కందిపప్పు - అచ్చంగా తెలుగు

కందిపప్పు

Share This

కందిపప్పు

- పెయ్యేటి శ్రీదేవి


          స్కూలు నించి పదేళ్ళ చింటూ స్కూల్ బస్సు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి, ఇంటికి రాగానే హడావిడిగా పుస్తకాలు సోఫాలో విసిరేసి, జేబులోంచి ఒక పొట్లం తీసాడు.  ఆ పొట్లం జాగ్రత్తగా విప్పి, వంటగదిలోకి వెళ్ళి వంటపనిలో వున్న తల్లి శ్రావ్యకి పొట్లంలో ఉన్న చిన్న వస్తువుని చూపించి, ' మమ్మీ!  ఇదేంటో చెప్పుకో చూద్దాం.' అన్నాడు.  శ్రావ్య ఆ చిన్ని పదార్థాన్ని అటు ఇటు తిప్పి, ' ఏమోరా, తెలీదు.  నేనెప్పుడూ చూడలేదు.  గోల్డ్ కలర్ లో వుంది కాబట్టి బంగారం ముక్కేమో నానమ్మ నడుగు.' అంటూ చింటూకివ్వబోతుంటే, అదెక్కడో కింద పడింది.మమ్మీ అజాగ్రత్త వల్ల కిందపడ్డ ఆ పదార్థాన్ని నేల మీద పడుకుని వెతికాడు.  ఎలాగో ఫ్రిజ్ కింద పడ్డ దాన్ని తీసి, జాగ్రత్తగా  పొట్లం కట్టి, నానమ్మ దగ్గరకెళ్ళి అడిగాడు.
          ' నానమ్మా!  నానమ్మా!  ఇదేమిటో చెప్పుకో.'నానమ్మ దాన్ని చేతిలోకి తీసుకుని పరీక్షగా చూసింది.  ' దీని పేరు ' క ' మీద మొదలవుతుందిరా.  చివర ' ప్పు ' యో ఏదో వస్తుంది.  నోట్లో నానుతోంది.  గుర్తుకు రావటల్లేదు.' అంది.' ఉండు, ముత్తవ్వ నడుగుతా.  ముత్తవ్వా!  దీని పేరేంటో చెప్పు?'' చెబుతా గాని అక్కడెక్కడో కళ్ళద్దాలు పెట్టాను.  ఇలాగియ్యి.' ' ఇవిగో కళ్ళద్దాలు.' ' హు!  కళ్ళద్దాలక్కూడా చత్వారం వచ్చినట్టుంది!  భూతద్దం వుంటే తెచ్చిపెట్టు.' ' ఉండవ్వా, నే తెస్తా.' అంటూ చింటూ చెల్లెలు ఏడేళ్ళ మణిమాల భూతద్దం తెచ్చిచ్చింది. ముత్తవ్వ భూతద్దం లోంచి చూసి పగలబడి నవ్వి, ' ఓస్, ఇదా?  కందిబద్దరా.' అంది. ' కందిబద్ద కాదు, కందిపప్పు.' అన్నాడు చింటూ. ' అదేలేరా.  ఒక్కటే చూపించావుగా మరి?  అందుకే కందిబద్ద అన్నాను.  ఎక్కువగా వుంటే కందిపప్పు అంటాం.  అది సరే, ఈ బద్ద ఎక్కడ దొరికిందిరా నీకు?' చింటూని అడిగింది ముత్తవ్వ. ' ఈరోజు క్లాసులో అందరం పురాతన వస్తుప్రదర్శనశాలకెళ్ళాం.  అక్కద సీసాలో పోసుంది.  దానిమీద ' కందిపప్పు ' అని రాసుంది.  ఇంకా దానితో చేసే రకరకాల వంటకాల పేర్లు కూడా రాసున్నాయి.  పెద్ద బైండు పుస్తకం కూడా వుంది.  ఆ పుస్తకం పేరు ' కందిపప్పు - దాని పోషకవిలువలు, దానితో చేసే వంటలు.'  