బాపూ విలనీయం - బహు రమణీయం - అచ్చంగా తెలుగు
బాపూ 'విలనీయం' - బహు రమణీయం
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్


శిశుర్వేత్తి పశుర్వేత్త్తి వేత్తి బాపురసం ఫణి: 
 కో వేత్తి రమణ తత్వం శివో జానాతి హితుల్ 
 శిశువులు (చిన్నారులు)పశువులు (విద్యరాని వారు= పామరులు) పాములు (వేణి) వశమగుదురు బాపూ రసానికి వసుధను నిక్కమే.. వశమే రమణ తత్వ్తము ... శశిధరునికి తెలియని శక్తులే వీరివి. (హితుల్ = స్నేహితుల్) బాపూ గారి గురించి కొత్తగా చెప్పమన్నారు ఎడిటర్ పద్మిని గారు.. బాపు గురించి తెలియనిదెవరికి.. బాపు సినిమా ఒక్కసారైనా చూడని వారుంటారా? . అంటే ఉండరనే సమాధానం వస్తుంది.. . దీంతో ఆయన ప్రతికథానాయకుని ఎంపిక పై దృష్టి పెడదామంటే.. ఆయన చిత్రాలలో ఒకటి రెండు సినిమాలలో విలన్లులా కనబడ్డా వారి విలనీయం కేవలం డైలాగులకే పరిమితం.. అది వారి నటనా కౌశలం కు చక్కగా ఉపయోగపడిందనుకోవచ్చు.. కానీ బాపు చిత్రాలలో అసలు విలను ఎవరూ అనే ప్రశ్న తలెత్తింది. అక్కడ దొరికింది సమాధానం.. ఆయన విలన్ ' సమాజాన్ని పట్టి పీడిస్తున్న పలు రకాల రుగ్మతలే' .! అందుకే నా దృష్టిలో సినిమా మాధ్యమాన్ని సమాజ శ్రేయస్సు కోసం పూర్తిగా వాడిన దార్శనికుడు బాపు.. వారి వెంటే రమణ గారున్నూ. కథ , కథానాయకుని, కథానాయిక ఎంపికలో ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటారో అదే తరహా జాగ్రత్తలు ప్రతి నాయకుని విషయంలో తీసుకోవడం బాపు స్టైల్. తీయదలచుకున్న చిత్రానికి, అందరూ స్క్రీన్ ప్లే వ్రాసుకుంటారు.. కానీ బాపుగారి రూటే సపరేటు.. ఆయన తన చిత్రాన్నంతా ఔపోసన పట్టి .. ప్రతి సీన్ ను బొమ్మగా చిత్రిస్తారు. ఆర్ట్ డైరెక్టర్.. నుంచి.. అసిస్టెంట్ డైరెక్టర్ వరకూ.., ఆర్టిస్టు నుంచి మేకప్ మాన్ వరకూ సీన్ మొత్తం ఒక్కసారే అర్ధమైపోతుందంటే.. ఒక్క బొమ్మ గీసి తన పని తగ్గించుకోవడమే గాక అందరి పనిని ఒంటి చేత్తో పూర్తిచేస్తారన్నమాట. అందుకే బాపు ది సైలెంట్ స్టైల్ . తక్కువగా మాట్లాడుతూ ఎక్కువబొమ్మలు గీస్తుంటారన్నమాట.!   అలివేణి చూపు ..బాపు నీలవేణి రూపు..బాపు నాయకుని షేపు.. బాపు కోణంగి కైపు..బాపు కంత్రీల నైఫు..బాపు కెమెరా స్కోపు ..