మౌన సంఘర్షణ
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
"యావండోయ్ ఏడైంది.. ట్రైన్ టైం అవుతోంది ఏంటా 'మొద్దు '... నిద్ర...." ...నిద్రలో ఉన్న భర్త వినడనుకోని మాటల్లో శ్లేష వాడేస్తొంది గబగబా కృష్ణుడి శ్రీమతి. ....దొరికినప్పుడే కదా..మరి..! వినినా నవ్వుకొనడం మినహా ఏ భర్త అయినా ఏంచేస్తాడు చెప్పండి.. అతడు కూడా ..సహజం గా అంతే..ఏం మాట్లాడలేడు.!
లేచి.." టైం ఎంతైంది.." అని అడుగుదామనుకున్నాడు... నోట మాట పెగల్లేదు... చేయి చూపించి సైగ చేశాడు..! .".టైం ఎంతైందని..?!" "ఏమైంది.. గొంతుకి ...ఏమొచ్చింది" మళ్ళీ శ్లేష.. పొద్దు పొద్దున్నే కృష్ణుడికి శ్రీలక్ష్మి గుర్తొచ్చింది.. అమె తన గర్ల్ ఫ్రెండో లేక రిసెప్షనిస్టో కాదు.. అబ్బ..లబ్బ.. జబ్బ శ్రీలక్ష్మి గారు.... అదేనండి మన హాస్య నటి శ్రీలక్ష్మిగారే.. పొద్దున్నే ఆవిడెందుకొచ్చిందబ్బా అని బుర్రకి పని పెట్టొద్దులేండి.. అతని గొంతు పూడి పోయింది.. మాట పెగలడం లేదు.. మాట జవదాటక పోవడం అంటే ఏవిటో ఇప్పుడు తెలుస్తుంది..!..
పాపం. ఇక ఆ రోజు ఎలాగడపాలా..! అనుకుంటూ చకచకా రెడి అయ్యి.. తాను పనిచేస్తున్న ఊరికి వెళ్లేందుకు కాఫీ సేవనం కుడా లేకుండా రైల్వేస్టేషన్ కి బయలుదేరాడు కృష్ణుడు. అప్పటికే ట్రైన్వచ్చే టైం అయ్యింది.. అసలే లేట్ గా ఇంటి దగ్గర బయలుదేరడంతో.. హాడావుడిగా రైల్వేస్టేషన్ చేరుకున్నాడు.. మరి కాసేపట్లో డెలివరీ అయ్యే నిండుగర్భిణిలా ఉంది స్టేషన్ ఆవరణ.. అంత కిటకిటలాడుతున్నారు. ముందురోజు పండగ కావటంతో వచ్చేపోయే జనాలతో రద్దీ బాగా పెరిగింది. స్టేషన్ బయటి దాకా ఉన్న పెద్ద క్యూలో నిలబడ్డాడు.. టికెట్ తీసుకోవడానికి కృష్ణుడి వంతు వచ్చింది..
"ఎక్కడికి" కౌంటర్ లోంచి పెద్ద సౌండ్. మాటరావటం లేదు కృష్ణుడికి.. సైగ చేశాడు.. ఒంగోలు అని.. కౌంటర్ లోని వ్యక్తికి అర్ధం కాలేదు.. కాస్త ముందుకు ఒంగి.. టికెట్ ఇవ్వమని సైగ చేశాడు..ఒంగితే ఒంగోలు అని అర్ధం చేసుకుంటాడేమోనని... ఊహు.. కౌంటర్ లో వ్యక్తికి కృష్ణుడు ఏం చెబుతున్నాడో అర్ధం కాలేదు..
" ఏమయ్యా ఎక్కడికో చెప్పవయ్య.. ఏ వూరో చెప్పమంటే చెప్పమంటే ఒంగుని ఆ సైగలేంటి..ఆ ...!! ఒక పక్క క్యూ ఎంతుందో చూడు.. ప్రతి ఒక్కడికి పరాచకాలై పోయాయ్.. చడామడా తిట్టేస్తున్నాడు కౌంటర్ లో వున్నవ్యక్తి .. వాళ్ళింట్లో వాళ్ళావిడమీద కోపం.. పెనం మీద నీళ్లలా ఇక్కడ చిటపట లాడేస్తున్నాడు కాబోలు అని అదో రకంగా మొఖం పెట్టాడు కృష్ణుడు.