ఆ పప్పు ఎందుకు కనుమరుగైందో, 2009 సంవత్సరం జులై నించి కందిపప్పుకి కష్టకాలం దాపురించిందని, దీనికి రాజకీయనాయకులే కారణమని, అదే అలుసుగా తీసుకుని కందిపప్పు వున్నా షాపుల్లో రేట్లు పెంచేసారని, ఈ విధంగా రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు లాభపడుతున్నారని.......ఇంకా ఏదో రాసారు.  అన్నీచదవడం కుదరలేదు.  ఆ పుస్తకం అమ్మేదీ కాదు.  ఒకవేళ కొ్నాలన్నా దాని ధర లక్ష రూపాయలు!' ' ఎందుకు, ఆ కందిపప్పుకొచ్చిన కష్టాలు నేనే చెబుతాను విను. మా రోజుల్లో పప్పు వండుకోందే ముద్ద దిగేది కాదు.  రోజూ ముద్దపప్పు కలుపుకుని, కాచిన నెయ్యి పోసుకుని, అందులో వూరుమిరపకాయలో, ఆవకాయో నంచుకు తింటే, అబ్బ, స్వర్గమే!  ఇంకా కాస్త వెరైటీగా టొమేటోపప్పు, దోసకాయపప్పు, మామిడికాయ పప్పు, ఆనపకాయ పప్పు, తోటకూర, పాలకూర, గోంగూర - ఇలా కలగలుపు పప్పులూ చేసే వాళ్ళం.  ఇంకా పప్పు పులుసు, సాంబారు ఎంతో రుచిగా వుండేవి.  ఏ ఆకుకూర పులుసో, ముక్కల పులుసో పెట్టినా, అందులో ఇంత పప్పు గాని, పప్పు తేట గాని పోస్తే మహారుచిగా వుండేది.  ఇంకా పెళ్ళిళ్ళల్లో విందులకి తప్పనిసరిగా సాంబారు వుండి తీరాలి.  సాంబారన్నంలో నెయ్యి పోసుకుని, అప్పడాలు గాని, వడియాలు గాని కొరుక్కు తింటే బలే రుచిగా వుంటుందిలే.  ఏమిటో, జిహ్వ చచ్చిపోయింది.  ఆ వంటలు, ఆ ఆంధ్రా రుచులు ఏనాడో అంతరించి పోయాయి.  ఏవో పచ్చడి మెతుకులు తింటూ ఎలాగో ఓ లాగ బతికేస్తున్నాం.  ఇదుగో కాత్యాయనీ!  నీ కోడలి చేత ఎలాగో నాలుగు కందిబద్దలు సంపాదించి ముద్దపప్పు గాని, సాంబారు గాని చేయించవే.  ఏనాడో మరిచిపోయిన కందిపప్పు రుచుల్ని ఈ చింటూగాడు గుర్తు చేసాడు.' అంది ఆవిడ కోడలితో ముత్తవ్వ. ' ఔను నానమ్మా.  నాకూ అవి తినాలనుంది.  రుచి చూపించు.  మీరంటే, మీ కాలంలో ఆ రుచులని ఆస్వాదించారు.  మా తరానికి కందిపప్పుని మ్యూజియంలో చూడాల్సిన గతి పట్టింది.' ' అసలు కందిపప్పు ఎక్కడుందిరా, వండమని ఆర్డర్లు జారీ చేసేస్తున్నారు నువ్వూ, మీ అవ్వ? ఎక్కడో వెతికి పట్టుకున్నా, కె.జి. పదివేలరూపాయలు పెట్టి ఎక్కడ కొంటాం?  బద్ద పది రూపాయలకిస్తాడు గాని, సరిపోవద్దూ?' అంది శ్రావ్య. ' ఏమైనా సరే.  నా పుట్టినరోజు వస్తోందిగా?  ముద్దపప్పు, వూరుమిరపకాయలు, సాంబారు, మామిడికాయ పప్పు, దోసకాయ పప్పు - పప్పుతో ఎన్ని రకాలుంటే, అన్ని రకాలు చేసెయ్యి మమ్మీ.' ' ఏడిసావులే.  