ఆదర్శ్ - అచ్చంగా తెలుగు
ఆదర్శ్
- అద్దేపల్లి జ్యోతి

‘అమ్మా, అమ్మా’, అంటూ ఆదర్శ్ పరుగెత్తుకుంటూ వచ్చాడు. వంట గదిలో పనిలో వున్న అమ్మని వెనక నుంచి పట్టుకున్నాడు ఏడుస్తూ. ‘ఏరా నాన్నా ఎందుకు ఏడుస్తున్నావు?’ అంటూ చేతిలో పని వదిలేసి ఆడర్శ్ని హత్తుకుంది రమ్య. కాసేపు అమ్మ దగ్గర సేద తీరాకా వాసూ అన్నాడు, ‘నేను నీ కొడుకుని కాదట అవునా?’ కళ్ళు తుడుచుకుని అమ్మ మొహంలోకి చూస్తూ ఆదర్శ్. . ‘మరి నువ్వేం చెప్పావ్?’ అంది రమ్య వాడి బుగ్గలు తుడుస్తూ ‘నేను మా అమ్మ కొడుకునే అని గట్టిగా చెప్పాను, కానీ వాడు అలా అంటే ఏడుపొచ్చేసింది’ అన్నాడు బుంగమూతి పెట్టి. అమాయకంగా వున్న వాడి మొహాన్ని దగ్గరకి తీసుకుని ముద్దు పెట్టుకుని ‘వెరీగుడ్ ఎవరన్నా ఏదన్నా అంటే సమాధానం చెప్పాలి అంతే కానీ ఏడుస్తూ పారిపోకూడదు’ అంది. ‘నేను వాడి ఎదురుగా ఏడవలేదు’ అన్నాడు బింకంగా. ‘నువ్వు నా బంగారు తండ్రివి. నా కొడుకువి కాకపోతే నన్ను అమ్మా అని ఎందుకు పిలుస్తావు? వాసు కి ఆ చిన్న విషయం కూడా తెలీదు షేమ్, షేమ్’ అని నవ్వేసింది. ‘అవునమ్మా, వాడికి అది కూడా తెలీలేదు’ అని పకపకా నవ్వేసాడు. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ‘సుశీలా, ఏం చేస్తున్నావు? ఇంకా వంట అవలేదా?’ అంటూ రమ్య పక్కింట్లోకి వచ్చింది. ‘ఆ, అయిపొయింది రా ఏదో తెచ్చావ్’ అండి రమ్య చేతిలో గిన్నె చూసి. ‘ఆనపకాయ పచ్చడి టి.వి. లో చూసి చేసాను. ఎలా వుందో చెప్పు’ అంటూ గిన్నె అందించింది. ‘నువ్వు చెయ్యటం బాగోక పోవటమా? మీ అన్నయ్యగారు నువ్వు ఏం చేసి ఇచ్చినా రమ్య బాగా చేస్తుంది ఏం చేసినా అంటూ తెగ మెచ్చుకుంటూ తింటారు’ అంది. నవ్వుతూనే అన్నా చిన్న అసూయ రేఖ ఆమె మోహంలో కదలాడింది. అది రమ్య దృష్టి దాటిపోలేదు. ‘పొరుగింటి పుల్లకూడా అంటారందుకే, నువ్వు ఏది ఇచ్చినా మీ అన్నయ్యగారు కూడా నిన్ను పొగుడుతూనే తింటారు అది సహజం’ అంది రమ్య. ‘నిన్న మీ వాసూ మా వాడిని ఏదో అన్నాడట వాడు ఏడుస్తూ వచ్చాడు. నీకు తెలుసుగా నాకూ, మా వారికి ఆదర్శాలు ఒకటే కావటం వల్లనే మేము పెళ్లి చేసుకున్నామనీ, ఒక అనాధని తెచ్చుకుని పెంచుకుంటున్నామని. అవి పిల్లల దగ్గర ఎందుకు అనటం అని వాడికి తెలీనివ్వలేదు. వాడికి కొంత వయసు వచ్చాకా అర్ధం చేసుకోగలడు అనుకున్నప్పుడు, వాడికి