కథ
|
అచ్చంగా మేము
-ఆకునూరి మురళీకృష్ణ
“ఈ లోకంలో నాకంటే గొప్పవాళ్ళు నీకు కనిపించవచ్చు, నా కంటే తక్కువ వాళ్ళూ కనిపించవచ్చు. కానీ అచ్చంగా నాలాంటి వాళ్ళు నీకు ఒక్కరు కూడా కనిపించరు. ఇతరులతో నన్ను పోల్చడం మానేసి నన్ను నన్నుగా చూడడమే ప్రేమంటే” ల్యాప్‍టాప్ మీద దీక్షగా టైపు చేస్తున్న నేను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను నా చెవులని తాకిన ఆ శబ్దాన్ని విని. ఎంతో చిరపరిచితమైన శబ్దం అది!! ఎన్నాళ్ళకి మళ్లీ విన్నాను ?! రాయడం ఆపేసి ల్యాప్‍టాప్ స్క్రీన్ మీదనుంచి దృష్టి మరల్చాను. సుదూర తీరాల నుంచి నన్ను వెదుక్కుంటూ వచ్చి నా చెవులని తాకినట్టుగా అనిపించిందా పిలుపు. చిన్ననాటి స్నేహితుడు పలకరించినట్టుగా అనిపించింది. అప్రయత్నంగానే నేను తలెత్తి వేప చెట్టు కొమ్మల్లో వెదుకుతూ చూసాను ఆనందంగా. ఏమీ కనిపించలేదు. ల్యాప్‍టాప్ మంచమ్మీద పెట్టి లేచి నిల్చున్నాను. చుట్టూ తిరుగుతూ వెదికాను. ఊహూ... అలికిడి లేదు. ఆ శబ్దం మళ్ళీ వినిపిస్తుందేమోనని చెవులని హెచ్చరికగా ఉంచి, నెమ్మదిగా అడుగులు వేస్తూ పొలం గట్టు వెంటే మిగిలిన చెట్ల గుబుర్లలో పరిశీలిస్తూ తిరిగాను. నేను ఎదురు చూస్తున్న శబ్దం నాకు వినపడలేదు. నేను వెదుకుతున్న నేస్తమూ నాకు కనిపించలేదు. నిరాశగా మళ్ళీ వచ్చి మంచమ్మీద కూర్చుని ల్యాప్‍టాప్‍ని ఒళ్ళోపెట్టుకుని రాయడానికి ప్రయత్నించాను. వేసవి కాలపు ప్రారంభపు రోజులు అవి. సమయం మిట్ట మధ్యాహ్నమవుతున్నా నేను కూర్చున్న ఆ వేపచెట్టు నీడలో చల్లగా వుంది. రాములు తాత నులకమంచమ్మీద బూరుగు దూది పరుపు వేసి, ఇస్త్రీ దుప్పటి వేసి, కాళ్ళూ చేతులూ ఆన్చుకుందుకు మెత్తని దిళ్ళు కూడా సౌకర్యంగా అమర్చాడు. గాలి నెమ్మదిగా వీస్తోంది. ఎండి పచ్చగా మారిన వేప ఆకులు అప్పుడప్పుడూ రాలి కీ బోర్డు మీద పడుతూ, రాసుకుంటున్న నాకు మధ్య మధ్యలో ధ్యాన భంగాన్ని కలిగిస్తున్నాయి. ఆ ఊరూ, ఆ వాతావరణం నాకు కొత్త కాదు. నా బాల్యంలో ప్రతి వేసవి సెలవలూ అక్కడే గడిపేవాడ్ని. ఉన్న పొలాన్నంతా ముక్కలు ముక్కలుగా అమ్మేయగా, అమ్మడానికి మనసు రాక సెంటిమెంటు ఫీలయి మేము మిగుల్చుకున్న పడమర వైపు పొలం దగ్గరే నేను కూర్చున్నాను ప్రస్తుతం. రోడ్డుని ఆనుకుని ఉంటుంది ఆ పొలం. పక్కనే పంపు సెట్టూ, రోడ్డు మీద కొద్ది దూరం నడిస్తే మా బాల్యస్మృతులని దాచుకున్న పాత కాలం నాటి పెంకుటిల్లూ వుంటాయి. ఊళ్ళో ప్రతి శ్రీరామనవమికీ గుళ్ళో కళ్యాణం జరిపించడం మా వంశాచారం. ఆ సందర్భంలో వచ్చినప్పుడు తప్ప మేము ఆ ఇంటిని ఎప్పుడూ వాడము. రాములు తాతే ఇంటిని వీలైనప్పుడల్లా శుభ్రంచేస్తూ నివాసయోగ్యంగా వుండేలా చేస్తూ వుంటాడు. నేనైతే దాదాపుగా పదిహేనేళ్ళనుంచీ శ్రీరామనవమికి