ణుడు - అచ్చంగా తెలుగు

కష్టజీవి శ్రీకృష్ణుడు

Share This

కష్టజీవి శ్రీకృష్ణుడు

- పిస్కా సత్యనారాయణ

 
      మీలో చాలామందికి ఈ వ్యాసం యొక్క శీర్షిక (Title) చిత్రంగా తోచవచ్చు - "శ్రీకృష్ణుడు కష్టజీవి ఏమిటీ?!" అని. వ్యాసమును చదివిన పిమ్మట, ఈ శీర్షిక పెట్టడంలోని సామంజస్యాన్ని మీరే నిర్ణయించాలి.
శ్రీరాముని కంటే హెచ్చు సందర్భాల్లో కష్టనష్టాలను చవిచూసినవాడు శ్రీకృష్ణుడు...
కృతయుగంలో శ్రీరామునిగా మనకు ఎన్నో ఆదర్శాలను బోధించిన శ్రీమహావిష్ణువే, మళ్ళీ ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా జన్మించి ఎన్నో బాధలనూ, కష్టాలనూ అనుభవిస్తూ, మనకెన్నో ధర్మసందేశాలను అందించాడు. శ్రీకృష్ణునిది విలాసజీవితం అనుకుంటారు ఎంతోమంది. నిజానికి, శ్రీరాముని కంటే హెచ్చు సందర్భాల్లో కష్టనష్టాలను చవిచూసినవాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా, ఏనాడూ ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు, మనకు కష్టాలుగా కనిపించవు. శ్రీరాముని జీవితమే మనకు కష్టాలమయంగా కనిపిస్తుంటుంది. ఈ విషయంపై ఒకసారి దృష్టి సారిద్దాం. శ్రీరాముని శైశవం, బాల్యం బహుసుఖంగానే గడిచాయి. సీతను వివాహమాడిన అనంతరం కొన్నేళ్ళు సుఖంగా జీవించాడు. ఆ తర్వాత 14 సంవత్సరాల అరణ్యవాసం, ఉత్తరకాండలో సీతావియోగం.......ఇవీ శ్రీరామునికి వచ్చిన ముఖ్యమైన కష్టాలు. కొంతకాలం కష్టాలు అనుభవించినా, ఆయన సుఖపడిన సంవత్సరాలు చాలా ఉన్నాయి. ఇక శ్రీకృష్ణుని సంగతి చూద్దాం. పైకి సుఖంగా, హాయిగా ఉన్నట్లు కనిపించినా, పుట్టింది మొదలు దేహత్యాగం చేసేవరకూ కూడా ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై, స్థిరజీవనం లేకుండా కాలం గడిపాడు శ్రీకృష్ణుడు. ఆ వివరాలను క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెఱసాలలో మ్రగ్గిపోయారు. శ్రీకృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టిన మరునిమిషమే తల్లిదండ్రులకు దూరమయ్యాడు. అనేక కష్టాలతో వ్రేపల్లెకు వలసపోయాడు. చూశారా! పురిటికందుకే ఎన్ని కష్టాలో!
       కేవలం కొన్నిరోజుల వయసుకే శ్రీకృష్ణునిపై మొదటగా హత్యాప్రయత్నం చేసింది పూతన. అప్పటినుండీ అతనికి దినదిన గండంగానే గడిచింది. శ్రీకృష్ణుని శైశవదశ, బాల్యదశ కూడా - శకటాసురుడు, తృణావర్తుడు, వత్సకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైన ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనే యక్షునితోనూ, కాళీయుడు అనే సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది.తన గురువైన సాందీపనిమహర్షి మృతపుత్రుణ్ణి తిరిగి బ్రతికించి తీసుకురావడానికి నరకానికి వెళ్ళి, యమునికే ఎదురు నిలిచాడు. ఒక సంవత్సరం పాటు తానే గోవులుగా, గోపాలురుగా జీవించి బ్రహ్మదేవునికి గర్వభంగం కావించాడు. ఇంద్రుని ఎదిరించి, తనవారిని కాపాడేందుకు గోవర్ధనగిరిని పెకలించి, ఏడురోజులు ఆ పర్వతాన్ని మోశాడు. యవ్వనదశ ఆరంభంలో మధురానగరం చేరాడు. అక్కడ కృష్ణుణ్ణి చంపేందుకు "కువలయాపీడం" అనే మదపుటేనుగును అతనిపైకి తోలించాడు కంసుడు. కాని, శ్రీకృష్ణుడే ఆ ఏనుగును సంహరించాడు. ఆ తర్వాత మల్లయోధుడైన చాణూరునితో పోరాటం. వాణ్ణి చంపిన పిమ్మట కంసునితో తలపడ్డాడు. కంసవధ అనంతరం కూడా శ్రీకృష్ణుని సమస్యలు తీరలేదు.