ఈ లోపు క్యూలో కృష్ణుడి వెనుక ఉన్న వ్యక్తి.. రైల్ టైం అవుతోందనే తొందరలో, కృష్ణుడి చంక లోంచి కౌంటర్ లో చెయ్యి పెట్టి ఒంగోల్ ఒకటి అని ఓ 20 రూపాయల నోటిచ్చాడు.. వాడు టికెట్ తీసుకుని తనని బ్రతికించాడనుకుని తనకు అదే ఊరికి టికెట్ కావాలంటూ సైగ చేసి 100 రూపాయలిచ్చాడు.... "ఏట్రైన్ కి" మళ్ళీ గద్దించాడు కౌంటర్ లోని వ్యక్తి.. "ఓరినాయనో.. పినాకినీ కి" అన్న కృష్ణుడి మాటలు మాటలు పెదవి దాటలేదు... ఎంత సైగ చేసినా.. ఊ హూ.. ఒక్క మాట బయటపడితేగా..అంతగా గొంతు పూడుకు పోయింది..కృష్ణుడికి.. బాగా ధ్రోట్ ఇన్ పెక్షన్ వచ్చింది. ముందరోడు టికెట్ తీసుకుంది ఒంగోలే కానీ.. ప్యాసింజర్ కి తీసుకున్నాడు.. తాను వెళ్ళాల్సింది సూపర్ ఫాస్ట్ పినాకిని.. ఎట్టా చెప్మా.. అని కృష్ణుడు బుర్రపగలకొట్టుకుండే లోపు.. తన వెనుక వున్న గత్తర మాస్టారొకరు తల మొత్తం కృష్ణుడి చంకలోంచి దూర్చి.. పినాకినికి ఒంగోలు టికెట్ ఒకటి అన్నాడు.
"క్యూ ఎందుకురా ఉంది వెధవ.." అని డిప్ప మీద ఒకటేద్దామనుకున్నాడు.. కానీ వాడి అదృష్టం అలా చేయలేక పోయాడు కృష్ణుడు.. ఆ టైంలో వాడే అతనికి భగవంతుడులా కనబడ్డాడు. " అదే ట్రైన్.. అదే ఊరని "కౌంటర్ లోని వ్యక్తికి సైగ చేశాడు కృష్ణుడు.. ఎప్పుడెప్పుడు కౌంటర్, కౌంటర్స్ నుంచి బయటపడదామా అని.. ! కౌంటర్ వ్యక్తి టికెట్ట్ ఇచ్చేవాడు ఇవ్వక పోగా.. "పాసేది" అన్నాడు.. "ఏంపాస్ రాబాబూ నీ బొందబెట్టా" అని లోలోన తిట్టూకుంటూ "ఏంపాస్" అని సైగ చేశాడు బ్రహ్మిలాగా కృష్ణుడు.... "డెంబ్ పాస్" డిసేబుల్డ్ పాస్ తీసుకు రాలేదా.".అన్నాడు.. దిమ్మతిరిగింది..కృష్ణుడికి. ముఖం కందిగింజంతైంది.."ప్చ్.. ఇదేం ఖర్మరాబాబూ" అనుకుని, " లేదు " అని సైగ చేయడంతో .. వాడిచ్చిన టికెట్ తీసుకుని రైలెక్కేందుకు పరిగెత్తాడు.. వెనుక నుంచి వినబడింది కృష్ణుడికి.. "బాబూ పాస్ తీసుకో కన్సెషన్ వస్తుంది".. అంటూ.. కౌంటర్ వాడే అయ్యుంటాడనుకుని, తిట్టూకుంటూ పరిగెత్తాడు అప్పటికే వచ్చిన ట్రైన్ ఎక్కేందుకు.