కూడా ఊళ్ళోకి రాలేదు. ఇంజనీరింగ్ చదువూ, సాఫ్ట్‍వేర్ ఉద్యోగం, విదేశీ యాత్రలూ, సొంత కంపెనీ స్థాపన ఇత్యాది కార్యక్రమాల్లో బిజీగా వున్న నాకు మేమంతా ‘సొంత ఊరు’ అని చెప్పుకునే ఆ గ్రామానికి పదిహేనేళ్ళుగా రావడానికి వీలు చిక్కలేదు. ఇన్నాళ్ళూ ఇక్కడికి రాని నన్ను ఇప్పుడు ప్రత్యేకంగా, ఒంటరిగా ఇక్కడికి రప్పించిన కారణం ... ఇంటర్నెట్‍లో నేను నిర్వహిస్తున్న బ్లాగు ! నాకోసం అనుకుని నేను ప్రారంభించిన ఆ బ్లాగుకి ఇంటర్నెట్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. పత్రికల నుంచి కొత్తగా బ్లాగులకి మారిన తెలుగు పాఠకులు నా బ్లాగుని విపరీతంగా అభిమానించడం మొదలు పెట్టారు. రాను రాను ఆ బ్లాగుని నిర్వహించడం నాకొక ప్రతిష్టాత్మక వ్యవహారంగా మారింది. కానీ కొంతకాలానికి నాకెందుకో నేను రాస్తున్నవన్నీ చాలా రొటీన్‍గా అనిపించ సాగాయి. ఆ రొటీన్ బ్రేక్ చేయాలంటే ఒక మంచి సీరియల్ బ్లాగుకి కావాలనిపిచింది. దానికోసం ఒరిజినాలిటీ వున్న ఒక మంచి ప్రేమ కథ రాయాలని అనుకున్నాను. ‘ఒరిజినాలిటీ’ అనుకోగానే నాకెందుకో మా ఊరు గుర్తుకు వచ్చింది. ఆ జ్ఞాపకాలతో, మా ఊరి వాతావరణంతో ఒక మంచి ప్రేమ కథ రాస్తే ఈ కాలం పాఠకులకి తప్పకుండా నచ్చుతుందనిపించింది. ఊర్లో మిగిలిన పొలాన్నీ, ఇంటినీ కూడా అమ్మేయాలనుకుంటున్నానని నాన్న అనడంతో మళ్ళీ మళ్ళీ ఈ ఊరికి రావడం కుదరదేమోనన్న ఆలోచన ఇక్కడే ఒక పది రోజులుండి ఈ వాతావరణంలో నవల రాయడానికి నన్ను ఈ ఊరివైపు నడిపించింది. అంతకు ముందు రోజు రాత్రే ఆ పని మీద ఇక్కడికి వచ్చాను. ఆలోచనల్లో వున్న నాకు మళ్ళీ ఆ శబ్దం వినిపించింది. ఈ సారి నేను కూర్చున్న వేపచెట్టు కొమ్మ మీదనుంచి కాకుండా కొద్ది దూరం నుంచి. వెంటాడే గతజన్మ జ్ఞాపకాల్లా ఆ శబ్దం వినగానే నాలో ఏవో ప్రకంపనలు... ఒళ్ళు పులకిస్తున్నట్టుగా, మరుగు పడిన ఏవేవో మధురస్మృతులని తట్టి లేపుతున్నట్టుగా... నేను ఆనందంగా లేచాను. ‘ఈ సారి నేను నా నేస్తాన్ని చూడడం ఖాయం. కచ్చితంగా కనిపిస్తుంది’ అనుకుంటూ ఆ శబ్దం వినిపించిన వైపుకు గబగబా అడుగులు వేసాను. నేను నడుస్తుంటే నన్ను ఆనందింప చేస్తూ మళ్ళీ మళ్ళీ వినిపించిందా పిలుపు. ఆ పిలుపు వింటుంటే ‘రా... రా...’ అని నన్ను పిలుస్తున్నట్టనిపించింది. ‘వస్తున్నా, వస్తున్నా’ అనుకుంటూ వెళ్ళాను. నా నేస్తం నా మీద అలిగిందేమో, మళ్ళీ నిశ్శబ్దం... చెట్ల ఆకుల గలగలలూ, పంటకాలవ లోంచి పొలం లోకి వెడుతున్న నీటి శబ్దమూ తప్ప మరేం వినపడడం లేదు. ‘ఇప్పుడే కదా పిలించింది? ఇంతలోనే ఎక్కడికి పోతుందీ?’ అనుకుంటూ తలెత్తి చెట్ల గుబుర్లలోంచి ఆకాశంలోకి చూసాను. సూర్యుడు కిరణాలతో కళ్ళలో పొడిచినట్టనిపించింది. వెంటనే కళ్ళు మూసుకున్నాను. నేనిలా కళ్ళు మూసుకున్నానో లేదో మళ్లీ పిలుపు. ఈ సారి నా వెనుక నుంచి ! ఒక్క ఉదుట్న వెనక్కి తిరిగి కళ్ళు నులుముకుంటూ చూసాను. ఏమీ లేదక్కడ. నా నేస్తం నన్ను పరిహసిస్తోందా?! లేక నేనేమైనా భ్రమ పడుతున్నానా?! నేనలా ఆలోచిస్తుండగానే నేను భ్రమపడటం లేదనీ, నేను వింటున్నది నిజమేననడానికి నిరూపణగా మళ్ళీ నాకు ఆ పిలుపు వినిపించింది. పిలుపు తో పాటూ మామిడి చెట్టు ఒక కొమ్మ మీదనుంచి మరో కొమ్మమీదకి ఎగురుతూ అరక్షణం పాటూ రేఖామాత్రంగా తన రూపుని నాకు చూపించింది నా నేస్తం. నా కళ్ళు ఆనందంతో విచ్చుకున్నాయి. ఎన్నాళ్ళకెన్నాళ్ళకూ అటువంటి సుందర దృశ్యాన్ని చూడగలిగాను? కానీ ఇదంతా ఒక్క క్షణం మాత్రమే. మళ్ళీ ఆ పిలుపూ లేదు, కళ్ళముందు ఆ రూపమూ లేదు. నాకు చిన్నతనపు రోజుల్లో మేము చేసే అల్లరిని గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా నేను కూడా దాని పిలుపుని అనుకరిస్తూ అరిచాను... ప్చ్... ఏమాత్రం ప్రతిస్పందన లేదు. ఈసారి పిలుపుతో పాటూ రెండు చేతులూ గాల్లోకి ఊపుతూ దాని బాడీ లాంగ్వేజ్‍కూడా అనుకరించడానికి ప్రయత్నించాను చిన్న పిల్లాడిలా. ఊహూ... ఫలితం లేదు. నాకు పట్టుదలగా అనిపించింది. అసలు అదొక జీవి వుందన్న విషయాన్నే మరచిపోయాను నేను. ఇప్పుడు హఠాత్తుగా వచ్చి ఒకసారి నాకు కనిపించి, తన పిలుపుని వినిపించి, నాలో ఏవో జ్ఞాపకాలని రేపి, నేను దాన్ని చూడాలని తహతహ లాడుతుంటే నాకు కనిపించకుండా బెట్టు చేస్తుందా?! పంతంగా మరోసారి చేతులూపుతూ దాని భాషలో గట్టిగా అరిచాను. అది రాలేదు. వెనకనుంచి రాములు తాత వచ్చాడు. “ఏమిటి బాబూ ఇది?” అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఒక్క క్షణం ఇబ్బంది పడ్డట్టుగా చూసాను. “వాటిని చూసి చాలా కలమైపోయింది తాతా. ఇందాకా రాసుకుంటుంటే దాని అరుపు వినిపించింది. చూద్దామనుకుంటే ఎక్కడా కనిపించడంలేదు” చిన్నగా నవ్వుతూ మొహమాట పడ్తూ చెప్పాను. “నేనూ వాటికోసమే వచ్చానులే బాబూ” అంటూ కండువాలో మూట కట్టి తెచ్చిన నూకలని విప్పి మావిడి చెట్టు మొదట్లో చల్లుతూ నోటితో ఒక విచిత్రమైన శబ్దాన్ని చేసాడు. అతడు చల్లే నూకలకి అలవాటు పడ్డాయో, మరి ఆ శబ్దానికి అలవాటు పడ్డాయో తెలియదు కానీ, ఎక్కడ నుంచి వచ్చాయో ఒకటి కాదు, రెండు కాదు- ఒకదాన్నొకటీ పిలుచుకుంటున్నట్టుగా అరుచుకుంటూ నాలుగు కాకులు వచ్చి గబగబా క్రింద వాలి నూకలని తిన సాగాయి. నా కళ్ళు ఆనందంతో మెరిసాయి... ఇందాకటినుంచీ నా చెవులు వినాలని వెంపర్లాడుతున్న అరుపులు... నా కళ్ళు చూడాలని తహతహలాడుతున్న నేస్తాలు !! అవే... కాకులు !! “తాతా? ఎన్నాళ్ళైపోయిందో అసలు ‘కాకి’ అన్న జీవిని నేను చూసి?! మా పట్నాల్లో అసలు కాకులే కనిపించవు తెలుసా?” అన్నాను నేను. చిన్నతనంలో