మనసు - స్వరూప స్వభావములు - అచ్చంగా తెలుగు

మనసు - స్వరూప స్వభావములు

Share This

మనసు - స్వరూప స్వభావములు

- వారణాసి రామబ్రహ్మం

లౌకిక మనసు: మనసు గురించి ఆలోచిస్తోంటే ఎన్నో తలపులు. ఆత్రేయగారి పాటలలో మనసు గురించి ఎంతో మనకు తెలిపారు. మౌనమే మనసు భాష. మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే అని అన్నా, మనసు ఉపయోగం మనకు ఎంతో ఉంది. మన గ్రహింపులన్నీ మనసు వల్లే సాధ్యపడతాయి. మనసు మనకు వరం, శాపం కాదు. మన వ్యథలు, బాధలు మన కృతాలే కాని మనసు కృతాలు కాదు. మనసు ముగ్ధ. రమ్య. లలిత. మనసు పోకడలు పలువిధములు. బహుముఖములు. చేలిమిచేసి మనసుని మంచి చేసుకోవాలి. వశమైన మనసు మంచి స్నేహితుతాలు. పరవశం చెందాలంటే మనసు సాయం కావాలి. నిర్మలమైన మనసు శాంతి సుఖాలను ఇస్తుంది. మనసు మనిషి ప్రకృతిలో భాగం. అభిమానానికి, అరాధనకూ ఆలవాలం. ఆస్వాదన దాని రసలక్షణం. మనసు లేక, మనసు పడక, మనసు పెట్టక, ఏ ఆనందాలు లేవు. శూన్యమైన మనసు ఉండకూడదు. బుద్ధి నిశితంగా పనిచేసే చోట మనసుండదు. బుద్ధి పనిచేస్తున్నంతసేపూ మనసు పడలేము. బుద్ధి తర్క కర్కశము. మనసు రమ్యభావ భరితము. రసమయము. రసపట్టులో తర్కం కూడదని కృష్ణపరమాత్మ ఉవాచ కదా! ఊహల ఉయ్యాలలూపే మనసే బాధా తరంగాలనూ వహిస్తుంది. రక్తి,విరక్తి, ఆసక్తి, అనాసక్తి, రాగము, విరాగము, మనసుకి రెండు వైపులు. తలచే తలపే మనసు. తలవుల వరుసయే మనసు గతులు. రమ్య భావ సహితయైన మనసు రహితయైనపుడు క్లేశభరితమైనపుడూ వేదన కలిగిస్తుంది. కావలిసినవారి మాటలు, చేతలు, దానికి లేపనము. అపుడు మనసు స్వస్థత చెందుతుంది. ఒకరికిస్తే మరలి రాని మనసే, అవసరమైనపుడు గట్టితనాన్ని దిట్టంగా చూపిస్తుంది. మనసు లేక స్పందన లేదు. స్పందన లేక భావుకత లేదు. పాండిత్యం లేకున్నా పరవాలేదుకాని భావుకత లేక రసస్పర్శ లేక సరసులు ఉండరు. సరస హృదయ హృదయంగమంగా  మాట్లాడించేది, పలికించేది, పలకరించేది,పలవరించేది, మనసే. మనసు నిండితే బ్రతుకు నిండుతుంది. బ్రతుకుపుస్తకంలో మనసుగతులే రాతలు. మన రాత ఎలాగున్నా, మనసు బాగుంటే, అన్ని  సౌభాగ్యములను పొందవచ్చు. మనసుకు మనసే తోడు. మనసు తెలిపి, మనసు తెలిసి, మసిలే మనుషులు దొరకడం వరం. అట్టి వరం ప్రసాదింపబడినపుడు వెనుకంజ వేయరాదు. అపుడు లాభమేదో. కోల్పోయినదేదో మనకే తెలియదు. అభిమానము, ఆప్యాయత, ఆపేక్ష, ఆత్మీయత, ప్రేమా - అంతరంగంలోనిదో, బయటి వస్తువులు, మనుషులు పై  ఆధారపడి ఉంటుందో ఎవరికీ సరిగా తెలియదు. రెండింటి మేలుకలయిక అని అనుభవజ్ఞులు