ఒకే రోజు పప్పుతో అన్ని రకాలు చేసుకు తినరు.' అంది ముత్తవ్వ. ' అన్నట్టు ముత్తవ్వా!  నా కందిబద్ద ఎక్కడ పెట్టావు?  మ్యూజియంలో ఎలాగో కొట్టేసాను.  అది చూపించి డాడీని అలాంటి కందిపప్పు తెమ్మంటాను.  అసలీ కందిపప్పు ఎలా కనుమరుగైంది నానమ్మా?' ' ఏమిటోరా, అసలీ కందిపప్పు రేటు కె.జి. ఇరవై, ముఫ్ఫై, నలభై - అలా వుండేది.  ఉన్నట్టుండి 2009 వ సంవత్సరం జులై నెలలో తొంభై, వంద, నూట ఇరవై రూపాయలు ఐకూర్చుంది.  ఆ తర్వాత కనబడకుండా పోయింది.' అంది నానమ్మ. ' మా కాలంలో ఐతే ఆర్రూపయలే వుండేదే కాత్యాయినీ!' అంది ముత్తవ్వ. ' ఊర్కోండత్తయ్యా, మీ అమ్మమ్మ కాలంలో రూపాయికే ఇచ్చి వుంటారు.  మరప్పుడు జీతాలూ తక్కువే కదా?' అంది కాత్యాయిని. ' అదేమో గాని, మా రోజులే బాగున్నాయి.  జీతాలు తక్కువై్నా తిండికి లోటు లేకుండా గడిపాము.' ' ఆ...ఏం బాగు ఆ రోజులు?  ఓ గ్యాస్ స్టవ్వా, కుక్కర్లా, కుళాయిలున్నాయా?  పొయ్యిల మీద, కుంపట్ల మీద వంటలు!  రోట్లో రుబ్బుకోవడాలు!  నూతుల్లోంచి నీళ్ళు తోడుకోవడాలు!  అభివృధ్ధి లేని రోజులు.  అప్పటి వాళ్ళు బుద్ధావతారాలు!  చింతమొద్దుల్లా అమాయకంగా బతికేసారు.' కాత్యాయిని అత్తగారితో అంది. కోడలన్న మాటలకి ఆవిడకి కోపం వచ్చి, ' ఆ....మా కాలంలో అన్ని పనులు మేం మిషన్ల సాయంతో కాక, మేమే చేసుకునే వాళ్ళం కాబట్టి, ఆరోగ్యంగా అందంగా వున్నాం.  అందుకే నన్ను ' ఆంటీ ' అని నిన్ను ' మామ్మగారూ' అని పిలుస్తారు అందరూ.  తిన్న కందిపప్పు బలం, చేసిన చాకిరీ వల్ల వంటికి ఎక్సర్ సైజు అయి, నీకు, నీ కోడలికి వున్న కాళ్ళ నెప్పులు, ఒళ్ళు నెప్పులు, బి.పి.లు, సుగర్లు నాకు లేవు.  నీ తరం వచ్చేసరికి కందిపప్పు రాజకీయ నేతల చేత చిక్కి, ధరలు ఆకాశాన్ని కూడా దాటిపోయాయి.  ఆ రోజుల్లో పెళ్ళీడు పిల్లలు కనిపిస్తే, ' ఏమే!  మాకు పప్పన్నం ఎప్పుడు పెడతావే?' అనేవాళ్ళం.  ఆ డైలాగు ఎప్పుడో అంతరించిపోయిందనుకో.  అంటే కందిపప్పుకి అంత ప్రాధాన్యత వుండేది.  ధనియాలు, ఆవాలు, ఎండుమిరపకాయలు పోపు పెట్టి, కొత్తిమీర వేసి, కందిపచ్చడి చేసి, దానికి కాంబినేషను ఉల్లిపాయ పులుసు వేసుకు తింటే, ఆహా....ఏమి రుచి?' ' మమ్మీ, మమ్మీ!  నాకు కందిపచ్చడి, ఉల్లిపాయ పులుసు చేసిపెట్టవా?' అంది చింటూ చెల్లెలు మణిమాల. ' ఉండవే, ' అవాక్కయ్యారా' కార్యక్రమానికి రిజిస్టర్ చేసాను.  