" ఐడియా ఉందా" ? - అచ్చంగా తెలుగు

 " ఐడియా ఉందా" ?

 - నాగజ్యోతి సుసర్ల


దీప్తికి ఆ రోజు పెళ్ళి చూపులు. పెళ్ళికొడుకు సుధీర్ LIC లో పని చేస్తాడని వింది.జాతకాలు కుదిరాక తన తండ్రి పిల్లను చూడటానికి పెళ్ళివారిని తమ ఇంటికి ఆహ్వానించి ,తమ అడ్రెస్ ఇచ్చాడు.వాళ్ళు ఫలానా తారీఖున మధ్యాహ్నం  3 గంటలకు పిల్లను చూడటానికి వస్తామనీ, పక్క ఊరు కాబట్టి ఒక సెంటర్ లో ఎవరైనా తమకోసం వచ్చి ఉండగలిగితే అడ్రెస్ కనుక్కోవటం తమకు సులువు గా ఉంటుందని చెప్పారు...
  ఆ రోజున దీప్తీ వాళ్ళ అన్నయ్య శంకర్ కూడా హైదరాబాదు నుండి వచ్చాడు.కానీ పెళ్ళివారికి తనే గుర్తు కాబట్టి దీప్తీ వాళ్ళ నాన్నగారు ఎండనబడి వెళ్ళి సెంటర్ లో నిల్చున్నారు వారికోసం ఎదురు చూస్తూ....కానీ పెళ్ళివారు అడ్రెస్ పట్టుకుని సరాసరి ఇంటికి వచ్చేశారు.పెళ్ళిపెద్ద లేకుండానే పెళ్ళి చూపులు మొదలయ్యాయి.
     దీప్తి ని తెచ్చి  పెళ్ళివారి ముందర ఒక కుర్చీలో కూర్చోపెట్టారు .శంకర్ అందరూ నిశ్శబ్ధం గా ఉండటం చూసి ముందు  మాటలు మొదలెట్టాడు.  పెళ్ళి కొడుకు సుధీర్ తో గుంటూరు లో మీరెక్కడండీ ఉండేదీ ? అని అడిగాడు...  మేము బ్రాడీపేట లో ఉంటాము...మీకు ఆ ఏరియా గురించి "ఐడియా ఉందా" అన్నాడు సుధీర్ ...ఆ...ఆ.. ఆ ఏరియా నాకు  తెలుసండీ అన్నాడు శంకర్. ఆ తరువాత LIC లో  మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు ? అన్నాడు శంకర్....నేను ఫీల్డ్  ఆఫీసర్ ని అండీ .. ఆ జాబ్స్ గురించి మీకేమైనా"ఐడియా ఉందా"? అన్నాడు సుధీర్...అబ్బబ్బే లేదండీ అన్నాడు శంకర్....
               ఇలా ఈ "ఐడియాలు ఉండటం " నాలుగైదు సార్లు అయ్యాక, దీప్తి చిన్నగా దగ్గి గొంతు సవరించుకుంది. అందరి అటెన్షనూ  దీప్తీ వైపుకు తిరిగింది.
     మంచి మరూన్ కలర్ చీర,మెడలో ఒక ముత్యాల దండ తో సింపుల్ గా,కుందనపు బొమ్మలా ఉంది దీప్తి..అందులో కాస్త పొడగరి కూడా అయిన దీప్తి ఎత్తుకు తగ్గ లావుతో చూడం గానే చక్కగా ఉంది అనుకునేలా ఉంటుంది.
   సుధీర్ దీప్తి వంక ఒక సారి మెచ్చుకోలుగా చూసి మీరు డిగ్రీ ఏ కాలేజ్ లో చదివారూ ? అన్నాడు...దీప్తి అతని వంక చూస్తూ నేను VSR & NVR కాలేజ్ లో చదివాను.... ఆ  కాలేజ్ గురించి....... మీకు "ఐడియా ఉందా" ? అంది చిరునవ్వుతో ..అంతే పెళ్ళి
కొడుకు బిర్ర బిగుసుకు పోయి దీప్తి వంక చూశాడు.. పక్కనే ఉన్న ఆ అబ్బాయి చెల్లెలుకు నవ్వు వచ్చేసి కిసుక్కున నవ్వేసింది. శంకర్ ,దీప్తి వంక నిర్ఘాంత పోయి చూసి...మా చెల్లెలు కాస్త చిలిపిది అంటూ నవ్వుమొహం తో సర్దేశాడు....
     కట్ చేస్తే .....దీప్తి కి ఆ సంబంధం కుదరలేదు..లోపాయ కారిగా మధ్యవర్తి ద్వారా తెలిసింది ఏమిటంటే దీప్తి ఇప్పుడె ఎత్తు కు తగ్గ లావు ఉంది...మున్ముందు ఇంకా పెరగిపోయే అవకాశం  ఉందని పెళ్ళి కొడుకు ఇష్టపడలేదని ....
