భారత జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య - అచ్చంగా తెలుగు

భారత జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య

Share This

భారత జాతీయ పతాక రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్య

-      పోడూరి శ్రీనివాసరావు ఆంగ్లేయుల పాలన నుంచి భారతమాత దాస్యశృంఖలాల విముక్తికై జరిపిన స్వాతంత్ర్యోద్యమ సమరంలో ఒక్కొక్కరోక్కొక్క పంధా అనుసరించారు. శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోసు, శ్రీ అల్లూరి సీతారామరాజు, ఝాన్సీలక్ష్మిబాయి ప్రభ్రుతులు సైనిక పోరాటాల ద్వారా విప్లవయుద్ధం, తిరుగుబాటు జరిపితే, శ్రీ మహాత్మాగాంధీ మొదలైన వారు అహింసా పోరాటం సాగించారు. ఎందరో త్యాగధనుల కృషి ఫలితంగా 15 ఆగష్టు 1947 న స్వతంత్ర భారతదేశం అవతరించింది. స్వాతంత్ర్య పోరాటం ముమ్మరంగా సాగుతున్న నేపధ్యంలో కూడా భారతీయులకు జాతీయ జెండా లేదు. మనమందరం ప్రస్తుతం చూస్తున్న మన జాతీయ జెండా రూపకర్త మన తెలుగు వాడయినందుకు మనమంతా గర్వించాలి. ఆయనే శ్రీ పింగళి వెంకయ్య గారు. కృష్ణ జిల్లా మచిలీపట్టణం సమీపంలో గల ‘చాల్ల పెనమలూరు’ అనే గ్రామంలో శ్రీ హనుమంత రాయుడు శ్రీమతి వెంకట రత్నమ్మ దంపతులకు ఆగష్టు 2 వ తేదీ 1876 లో శ్రీ పింగళి వెంకయ్య గారు జన్మించారు. ఆయన ప్రాధమిక విద్య మచిలీపట్నం లోనూ, సీనియర్ కేంబ్రిడ్జ్ విద్య కొలొంబో లోనూ జరిగింది. ఆయనకు భూగర్భ శాస్త్రమంటే విపరీతమైన ఆసక్తి ఉండేది. ముఖ్యంగా వజ్రపు గనుల గురించి విశేషమైన కృషి చేయడంతో శ్రీ వెంకయ్య గారు, “డైమండ్ వెంకయ్య” అనే పేరుతో ప్రసిద్ధికెక్కారు. శ్రీ వెంకయ్య గారు జియోలజి లో డాక్టరేట్ సాధించారు. దక్షిణ ఆఫ్రికాలో ‘ఆంగ్లో-బోయర్ వార్’ జరిగినప్పుడు శ్రీ వెంకయ్య బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పని చేసారు. ఆ సమయంలోనే, దక్షిణ ఆఫ్రికాలో శ్రీ వెంకయ్యగారు, పూజ్య బాపూజీ-మహాత్మాగాంధీ ని కలుసుకోవడం జరిగింది. స్వాతంత్ర్య సాధనకై శ్రీ గాంధీ చేస్తున్న పోరాటం పట్ల, గాంధీజీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైన శ్రీ వెంకయ్య గారు స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో పాలుపంచుకున్నారు. పిమ్మట బెంగళూరు లోనూ, మద్రాసు లోనూ రైల్వే గార్డ్ గా కొంత కాలం పని చేసారు. బళ్లారిలో ప్లేగ్ అధికారిగా కొన్నాళ్ళు పని చేసారు. అనంతరం లాహోర్ వెళ్లి అక్కడ ఆంగ్లో వేదిక్ కాలేజీ లో ఉర్దూ జపనీస్ భాషలు నేర్చుకున్నారు. ఉత్తర భారతదేశంలో ఉన్న 5 సంవత్సరాలలో రాజకీయాలలో, స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడైన శ్రీ దాదాభాయ్ నౌరోజీ, 1906 లో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో, శ్రీ పింగళి వెంకయ్య గారిని ఉత్సాహవంతుడైన ఉద్యమకారునిగా సభకు పరిచయం చేసారు. శ్రీ వెంకయ్య గారు 1906-1911 మధ్య వ్యవసాయ పద్ధతుల పై పరిశోధన చేసి, కాటన్ పై ప్రత్యెక కృషి సలిపారు. ‘కాంబోడియన్ కాటన్’ పై విశేష కృషి చేసినందుకు శ్రీ పింగళి వెంకయ్య గారిని ‘ప్రత్తి వెంకయ్య’ అని పిలిచేవారు. వ్యవసాయ రంగంలో శ్రీ వెంకయ్య చేసిన కృషికి గాను, ఆయన సేవలను గుర్తించి ‘రాయల్ అగ్రికల్చర్ సొసైటీ ఆఫ్ బ్రిటన్’ తమ సంస్థలో గౌరవ సభ్యత్వమిచ్చి గౌరవించింది. తర్వాత మచిలీపట్టణం తిరిగి వచ్చి ‘నేషనల్ స్కూల్’ ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో అచటి విద్యార్ధులకు బేసిక్ మిలటరీ ట్రైనింగ్, హిస్టరీ, అగ్రికల్చర్ – మొదలైన విషయాలపై పాఠాలు చెప్పేవారు. కాకినాడలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ సభల్లో – జాతీయ కాంగ్రెస్ కి జాతీయ పతాకమొకటి ఉండాలని శ్రీ పింగళి వెంకయ్య గారు ప్రతిపాదించగా, పూజ్య బాపూజీ వారినే పతాకానికి రూపకల్పన చేయమని కోరారు. 1916-1921 మధ్య సుమారు 5 సంవత్సరాల పాటు దాదాపు ౩౦ దేశాల వివిధ జాతీయ పతాకాలను సమగ్రంగా పరిశీలించి శ్రీ వెంకయ్య గారు త్రివర్ణాలతో మధ్య చరఖాతో, ప్రస్తుత జాతీయ పతాకానికి రూపకల్పన చేసారు. శ్రీ తుర్లపాటి వెంకటాచలం – మంగమ్మ దంపతుల కుమార్తె అయిన రుక్మిణమ్మ గారిని శ్రీ పింగళి వెంకయ్య గారు వివాహమాడారు. వారికి ఇరువురు కుమారులు, ఒక కుమార్తె - సంతానం. 04.07.1963 న విజయవాడలో పేదరికంలో మ్రాగ్గుతూ శ్రీ పింగళి వెంకయ్య గారు తనువు చాలించారు. జాతీయపతాక రూపకల్పన చేసిన శ్రీ పింగళి వెంకయ్య గారికి ఏ విధమైన గౌరవమూ దక్కలేదు. ఆయన జన్మస్థలమైన భట్లపెనమలూరు లో గాని, సమీప ప్రదేసమైన మచిలీపట్నం లో గాని ఏ విధమైన స్మారక చిహ్నమూ లేదు. ఆయన నివసించిన గృహం కూడా శిధిలమై, నేలమట్టమై పోయింది. ఆయన సేవలకు భారత ప్రభుత్వం ఒక స్టాంపు రిలీజ్ చేసి చేతులు దులుపుకుంది. ఆయన కుమార్తె, శ్రీమతి సీతామహాలక్ష్మి గారికి గత కొద్ది సంవత్సరాల క్రితమే పించన్ మంజూరైనట్లు తెలుస్తోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడం, జాతీయ పతాక రూపకర్త శ్రీ పింగళి వెంకయ్య గారు జన్మించడం, ఈ వ్యాసానికి రూపకల్పన జరగడం – అన్నీ ఆగష్టు నెల కావడం.... కేవలం.... యాదృచ్చికమేనెమో!! (కళాసేవారత్న, విశ్వకళావిరించి, రచనాప్రవీణ, పోడూరి శ్రీనివాసరావు- 9849422239, హైదరాబాద్-500085)  

No comments:

Post a Comment

Pages