మొన్నెవరికో ఆరు కె.జి.ల కందిపప్పు గిఫ్ట్ గా వచ్చిందట!  మనక్కూడా రావచ్చు.  అప్పుడు మీరడిగినవన్నీ చేస్తాలే.' ' అవాక్కయ్యారా లో కందిపప్పు ఎందుకక్కయ్యా?  ఇదిగో నేను తెచ్చాగా?' అంటూ ఒక పేకెట్టు ఆవిడ చేతికిచ్చాడు అప్పుడే లోపలికొస్తున్న ఒక నడివయసాయన. ' ఎక్కడిదిరా నీకీ కందిపప్పు, ఏనాడో కనుమరుగైపోతే?' అంది కాత్యాయిని. ' అవన్నీ అడక్కు. నీకు సాంబారిష్టమని తెచ్చాను.  జాగ్రత్తగా వాడుకో.' అంటూ కాఫీ తాగివెళ్ళమన్నా వినిపించుకోకుండా కంగారుగా వెళిపోయాడు. ఆయన ఆహారశాఖా మంత్రి!  ఆయన గాది కింద పందికొక్కు లాంటి వాడు.  అందుకే గాదిలోని కందిపప్పు తెచ్చి అక్కయ్యకు జన్మదిన కానుకగా ఇచ్చాడు.  ఆయన కాత్యాయినికి పినతల్లి కొడుకు.   చిన్నప్పుడే వాడి తల్లి పోతే కాత్యాయినే వాడ్ని పెంచి పెద్ద చేసింది.  అందుకే ఆవిడంటే అప్పుడప్పుడు కృతజ్ఞత చూపించకపోతే ఏమన్నా అనుకుంటుందని, ఉదారబుధ్ధితో జన్మానికో శివరాత్రి అన్నట్లు వచ్చి ఏదో తెస్తూ వుంటాడు ఆ మినిస్టరుగిరీ వెలగబెట్టే తమ్ముడు! కందిపప్పు పేకెట్టుని అందరూ ఆత్రంగా విప్పిచూసారు ఎలా వుంటుందోనని.  శ్రావ్య జాగ్రత్తగా కందిపప్పుని డబ్బాలో పోసింది. ' జిహ్వ చచ్చిపోయింది.  కందిపచ్చడి, ఉల్లిపాయ పులుసు చేసి పెట్టవే శ్రావ్యా!' అని కోడలికి పురమాయించింది అత్తగారు. ' కందిపచ్చడి రేపన్నా చేయొచ్చు.  ఇవాళ ములక్కాడలు వేసి సాంబారు పెట్టి, అప్పడాలు, వడియాలు వేయించు.' అని అత్తగారి అత్తగారు పురమాయింపు. ' నాకు టొమేటో పప్పు, మామిడికాయ పప్పు చేసి పెట్టమ్మా.  అందులోకి వూరుమిరపకాయలు వేయించు.  బలే భేషుగ్గా వుంటుంది.' మామగారు ఉవాచ. ' మమ్మీ!  నాకు ముద్దపప్పు చెయ్యి.  ముత్తవ్వ చెప్పినట్లు ఇంత నెయ్యి పోసుకుని తింటా.' పుత్రరత్నం కోరిక. ' మమ్మీ!  నాకేమో ఆలూ కూటు, బిసిబేళ బాత్ చెయ్యి.  చాలా బాగుంటుందట.  మా సైంసు టీచరు కందిపప్పు పాఠం చెబుతూ చెప్పింది.' అంటూ చిట్టికూతురు మణిమాల కోరిక. ' ఉన్న కాస్త కందిపప్పుకి ఇన్నిరకాలు ఎలా చేస్తుందర్రా?  ఐనా రోజుకొకటి చేస్తుందిలే.' అని అత్తగారి అత్తగారు జగదాంబగారు అంది. ' అసలు అందరూ తలోటి చెయ్యమని చెప్పేస్తున్నారు.  అసలు కందిపప్పు అంటేనే తెలీదు నాకు.  