- యజ్ఞపాల్ రాజు ఉపేంద్రం
నేను మీకు కొన్ని నిజాలు చెప్పదలుచుకున్నాను. అవేంటో తెలుసా? మామూలుగా మనం రోజువారీ జీవితంలో చూసేవే. మామూలే కదా అని ఏ మాత్రం పట్టించుకోకుండా వదిలేసేవే. అవి మాత్రం వేరెవరూ నేర్పించలేని విలువైన పాఠాలు. పసి పిల్లలు మనకు నేర్పే జీవిత పాఠాలు. విచిత్రంగా ఉంది కదూ. సరే విషయానికొద్దాం. మీ ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల ఇళ్ళలో కానీ చంటి పిల్లలు ఉన్నారా? వారిని చూస్తే మీకేమనిపిస్తుంది? వారి ప్రవర్తన, శరీరభాష మీకేమీ ఆలోచనలు రేకెత్తించలేదా? అసలు మీకు పసిపిల్లలను, వారి జీవన విధానాన్ని దగ్గరగా గమనించాలని ఎప్పుడైనా అనిపించిందా? ఈ ప్రశ్నలకు అవును కాదు అనే సమాధానాలు మీకు మీరే ఇచ్చుకోండి గానీ నేను మీకో రహస్యాన్ని చెప్పేస్తున్నాను. అదొక బ్రహ్మరహస్యం. మొదట్లో చెప్పినట్టు, తెలిసినా తెలియనిది.
పసివాళ్ళ గుప్పిళ్లు చిన్నప్పుడు మూసి ఉంటాయి, అందులో కొన్ని రహస్యాలుంటాయి. పెరిగే కొద్దీ తెరుచుకుంటాయి. అంటే అర్థం నేను చెప్పిందే. రహస్యం వీడిపోయిందని పిల్లలు మనకు చెప్తున్నారు అంతర్లీనంగా. ఆది మానవులకు మొదట బట్టలుందేవి కావు, లోకజ్ఞానం ఉండేది కాదు, ఏడ్చినా నవ్వినా వాటి భావాలు సమానమే, ఆకలేస్తే తినడం, నిద్ర వస్తే పడుకోవడం, స్వేచ్చగా తిరగడం ఇవే. తర్వాత మెల్లమెల్లగా అన్నీ నేర్చుకున్నారు. బట్టలు వేసుకోవడం. సరిగా తినడం, సంఘ జీవనంలో బాగం కావడం, లౌక్యంగా ప్రవర్తించడం ఇలా. పసి పిల్లలను జాగ్రత్తగా గమనిస్తే ఇవే లక్షణాలు ఇంచుమించు కనిపిస్తాయి. చిన్నప్పుడు బట్టలు లేకుండానే ఉంటారు, ఏం తోస్తే అది చేస్తారు, ఆకలేస్తే తింటారు, నిద్ర వస్తే పడుకుంటారు, ఏదైనా కావాలంటే మారాం చేసి పట్టుబట్టి సాధించుకుంటారు, ఏడుస్తారు, నవ్వుతారు, ఈ రెండిటికీ పెద్ద తేడాలేదు. ఉన్నా ఏడుస్తారు, లేకపోయినా నవ్వుతారు. మెల్లమెల్లగా మాటలు వస్తాయి, భాష వంటబడుతుంది, బట్టలు వేసుకుంటారు, అన్నం సరిగా తినడం నేర్చుకుంటారు, సమాజంలో ఎలా ఉండాలో ఎలా మసలాలో తెలుసుకుంటారు. ఇన్ని సారూప్యతలు మన చుట్టూనే ఉండగా మనకు మానవ ప్రవర్తనా పరిణామాలను చెప్పడానికి వేరే సిద్ధాంతాలు అవసరం లేదు కదూ.
పసివాళ్ళ చుట్టూ ఒక ప్రపంచమే ఉంటుంది. మనం ప్రయత్నిస్తే ఆ ప్రపంచంలోకి ఏ వయసులోనైనా వెళ్లవచ్చు. అసలు మనం చిన్నప్పటి ప్రపంచంలోనే ఉంటామేమో. చాలామంది అంటూ ఉంటారు, ఈ వయసులో కూడా ఏంట్రా చిన్నపిల్లాడిలా అని. మనం ఎప్పటికీ చిన్నపిల్లలమే అని తెలీదు కాబోలు. పెద్దవాళ్ళమైపోయాముగా, నామోషీలు ఎక్కువగా ఉంటాయి మరి మన పెద్దరికానికి. మనలోని పసితనం మాత్రం ఎప్పటికీ వాడిపోదు. మనమే ఆ పసిదనానికి మర్యాదల ముసుగేసేస్తాం. చక్కగా కేరింతలు కొడుతూ నవ్వే పసిపిల్లలను చూస్తే మనసులోతుల్లో దాగి ఉన్న అసలు మనం బైటికోస్తాం. వారితో పాటు ఆడి పాడి ఆనందిస్తాం.
గొప్ప తత్వముంటుంది పసితనంలో. పసివాళ్లకన్నా గురువులు మనకు దొరకరు. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. పసిపిల్లలను దేవుళ్ళతో పోలుస్తారు. కల్లా కపటం లేని స్వేచ్ఛ దైవత్వమయితే, అలా ఉండే పసి వాళ్ళు దేవతలతో సమానమైతే, అలా జీవితాంతం ఉండగలిగితే అందరం దేవుళ్ళమేగా. పిచ్చి ప్రపంచానికి ఇది తెలియదు అందుకే మేం గొప్ప అంటే మేం గొప్ప అంటూ భేషజలకు పోతారు. ప్రపంచశాంతికి పెద్ద మనుషులూ, పెద్ద పెద్ద వేదికలూ, ఇంకా పెద్ద ప్రసంగాలూ, అర్థం కానీ సిద్ధాంతాలూ అవసరం లేదు. పసి పిల్లలంత స్వచ్చంగా ఉండగలిగితే చాలు.
తమకు కావాల్సింది పట్టుబట్టి సాధించుకుంటారు పసి వాళ్ళు. చుట్టూ పక్కల ఏం జరుగుతున్నా తమకు పట్టనట్టు యోగి తత్వం కనబరుస్తారు. బ్రహ్మానందాన్ని పొందినట్లు కేరింతలు కొడుతూ తుళ్లుతారు. ఏడుపొస్తే ఆపుకోరు, దుఃఖాన్ని పొంగనిస్తారు. ఆప్యాయంగా దగ్గరికొస్తారు. ఈ లక్షణాలన్నీ పసివయసు దాటిపోయింతరవాత కూడా మనలో కనిపిస్తూనే ఉంటాయి. ఒక జీవితానికి ఇంకా ఏం కావాలి? ఇంత కల్మషరహితంగా జీవించడం సాధ్యమని తెలిసినా జీవితాలను సంక్లిష్టం చేసుకుంటామే, అలా బ్రతకడానికి కనీసం ప్రయత్నించనైనా ప్రయత్నించమే. దీనికి నిష్కృతి ఉందా? ఇంత పెద్ద రహస్యాన్ని చెప్పే పసి వాళ్ళ హృదయాలను మనం ఎంతవరకూ అర్థం చేసుకుంటున్నామో తరచి చూసుకోవాలి మరి. ఈ ప్రపంచంలోని పెద్దవాళ్ళమనుకునే పసిపిల్లలందరికీ ఇది నామాట. అందరం పసిపిల్లలమైపోదాం. ఇంకోమాట, బ్రహ్మరహస్యమంటే తెలియనిది కాదు కళ్ళముందున్నా తెలుసుకోలేనిది.
No comments:
Post a Comment