అంటారు. లేత అరిటాకు వలె, పూరేకు వలె కోమలమైన మనసు కొమలలులకే కాదు పురుషులకూ స్వంతం. కంపన, అనుకంపన లేక మానవ జీవితం పండదు. నిండదు. అందుకనే ఇన్ని అభిమానాలు, ఆపేక్షలు. మనిషి కుటుంబ, సంఘ జీవితానికి వన్నె పెట్టేది, వన్నె తెచ్చేది, మనసే. అటువంటి మనసుని మనము ఎంతో శ్రద్ధగా చూసుకోవాలి. ఒకే వస్తువుని చింతిస్తున్న మనసుని ధ్యానమగ్న అంటారు. వేదన కూడా ధ్యానమే అయినా, అభిలషణీయం కాదు. ధ్యానములో మనసు ఏకాగ్రమై తను చింతిస్తున్న వస్తువులో లీనమవుతుంది. అపుడు దానిని నిర్మలమైన మనసు అంటారు. నైర్మల్యము, భావుకత, ఆస్వాదన, ఆరాధన మనలో కలిగించే, మనలో నింపే మనసు ఆరాధ్య. మనసు లేని మనుషులు ఉండరు. మనసు పడని మనుషులూ అరుదు. తర్క కర్కశత్వంలో నలిగిన మనసు పరిక్వతనైనా చెందుతుంది లేదా శూన్యత్వాన్నైనా పొందుతుంది. వలచినా, వగచినా, పూర్ణతనిచ్చేది మనసే. ఒక పొరబాటుకు యుగములు కుమిలె మనసే సరియైన తోడు దొరికినపుడు రసపరిపూర్ణమవుతుంది. ఆధ్యాత్మిక మనసు: ఆత్మ సత్-చిత్-ఆనందం. ఆత్మ సత్ రూపం లో మనకు మన ఉనికి స్పృహనిస్తుందిమనం ఉన్నట్టు ధ్యాస నిస్తుంది. మన ఉనికిని కలిగించి తెలియజేస్తుంది. చిత్ రూపం లో మనకు లౌకిక- శాస్త్రీయ - సాంకేతిక - భాషా జ్ఞానాన్ని; ఇతర అన్ని జ్ఞానములను, కళలను కలిగిస్తుంది. ఆనందం రూపం లో  అన్ని అనుభవాలను ఇస్తుంది. ఆత్మ ఇలా మనకు మన ఉనికి స్పృహను, సమస్త జ్ఞానాన్ని, కళా కౌశలాన్ని, తెలివిని, గమనికను, ఇతర అనుభవాలను కలిగిస్తోంది. ఆత్మ నుంచి చిత్ శక్తి మయతకు వచ్చి మన మేధలో ప్రతిబింబించి,  ప్రతిఫలించి చిదాభాస అవుతుంది. మేధను చేరి చిదాభాసగా మారిన చిత్ శక్తినే మాయ అంటారు. మాయయే మన మానసిక శక్తి. మాయ భ్ర్రాంతి కాదు, లేనిది (మిథ్య) కాదు. "యయా అసంతం పశ్యతి సా మాయా" - దేని ద్వారా మనము సమస్త జ్ఞానములను పొందుతామో, అన్ని మానసిక స్థితులను, గతులను అనుభవిస్తామో, తలపులను, ఆలోచనలను, భావములను పొందుతామో, అన్ని భాషలను మాట్లాడుతామో, అర్థము చేసికుంటామో - ఏ శక్తి పరిణామములు ఇవన్నీనో - ఆ ఆత్మ శక్తి విభూతిని మాయ అంటారు. మానసిక శక్తి యైన మాయ (ప్రకృతి, చిదాభాస,ప్రణవం, స్ఫోట - అన్నా ఇదే) మార్పునొంది (వికృతియై) అంతఃకరణములుగా  మారుతుంది. అంతఃకరణములన్నీ, మాయా విభూతులే అయినా అవి చేసే పనిని  బట్టి అవి నాలుగు. అవి : మనసు, బుద్ధి, అహంకారం మరియు చిత్తము. చేసే పనిని బట్టి పేర్లు వేరు గానీ అన్నీ మానసిక శక్తులే. ఒక్క బుద్ధిని తప్ప, మిగతా మూడింటిని మనము