ఈరోజే మొదటిసారిగా చూసాను.  ఎలా వండాలో మీరే చెప్పండి.' అంది శ్రావ్య. అత్తగారు చెప్పినట్లే ఆ రోజుకి ముద్దపప్పు, ములక్కాడ సాంబారు చేసి వూరుమిరపకయలు, అప్పడాలు వేయించింది. అందరూ ' ఈరోజు ఆహా విందు భోజనం' అనుకుంటూ లాలాజలంతో నోరూరిపోతుంటే ఆత్రంగా టేబులు దగ్గర భోజనాలకి కూచున్నారు.  ముందుగా ముద్దపప్పు కలుపుకుని, అందులో వేడినెయ్యి పోసుకుని నోట్లో పెట్టుకుని, ' ఎన్నాళ్ళయిందో పప్పన్నం తిని ' అనుకుంటూ వూరుమిరపకాయలు కొరుక్కున్నారు.  కాని రుచి ఏదో తేడాగా వుండి ఎవరూ తినలేక పోయారు.  సాంబారు పోసుకుంటే అది కూడా ఘోరాతి ఘోరంగా వుంది.   ముద్దపప్పు ముక్కవాసన వచ్చింది.  సాంబారు కూడా అదే పరిస్థితి! ' ఏమిటి నానమ్మా?  ముద్దపప్పు, సాంబారు ఎంతో రుచిగా వుంటాయని గొప్పగా నువ్వు చెబుతే ఎంతో ఆత్రంగా భోజనానికి కూర్చున్నాము.  ఇంత ఘోరంగా వున్నాయేమిటి?' అంటూనే పిల్లలిద్దరూ వాంతులు చేసుకున్నారు. వంట సరిగా చేయలేదని జగదాంబ శ్రావ్యని తిట్టింది. పప్పు కడుగుతే రంగునీళ్ళు వచ్చి తెల్లగా తయారైందని, పురుగులు కూడా వచ్చాయని శ్రావ్య చెప్పేసరికి జగదాంబ తన కోడలు కాత్యాయిని మీద ఎకసక్కెంగా విరుచుకు పడింది.
          ' ఏమే కాత్యాయినీ, నీ తమ్ముడు ప్రెమగా కందిపప్పు తెచ్చా, తీసుకో అక్కయ్యా అంటూ పుచ్చిపోయిన కందిపప్పు ఇస్తాడా?  అదేం దుర్బుధ్ధే?  ఛీ!  నీ పుట్టింటారే అంత!  మర్యాద లేని మనుషులు!  ఇస్తే మంచిదివ్వాలి.  లేకపోతే మానెయ్యాలి.  అదివరకూ అంతే.  ఉల్లిపాయలు, టొమేటోలు రేటు పెరిగినప్పుడు కుళ్ళిపోయినవిచ్చి పోయాడు.'' అత్తయ్యా!  వాడేం నా స్వంత తమ్ముడు కాడు.  మా పుట్టింటివాళ్లనేం అనకండి.  మీకు కట్నాలు, లాంఛనాలు బాగానే సమర్పించుకున్నారుగా?  వాళ్ళేం అలాంటి వాళ్ళు కారు.  వీడికే ఈ మాయరోగం.  మంత్రయ్యాక మరీ ఎక్కువైంది.  అబ్బ, ఉండండి.  నాకూ కడుపులో తిప్పుతోంది.  నన్ను వాగించకండి.' అంటూ భళ్ళున వాంతి చేసుకుంది.ఆ పప్పన్నం తిన్నందుకు ఆ రోజు ఆ ఇంట్లో అందరికీ వాంతులు పట్టుకున్నాయి.  ఆ ఇంట్లోనే కాదు, ఊళ్ళల్లో కూడా అందరిళ్ళళోను ఇదే పరిస్థితి!ముఖ్యమంత్రిగారు కందిపప్పు పేదవారికి ఉచితంగాను, మధ్యతరగతి వారికి తక్కువ రేటుకి ఇచ్చారు.  అది పుచ్చినదని తెలియక అందరూ ఆత్రంగా వండుకుని ఆస్పత్రుల పాలయ్యారు.  