దేవతలంటే బాపు గీతలే !
---- యస్. వి . డి . యస్. శర్మ 9490630896
బాపూ! కొన్ని తరముల సేపు తెలుగు వెలుగుల రేఖలను నింపి మనిషి ఇలా బ్రతకొచ్చని కోతి కొమ్మచ్చి, ఇంకోతి కొమ్మచ్చి, ముక్కోతి కొమ్మచ్చి ఆటలు ఆడించి, కొసరి కొమ్మచ్చితో సరిపెట్టేశారా? రమణీయులు రమణుని విడిచి ఉండలేకపోయారా? చిత్ర గీతాల గీతాచార్యుడు మరి ఎక్కడ? తెలుగు లోగిళ్ళలో ముత్యాల ముగ్గు మరి ఏది? మా అందాల రాముడు అని మురిసిపోయిన గోదావరి పరవశపు మురిపాల పరవళ్ళు ఏవి? తెలుగింటి పడతికి గోరింటాకు ఇంక పెట్టేది ఎవరు? శ్రీ రామరాజ్యం విడిచి ఎందుకు వెళ్లారు? శివా ! రమణుని కన్నుతీసుకున్నావు ఓర్చుకున్నాం. బాపు కన్ను కూడా తీసేసుకున్నావు తెలుగు కన్నప్పలం మాకు మీరు ఇంక కనపడరా? తెలుగు గుండెల్లో బుల్లెట్ దింపేసి వెళ్లిపోయారా? జగదానందాకారకులు సీత రాములను దాటించిన బాపు గుహుడు తాను రమణులతో, రమా రమణులతో ఏరు దాటి, తెలుగు తెప్పను తగలేశారా? దేవతలంటే బాపు గీతలే నమస్కారం పెడితే వెనక్కి తిరిగి చూసి నేను కాదు బాబోయి అనే సంస్కారం ఇక చూడలేమా? మనిషి మరణిస్తాడు. బాపు ఉంటారు. శ్రీ రాముని దయ చేతి రాత ఉన్నంత కాలం ఉంటారు బాపు రమణులు అ, ఆ లు ఉన్నంత కాలం ఉంటారు తెలుగు మాట, గీత , రాత ఆగిపోయి మూగ వారమైపోవలసిందేనా? మహానుబాపులు శ్రీ బాపు గారికి మీరు మాదిలో స్థిర స్థానం మీకు ఇవే స్మృత్యంజలి
No comments:
Post a Comment