మనసనే వ్యహరిస్తాము. ఆ అర్థం లోనే వాడతాం. వీటినే మాయా పరిణామాలు, చిత్ విభూతులు అంటారు. మానసిక శక్తులు: అంతఃకరణములు - వర్గీకరణ   1. మనసు: మనసు విషయాలను గ్రయించే మాయా శక్తీ  రూపం. పరిణామం. మనం విషయాలను జ్ఞానేంద్రియముల ద్వారా (దృశ్యములు, రూపములు - కన్ను; నామములు, ధ్వనులు, శబ్దములు, మాటలు - చెవి; వాసనలు - ముక్కు; రుచులు - నాలిక; స్పర్శలు, వేడిమి, చల్లదనము - చర్మం) మనసు మాధ్యమం గా  తెలుసుకుంటాము. ఇలా తెలుసుకున్న విషయాలను మనసు మెదడులో జడ శక్తులుగా భద్రపరుస్తుంది. ఇదే మనకు తెలిసిన ప్రపంచం. మనసు ఈ లోని ప్రపంచం లోని విషయాలను వెలికి తీయడమే తలపులు కలిగే విధం. మనసు = చిదాభాసా (మాయ) + విషయ శక్తి.  చిదాభాస చే తాకబడి చైతన్యం పొందిన జడ శక్తే భావం. చిత్ శక్తి పరిణామ రూపమైన మనసుతో కలిసిన విషయ శక్తిని "జగత్" అంటారు. ఇలా మనసుచే గ్రహింపబడి, నిర్మింపబడి, వెలికి తీయబడిన విషయ సమాహారమే "జగత్" (జగత్తు అని మనం అంటాము. ప్రపంచం అన్నా, విశ్వం అన్నా ఇదే). అలా "సత్" లేక "చిత్" తో కలిసిన విషయ శక్తి "జగత్ - జగత్తు) అవుతుంది. గ్రహించబడే విషయం మారినప్పుడల్లా తలపు మారుతుంది. అలా మనసుని "తలపుల వరుస" అనవచ్చు. విషయ గ్రహణల ప్రవాహం లేక భావలహరి లేక కర్మ ప్రవాహం (తలపు లేక భావమును ఉపనిషత్ పరిభాషలో "కర్మ" అంటారు). 2  చిత్తం: మనం విషయాలను గ్రహిస్తున్నప్పుడు అ విషయ శక్తులు మనకు అదే కాలం లో కలిగించే అనుభవాలను అప్పుడే గ్రహించి, భద్రపరచి, అవసరమైనప్పుడు స్మరణకు, జ్ఞప్తికి తెచ్చే చిదాభాసా  పరిణామ రూపమే, విభూతియే చిత్తం. భద్రపరచబడిన విషయానుభవాలను "వాసనలు" అంటారు. వాసనలకే కర్మ ఫలములనీ పేరు. మనకు జ్ఞానం వచ్చినప్పటి నుంచీ మనకు తెలిసే, గ్రహింపబడే విషయాలు మనకు కలిగించే అనుభవాలనన్నిటిని  వాసనలుగా, జ్ఞాపకాల రూపంలో మెదడులో జడ శక్తులుగా స్థిరపడేలా చిత్తం చేస్తుంది.  కావలిసినపుడు (సంకల్పం కలిగినపుడు) ఈ వాసనలను ప్రేరేపించి (జాగరితం చేసి) అనుభవాలుగా దృష్టికి  తెచ్చి అనుభవింపచేస్తుంది. చిత్తం ఇలా వాసనలను జాగరితం చేయడమే మనలోని మొదటి మానసిక కలాపం. కర్మఫలములైన వాసనలను దృష్టికి రానీయక  పోవడమే కర్మఫల సంన్యాసం. మనసు సంధానం గా జ్ఞానేంద్రియాల ద్వారా కలిగిన విషయ, వ్యక్తిత్వ, శరీర జ్ఞానములు కలిగించిన అనుభవాల రూపంలో, వంశపారంపర్యంగా జన్యువుల ద్వారా వచ్చి సంక్రమించిన వక్తిత్వ లక్షణాలు, విషయాసక్తి, జ్ఞానాసక్తి, కళా పిపాస, ఆకలి, దాహం, కోరిక, మంచి, చెడు