ఆ పప్పు పుచ్చినట్లు కనిపించకుండా రంగులు కలిపారు.  కందిపప్పు గోదాముల్లో మూలుగుతుంటే కందిపప్పు పండటల్లేదని, ఇతర దేశాలలో కూడా పండటల్లేదని చెప్పి, రేట్లు విపరీతంగా పెంచేసి, ఆఖరికి కనబడకుండా మాయం చేసారు.  ఇప్పుడు గాదుల్లో కందిపప్పు పుచ్చిపోయి వాసన వస్తోంటే, ఈ గాదుల కింద పందికొక్కులు పుచ్చిపోయిన పప్పుని ప్రజలకి అమ్మాలని చూస్తున్నారు.  రాబోయే ఎన్నికలకు ఉచిత కరెంటే కాదు, ఉచితంగా కందిపప్పు ఇచ్చామంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుని, ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. టి.వి.10 ఛానెల్ లో కందిపప్పును గురించిన వార్తలలో, ఆ కందిపప్పు వండుకుని తిన్నవాళ్ళందరూ ఆస్పత్రుల పాలవడం, ప్రతిపక్ష పార్టీలన్నీ, అధికార పక్షం వారు కందిపప్పు దాచేసి పండలేదని చెబుతున్నారని అధికార పార్టీ మీద విరుచుకు పడడం చూపిస్తున్నారు. న్యూస్ రీడరు ఫోను ఇంటర్ వ్యూ చేస్తోంది లైవ్ లో. ' సాయీ!  ఈ కందిపప్పు కహానీ ఏమిటి?  గవర్నమెంటువారు ఉచితంగా ఇచ్చిన పప్పు వండుకుని తిన్న తర్వాతనే వాళ్ళకి వాంతులు, విరోచనాలు పట్టుకున్నాయట, నిజమేనా?  అక్కడ పరిస్థితి ఎలా వుంది సాయీ?  నా మాట వినిపిస్తోందా సాయీ?  అక్కడ పరిస్థితి ఏమిటి?' ' శ్వేతా!  ఇక్కడ పరిస్థితి చాలా తీవ్రంగానే వుంది.  ఒక్కసారిగా జనానికి కందిపప్పు కనిపించేసరికి ఆనందం వేసి, పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టాలన్న సామెత లాగ కందిపప్పు దొరకగానే పెళ్ళి ముహూర్తాలు పెట్టుకుని, అందరూ పప్పన్నాలు, సాంబార్లు, రకరకాల కలగలుపు పప్పులు, కందిపచ్చళ్ళు, బిసిబేళాబాత్ లు చేసుకుని, బాగా ఎంజాయ్ చేద్దామనుకున్నారు శ్వేతా!  రెండు ముద్దలు నోట్లో పెట్టుకోగానే భళ్ళున వాంతులు చేసుకున్నారు.  పిల్లల పరిస్థితయితే మరీ దారుణంగా వుంది శ్వేతా!  పాపం, కందిపప్పు రుచంటే ఏమిటో తెలీక వాళ్ళు అన్నమంత తినెసరికి, వాళ్ళ పేగులు దెబ్బ తిన్నాయి.  ఎవరూ స్పృహలో లేరు.  సెలైను బాటిల్సు ఎక్కిస్తున్నారు శ్వేతా!  ప్రతిపక్ష నాయకుడు, ఆంధ్రదేశం పార్టీ అధ్యక్షుడు ఐన ఇంద్రబాబు, ఇంకా అనేక పార్టీల నాయకులు ఆస్పత్రికి వచ్చి పరామర్శిస్తున్నారు శ్వేతా!  ఇప్పుడు ఇంద్రబాబుగారేమంటున్నారో విందాం శ్వేతా!' ' ఇంద్రబాబుగారూ!  