హమ్మయ్య అని రైలెక్కాక ఊపిరి పీల్చుకున్నాడు...అప్పటికే ట్రైన్ ఎక్కిన అతని ఫ్రెండ్స్.. "ఏమైంది మూడు రోజులుగా కనిపించలేద"ని ప్రశ్నలు మింగిన వాళ్ళలా ఒకటే రొద.. ఏం చెప్పాలన్నా.. కృష్ణుడి వల్ల కావడం లేదు.. నోట్లోంచి కనీసం శబ్ధం కూడా రావటంలేదు.. " ఏమైందిరా.. ! అబ్బ..లబ్బ ..జబ్బ.. " అంటూ ఒహటే వెక్కిరింతలు.. అంతలో కృష్ణుడి స్నేహితుల్లో ఒకడు " మామా.. గొంతు పోయిందా..? 'సింహాసనం' ఏస్తే.. గొంతు సరిగా వస్తుందే." అన్నాడు... " నాన్సెన్స్ " అన్న అరుపు కృష్ణుడి కొండనాలిక దాటి వస్తే ఒట్టు. 'సింహాసనం' ఎలా వేయాలో కూడా అతడే చెప్పాడు కృష్ణుడికి. ..
"ఎంచక్కా మోకాళ్ల మీద కూర్చుని.. మునివేళ్ళను నేలకానించి.. అంటే సింహం లాగా నోరెళ్ళబెట్టి.. పెద్దగా గాండ్రించాలి.. అంటే సింహం లాగా అన్నమాట..అలా చేస్తే తగ్గిపోద్ది మామా" అని సలహాపారేశాడు. కృష్ణుడికి వాళ్ళ ఇంట్లోని బ్రౌని గుర్తొచ్చింది.. 'ఊరంతా తిరిగొచ్చి నాలిక బయటెట్టి గసపెడుతూ...' "అయినా ఆ సింహగర్జన నిర్జీవంలో చేస్తే పర్లేదుకానీ, నీ తెలివి దొంగలుదూర.. జనజీవన స్రవంతిలో చేస్తే.. కుమ్మేయరూ " అనుకున్నాడు కృష్ణుడు. .. వారి గోల తప్పించుకునేందుకు ఒక కాగితం మీద ' శ్రావణమాసం మౌనవ్రతం'.. అని వ్రాశాడు... వాళ్ళలో ఒకడు లీలగా గొణుగుతున్నాడు..
"శ్రావణమాసంలో కూడా మౌనవ్రతాలుంటాయా.. అదీ బుధవారాలూ " అంటూ.. వినబడ్డా వినబడనట్టు సిగ్నల్ లేని సెల్ చేతిలోకి తీసుకుని యాక్షన్ ఎపిసోడ్ మొదలెట్టాడు కృష్ణుడు...మెయిల్స్ చెక్ చేస్తున్నట్టు. గంట ప్రయాణం తర్వాత కృష్ణుడు దిగాల్సిన స్టేషన్ రానే వచ్చింది.. దేవుడా..! అనుకుంటూ జనాలందరిని దాటుకుని రైలు దిగి..ఆటో స్టాండ్ కి వచ్చాడు...
"ఏవిటో ఈ రోజు లేచిన వేళ ఏంబాలేద"నుకుంటూ తన్లో తానే గొణుక్కుంటూ.. ఒక్కసారి గా కృష్ణుడిని చుట్టు ముట్టేసిన ఆటో వాలాలు "ఎక్కడికి సార్.. బస్టాండ్.. బస్టాండ్" అంటూ వెంబడి బడ్డారు.. ఎక్కడికెళ్ళలో చెప్పడానికి కూడా గొంతు సహకరించనంతగా పూడిపోవడంతో కృష్ణుడు తాను వెళ్లే లైన్ ఆటో వాడు కనబడేంతవరకు ఉండి గప్ చిప్ గా ఎక్కి కూర్చున్నాడు..