కేవలం పదహారేళ్ళనాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత దుర్భరమో ఆలోచించండి.ఆ తర్వాత జరాసంధునితో వరుసగా 17 సార్లు భీకరయుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లూ శ్రీకృష్ణుడే జయించాడు. కాని, క్షణం విశ్రాంతి లేకుండాపోయింది. అంతలోనే "కాలయవనుడు" అనే గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది. యుద్ధాల వల్ల ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలుగుతున్నదని భావించిన శ్రీకృష్ణుడు తన రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు.అనంతరం రుక్మిణిని వివాహమాడేందుకు, ఆమె అన్నయైన రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందిన ఘట్టములో శమంతకమణిని అపహరించాడనే నిందనూ, ఒక హత్యానేరాన్నీ మోశాడు. ఎన్నో కష్టాలు పడి, పరిశోధించి, శమంతకమణిని సాధించి తెచ్చి, తనపై మోపిన నిందలను పోగొట్టుకున్నాడు. జాంబవతిని పెళ్ళాడేముందు, ఆమె తండ్రియైన జాంబవంతునితో భయంకరయుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైన నాగ్నజితిని వివాహం చేసుకునేటందుకు, మదించిన ఆబోతులతో పోరాడవలసి వచ్చింది.
      జీవితమే ఒక పోరాటమయింది శ్రీకృష్ణునికి. చివరకు సంసారజీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలూ, వైషమ్యాలూ ఎన్ని ఎదురైనా ప్రశాంతంగా చిరునవ్వు లొలికిస్తూనే, ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లు నటిస్తూనే, చక్కటి గుణపాఠాలను నేర్పుకొచ్చిన మగధీరుడు ఆయన. సత్యభామ కోరిన పారిజాతవృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు.చెల్లెలు సుభద్ర వివాహవిషయములో బలరామునిచే నానా మాటలూ పడ్డాడు. ప్రజాకంటకుడైన నరకాసురునితో ఘోరయుద్ధం చేసి, అతణ్ణి వధించాడు. దుష్టుడూ, అహంకారీ అయిన పౌండ్రకుణ్ణి అంతమొందించాడు. జరాసంధుణ్ణి భీమునిచే సంహరింపజేశాడు. శిశుపాలుణ్ణి కడతేర్చాడు. అనంతరకాలంలో సాళ్వుడు అనే రాజు శ్రీకృష్ణునిపై దండయాత్ర చేశాడు. అతడు తపస్సు చేసి, శివుని వరం పొంది, శివప్రసాదిత విమానంపై వచ్చి, ద్వారకపై దాడి చేశాడు. ఆ యుద్ధములో సాళ్వుణ్ణి వధించాడు శ్రీకృష్ణుడు. ఆ పిదప దంతవక్త్రుడు, విదూరథుడు మున్నగు దుష్టులెందరినో మట్టుబెట్టాడు.తన కుమారుడైన సాంబుని వివాహవిషయంలో కౌరవులతో వైరం తప్పలేదు ఆయనకు. తన మనుమడైన అనిరుద్ధుని కళ్యాణఘట్టములో బాణాసురునితోనూ, సాక్షాత్తు శివునితోనూ కూడా యుద్ధం చేయవలసి వచ్చింది.తననే నమ్ముకున్న పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసిన గాయాలకు గురైనాడు. కురుక్షేత్రములో దుష్టజన నాశనం పూర్తయినా, శ్రీకృష్ణుని కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారిచేత శపించబడ్డాడు. యదువంశం నాశనమై పోవాలని శపించింది ఆమె! శ్రీకృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కోపం తెచ్చుకోలేదు, బాధ పడలేదు. యాదవకుల నాశనానికి "ముసలం" పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనుమలు యావన్మందీ ఒకరినొకరు నరుక్కుంటూ చచ్చి పీనుగుపెంటలైపోతున్నా, విధి విధానాన్ని అనుసరించి అలా చూస్తూ నిలబడ్డాడు శ్రీకృష్ణుడు! సోదరుడైన బలరాముడు సైతం తన కళ్ళముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు.