ఈ కందిపప్పు గొడవ గురించి మీ ఉద్దేశ్యమేమిటి?' ' కందిపప్పు బస్తాలు బస్తాలు గాదిలో నిలవ చేసి, గాది కింద పందికొక్కుల్లా ఎవరికీ పప్పుని అందనివ్వకుండా చేసి, ఇలా ఏళ్ళతరబడి దాచిన కందిపప్పుని, పుచ్చిపోయాక దానికి రంగులు కలిపి, ఉచితంగా కందిపప్పు ఇస్తామని మొన్న ఎన్నికలలో వాగ్దానాలు చేసి గ్యాసుపార్టీ వారు గెలిచారు.  మేం ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం.' అలగే ఇతర పార్టీల నేతలు కూడా ఈ చర్యని తీవ్రంగా ఖండించడం చూపించారు. ' ఇదుగో! వండిన సాంబార్లు, కందిపప్పుతో వండిన ఇతర వంటకాలన్నీ రోడ్ల మీద పారబోసారు శ్వేతా!' ' టి.వి. 10 ప్రేక్షకులకి సమాచారాన్నందించినందుకు థేంక్ యూ సాయీ!' ఆ మర్నాడు టి.వి.ఛానెల్సులో అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు మొదలయ్యాయి. ' అధ్యక్షా!  మా గ్యాస్ పార్టీ అధికారం లోకి వచ్చాక ఎన్నో మంచి పనులు చేసాం.  ఇంకా చేస్తూనే వున్నాం.  ' ఆరోగ్యమే మహా భాగ్యం ' పథకం, ఐదు పైసల వడ్డీకే ఋణాలు, చంద్రమ్మ ఇళ్ళ పథకం, ఉచిత కరెంటు, ఋణాల మాఫీ, ఉచిత కందిపప్పు ఇచ్చాం అధ్యక్షా!  ఈ వయసులో కాళ్ళనెప్పుల మూలాన మేం అన్న మాట మీదే నిలబడుతున్నాం అధ్యక్షా!  ఇంద్రబాబు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు.  ఈ రాష్ట్రానికేం ఇచ్చాడు అధ్యక్షా?  ఈ సంవత్సరంలో మొన్న శనివారం నాడు రెండు చినుకులు పడ్డాయి అధ్యక్షా!  అందుకే వరుణదేవుడు కూడా మా పార్టీయే.  మా హయాంలో హరితాంధ్రప్రదేశ్ ని తెచ్చాం.  మా అక్కలు, చెల్లెల్లు, అన్నలు, తమ్ముల్లు, (ముఖ్యమంత్రిగారికి పాపం, ళ పలకదు!) ఇలా ప్రతిఒక్కల్లు మా పరిపాలనలో ఎంతో సంతోషంగా వున్నారు అధ్యక్షా!  అందుకే మల్లీ మల్లీ ఈ ప్రజలు మమ్మల్నే ఎన్నుకుంటున్నారు అధ్యక్షా!' ' ఇంద్రబాబుగారూ!  మీరు మాట్లాడండి.' ' అధ్యక్షా1  కందిపప్పుని కనబడకుండా దాచేసి, పదేళ్ళక్రితం దాచేసిన ఆ పుచ్చిపోయిన పప్పుని, ఉచితంగా కందిపప్పుని ఇస్తామని వాగ్దానం చేసి, సిగ్గు, లజ్జ, నీతి అన్నీ విడిచిపెట్టి అన్యాయంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చారు అధ్యక్షా1  నేనీ చర్యని ఖండిస్తున్నాను అధ్యక్షా!  గాదిలోన కందిపప్పు ఉంటే, గాదికింద పందికొక్కుల్లా తయారయ్యారు అధ్యక్షా1' ' మీ టైమయి పోయింది.  ఇంక కూర్చోండి.' (ప్రతిపక్షపార్టీ కాబట్టి) ' ఈ ఒక్క మాట మాట్లాడనివ్వండి అధ్యక్షా!' ' లేదు.  