సెలవల్లో మధ్యాహ్నం పూట భోజనం చేసి మా పెంకుటింట్లో వసారాలో మడతమంచం వేసుకుని ఏదో పుస్తకం చదువుకోవడం, నిశ్శబ్దమైన ఆ పల్లె వాతావరణంలో నేపధ్య సంగీతంలా ఎక్కడో పెరట్లోని ఏ బాదం చెట్టు మీదనుంచో ‘కావు కావు’ మంటూ కాకి అరుపు వినిపించడం, ఇప్పటికీ ఆ వాతావరణం నా మనసులో అలా చెరగని ముద్ర వేసింది. పిల్లలందరం దాగుడు మూతలాట ఆడుకుంటుంటే అంతా నిశ్శబ్దం, దాక్కున్న పిల్లలకోసం వెదుక్కుంటుంటే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మా ఉద్వేగాన్ని రెట్టిస్తూ వినిపించే కాకి అరుపు... రాత్రి భోజనాలయ్యాక నాన్నమ్మ ‘కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడవి’ అని కథ చెప్పడం మొదలు పెడితే మా కళ్ళ ముందు కదలాడే రూపు... ఏమీ తోచనప్పుడు పిల్లలంతా మావిడి చెట్టుక్రింద చేరి వాటిని వెక్కిరిస్తూ “కావు కావు” మని అరవడం, అవి కూడా ప్రతిస్పందించి రెట్టించి అరవడం, అదో ఆటలా వుండేది. ఇలాంటివే ఎన్నో జ్ఞాపకాలు !! అందుకే ఇప్పుడు ఇన్నాళ్ళ తరువాత విన్న ఆ కాకి అరుపు నన్ను అంతలా కదిలించింది. దాన్ని చూడాలని నా మనసు అంతలా తహ తహ లాడించింది. పట్నంలో కూడా చిన్నతనంలో అప్పుడప్పుడూ కాకులు కనిపించేవి. కానీ క్రమంగా అరుదై పోయి పూర్తిగా అదృశ్యమైపోయాయి. విచిత్రమేమిటంటే అదృశ్యమైపోతున్న వాటి సంగతి నేనెప్పుడూ ఆలోచించనే లేదు. ఇక్కడికి వచ్చి దాని అరుపు విన్నాకే అసలు ‘కాకి’ అన్న ఒక జీవి వుందని నాకు గుర్తుకు వచ్చింది. రాములు తాత నవ్వాడు. “పట్నాల్లో ఎందుకు బాబూ, పల్లెటూర్లలోనే కాకులూ పిచుకలు కనిపించడం గగనమైపోతోంది” నేను మాట్లాడలేదు. ఆ విషయం నాకూ తెలుసు. ఈ రోజుల్లో పర్యావరణ కాలుష్యానికి పల్లెలు అతీతమేం కాదు. “ఒకప్పుడు కాకులు, పిచ్చుకలు మన ఇంటింటి జీవులు. తెల్లవారినప్పటినుంచి, సాయంత్రం చీకటి పడేవరకు మనతో జీవించేవి. పొలాల్లో పంటని నాశనం చేసే ఎలుకలు, చుంచెలుకలు వంటి జంతువులను కాకులు వేటాడేవి. కాకి అరిస్తే బంధువులు వస్తారని నమ్మెవాళ్ళం. కర్మ చేసేటప్పుడు పిండాలు కాకులకే పెట్టాలని శాస్త్రం. మొన్న కరణంగారింట్లో తద్దినం పెట్టినప్పుడు కాకి కోసం రెండు గంటలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఊళ్ళో ఉన్న నాలుగు కాకులూ కూడా లేకుండా పోతాయేమోనని భయమేస్తుంది” నూకలు చల్లుతూ అన్నాడు రాములు తాత. “మిగతా పక్షుల్లా కాకి అందంగా వుండదు. దాని పలుకు కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత మధురంగా వుండదు. అందుకేనేమో ఆ జాతి అంతరించిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. జూలో పెట్టి గొప్పగా చూపించేంత అందమైన పక్షేం కాకపోయినా అదికూడా జీవే కదా బాబూ. ఒక జాతి అంతరించిపోతోదంటే