తన కోపమె తన శత్రువు
పెయ్యేటి రంగారావు
' తన కోపమె తన శత్రువు ' ట! హు!...........సూక్తులు వినడానికి బాగానే వుంటాయి. కాని ఆచరణలో పెట్టాలనుకుంటేనే శతకోటి ఇబ్బందులెదురవుతాయి. మనమేమీ రాళ్ళనించి మలచబడ్డ శిల్పాలం కాదుగా, అందాల్ని చూపిస్తూ భావావేశాలు లేకుండా నిశ్చలంగా వుండడానికి?
ప్రేమకు స్పందించని హృదయమేమి హృదయము? శిలామయ సదృశ హిమవన్నగము గాక?
అన్నాడో కవి. అవును. అది నిజం!కూరలో కారం ఎక్కువైతే గొంతు పొలమారుతుంది. అది భౌతికమైన ప్రక్రియ. కాని దాని తర్వాత వండిన భార్య మీద కోపమొస్తుంది. అది మానసిక స్పందన. మనసు లేని జంతువులకి కూడా గొడ్డుకారం పెడితే అవి ఆవేశంతో స్పందిస్తాయి. మరి మనిషి కోపాన్ని నియంత్రించుకోవాలంటే అది సాధ్యమా?నాకు సంగీతమంటే పిచ్చి. సంగీతసాధన కానివ్వండి, సంగీత శ్రవణం కానివ్వంది, నాకు వ్యసనం లాంటివి.నేను అనేకరకాల వాయిద్యాలు, ఆసక్తి కొద్దీ, ఏకలవ్యుడిలా స్వయంకృషితో, వాయించడం చేర్చుకున్నాను. నేను మురళి వాయిస్తాను. నేను వేణువు మీద ' కూ' అని పలికిస్తే, వసంతఋతువులో కోయిల తిరిగి ' కూ ' అని సమాధానమిస్తుంది. నేను వీణమీద ' రఘువంశ సుధాంబుధి చంద్రమా ' అని కదనకుతూహలరాగం పలికిస్తే, ఆ శ్రీమచంద్రుడు చిరునవ్వులొలికిస్తూ నడిచి వస్తున్నట్లు నాకనుభూతి కలుగుతుంది. నీను కీబోర్డు మీద ' నాగిన్ ' సినిమాలోని నాగస్వరం వాయిస్తే, శ్రోతలు, వాళ్ళు మానవులైనా, సర్పాలై శిరసులూపుతారు. ఇది స్వోత్కర్ష కాదు. నా నిరంతర కృషి, సాధనల ఫలం. నా గదిలో చాలా సంగీతవాయిద్యాలున్నాయి. పాము బూరా, అది ఉత్తరప్రదేశ్ లోని ' హాథరస్ ' అన్న గ్రామం నించి ప్రత్యేకించి తెప్పించాను. మేండొలిను, సితార - సితార నాకు వాయించడం రాదు - ఐనా కండూతి కొద్దీ కొన్నాను - తంజావూరు వీణ - ఇది మాత్రం నేను గురుముఖత: నేర్చుకున్నాను లెండి - యమహా కీబోర్డు - ఇది ఆస్ట్రేలియా నించి తెచ్చుకున్నాను లెండి - , అనేక శృతులలో వున్న పదిహేను ఫ్లూట్లు - వాటిలో హిందుస్తానీవి కూడా వున్నాయి - , మౌతార్గను - ఇది కూడా నాకు వాయించడం సరిగ్గా రాదు - ఐనా కొన్నాను - అలాగే వయొలిను కొని భద్రపరుచుకున్నాను - అలాగే ఘటం - ఇది నేను కుమ్మరికి ప్రత్యేకమైన సలహాలిచ్చి తయారు చేయించుకున్నాను - , కంజీరా, డప్పు - ఇలా ఎన్నో రకాల వాద్యపరికరాలున్నాయి. నా గదిలోకి వస్తే మీకు ఆరాధనన్నా కలుగుతుంది, అవహేళనన్నా కలుగుతుంది. ఘటం వాయించడం ఒక ఎత్తు ఐతే, అర్థరాత్రి ఇరుగు పొరుగు వాళ్ళకి నిద్రాభంగం కలిగించకుండా, అందులో నోరు పెట్టి, రెండున్నర శృతిలో పద్యాలు పాడడం - అదొక సాధన, సరదా! నా ఇంటికి వచ్చిన నా మిత్రులు, అతిథులు నన్నొక సంగీత తపస్విగా భావిస్తారో, చలిత మనస్కుడిగా భావిస్తారో నాకు తెలియదు. కాని ఇది నాకు నేను ఏర్పరుచుకున్న విశిష్ఠమైన ప్రపంచం. అందులో నేను, నా వాద్యపరికరాలు, నా సంగీత సాధన - ఇందులోనే నేను విశేషమైన ఆనందాన్ని పొందుతాను. ఐతే, నా ఈ బుల్లి ప్రపంచంలోకి అనుకోకుండా ఒక అపస్వర వల్లరి, ఒక పీడకల, ఒక కోకిలల సమూహంలోకి ప్రవేశించిన కాకి - నాకు ఆగర్భ శత్రువుగా అరుదెంచింది. నా కఠోర తపస్సుకి అది భగ్నకారకంగా నిలిచే ఒక రంభ, ఒక ఊర్వశి, ఒక మేనక, ఒక తిలోత్తమ!! కాని నాకు మాత్రం అది ఎన్నెన్నో జన్మల బంధం - కాదు కాదు - రాబందువు!! అర్థరాత్రి వీణ తీసి మంద్రంగా రాగప్రస్తారం చేయబోతుంటే, మెల్లగా కిటికీలోంచి