ఉలి ‘ చెక్కని ‘ శిల్పం
- డా.నీరజ అమరవాది.
కల్లా కపటం తెలియని ‘ బాల్యం ‘
నవ్వుతూ , తుళ్లుతూ , ఎగురుతూ
తోటివారితో ‘ ఆటలు ‘ .
ఆడపిల్లవి ‘ ఆ ‘ ఇకపకలేంటి
హెచ్చుస్వరంతో ‘ బామ్మ’ హెచ్చరింపు.
‘ చింతపిక్కలు , గచ్చకాయలు ‘ ఆడుకోవచ్చుగా !
‘ అమ్మమ్మ , తాతయ్యల ‘ బుజ్జగింపు .
‘ఆడపిల్లవి ‘ పెద్ద పెద్ద చదువులెందుకు ?
ఉద్యోగాల పేరుతో ‘ ఊర్లు ‘ తిరగటమెందుకు ?
అమ్మ ‘ ప్రేమపూర్వక లాలింపు ’.
సినిమాలు , షికార్లు అంటూ ,
స్నేహితులతో తిరిగి ‘ పరువుతీయకు ‘
అన్నయ్య ‘ అధికారస్వరం ’ .
“ ఏ ఈడుకు ఆ ఈడు ముచ్చటన్నట్లు ”
బుద్ధిగా తలవంచుకొని
చెప్పిన వాడితో ‘ మూడుముళ్లు ’ వేయించుకో
నాన్న బాధ్యతతో కూడిన ‘ హితవచనాలు ‘ .
ఇక్కడ నాకు నచ్చినట్లు నీ ‘ కట్టు బొట్టు ‘ ఉండాలి
కొత్తగా వచ్చిన భర్త ‘ హోదాలో ‘ బోధన .
ఆడబడుచును ‘ అక్కగా ‘ ,
మరిదిని ‘ తమ్ముడుగా ‘ ,
“ ఏ లోటూరాకుండా చూసుకోవాలి “
అత్తమామల ‘ మనసైన మాట ’.
ఇంటివారితోపాటు ‘ ఇరుగు పొరుగువారి ’
కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలి
చుట్టుపక్కలవారి ‘ ఉచిత సలహా ’ .
అమ్మా ! నీకేం ‘ తెలియదు ’
మేము చెప్పినట్టు విను
“ పాతబడిన పోకడలతో మాకు తలవంపులు తేకు ”
పిల్లల ‘ అసహన ’ వచనాలు .
అటు పెద్దల ‘బుద్ధులు ’ , ఇటు పిన్నల ‘ సుద్దులు ’
అందరి అభిప్రాయాలకి , అజమాయిషీలకి లొంగి
నా ‘ ఇష్టాలను ’ పట్టించుకోవాలని తెలియక
ఎవరికి కావలసినవి వారికి అందిస్తూ
మరబొమ్మగా , స్పందన లేని ‘ మనిషిలా ’ మలచబడ్డాను .
ఏ విభాగంలోను నాకు ఎవరూ ‘ పోటీ ‘ లేరు.
‘ అవార్డులకు ‘ కొదువలేదు
ఉత్తమ ఇల్లాలు -- బంధువుల ‘ కితాబు ’
మా అమ్మ చాలా ‘ మంచిది ’ పిల్లల మెచ్చుకోలు
“ శిలను ‘ మనిషిగా ’ మార్చిన రామజన్మ భూమిలో “
మనిషిని ‘ శిలగా ’ మార్చగల
రామభక్తులెందరో !
*****
No comments:
Post a Comment