బాపు వెక్కిరించే బొమ్మ బాపు నడ్డివిరిచే గీత బాపు నవ్వించే బుడుగు బాపు స్నేహసంతకం.. బాపు దార్శినికత్వం.. బాపు సినీ 'మా' ఒడి పుష్ఫం.. బాపు..! - కరణం   బాపు ' విలనీయం ' అని ఎందుకన్నానో చెప్పాల్సిందే..! బాపు విలనిజంలోని నిజం ను చూపెట్టారు. బాపు 'విలన్' అనే పదానికి భాష్యం మార్చారు. బాపు 'విలనీ'కి కొత్త రంగులద్దారు. సహజంగా చిత్రాలలో నాయకుడు, నాయిక ప్రతినాయకుడు ఉంటారు.. ఉంటే కొద్దిగా కథ కూడా ఉంటుంటుంది.. కానీ బాపూ అలా కాదు.. ఆయన కథే హీరో.. కథే హీరోయిన్.. కథే విలన్.. సామాజిక పరంగా ఎక్కువగా ఏ సమస్యలు ప్రజలను పట్టీ పిడిస్తున్నాయో అవే బాపూ సినిమా విలన్లు.. ఏడిపించే రాక్షసులు.. కన్నీరు పెట్టించే కంత్రీలు.   తొలి నాటి నుండి తన చిత్రాలలో నవరసాల పాళ్ళు సమంగా ఉండేలా జాగ్రత్త పడటం మనకి స్పష్టంగా కనిపిస్తుంది వారి చిత్రాలలో. ఇక విలనీలో మాత్రం ప్రతి చిత్రంలో సమాజంకి కీడు తలపెడుతున్న అంశాలపైనే ఎక్కువగా ఎక్కుపెట్టారు బాపు.. బాపు దర్శకత్వం వహించిన 51 చిత్రాలలో హిందీ , తమిళ చిత్రాలు కుడా వున్నాయి.. వాటిలో ప్రతినాయకుని పాత్ర ఔచిత్యం తీసుకుంటే సాధారణంగా మన మధ్య ఉండే సర్వసాధారణ వ్యక్తిత్వాలే దర్శనమిస్తాయి.   'భయం' ఉన్నవాడు బ్రతికినా చచ్చినట్లే..! అన్న 'సాక్షి' (1967) బాపు తొలి చిత్రం ' సాక్షి ' . ఈ చిత్రాన్ని గనుక గమనిస్తే.. ఇది ఖచ్చితంగా ఒక ప్రయోగాత్మక చిత్రమని చెప్పచ్చు. నాటి నుండీ నేటికీ మారని జనాల తీరును ఎండగట్టారు బాపు... 'భయం ' తో పెనవేసుకున్న మంచి వ్యక్తి (కృష్ణ) .. ఒక హత్య కు సంబంధించిన కేసులో నిజం చెప్పాలనే ఉద్దేశ్యంతో సాక్ష్యం చెబుతాడు.. ఆ హంతకుడికి శిక్ష పడుతుంది. ఆ యువకుడిని (కృష్ణ) .గ్రామస్తులంతా మెచ్చుకుంటారు.. కానీ జైలు నుండి బయటకి వచ్చిన ఆ హంతకుడు నుండి, ఆ యువకుడిని కాపాడేందుకు గ్రామస్తులెవరూ ముందుకు రారు..'భయం' వారిని బందీలను చేస్తుంది. అసలు బాధితుడు (కృష్ణ) ఎవరో కుడా తెలియనట్లు నటిస్తారు.. చివరకు పిల్లి తిరగబడ్డట్టు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి అతి భయస్తుడైన కృష్ణ తిరగబడటం వంటివి పక్కన పెడితే.. ! బాపు ఈ కథలో ప్రతినాయకుడు గా ' భయం ' అనే మనిషి మానసిక స్థితినే ఎంచుకున్నారు.. ఈ సాక్షి కథ ఆద్యంతం భయం చుట్టూ నడిచి .. చివరికి పిరికివాడు ఆ భయాన్నే జయిస్తాడు.. అంటే ఇందులో భయం ని విలన్ ని చేశారు. జగ్గరెడ్డి రౌడీ పాత్ర చాలా తక్కువే..! భయం పాత్ర తో పోలిస్తే..! ఈ చిత్రంలో రంగారావు అనే నటుడు కరణం పాత్రను పోషించి,ఈ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకుని 'సాక్షి రంగారావు' గా ప్రసిద్ధికెక్కాడు. దర్శకుడుగా బాపుకు గుర్తింపు తీసుకు వచ్చింది ఈ చిత్రం.   