ఇంతకీ కృష్ణుడు ఏం చేస్తాడో చెప్పలేదు కదూ.. అతనో పెద్ద చానల్ లో చిన్న ప్రతినిధి.. చానల్ 111 కి, మీడియా రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. కృష్ణుడుది 24 గంటలూ ఫోన్ లో మాట్లాడాల్సిన ఉద్యోగం.. సజ్జోగం లాగా కనిపిస్తుంది కానీ.. అలాంటిదిప్పుడు ..అమ్మో...! అంతలో రోజూ శుభోదయం చెప్పే కృష్ణుడి ఫ్రెండ్ నుంచి ఫోన్.. ...ఎత్తితే మాట్లాడటానికి గొంతు రాదు.. ఎత్తకుంటే ఇకపై ఫ్రెండ్ నుంచి ఫోన్ రాదు.. ఏంచెయ్యలో అర్ధం కాక ఫోన్ ను తీక్షణంగా చూస్తూ ఉన్నాడు.. ఆటోలో ప్రక్కన కుర్చున్న ఉత్సాహి.. " ఫోన్ మ్రోగుతుంటే అలా చూస్తారేవిటండీ, ఎత్తండి.ఎత్తి మాట్లాడండీ." అన్నాడు.. చెప్పొద్దూ కృష్ణుడికి మండిపోయింది.. "నీపని నువ్ చేసుకో " అన్నట్లు చూసి ఆ ఫోన్ లిఫ్ట్ చేసి ...... "అహ్రలోలో" అన్నాడు.. చిత్ర విచిత్ర శబ్ధ తరంగాలు కృష్ణుడి నోటి నుంచి వెలువడటంతో సదరు ఫోనో ఫ్రెండ్.. 'సారీ రాంగ్ నెంబర్' అని పెట్టేశారు... ఇటు చూసేసరికి.. ప్రక్కన కూర్చున్న ఉత్సాహి మరింత దూరంగా జరిగాడు .. ..కృష్ణుడినే అదోలాచూస్తూ.. ..
"అంతా వాయిస్ మహిమ.. మూడో లింగం అని భ్రమపడ్డట్టున్నాడు,..సారి భయపడ్డట్టున్నాడు బడుద్దాయ్" అనుకుని ఏడ్చి మొఖం కడుక్కున్న వాడిలా అయిపోయాడు కృష్ణుడు. ఆఫీస్ ఏరియా రాగానే ఆటో దిగాడు.. ఎదురుగా ఉన్న టీస్టాల్ లోకి నడిచి 'టీ ఒకటి' అని సైగ చేశాడు.. వాడు "టివి సార్ కో స్పెషల్ టీ.. " అని.. "సార్.!. ఈరోజు వార్తలేంది సారూ! .. మొన్న బయటికి పంపిన నాయకుణ్ణి ఆ పార్టీ వోల్లు మళ్ళీ పార్టీలోకి తీసుకుంతారా.. అక్కడెక్కడడో రేప్ జరిగిందంత గద సారూ... సార్.. మొన్న సంతనూతలపాడు మర్డర్ కేసులో అరెస్ట్ లు జరిగాయంటగా" అంటూ వార్తలడుగుతున్నట్లు.. మింగిన ప్రశ్నలన్నీ కక్కేస్తున్నాడూ వెధవాయ్.. వాడి ప్రశ్నల శరాలను తప్పించుకునేందుకు , అక్కడపెట్టిన టీ తీసుకుని ప్రక్కకు కదిలాడు..
వెనుకనుంచి "ఏంది సారూ ఏంఅడిగినా అట్లా మూగోల్లెక్క మాట్లాడరూ".. అన్న వాడి స్వతంత్రతా వాగుడు కృష్ణుడికి తన గొంతులో కిచ్ కిచ్ బొమ్మలాగాకనబడింది... అంతలో "'నిను వదలని నీడను నేనే" .. అని చక్కటి స్వరంలో జేబులోంచి కంట తడిపెట్టిస్తోంది కృష్ణుడి ఫోన్ .. 040...... .ఆఫీస్ కాల్ అదికుడా.. ఫోన్-ఇన్ సెక్షన్ నుంచి.. ఆఫీస్ ఫోన్ చూడగానే దెబ్బకు పొరబోయి..నోట్లో టీ అంతా నేలపాలైంది. నెత్తిన కొట్టుకుంటూ.. తనకు తెలియకుండా తన పరిధిలో ఏం ముఖ్యసంఘటన జరిగుంటుందా? అని ఆలోచనలో పడ్డాడు. .