ప్రవర్తనలను ప్రేరేపించే స్ఫురుణలు, క్రియాసక్తుల రూపంలో, పద=అర్థముల -  పదార్థముల రూపంలో కూడా వాసనలు ఉంటాయి. ఇచ్ఛా శక్తిని ప్రేరేపించే చిద్విభూతియే చిత్తం. అలా చిత్తం వాసనలు ఏర్పడడానికి,ఏర్పడి ఉన్న వాసనలు (సుఖ దు:ఖానుభవములు, అర్థములు, ఇచ్ఛలు, స్ఫురణలు జాగారితము అవడానికి ఉపయోగపడే మానసిక శక్తి చిద్విలాసం; మాయా పరిణామం కూడా. 3.  అహంకారం: మనకు వంశ పారంపర్యంగా సంక్రమించిన వ్యక్తిత్వ  లక్షణాలతో పాటు జ్ఞానం వచ్చినప్పటినుంచి వ్యక్తిత్వ  స్పృహ ఏర్పడుతుంది. ఈ ఏర్పడే వ్యక్తిత్వ స్పృహలో మన పేరు, రూపము, శారీరక, మానసిక లక్షణాలు, సంఘంలో మన స్థితి గతులు, మానావమానములు, అందించిన, అందుకున్న మమతలు, ప్రేమలు, అభిమానాలు, ఇష్టాయిష్టాలు, స్న్సేహాలు, విరోధాలు,దురభిమానాలు,ద్వేషాలు,తలపుల రూపంలో వ్యక్తిత్వ లక్షణాలుగా ఉంటాయి. ఇలా "నేను" ని శరీరంతో, దానికి, మనస్తత్వానికి సంబంధించిన వాటితో తాదాత్మ్యం చెందించే, ఆ తాదాత్మ్యాన్ని ఏర్పరచే, తలపులుగా మార్చే, ఆ తలపులను తెచ్చే స్పృహ కలిగించే, చిత్ విభూతిని అహంకారం అంటారు. 4.  బుద్ధి: విచక్షణనీ, నిశ్చయాన్ని, తర్కాన్ని, అన్ని జ్ఞానములను, శాస్త్రములను, కౌశలములను - నేర్వడానికి, నేర్పడానికి, అవగాహను, బుద్ధి కుశలతనూ కలిగించడానికీ, బోధకూ ఉపయోగపడే చిత్ శక్తి స్వరూపమే బుద్ధి. ఇలా మనసు నాలుగు అంతఃకరణములుగా మానసిక కార్యకలాపములను నిర్వర్తిస్తుంది. తాత్త్విక    మనసు:మెళకువలో మనం కనులతో చూసే దృశ్యాలతో ; చెవులతో వినే మాటలతో, పాటలు సంగీతము, శబ్దములతో; నాలికతో చూసే రుచులతో; ముక్కుతో చూసే వాసనలతో; చర్మం ద్వారా గ్రహించే స్పర్శ లతో, వేడిమి, చల్లదనాలతో; మన మనసు ద్వారా మనలో ఒక "ప్రపంచం" ఏర్పడుతుంది. ఇది ఇలా విషయ సమాహారం గా మన మస్తిష్కంలో ముద్రించబడుతుంది. ఈ గ్రహణలన్నీ అదే సమయం లో కలిగించే అనుభవములతో వాసనలు (మిగిలి ఉండేవి) గా మన స్మృతి ఏర్పడుతుంది. ఈ సుఖ దు:ఖానుభవములు జ్ఞప్తిలో నిండి, జ్ఞాపకములుగా నిలిచి ఉంటాయి. ఈ స్మృతి లోనే మనకు శరీరంలో జన్యుపరం గా, వంశపారంపర్యంగా, వచ్చే, సంక్రమించే స్ఫురణలు, కోరికలు, వాంఛలు, లాలసలు, అవగాహనలు, ఆర్థములు, అపార్థములు,, ఇంగిత జ్ఞానములు ఉంటాయి. ఇవన్నీ ఇలా స్మృతిలో భాగం. ఈ సుఖ దు:ఖానుభవ రూపమైన వాసనలు (విషయానుభవములు) ముందుగా ప్రకోపింపబడి  మనకు వివిధ మానసిక స్థితులు - మెళకువ, కల - మానసిక దశలలో కలుగుతాయి. గాఢనిద్ర, ఆత్మానుభవ దశ మిగిలిన రెండు మానసిక దశలు. ఈ చివరి రెండు మానసిక దశలలో మనసు నిండుకుంటుంది.