 తరువాత అదే పెళ్ళి కొడుక్కి తమ సందు చివరే ఉండే పద్మ తో వివాహం జరిగిపోయిందని తెలిసింది.పద్మ చాలా నాజూకు గా ,గట్టిగా గాలి వీస్తే పడిపోయేలా ఉంటుంది. ఆ అమ్మాయికి ఉన్న ఇద్దరు అన్నయ్యల్లో ఒకరు పోలీస్ ఆఫీసర్, ఇంకొకరు లాయర్.
   ఆ తర్వాత సంవత్సరం దీప్తి కూడా పెళ్ళి అయిపోయి సింగపూర్ వెళ్ళి  పోయింది....ఒక అయిదేళ్ళ తరువాత దీప్తీ వాళ్ళు ఇండియా లో సెటిల్ అవ్వటానికి సింగపూర్ నుండి వచ్చేశారు ...హైదరాబాదు లో ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుని కాపురం పెట్టారు. చుట్టుపక్కలంతా చిన్నా చితకా అపార్ట్ మెంట్ కాంప్లెక్స్  లతో సందడి గానే ఉంటుంది.. ఆ ఏరియా అంతా..
   ఒక రోజు సాయంత్రం  దీప్తీ వాళ్ళ మూడేళ్ళ అబ్బాయిని ఆడిస్తూ వాకిట్లో తిప్పుతోంది.ఒక జంట తమ ఇంటిముందు గా వెళుతోంది.ఆ జంటలో అబ్బాయి తదేకం గా దీప్తి నే చూస్తున్నాడు. దీప్తి కూడా వారిని తను బాగా ఎరుగుదునే అని ఆలోచించింది...వెంటనే గుర్తుకొచ్చారు..పద్మ సుధీర్ లు...పలుక రించే లోపల వెళ్ళిపొయ్యారు వాళ్ళు. ఆ మర్నాడు మళ్ళీ  వాళ్ళు తననే గమనించటం చూసిన దీప్తి వాళ్ళ ఆయనకు విషయం చెప్పింది....దీప్తి భర్త వాళ్ళని చూసి నవ్వుతూ చేయి ఊపి..దగ్గరకెళ్ళి పలుకరించాడు...తమ ఇంటిలోకి ఆహ్వానించాడు వారిని.  ఆ రోజు అలా వాళ్ళింటికి వెళ్ళీన సుధీర్,  దీప్తి వాళ్ళ అన్యోన్య దాంపత్యాన్ని చూసి మనసులో కాస్త చింత పడ్డాడు.మరేం చేస్తాడు ? దీప్తీ భవిష్యత్తు లో లావు అవుతుంది అని చిన్న పనికిమాలిన వంక పెట్టి దీప్తి ఆకారం పై లోపం ఎంచటం ద్వారా , ఆమె తనను ఎక్కిరించిన పొగరు పై దెబ్బ కొట్టానని సంతృప్తి పడ్డాడు అప్పట్లో... మరి ఇప్పుడు చూస్తే దీప్తి దాదాపు అలాగే ఉంది ,ఒక బిడ్డ పుట్టాక కూడా.......కానీ తన భార్యో? ఎప్పుడూ నాజూకు గా ఉండాలనే తపనతో తను సరిగ్గా తినదూ  , తనకు పెట్టదూ..ఎప్పుడూ నీరసం గా ఉంటుంది...బిడ్డలు పుడితే తన అందమంతా చెడుతుందని పిల్లల్నే వద్దనుకుంది...ఇప్పుడేమో ఎనీమిక్ గా ఉందంటూ మందులూ,మాకులూ వాడాల్సొస్తోంది. ఏమైనా గట్టిగా అనాలంటే వాళ్ళ అన్నయ్యలు పోలీస్ ఆఫీసరూ, లాయరూనూ... తనమీదే కేసులు వేయించే సత్తా ఉన్నవాళ్ళు. అస్థిపంజరం లా గట్టిగా పట్టుకోటానికి చెంచాడు కండ కూడా లేకుండా  " లావొక్కింతయు లేదు" అని తను ఏడ్చేలా ఉంటుంది పద్మ...ఇలా మదన పడీ ,మదనపడీ ..చివరకు ఒక రోజు దీప్తీ వాళ్ళ ఇంటికి వెళ్ళి దీప్తి గారూ మా ఆవిడ కూడా మీ లాగా చక్కగా తయారవటానికి , తనని నొప్పించకుండా ,ఒప్పించే "ఐడియా ఉందా"?  మీ దగ్గర ,ఉంటే కాస్త చెప్పండి ప్లీజ్ అంటూ ప్రాధేయపడుతున్న సుధీర్ ని చూసి విస్తూ పోయి చూస్తూ ఉండిపోయారు దీప్తీ దంపతులు....
(గమనిక : ఊబకాయం ఎంత అనర్ధ హేతువో.....అతి నాజూకు తనం కూడా అంతే అనర్ధ హేతువు...)

No comments:

Post a Comment

Pages