స్వర్ణ భారతం
- కాంతి కలిగొట్ల
నల్లని నడిరేయిలో తెల్లనివాడు క్షమాపణ అడిగి భారతావని నుంచి అడుగు బయట పెట్టిన ఆనందాల సమయాన తల్లి ధరణి నుదుట కుంకుమ బొట్టుగా భారతావనిని అలంకరించుకున్నవేళ అర్థరాత్రిలో కూడా అందాల తల్లి అవని భారతి కోటి సూర్యులకు సరిసమానమయిన వెలుగులను దేదీప్యమానంగా విరజిమ్ముతుంటే... జీవితాలను కాదనుకొని జనని భారతి కోసం పోరాడిన భారతీయుడి స్వేద బిందువులు పన్నీటి బిందువులై మిలమిల మెరిసిన సమయాన.. మిన్నంటిన సంబరాలు ఇంద్రధనుస్సులై విరిసిన వేళ నాడుకలలు కన్న భారతం స్వర్ణ భారతం !!! ప్రతి ఆడపడుచు ఇది నా తల్లి భారతి ఒడి అని అర్థరాత్రి అయినా తన నట్టింటిలో లాగే అడుగు బయటకు పెట్టగలిగే స్వాతంత్ర్యం !! నాడు కలలు కన్న స్వర్ణ భారతం !!! ప్రతి భారతీయుడూ ఒక తోబుట్టువు వలే తోటి వారికి చేతిని అందించగలిగే ఆపన్న హస్తం !! నాడుకలలు కన్న స్వర్ణ భారతం !!! మేలును కోరే మేలిమి తలపుల పుత్తడి మనసుల సువర్ణ భారతం నాడు కలలు కన్న భారతం !!! ఆనాడు పోరాడి గెలుచుకున్న స్వాతంత్ర్య ఘడియలలో అలసిన భారత యోధుని అరవాలిన రెప్పలమాటున తళుక్కుమని ఊరించిన స్వర్ణ స్వప్న భారతావనం అరవై ఏడు సంవత్సరాలు గడచిపోయిన కాలంలో చేరిన సంఘటనలతో తెల్లబోయిన భారతీయుని ముఖ కమలములు ఎరుపెక్కిన కన్నీటి కొలనులను కన్నుల మధ్య భారంగా మోసుకుంటూ ప్రశ్నిస్తున్నాయి...... పుట్టినిల్లు భారతావనిలో ఆడపడుచు రక్షణ ఏది ?? అని.. అందలాలెక్కిన అమాత్యులు అభిమాన ధనం అథః పాతాళానికి తొక్కిపట్టి అన్యాయ ధనం ఏల లెక్కిస్తున్నారని ?? మేలు కోరే కలిమి మనసులకు కల్మషాల మసి పూసినదెవరని ?? రెప్పల మాటున మురిపించిన ముచ్చటయిన ఆ స్వర్ణ భారతం ఇలలో సంపూర్ణం గా కనులకు సాక్షాత్కరించేదెప్పుడని ?? ప్రశ్నిస్తోంది నేటి భారతీయ హృదయం...
No comments:
Post a Comment