నాస్తికత్వం అన్నింటా సరికాదని సందేశం అందించిన బుద్దిమంతుడు...( 1969) స్వతహాగా దైవ భక్తుడైన బాపు.. చిత్రాలలో దైవానికి సంబంధించిన పాత్రలు.. కథలే గాక పూర్తిస్థాయి చిత్రాలైన, సంపుర్ణ రామాయణం, సీతా కళ్యాణం, భక్త కన్నప్ప, శ్రీరామరాజ్యం వంటి ఎన్నో భక్తి రసాల చిత్రాలకు దర్శకత్వం వహించి దైవభక్తి ఆవశ్యకతను చెప్పకనే చెప్పే బాపు చిత్రాలలో కొత్తట్రెండ్ సృష్టించింది బుద్దిమంతుడు చిత్రం.. దేవుడే దిగి వస్తే అనే కాన్సెప్ట్ ని తెచ్చింది బాపూ ఆలోచనలే.. అదే తరహా చిత్రాలకు బీజం వేశాయి.. ఇక బుద్ధిమంతుడు చిత్రం విషయాన్ని పరికించి చూస్తే మాత్రం మరో సామాజికాంశం.. కనిపిస్తుంది. ఆస్తికులు.. నాస్తికుల మధ్య జరిగే వాదాలు బేధాలతో పాటు సమస్యలను స్పృసించారు.. ఆస్తికుడైన అన్న.. నాస్తికుడైన తమ్ముడు ల మధ్య ఉత్పన్నమైయ్యే సమస్యలు..భిన్నకోణాలలో చూపారు బాపు.. అంతే కాదు ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న మరో సమస్య 'దేవుడిని అడ్డుపెడ్డకొని పబ్బం గడుపుకునే' వారిని కూడా ఈ చిత్రంలో వేలెత్తి ప్రశ్నించారు బాపు.. అలాంటి వారి వల్ల ఆస్తికత్వానికే ప్రమాదం అన్న విషయాన్ని ఆయన చూపే ప్రయత్నం చేశారు.. నాగేశ్వరరావు బాపు దర్శకత్వంలో తొలి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో నాస్తికత్వమే.. ముఖ్యమైన విలనీగా మనం పరిగణించాలి.. అంతే కాదు దైవ భక్తి మానసిన పరిణతికి చెందినదనే ఉద్దేశ్యాన్ని ఆపాదిస్తూ స్వయానాదేవుడే వచ్చి అమాయకపు అన్న అయిన నాగేశ్వరరావుతో ఉండటం .. ఆయన పెట్టే నైవేద్యాన్ని స్వీకరించడం వంటివి ఈ చిత్రంలో మనకి కనిపిస్తాయి. మనసే దేవాలయం అని చెప్పడమే ఈ కథనంలో ని బాపు గారి ఉద్దేశ్యం.. నకిలీలకు చెక్ పెట్టమని హెచ్చరిస్తూనే .. దైవాన్ని మనసారా ఆరాధించమని.. నాస్తికత అన్నిటా పనికిరాదని ఆయన ' బుద్ధిమంతుడు ' చిత్రం ద్వారా సమాజానికి విన్నవించారు బాపు..   అనుమానం పెనుభూతం అన్న 'ముత్యాలముగ్గు'.. (1975) ఇక ఆలానే మరో చిత్రం బాపురమణల పేరు దశదిశల వ్యాపించిన చిత్రం..ప్రతి తెలుగింటి ఇంటి లోగిలిలో ముగ్గు వేసిన చిత్రం.. ముత్యమంతా పసుపు ముఖమంతా అద్దిన చిత్రం.. 'ముత్యాలముగ్గు'.. ఇందులో విలన్ ని తీసుకుంటే కొంత కళాత్మకత కనిపిస్తుంది.. అంతే కాదు విమర్శకుల నోళ్ళుమూయించేందుకు .. "మడిసన్నాక కాత్తంత కళాపోషణ ఉండాలం"టూ.. నేరుగా పాత్రతో చెప్పించి విమర్శకుల నోరు మూయించి, రొటీన్ కు భిన్నమైన విలన్ ని పరిచయం చేసిన స్టైల్ వారిది.. రామాయణంలోని సున్నితమైన సమస్యను తీసుకుని దానిని నేటిరామాయణంలో రావణుల పాత్రలను సృష్టించి, వారు అమాయకపు వివాహితపై కలిగించే అనుమానం ను ఆ అనుమానం ' రగిల్చిన చిచ్చును దాని పర్యవసానాలను కళ్లకు కట్టారు. ఇది ప్రతి ఊర్లో నిత్యం జరుగుతున్నదే , ప్రతి దినం పత్రికలో చూస్తున్నదే.. ప్రేమించి పేదింటి పిల్లను పెళ్ళిచేసుకున్న శ్రీధర్ ఆస్తి కాజేసేందుకు అతని మేనమామ, కాంట్రాక్టర్ రావుగోపాలరావు ను కలసి కుట్రపన్ని, భార్య సంగీతను బయటకు పంపించడంలో కృతకృత్యులౌతారు. వారి కుట్ర వల్ల ఆ ఇల్లాలిని శంకించి ఆమెను భర్త దూరం చేసుకొంటాడు. ఆమె ఒక పూజారి ఇంట్లో తల దాచుకొని కవలలను కంటుంది. ఆ పిల్లలు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో విడిపోయిన తల్లిదండ్రులను కలుపుతారు. ఇదంతా దాదాపుగా ఉత్తర రామాయణంలోని సీత.. లవకుశులు.. రాముడు.. వ్యాసుడు.. కనిపిస్తారు. కానీ కథలో విలనీ కి కొత్త సొబగులు తీర్చడంతో రావుగోపాలరావు అనే కొత్త నటుడు తెలుగు సినీ చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకోగలిగాడు.. కానీ ఇందులో అసలు విలన్ మాత్రం ' అనుమానం ' మాత్రమే.. కథ అంతా అనుమానం చుట్టు తిరుగుతుంది.. ఇది కూడా ఒక రకంగా 'భయం' లా సమాజాన్ని పట్టిపీడిస్తున్న జాడ్యం.!   అంతరానితనం.. పరమతసహనం అనే విషయాలపై చర్చకు దారి తీసిన చిత్రం శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్ (1976) చదువుకున్న పేదవాడు క్రైస్తవుడైన మ్యాథ్యూస్ (కృష్ణ) ఉద్యోగం లేక హోటల్లో చేరతాడు.. అక్కడ పని సరిగా చేయకపోవడంతోయజమాని ఉద్యోగంలోంచి తీసేస్తారు.. అంటే ఇక్కడే ఒక సామాజిక అవసరాన్ని ఆయన సూచించారు... అవి చదువుకునే వారు పెరుగుతున్న రోజులు. "చదువుకున్న వారు ఎక్కువై ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగులు కనీసం కాఫీ హోటల్లో పనిచేయడానికి కూడా పనికిరాక ఇబ్బందులు పడుతున్నారు.. నిరుద్యోగుల భవిష్యత్తేమిట"ని ప్రభుత్వాలని తనదైన శైలిలోవేలెత్తి ప్రశ్నించారు మన బాపు....   