మీ టైమయిపోయింది.  ఇంక కూర్చోండి.   ఏకాకిరాజ్యం పార్టీ వారూ!  మీరు మాట్లాడండి.' ఏకాకిరాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరాయువు లేచి మాట్లాడాడు, ' అధ్యక్షా!  నేను ఈ అసెంబ్లీలోకి అడుగు పెట్టి పదేళ్ళయింది.  పదేళ్ళనించీ ఈ గ్యాస్ పార్టీ వారు ఆంధ్రదేశం పార్టీ వారు వాదులాడుకుంటూనే వున్నారు.  వీళ్ళు ఇంక మారరా?  ఈ అసెంబ్లీహాలు వీరిద్దరిదేనా?  తిట్టుకోడానికే ఐతే అసెంబ్లీకే రావాలా?  మాక్కూడా ఆవేశం వుంది.  తిట్టే అవకాశం మాకు ఇవ్వరా?  ఎంత టైము వృధా చేస్తున్నారు?  మన ప్రజల గురించి పట్టించుకోకుండా ఎన్ని యుగాలైనా గతం గురించే తవ్వుతున్నారు.  ఇన్నాళ్ళూ ఎందుకి్లా జరుగుతోందా అనుకున్నాను.  లోపం ప్రజలలో లేదు.  మనలోనే వుంది అధ్యక్షా!  ఈ అసెంబ్లీ ఆవరణ లోనే వుంది.  అందుకని అందరూ మారాలని కోరుకుంటున్నాను.' ' చిరాయువుగారూ!  ఇంక మీరు కూర్చోండి.  టైమయి పోయింది. '
************************
          ' ముత్తవ్వా!  ' గాదిలోన కందిపప్పు, గాది కింద పందికొక్కు అంటే ఏమిటి?' అడిగాడు చింటూ.' ఇదుగో, ఇప్పుడు టి.వి.లో చూసావుగా, అసెంబ్లీలో దెబ్బలాటలు?  గాదిలో కందిపప్పును దాచేసిన గాది కింద పందికొక్కులు వాళ్ళే.'
*************************
          మళ్ళీ ఐదేళ్ళు ఐపోయాయి.  ఎన్నికలు మళ్ళీ వచ్చాయి.  ముసలి ముఖ్యమంత్రిగారు నుంచోలేక కుర్చీలో కూచుని, బుగ్గలు సొట్ట పడేలా నవ్వుతూ చెయ్యి ఊపుతున్నారు.  ' రేపు ఎన్నికల్లో మళ్ళీ మా గ్యాస్ పార్టీకే ఓటేసి గెలిపించండి.' కుర్చీలోంచి కర్ర సాయంతో లేవబోయారు.  జిగురున్నట్టుంది.  ఆ కుర్చీకతుక్కు పోయారు.టి.వి. ఛానెల్స్ లో హరితాంధ్రప్రదేశ్ అని రాసున్న పచ్చని వరిచేలల్లో ముఖ్యమంత్రిగారు నిలబడి, తెల్లని గ్లాస్కో పంచె, చొక్కా వేసుకుని, చిరునవ్వులు చిందిస్తూ చెయ్యి ఊపుతూ దర్శనమిస్తున్నారు!
*************************
(గతంలో కొద్ది సంవత్సరాల క్రితం కందిపప్పు రేటు విపరీతంగా పెరిగిపోయిన సందర్భంగా ఈ కథ వ్రాయడం జరిగింది.  అచ్చమైన కందిపప్పుతో చేసే తెలుగు వంటకాలతో, తెలుగు సామెతల చమక్కులతో వ్రాసిన ఈ కథను అచ్చంగా తెలుగు పాఠకమిత్రులకు అందజేస్తున్నాను.-------- రచయిత్రి.)

No comments:

Post a Comment

Pages