ఉండదు. గాఢ నిద్రలో మనసు, ఇతర అంతఃకరణములైన బుద్ధి, చిత్తము అహంకారము ఉండవు. పనిచేయవు. వీటితో జరిగే మానసిక కార్య కలాపములు జరగక ఆగి ఉంటాయి. అమావాస్య చంద్రుని ఉనికి వంటిది ఈ దశ. ఆత్మానుభవ దశలో  మనసు పరిపూర్ణమై  ఉంటుంది. మనసు ఆత్మలో లీనమై ఆత్మయై ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మ సన్నిధిలో మనసు పున్నమి చందమామలా అంతరంగమంతా వెన్నెల చిందిస్తూ ఉంటుంది. శాంతి, ఆనందము, మౌనము అనుభవములై అలరారుతూ అలరిస్తూ ఉంటాయి. మెళకువలో, కలలో మనకు తలపులు, భావములు, ఊహలు, అపోహలు, మానసిక స్థితిని బట్టి కలుగుతాయి. ఇలా మనకు తలపులు, ఆలోచనలు, కలగడానికి, మన లోపల మనసు మాధ్యమముగా జ్ఞానేంద్రియముల ద్వారా ఏర్పడిన విషయ ప్రపంచం, ఆ విషయములు అదే సమయంలో కలిగించిన విషయానుభవముల (వీటినే వాసనలనీ అంటారు) సమాహారంగా ఏర్పడ్డ స్మృతి, కారణములు. జ్ఞానేంద్రియముల ద్వారా కలిగే అన్ని జ్ఞానములు ఇలా అంతర ప్రపంచాన్ని, స్మృతినీ (అనుభవముల గుచ్ఛము) ఒకే సమయంలో ఏర్పరుస్తాయి. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము - ఈ  నాలుగు మన అంతఃకరణములు (లోని మానసిక పనిముట్టులు). చిత్తం వాసనలను ప్రకోపింపచేసి అనుభవములను, అవగాహనలను, జాగరితము చేస్తుంది. ఈ జాగరితములైన అనుభవములను, అవగాహనలను, మనసు తలపులు, భావములు, గ్రహణలు గా రూపొందిస్తుంది. బయటి ప్రపంచములోని విషయములను కూడా మనసు గ్రహణలు గా మారుస్తుంది. అవి  ఆ గ్రహణలు కలిగించే అనుభవములను చిత్తం అవగాహనలుగా, అర్థములు గా మార్చి స్మృతిగా మనలో నిలుపుతుంది. బుద్ధి విచక్షణనీ, తర్కాన్ని, యుక్తిని; అహంకారం వ్యక్తిత్వాన్ని ఇస్తాయి, కలిగిస్తాయి. ఇలా ఏర్పడ్డ స్మృతి రూపమై, వాసనలుగా పిలవబడే అనుభవములు, అవగాహనలు, గ్రహింపులు, అర్థస్పృహలు, అర్థాలు, అపార్థాలు కాలక్రమేణ దృష్టికి తేబడి వర్తమానంలో వాసనలను, తదనుగుణంగా తలపులను కలిగిస్తాయి. "నేను" అనుకోగానే లేదా అనగానే మనలో ఎన్నో తలపులు, మానసిక స్థితులు కలుగుతాయి. ఏర్పడతాయి. మనం "నేను" ని మన శరీరంతో, అన్వయించుకుంటాము. ఇంకా ఈ శరీరం వల్ల, శరీరంతో కలిగిన వక్తిత్వం వల్ల ఏర్పడ్డ వివిధ బంధాలతో, అనుబంధాలతో, మన మానసిక వృత్తులతో , ప్రవృత్తులతో, మన ప్రజ్ఞా పాటవాలతో, వాటి లేమితో, మన సాంఘిక స్థితిగతులతో, అభిరుచులతో, ఇష్టాయిష్టములతో కూడ "నేను" ని అన్వయించుకుంటాము. ఈ అన్వయం వల్ల కలిగే సాధక బాధకాలతో సుఖ పడుతూంటాము, సతమతమవుతూంటాము. దు:ఖాన్ని, వేదనలనూ, వ్యథలనూ అనుభవిస్తూంటాము. "నేను" అనుకోగానే ఏ విధమైన తలపులు, భావములు, ఆలోచనలు కలుగక, వివిధ మానసిక స్థితులు ఏర్పడక, మనసంతా ఆనందం వెల్లి విరుస్తూంటే అది నిర్మల మానసిక స్థితి. ఆనందాహ్లాద భరిత  స్థితి. ఈ స్థితియే  దశయే నిర్మల మానసిక సమయము. "అసలు నేను" స్వరూపము. జ్ఞానులు నిరంతరం ఈ నిర్మల మానసిక స్థితిలో ఉంటారు. ఆనందం లో ఎల్లప్పుడూ ఆనందలహరి గా ఉంటారు. ఈ స్థితిని గురించి విని, తెలిసికొని, గ్రహించ, అవగాహన చేసికొని, అనుభవం గా మార్చుకుంటే మనమూ సంసార (సుఖదు:ఖానుభావభరిత) జీవితం కలిగించే వడికి, ఒడుదుడుకులకు లోనవక, ప్రశాంత చిత్తంతో మన బాధ్యతలని నిర్వర్తిస్తాము. బుద్ధి సునిశితమవుతుంది. ఉపయోగకరమైన మంచి స్ఫురణలు కలుగుతాయి. మన ప్రజ్ఞా పాటవాలు వృద్ధి చెందుతాయి. మనం సుఖ సంతోషాలతో జీవిస్తూ, మన వారిని సుఖ సంతోషాలతో జీవింప చేస్తాము. మన జీవితముల పరమావధి, పరమార్థము ఇదే కదా. నిర్మల మానసిక స్థితే ఆత్మ స్థితి. జాగ్రత్ సుషుప్తి దశ. ఆత్మ దశ కూడ. నిర్మలమైన మనసే ఆత్మ. నిర్మల మానసిక స్థితే మన నిజ స్థితి. నిజ స్వరూపము. నిజ శబ్దము, మౌనము కూడ ఇదే. ఆనందము, శాంతి, మౌనము, మననమై, మనమై, అనుభవమై, దివ్య స్థితిలో జీవిస్తాము. నిర్మల మానసికానుభవమే ఆత్మానుభవము. మనసు యొక్క నిశ్శబ్దమే  మౌనము. రసము. భక్తీ. తాత్పర్యము. తత్పరత. అందరము ఈ స్థితిని స్వంతం చేసికొనాలి. చేసికొనాలి అంటాము కాని, నిజానికి ఈ స్థితి ఎల్లప్పుడూ మనకు స్వంతమయ్యే ఉంటుంది. మన మానసిక కార్య కలాపములు జరుగుతున్నప్పుడూ సంగీతము వెనుక శ్రుతి వలె వెన్నంటే  ఉంటుంది. తేనెలో మధురిమ వలె కలిసి పోయే ఉంటుంది. మానసిక కార్య కలాపములు విరమింపబడినపుడు ఆనందం, శాంతి, మౌనములుగా వెలుగుతూ అనుభవానికొస్తుంది. మనం శాంతానందమయులము అవుతాము. మనం "నేను" ని తప్పుగా అన్వయం చేసికోవడం వల్ల కలిగే సుఖ దు:ఖ కారక  భావములు, జ్ఞానములు, అజ్ఞానములు, మన నిజ స్థితియైన ఈ శాంతానంద స్థితిని కప్పి ఉంచుతాయి. అవి తొలగగానే సతతమూ మన నిజస్వభావమైన శాంతి మనసంతా నిండుతుంది. మనసప్పుడు విరామము నొంది, అంతరంగమంతా రామము (ఆత్మ స్వరూపము), రామబ్రహ్మము అవుతుంది. ఆనందం అనుభవిస్తూ మానసిక కార్య కలాపములనుంచి విరామాన్ని పొంది విశ్రాంతిని నింపుకొని నిర్మల మనస్కులమై జీవిస్తాము. మన విధులను, బాధ్యతలను మరింత శ్రద్ధగా, బాగా నిర్వర్తిస్తాము. శ్రీర్భూయాత్!

No comments:

Post a Comment

Pages