ఇప్పుడు ఫోన్ - ఇన్.. ఎలా? ఏంచేయాలిప్పుడు?? తనకు గొంతు పోయిందని వారికి ఎలా చెప్పటం..? కృష్ణుడికి టెన్షన్ షురూ..! ఆఫీస్ కాల్ వస్తేనే మామూలుగానే గొంతు తడారి పోతుంటుంది ఇతనికి. అలాంటిది గొంతే లేదిప్పుడు.. మిన్నువిరిగి మీద పడ్డట్టు ఎకాఎకీ ఫోన్-ఇన్.. , 'థ్రోట్ ఇన్ ఫెక్షన్' అని ఫోన్ లో అవతలి వారికి తన పరిస్థితి చెప్పేందుకు ప్రక్కన ఎవ్వరూ లేరు. తనేమో గొంతు బాలేదని ఇంకా ఆఫీసుకు మెసేజ్ ఇవ్వనూ లేదు.. తప్పదు నేరుగా ఫోన్-ఇన్ వాళ్ళకే ఎలాకొలా మెసేజ్ చెబుదామని ఫోనెత్తాడు.. " గురూ ఏంటి ఫోన్ ఎత్తుడింతజేపా.. ఫోన్-ఇన్.. యాక్సిడెంట్.. యాంకర్ రాధిక.."అని గడగడ చెప్పేసింది అవతలి గొంతు. వెంటనే యాంకర్ రాధిక కి లైన్ కలిపారు.. అవతలి నుంచి రాధిక వాయిస్ వినబడుతోంది..
"చేర్యాల ప్రాంతంలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది.. గాయపడాల్సిన పలువురు ప్రమాదం నుంచి బయటపడ్డారు.. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణుడు అందిస్తారు... గుడ్మార్నింగ్ కృష్ణుడు.. చెప్పండి మీ ప్రాంతంలో జరగకుండా ఆగిన ప్రమాదం గురించి చెప్పండి.. ఇంతకీ ప్రమాదం జరగకుండా అంచునెలా వుంది. ఇప్పుడు బస్ లో ఉన్న వారి పరిస్థితి ఎలావుంది... ... ?? ప్రశ్నల వరసెట్టేసింది...
"అసలు ప్రమాదం జరిగిందని ఒక వైపు చెబుతూ.. గుడ్ మార్నింగ్ ఏమిటో.. మాఏరియా కాని వార్తకు నన్ను ఫోన్ ఇన్ అడగడమేంటో.. నాఖర్మ కాక పోతే.." అని లోలోన గొణుక్కుంటూ..."మా జిల్లా లో చేర్యాల లేదు తల్లోయ్" అని అరిచి చెప్పాలనుకున్నాడు. చెప్పలేని పరిస్థితి... మౌనమే నీ భాష ఓ మూగ మనసా.. అన్నట్లైయ్యింది కృష్ణుడికి. " హలో.. హలో చెప్పండి కృష్ణుడు అంటోంది ఆవలి గొంతు.. ఊహు. నో చాన్స్.. అలో.ఆలో అని సాంకేతిక కారణాల వల్ల లైన్ కట్ అయ్యింది.. అని యాంకర్ అంటూ ఉండగా యాంకర్ ఫోన్ కట్ అయ్యింది , ఫోన్ - ఇన్, సెక్షన్ నుంచి మాత్రం మాటలు వినబడుతూనే ఉన్నాయ్.. .. " ఫోనెత్తి మాట్లాడడేం.. మూగచింతలోడా..?? ఎండి సార్ కి కంప్లైంట్ ఇవ్వండి.. రిపోర్టర్ ని ఆన్సర్ అడగండి.." సీనియర్ సబ్ ఎడిటర్ కస్సుమంటున్నట్లున్నాడు...