వచ్చి, నా ఎదురుగా మునిలా కూర్చుని, నా శృతికి ఎదురు అపశృతిగా ' మ్యావ్ ' అని అరుస్తుంది. అంతే! నా తపస్సు భగ్నమవుతుంది. నా మనసు వికలమవుతుంది. అంతులేని ఆవేదన కలుగుతుంది. జీవితమంటేనే విరక్తి కలుగుతుంది. ఒక రాత్రి వేళ సంగీతసాధనలో వుండగా నాకు ఆకలి వేస్తుందేమో అని చిరుతిళ్ళు పెట్టుకుంటాను. అది కిటికీలోంచి చెంగున టేబులు మీదకు దూకి, ఆ చిరుతిళ్ళు భోంచేసి, ఆత్రుతలో పింగాణీ ప్లేట్లన్నీ బద్దలు కొడుతుంది. నేను ఆవేశంగా కొట్టడానికి మీదకు వెళ్ళబోతే, ' మ్యావ్ ' అని తన భాషలో అన్నదాతా సుఖీభవ అని ఆశీర్వదించి, మళ్ళీ కిటికీలోంచి బైటకి పారిపోతుంది. ఈ కర్ణుడిని నిర్జించడానికి నేను అర్జునిడిని కాలేకపోయానే అన్న ఆవేదన, ఈ బకాసురుణ్ణి చంపడానికి నేను వృకోదరుడిని కాలేక పోయానే అన్న ఆవేశం, ఈ శిశుపాలుడిని చంపడానికి నేను చక్రధారిని కాలేకపోయానే అన్న క్షోభ నన్ను చుట్టిముట్టి నా మనసుని కకావికలు గావించి వేస్తాయి. అది మాత్రం వికటంగా, విచ్చలవిడిగా నా స్వేఛ్ఛామయ జీవితానికి భయంకరమైన ఆటంకంగా వీరవిహారం చేసీస్తోంది. ఎన్నాళ్ళు సహించను ఆ మార్జాలం దుష్కృత్యాలని? ఎన్నాళ్ళని భరించను ఆ బిడాలం ఆగడాలని? ఈ సారి ఆ దుష్టుణ్ణి ఎలాగైనా అంతమొందించాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. ఒకరాత్రి మంచం కింద పాయసం ఉంచిన పళ్ళెం పెట్టి, కిటికీ తలుపులన్నీ తీసేసి, అర్థరాత్రి దాకా నిద్ర నటిస్తూ వుండిపోయాను. ఎప్పుడు కునుకు పట్టిందో తెలియలేదు. ఉలిక్కిపడి లేచి చూస్తే పాయసం పళ్ళెం ఖాళీగా వెక్కిరిస్తూ కనిపించింది. ఇంకొక వారం రోజులాగి మళ్ళీ నా పధకాన్ని అమలు చేసాను. ఈ సారి ఏమైనా నిద్రపోకూదదని కఠోరంగా తీర్మానించుకున్నాను. రాత్రి ఒంటిగంట అయింది. నా ఆగర్భశతృవు - ఆ పిల్లిరాక్షసి - కిటికీలోంచి చెంగున టేబులు మీదకి దూకింది. అక్కడేమీ కనబడలేదు. కాని దాని ముక్కు దాన్ని హింసిస్తోంది. అది మంచం కిందకి దూరింది. అక్కడ కనిపించిన పాయసాన్ని చూసి అది తనని తానే మరిచిపోయింది. ఆత్రంగా పాయసాన్ని జుర్రుకోసాగింది. నేను నిశ్శబ్దంగా మంచం మీంచి లేచి చేతికందిన వెదురు మురళిని తీసుకున్నాను. అది నన్ను గమనించే పరిస్థితిలో లేదు. చప్పుడు కాకుండా దాని చెంతకు జేరి, నా మురళితో ఒకే ఒక్క దెబ్బ - కరాటే దెబ్బ - కుంగ్ ఫూ దెబ్బ - భీముడి గద దెబ్బ- కొట్టాను! అమ్మయ్య! ఈ రోజుతో దాని పీడ విరగడైపోయిందన్న ఆనందం! దుష్టశిక్షణ చేసానన్న అలౌకిమైన భావన!! కాని, కనురెప్ప మూసి తెరిచేటంతలో అది చెంగుమని దూకి కిటికీలోంచి పారిపోయింది. నిరాశగా కిందకి చూస్తే నా కోపం నన్ను వెక్కిరించింది! నా చేతిలోని మురళి ఘటానికి గట్టిగా తగిలినట్టుంది. అది పదహారు ముక్కలైంది. నా చేతిలోని మురళి నిలువునా చీలిపోయింది. ఆ పిల్లి ఎగరడంలో వాయులీనం మీద పడ్డట్టుంది. అది నేలని తాకి పగిలిపోయింది. కిటికీ దగ్గరున్న కీబోర్డు సితారు మీద పడింది. కీబోర్డు బీటలు తీసింది. సితారు రెండు చెక్కలైంది. పిల్లి మాత్రం తాగినంత పాయసాన్ని తాగి, హాయిగా పారిపోయింది!! అప్పుడు నాకు కలిగిన పశ్చాత్తాపాన్ని ఎలా వర్ణించను? నాకు కలిగిన ఆవేదనను ఏ భాషలో వివరించను? నాకు కలిగిన ఆత్మక్షోభను ఏ రాగంలో ఆలపించను? ' తన కోపమె తన శత్రువు' అనుకుంటూ ఆర్తితో, ' ఆర్ద్రత ' తో బాధ పడసాగాను.
****************************** ***
No comments:
Post a Comment