      అలాంటి సమయములో ఆయన మనఃస్థితి ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. శ్రీకృష్ణుని జీవితం పూలపానుపేమీ కాదు; దారుణమైన ముళ్ళబాట. ఆయన జీవితం కులాసాగా గడిచిందో, అష్టకష్టాలతో గడిచిందో ఈసారి మీరే చెప్పండి.మనకు చిన్న కష్టం వస్తే చాలు, ఎంతో బాధపడి పోతాం. ఆ కష్టాలకు బాధ్యుడు దేవుడేనని నిందిస్తాం. కాని, భగవంతుడు శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా మానవరూపం దాల్చి, మానవులకంటే ఎక్కువ కష్టాలూ, సమస్యలూ అనుభవించి చూపించాడు. శ్రీకృష్ణుడు అనుభవించిన కష్టాల్లో వందోవంతు కష్టాలు పడిన మానవులు ఎవరైనా ఉన్నారా?ఆయన ఎదుర్కొన్న సమస్యల్లో కనీసం వెయ్యోవంతయినా సమస్యలు చవిచూసినవారు ఉన్నారా? శ్రీకృష్ణుడు మోసినన్ని నిందలు, ఆరోపణలు ఎవరు మోశారు?.......నేటి మానవుల్లో ఏ ఒక్కరైనా సరే ఆయన స్థానములో ఉంటే - ఆయన పడిన వేదనలు, బాధలు, సమస్యలు భరించగలిగేవారా? మన ఆత్మీయుల్లో ఏ ఒక్కరు మరణించినా "జాతస్య మరణం ధ్రువం" అని తెలిసికూడా భోరున విలపిస్తూ, దైవాన్ని నిందిస్తాం మనం. తనవారెందరో తన కళ్ళ ముందే మరణించడం చూశాడు శ్రీకృష్ణుడు. వంశం యావత్తూ....కుమారులు, మనుమలు, సోదరులతో సహా అందరూ దారుణంగా మరణిస్తున్న దృశ్యాన్ని చూశాడాయన! అలాంటి దృశ్యం చూసి ఎవరైనా సహించగలరా?.......కష్టపడి నిర్మించుకున్న ద్వారక కొద్దిరోజుల్లో సర్వనాశనం కానున్నదని ఆయనకు తెలుసు. తనవారెవరూ మిగలరనీ తెలుసు. బలరాముడు తనకంటే ముందే లోకాన్ని విడిచి వెళ్ళిపోతాడనీ తెలుసు. తమ స్త్రీలు, పిల్లలు అంతా అనాధలు అవుతారనీ తెలుసు. తనకు చివరి ఘడియలు వచ్చాయనీ తెలుసు. ఇన్ని తెలిసినప్పుడు హృదయంలో ఎలా ఉంటుందో, చివరి క్షణాల్లో ఆ ఒంటరి వ్యక్తి పడే మనోవ్యధ ఎంత దారుణమైనదో మీరు ఊహించగలరా?........నీతులూ, ధర్మాలూ చెప్పడం తేలికే! కాని, ఆచరించడం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే! అనుభవించడం కష్టం. కాని, శ్రీకృష్ణుడు అన్నీ ఆచరించి, భరించి చూపించాడు.
    శ్రీకృష్ణుని పేరు వినగానే "గోపికలు, రాసలీలలు, వెన్న దొంగతనాలు, బృందావన విహారాలు, అష్టభార్యలు......" ఇవే గుర్తుకొస్తాయి మనకు. "జీవితమంటే నిజంగా శ్రీకృష్ణుడిదే! అమ్మాయిలతో వెన్నెల షికార్లు, బృందావనంలో ఆటపాటలు....అలా ఉండాలి జీవితం" అనుకుంటూ కొంతమంది అజ్ఞానంతో వాపోతుంటారు. శ్రీకృష్ణుని జీవితం గురించి వారికి ఏమాత్రం తెలుసునని?.....ఆయన అనుభవించిన వాటిలో ఒక చిన్న కష్టాన్ని కూడా నిజజీవితంలో మనం భరించలేం. కష్టాల్లో ధీరోదాత్తంగా నిలబడినవారికే సుఖాలందుకునే అర్హత, అవకాశం ఉంటాయి.దైవాన్ని విమర్శించే హక్కు, నిందించే అధికారం మనకు లేవు. మనం పడే కష్టాలు, దేవుళ్ళు పడిన కష్టాల ముందు ఒక లెక్క కాదు. మనం శ్రీకృష్ణపరమాత్మ లోని ధీరోదాత్తతను అలవరచుకోవాలి; స్థితప్రజ్ఞులం కావాలి. అందుకోసం కావలసిన మనోబలాన్ని మనకు ఇచ్చేందుకే శ్రీకృష్ణుడు ఇంత జగన్నాటకం ఆడి చూపించాడు.

No comments:

Post a Comment

Pages