అక్షరాల గవాక్షాలు
-శంకు
తెలుగు దస్తూరి ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొందరి దస్తూరి నారికేళ పాకంలా ఎంతకీ కొరుకున పడనిడైతే, కొందరి దస్తూరి నల్లేరు నడకలా సులభగ్రాహ్యమయే విధంగా సాగుతుంది. ఫలానా వాడిది ‘బ్రహ్మరాత’ అనో, ఫలానా ఆసామీది ‘గొలుసుకట్టు’ అనో మనవాళ్ళు అనుకున్నట్టే ప్రతి భాషలోనూ లిపి విషయంలో వివిధ రకాల శైలికి రకరకాల
పేర్లున్నాయి. అయితే, కేవలం ఒక చిత్రకారుడి పేరుతో బహుళ ప్రాచుర్యం పొందిన దస్తూరిగానీ, శైలి గానీ తెలుగులో తప్ప మరే ఇతర ప్రపంచ భాషలోనూ వున్నట్టు కనబడదు. తెలుగు పత్రికలతో పరిచయం వున్న పాఠకులు, చూడగానే యిట్టె పోల్చేసి అనుకునే ‘బాపు లెటరింగ్’ అనే మాట దాదాపు ఊతపదంలా ఈ రోజు తయారైంది. అందుక్కారణం ఆ శైలికి ఓ ప్రత్యేకత, ఆ దస్తూరికి ఓ ప్రత్యేక ఆకర్షణ ఉండడమే. బాపు తన బొమ్మలకు కాప్షన్ రాస్తున్న కొత్తల్లో అక్షరాలూ గుండ్రంగా లేవని కొందరు విమర్శించారు. ‘గుండ్రటి అక్షరాలు కావాలంటే కంపోజిటర్ చేత టైపు సెటింగ్ చేయించుకుంటే చాలదూ! దానికి వేరే ఆర్టిస్టు ఎందుకూ?’ అని ఆయన అడిగేవారు. తను ఏ పని చేసినా తన ప్రత్యేకత చూపగలగాలని కృషి చేసే బాపు విమర్శలకు వెరవలేదు. వెక్కిరించబడిన తన ఒరవడినే వేలాది తెలుగు పాఠకులు, వందలాది యువ చిత్రకారులుమెచ్చుకుని, ఫాలో అయేటంత పాప్యులర్ చేయగలిగారు. ఒక కథకి పేరు రాసినా, ఓ కార్టూనుకి వ్యాఖ్య రాసినా, ఓ వ్యాపార ప్రకటనకి అక్షరాలతో డిజైను కట్టినా బాపు తన ప్రత్యేక శైలిని కనబరుస్తారు. తన అక్షరాలతో తెలుగు లిపిలో తెలుగుదనం చూపించగలరు బాపు. తన దస్తూరితో తెలుగు సాహిత్యానికి తెలుగు అందాలు దిద్దగలరు బాపు. వ్యాపార ప్రకటనల్లో సాధారణంగా సుదీర్ఘమయిన వ్యాఖ్యలుండవు. క్లుప్తంగా చెప్పినపుడే ఖాతాదారు కన్ను తన ప్రకటన మీద పడుతుందనే నమ్మకం చాలా మందికి వుంది. కానీ కొన్ని సందర్భాల్లో సుదీర్ఘమైన ప్రకటనలు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సందర్భాల్లో కూడా పాఠకుణ్ణి ఆకర్షించి, యెంత పెద్దదయినా ఆద్యంతం ప్రతి అక్షరాన్ని చదివించే విధంగా అలంకరించి ఆ ప్రకటనను మలచడంలో బాపు సిద్ధహస్తులు. ఎమెస్కో పాకెట్ బుక్స్ వారి ప్రచురణలకు అనేక సందర్భాల్లో బాపు రచించి అందజేసిన ఫుల్ పేజీ ప్రకటనలు ఇందుకు సాక్ష్యాలు. కార్టూన్ వ్యాఖ్యలు రాసినపుడు బాపు తన బొమ్మలతోనే కాక, అక్షరాలతో కూడా పాథకులను కవ్వించి, నవ్విస్తారు. ఒక కార్టూన్లో మందకొడిగా పడుకున్న మొగుణ్ని చూసి మదనకామరాజు కథలు చదువుకుంటున్న ఇల్లాలు ‘వెవెవ్వే’ అని వెక్కిరిస్తుంది. ఈ కార్టూన్ లో ‘వెవెవ్వే’ అన్న అక్షరాలే కితకితలు పెడతాయి. కొన్ని సందర్భాల్లో కేవలం నోటితోనే సాధ్యపడి, లిపికి అందని శబ్దాలను బాపు తన కార్టూను అక్షరాల్లో
***
No comments:
Post a Comment