నెత్తిన పిడుగుపడ్డట్టై ఫోన్ కట్ చేశాడు కృష్ణుడు.! అదే సమయంలో టీ స్టాల్ లో టీవీలో మూగగా రోదిస్తూ..బిత్తరచూపులు చూస్తూ.. బాపూ బొమ్మలా మోకాళ్ల చుట్టూ చేతులు చుట్టుకుని ఎర్రంచు తెల్లచీరె కట్టుకుని చూస్తున్న సుహాసిని...ఆమె వెనుక పాట..బెనర్జీ రూపంలో బాలూ నోట సిరివెన్నెలపాట.. " విధాత తలపున ప్రభవించినది. అనాది జీవన వేదం.. ఓం...ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవానాదం.. " అంటూ పాట మొదలైంది.. " నా దరిద్రం కాకుంటే.. నేను టీస్టాల్ కి రావడమేంటో.. టీ వాడు టీ పెట్టకుండా టివి పెట్టడమేంటో,.. నా పరిస్థితిని ఆ పాట ప్రతిబింబించడమేంటో.." అనుకుని మదన పడ్డాడు. కాకతాళీయమైనా ఎవరో వెక్కిరిస్తున్నట్లు అనిపించి కళ్లలో నీళ్ళు సుడులు తిరగాయ్... నాకే ఎందుకిలా జరగాలి అని మనసులో తిట్టూకుంటూ..వడివడిగా ఆఫీసులోకి ఆఫీసువైపుకు అడుగులేశాడు కృష్ణుడు...!
మళ్ళీ ఫోన్ ఇన్ వస్తే....ఆ ఊహకే భయమేసింది..కృష్ణుడికి.. ఆఫీసులో ఏంచేయాలో అర్ధంకాక సిరివెన్నెల సుహసిని ని , అల్లుడుగారు రమ్యకృష్ణని గుర్తుచేసుకుంటూ "మాట రాని మౌనమిది..మౌన వీణ గాన మిది.." అని లోలోనే పాడుకుని స్వాంతన పడ్డాడు.... " ఎందుకు నాకీరోజు అకస్మాత్తుగా గొంతుపోయిందీ' అని తీవ్రం గా ఆలోచనలోపడ్డాడు... అప్పుడు గుర్తొచ్చింది.. కృష్ణుడికి వాళ్ళ బామ్మ నిన్న "గొంతు రావడం లేదురా" అని సైగ చేస్తూ అని కన్నీళ్ళు పెట్టూకుంటుంటే ..చూడలేక మనసు ద్రవించి..
"పాపం ఆవిడికీ వయసులో ఎంతకష్టం వచ్చింది.. నాగొంతు పోయినా బావుండేది "అని..అనుకున్నాడు. ఇదిగో ఇప్పుడు తన గొంతు పూడిపోయింది కానీ ఆవిడ గొంతుమాత్రం తిరిగి రాలేదు... ఇప్పుడు తెలిసొచ్చింది కృష్ణుడికి .. ఏది కోరుకున్నా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు ఎందుకు చెప్పారో..! ఏం లేదండి .. ఆవిడకు తగ్గాలని కోరుకోకుండా.. నాకు వచ్చినా బాగుండు అని కోరుకున్నాడు.. అదీ జరిగింది.. "నానోరు నిప్పడా..! కోరుకునేది సరిగ్గా కోరికుని చావకుడదూ... ఇప్పుడు చూడు ఒక్కపూట గొంతు పూడిపోతే ఇన్ని కష్టాలెదురై భూలోకంలోనే నరకం కనబడితే.. .. పుట్టు మూగ వాళ్ళు ఈ మౌన సంఘర్షణను బ్రతికినంతకాలం ఎలా భరిస్తున్నారో కదా..?? " అని అద్దం ముందు నిలబడి ఆలోచన చేశాడు కృష్ణుడు.. అంతే బుర్రలో మెరుపు మెరిసింది.. ఆ ఆలోచన వచ్చిందే తడవు... కెమెరామేన్ కి మెసేజ్ చేశాడు.." రేపు మనం పర్చూరు నాగులపాలెంలోని ' బధిరుల పాఠశాల' విద్యార్ధుల మీద కాన్సెప్ట్ చేస్తున్నాం.. బీ రెడీ ఫ్రెండ్" అని.
(మాటరాని వాళ్ళని ఎప్పుడూ హేళన చేయకండి.. ఒక్కపూట మాట్లాడలేకుండా మనం మనలేం..- కరణం)
No comments:
Post a Comment