ఎంత బాధ అది?” విచారంగా అన్నాడు రాములు తాత. ఏదో తెలియని బాధతో నా మనసు చేదుగా అయిపోయింది. మెడని ముందుకు చాచి నల్లటి ముక్కుతో నూకలని పొడుచుకుని తింటున్న నా చిన్న నాటి నేస్తాలని జాలిగా చూసాను. ‘నాకంటే గొప్పవాళ్ళు నీకు కనిపించవచ్చు, నా కంటే తక్కువ వాళ్ళూ కనిపించవచ్చు. కానీ అచ్చంగా నాలాంటి వాళ్ళు నీకు ఒక్కరు కూడా కనిపించరు’ - నేను నవలలో రాస్తూ వదిలేసిన వాక్యాలు గుర్తొచ్చాయి. “బాగా ఎండెక్కింది కదా? ఇంట్లో కూర్చుని రాసుకుంటారా?” అన్నాడు రాములు తాత. రాములు తాత వంక పరిశీలనగా చూసాను. నల్లగా ముడుతలు పడ్డ ముఖం. తెల్లగా నెరిసిన జుట్టు. మట్టి కొట్టుకుపోయిన బట్టలు. ఒకప్పుడు మా పాతికెకరాల వ్యవసాయాన్నంతా ఒంటి చేత్తో అతడే చూసే వాడు. మా అవసరాలకీ, సౌకర్యానికీ అనువుగా మేము ఒక్కో ఎకరాన్నీ అమ్ముకుంటూ వస్తుంటే అతడి పని కూడా తగ్గుతూ వస్తోంది. కానీ ఎప్పుడూ ముఖంలో ఏ భావమూ కనిపించనీయకుండా మాకు నమ్మిన బంటులా వుంటూ ఉన్న కాస్త పొలాన్నీ కౌలు చేస్తూ, మా ఇంటిని కనిపెట్టుకుని చూస్తూ వున్నాడు. “ఊళ్ళో ఎవరూ కౌలుకి పొలాన్నివ్వడం లేదండీ. ఆ నమ్మకాలు పోయాయి ప్రస్తుతం. అంతా వ్యాపారమైపోయింది ఇప్పుడు. ఇక్కడ పని లేక పిల్లలు పట్నానికి పోతామంటున్నారు. మాకు మాత్రం పల్లె మీద మనసు చావదు. ఇటు పల్లెనీ వదల్లేకుండా, అటు పిల్లలనీ మనవల్నీ వదల్లేకుండా వుంది బాబూ పరిస్థితి” అని ముందు రోజు నాతో అతడన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అటువంటి స్థితిలో ఉండి కూడా మూగ జీవుల మీద మమకారం చూపిస్తున్నాడు !! అంతరించి పోతున్న జాతుల్లో రాములు తాతలాంటి జాతి కూడా ఒకటేమో ననిపించింది నాకు హఠాత్తుగా. “రాములు తాతా? మా పొలాన్ని కొనుక్కుంటావా?” అడిగాను. “ఏంటి బాబూ మీరంటున్నది?” ఆశ్చర్యంగా అన్నాడు రాములు తాత. “బయటి వాళ్ళకన్నా తక్కువ రేటులో ఇస్తాం. మొత్తం ముందే ఇవ్వక్కర్లేదు. ప్రతి పంటకీ ఇంతని వడ్డీ లేని వాయిదాల మీద ఇద్దువుగాని. మీ పిల్లలు పట్నం వెళ్ళకుండా ఇక్కడే వుండి పోవచ్చు. మా ఇంటిని కూడా నువ్వే చూసుకోవాలి. మేము అప్పుడప్పుడూ వచ్చి మా ఇంట్లో ఉండి వెడుతూ వుంటాము. ఏమంటావు?” క్షణాల మిద నిర్ణాయాలు తీసుకుంటూ అడిగాను. ముడుతలు పడ్డ రాములు తాత కళ్ళల్లో నీళ్ళు !! “మీరేం మాట్టాడుతున్నారు బాబూ. నాలో ఏం చూసి ఇలా అదరిస్తున్నారు?” అన్నాడు నమ్మశక్యం కానట్టుగా. “నేను చాలా ప్రపంచాన్ని చూసాను తాతా. నీ కంటే గొప్పవాళ్ళని చూసాను. నీ కంటే తక్కువ వాళ్లనీ చూసాను. కానీ అచ్చంగా నీలాంటి వాళ్ళని మాత్రం ఒక్కరిని కూడా చూడలేదు. అందుకే...” రాములు తాత భుజమ్మీద చెయ్యేసి ఇంటి వైపు నడిపిస్తూ అన్నాను.
*
No comments:
Post a Comment