ఆ పరిణతి వస్తే చెప్దాం లేదంటే మా కన్నబిడ్డ లానే పెంచుతున్నాం కాబట్టి ఆ విషయం చెప్పాల్సిన అవసరం రాకపోవచ్చు. పిల్లల్ని ప్రేమతో పెంచాలి.... కొట్టి పెంచాలి అని నువ్వు అనుకుంటావు. మొన్న నువ్వు వాసుని కొట్టటం వాడు నిన్ను ఎదిరించి రమ్య ఆంటి అస్సలు కొట్టదు ఆదర్శ్ ని యెంత అల్లరి చేసినా అనటం, నువ్వు వెంటనే రమ్య ఆదర్శ్ ని పెంచుకుంటున్నట్టుగా నేను నిన్ను పెంచుకోవడం లేదు, నువ్వు నా కన్న కొడుకువి అనటం విన్నాను. వాసూ అదే విషయాన్ని నిన్న ఆదర్శ్ తో అన్నాడు. పిల్లలు మైనపు ముద్దలలాంటి వాళ్ళు. వాళ్ళని మనం ఎలా మలిస్తే అలా మలచబడతారు. నీకు తెలీదని కాదు, పిల్లల్ని కొడితే వారి మనసులో మన పట్ల ద్వేషం ఏర్పడుతుంది. ఆ ద్వేషం మన వారిపైనే కాదు పక్క వాళ్ళ మీద కూడా పెంచుకుంటారు. ఆ ద్వేష స్వభావం వల్ల ఎన్ని అవాంఛనీయ సంఘటనలు మన సమాజంలో జరుగుతున్నాయో మనం రోజూ చూస్తున్నాం కదా! మనం పిల్లలకి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రేమ, దయ, మంచితనం లాంటి ఉన్నత విలువలతో పెంచాలి. అదే మనం సమాజం పట్ల గౌరవాన్ని చూపినట్లు. సరే వుంటాను. B.C హాస్టల్ లో ఆడపిల్లలకి వ్యక్తిగత రక్షణా విధానాలు చెప్పే టైం అయింది’ అంటూ రమ్య బయటకి నడిచింది. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ‘అమ్మా, అమ్మా అంటూ ఆదర్శ్ వస్తూనే హడావిడిగా పిలిచాడు. స్కూల్లో ఏదన్నా విశేషం జరిగితేనే అలా అరుస్తూ వస్తాడు. రమ్య నవ్వుతూ ఎదురొచ్చి ‘ఏం చెప్పారు స్కూల్లో అంత హడావిడిగా పిలుస్తున్నావు’ అంది. ‘మరి ఏమో మా స్కూల్లోకి ఒక సంస్థ వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్పారు... ఎయిడ్స్ అనే వ్యాధి వల్ల పాపం ఒక తల్లి, తండ్రి చనిపోయారట. పాపం చిన్ని చెల్లి ఒక్కతే వుందట. ఆ పాప కి ఎయిడ్స్ రాలేదట. ఆ చిట్టి చెల్లిని మనం పెంచుకుందాం అమ్మా’ అన్నాడు ఆత్రుతగా. అమ్మ ఏం అంటుందో అని కొంచెం భయంగా. ‘అలాగే నాన్నా, మనం తప్పకుండా ఆ చెల్లిని పెంచుకుందాం అని వాడిని మనసారా కౌగిలించుకుంది. నువ్వు కూడా అలా వచ్చిన వాడివేలే’ అని మనసులో ‘నీకు తగ్గ పేరే పెట్టానురా’ అనుకుంది తృప్తిగా. ఆ తల్లీ బిడ్డల ప్రేమకు నెలవంక అందంగా నవ్వింది. ఆశీర్వదిస్తూ.  
***

No comments:

Post a Comment

Pages