అంతటితో ఆగక మత మౌఢ్యం అనే సామాజిక మానసిక రుగ్మతని వేలెత్తి దూనమాడారు బాపు. ఈ చిత్రం ముఖ్య కథాంశం.. అదే ఈ చిత్రంలో ప్రతినాయకుని పాత్ర పోషించింది.. ఎందుకంటే క్రిష్టియన్ అయిన హీరో బ్రాహ్మణ హోటల్లో పని చేసి.. అనంతరం అతని కూతుర్ని ప్రేమిస్తాడు.. దీంతో సంఘర్షణకు లోనైన యజమాని శేషాద్రి (జగ్గయ్య) కూడా పెళ్ళికి అడ్డుకునే యత్నం చేస్తాడు. ఇరవై ఏళ్ళక్రితం పొట్టకూటికోసం వచ్చి స్థిరపడటానికి బ్రాహ్మణ హోటల్ నడుపుతున్న శేషాద్రి కూడా నిజానికి ఒక క్రిష్టియన్ అన్న విషయం బయటపడటంతో మాథ్యూస్ వివాహానికి అడ్డుతెర తొలిగిపోతుంది. అంటే ప్రేమ వివాహాలను.. ప్రోత్సహించేందుకు.., బ్రతకాలంటే ఇతరప్రాంతాల క్రిష్టియన్ కూడా బ్రాహ్మణునిలా బ్రతక గలరని నిరూపించేందుకు బాపూ ప్రయత్నించారని పిస్తుంది. అంటే మరో బ్రహ్మర్షి కథ మనకు చూపారన్న మాట.. కృషి ఉంటే మనిషి ఋషిగా మనగలడు.. మరిపించనూ గలడన్న సామాజిక సందేశాన్నందించారు. బాపు.. అంటే ఈ చిత్రం లో కులమత తారతమ్యమే మెయిన్ విలన్అని అర్ధమౌతుంది కదూ..!   ప్రతి దానికీ ఒక సమయం ఉంటుందన్న మనవూరి పాండవులు (1978) ప్రతి కథకూ మూలాలు రామాయణ భారతాలే అని అంటుంటారు. అలా బాపు గారి కథగా పుట్టిందే మనవూరి పాండవులు... దీనిలో కుడా సామాజిక ఆలోచనను వీడలేదు బాపు. కనపడ్డ కన్నెను చెరబట్టే కీచకుడంటి జమిందారు.. రావుగోపాలరావు.. వందతప్పుల వరకు భరిస్తానని ఇంటి నుండి దూరంగా నివశిస్తూ వేచిచూసే పాత్రలో కృష్ణంరాజు (రావుగోపాలరావు తమ్ముడు) కాగా.. చదువుకుని ,ఉద్యోగం ఇవ్వని ప్రభుత్వాలను తిట్టుకునే నిరుద్యోగ యువకులు నలుగురు.. వారికి కలిసే మరోవ్యక్తి గా రావుగోపాలరావు ఇంట్లో పాలేరు ... మొత్తం ఐదుగురు.. ప్రజల జీవితాలు బాగుచేసేందుకు యువతరం కృషిచేయాలి అనే స్ఫూర్తి నింపే చిత్రం.. కృష్ణుడి ని పోలి ఉండే కృష్ణంరాజు పాత్ర. శిశుపాలుడిని పోలి ఉండే రావుగోపాలరావు గారి పాత్ర. .. చెడునెదిరించే ఐదుగురు యువకుల పాత్రలు పాండవులని, తలపిస్తాయ్.. అయితే ఈ చిత్రంలో జమీందారీ వ్యవస్థ లో లోపాలు.. డబ్బున్న కామాంధులు ఎలా 'అమాయకులను చెరబడుతున్నారో తెలిపే చిత్రం.. ఇది డబ్బు.. పేద మధ్య సంఘర్షణ... ' ఆడవారిని చెరబట్టడమనే' సామాజిక రుగ్మతే ఇందులో ప్రభవించే ప్రతినాయక కోణం . చెడుని ఎదిరించేందుకు యువత సమాయత్తం కావాలనే కోణమే హీరో..!   ఆర్ధిక అవసరాలను చూపిన పెళ్ళిపుస్తకం (1991) ఇక సంచలనాలు సృష్టించిన బాపూ బొమ్మల చిత్రం పెళ్ళి పుస్తకం. హిందూ సంప్రదాయంలోని పెళ్ళి ని, అనంతరం ఆ దంపతుల కష్టనష్టాలను తెరకెక్కించారు. పెళ్ళైనా కుటుంబాల బాధ్యత ను మరచి పెంచిన వారిని రోడ్డు పాల్జేస్తున్న వారికి మేలుకొలుపే ఈ చిత్ర కథాంశం. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ.. తమతమ కుటుంబ అవసరాలను దృష్టిలో వుంచుకుని జీవితాన్ని మలుచుకొనే ఈ దంపతుల కథ.. అందరికీ చేరువైంది. ఈ చిత్రంలో 'ఆర్ధిక అవసరం ' అనేదే మెయిన్ విలన్ గ మనకు కనబడుతుంది.. కుటుంబంలోని కష్టాలను భుజం పై వేసుకోవడంతో ఏర్పడ్డ ' ఆర్ధిక అవసరాలు ' ఆ కొత్తదంపతులను అనేక ఇబ్బందుల పాల్జేస్తుంది.. ఆ సమయంలో ఏర్పడే సహజ సమస్యలను తెరకెక్కించి తన కోణం సమాజం.. సమాజ శ్రేయస్సే తన సినిమా వ్యూ అని చెప్పకనే చెప్పారు బాపు.   యత్రనార్యంతు పూజ్యంతే..రమంతే తత్రదేవతా ! అన్న మిష్టర్ పెళ్ళాం (1993) స్త్రీకి సమోన్నత స్థానం కట్టబెట్టాలనేదే ఈ మిస్టర్ పెళ్లాం సినిమా కథ. బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తూ మోసపోయి ఇంటికి చేరడంతో ఇంటి అవసరార్ధం కుటుంబ బాధ్యత చేపట్టిన భార్య.. ఆమె గడుసుదనం ఈ చిత్రం.. భార్యంటే వంటింటి కుందేలు కాదు.. అపర శక్తి శాలి తాను తలుచుకుంటే దుర్మార్గుల పీచమణచగలదనే విషయాన్ని తన చిత్రం ద్వారా.. తెలిపే ప్రయత్నం చేశారు బాపు.. ఈ చితంలో కూడా సాధారణం గా మన మధ్య తిరిగే వారిలాంటి వారే బ్యంకులో మోసాలకు పాల్పడతారు.. కానీ చిత్రంలో మెయిన్ విలన్ పాత్ర పోషించింది.. ' ఇగో ' ఈ చిత్రంలో పురుషుల 'అహం' మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు బాపు. ..భార్య ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదన్న పరిస్థితుల నుంచి భార్య ఉద్యోగం చేస్తూ పోషిస్తుంటే .. వెక్కిరిస్తున్నట్లుగా భావించి తాను బాధపడుతూ భార్యనూ బాధపెట్టే భర్త కథే.. ఇందులో కథాంశం.. భర్త (రాజేంద్ర ప్రసాద్) పై పడ్డ నిందను తొలిగించేందుకు భార్య (ఆమని) కృషి చేసినా, భర్త జీర్ణించుకోలేకపోవడం కుడా ఈ చిత్రంలో భార్య స్థానం ఎప్పుడూ కాళ్ల దగ్గరే అనే భావన భర్తలది అంటూ సమాజంలో భర్తలను సూటిగా వెక్కిరించారు.   ఇలా బాపూ తాను దర్శకత్వం వహించిన చిత్రాలలో కథకు విలువనిచ్చి.. చిన్న చిన్న కథానాయకులతో చిత్రాలను తక్కువ బడ్జెట్ తో పూర్తి చేయడమే గాక. గొప్ప గొప్ప కళాకారులను, వారి లో దాగున్న కళను సినిమాకు పరిచయం చేసి, . పూర్తి వినోదం తో పాటూ.. సామాజిక బాధ్యతను.. గుర్తు చేస్తూ ఆయా సమస్యలను ఎత్తి చూపిన దార్శనికుడు బాపు.. ఆయన చిత్రాలలో స్పృశించిన ప్రతీ అంశం సమాజంలో నేటికీ వార్తా వస్తువే.. వాస్తవ గాథలే..!

No comments:

Post a Comment

Pages