రామాయణ“చిత్ర”కారులు–బాపు-రమణ - అచ్చంగా తెలుగు

రామాయణ“చిత్ర”కారులు–బాపు-రమణ

Share This

రామాయణ“చిత్ర”కారులు–బాపు-రమణ

- పరవస్తు నాగసాయి సూరి

ఆది కావ్యం రామాయణం. శోకం శ్లోకమై... ఆదికవి వాల్మీకి అందించిన ఈ మహాకావ్యం జరిగి ఉంటే అద్భుతం. జరగకుంటే మహాద్భుతం ( కొంతమంది ఇది కూడా నమ్ముతారు గనుక ). అలాంటి రాముని నమ్మిన వారికి అంతా మంచే జరుగుతుందని నమ్మకం. బాపు-రమణ కూడా అంతే. బాపు అంటే... రామయణంలో ప్రతి ఘట్టాన్ని తన కుంచె నుంచి అందించిన ‘గీతా’కారుడే కాదు... తెరపై ఆవిష్కరించిన ‘చిత్ర’కారుడు కూడా. రాముడంటే బాపు గారికి ఎంత అనురాగమంటే ( భక్తి అని తక్కువ చేయలేం)... రంగనాయకమ్మ రాసిన రామాయణ విషవృక్షానికి ముఖచిత్రం వేయాల్సిందిగా కోరుతూ... బాపు గారికి బ్లాంక్ చెక్ పంపిస్తే... ఆయన దాని వెనుక రామ..రామ... అని రాసి తిప్పి పంపారట. అంతేనా ఆయన సినిమాలో ఏదో ఒక సన్ని వేశాన్ని భద్రాచలం చుట్టూ పక్కల తెరకెక్కించే వారట. అలా రాముని పట్ల అచంచల భక్తి భావమున్న బాపు రమణలు వెండితెరపై రామాయణాన్ని చిత్రించిన తీరు మహాద్భుతం. రామాయణం అనగా బాపు గారి సంపూర్ణరామాయణం సినిమా కళ్ళ ముందు మెదులుతుంది. దేవుడి పాత్రలో ఎన్టీఆర్ ను చూడ్డానికి అలవాటు పడ్డ సినీ జనాలకు... ఆ స్థానంలో శోభన్ బాబును చూపించి మెప్పించగలిగారు. ఈ క్రెడిట్ మొత్తం బాపు గారికే దక్కుతుంది. ఆరుద్ర లాంటి నాస్తికుడి చేత పాటలు రాయించినా, హాస్యరసాన్ని అలవోకగా కురింపించే రమణ గారి కలం నుంచి భక్తి రసాన్ని అందుకున్నా అది బాపు గారి కలాపోసనకు నిదర్శనం. చివరకు ఎన్టీఆర్ కూడా స్పెషల్ షో వేయిచుకుని మరీ సినిమా చూశారు. ఆ వెంటనే ఆయన్ను రాముడిగా మార్చే అవకాశం వీరికి దక్కింది. బాపు చిత్రించిన మరో రామాయణ దృశ్యకావ్యం శ్రీరామాంజనేయ యుద్ధం. ఇందులో ఎన్టీఆర్ రాముడిగా నటించారు. రాముడికి, రాముని భక్తుని యుద్ధం జరిగే ఈ కథ గయోపాఖ్యానం ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి రమణ గారు పని చేయలేదు. ఇక బాపు గారికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చి పెట్టిన చిత్రం సీతా కళ్యాణం. శ్రీరామ జననం మొదలుకుని, సీతారాముల కళ్యాణం వరకూ మాత్రమే తీసుకుని, విశ్వామిత్రుని గర్వభంగం, వామనావతారం, గంగావతరణం లాంటి ఘట్టాలను అత్యద్భుతంగా ఈ సినిమా తెరకెక్కించారు. అచ్చంగా వాల్మీకి స్క్రీన్ ప్లేని అలానే ఉంచి రామాయణాన్ని ఆవిష్కరించారు బాపు రమణ. శ్రీరామాంజనేయ యుద్ధం తర్వాత బాపు-రమణ దర్శకత్వంలో లవకుశలో మళ్ళీ నటించాలని ఎన్టీఆర్ కోరికట. అప్పట్లో పిలిపించి అడిగారట కూడా. అయితే... అది కార్యరూపం దాల్చలేదు. అనంతరం బాలకృష్ణతో బాపు-రమణలు తెరకెక్కించిన శ్రీరామరాజ్యం ఈ కాలంలో వచ్చిన చిత్రాల్లో అద్భుత చిత్రంగా నిలిచింది. బాపు రమణల చివరి రామాయణం కూడా ఇదే. ఎన్నిసార్లు తెరకెక్కించినా... ప్రతి రామాయణంలోనూ మార్పు చూపించడం ఆయనకే చెల్లింది. పౌరాణిక కథల్లోనే కాదు, సాంఘిక చిత్రాల్లోనూ అణువణువునా రామాయణాన్ని ఆవిష్కరించిన ఘనత బాపు గారికే దక్కుతుంది. అక్కినేని నాగేశ్వరరావుతో ఆయన తెరకెక్కించిన అందాల రాముడు రామాయణ కథనం కాకపోయినా... భద్రాచలం వెళ్ళే పడవలో సాగే కథ. రాముడి కథతో ముడిపడిన కథ. అనంతరం వచ్చిన ముత్యాల ముగ్గు అచ్చంగా లవకుశ లాంటి కథే. భర్త అనుమానించి వెళ్ళగొట్టిన భార్యను మళ్ళీ ఆయన దగ్గరకు చేర్చేందుకు వాళ్ళ పిల్లలే ప్రయత్నించడం ఇందులోని కథ. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రను కూడా బాపు గారు చేర్చారు. ఇక కలియుగ రావణాసురుడు, గోరంత దీపం లాంటి చిత్రాలు సీతమ్మ తల్లి కష్టాల నేపథ్యంలో వచ్చిన కథలే. ఇప్పటికీ రావణాసురులు అలానే ఉన్నారని చెప్పే కథ. రాజేంద్ర ప్రసాద్ కథానాయకుడిగా తెరకెక్కించిన రాంబంటు చిత్రాన్ని చూసినా మనకు రామాయణమే గుర్తొస్తుంది. కాకుంటే ఇది రామాయణం కాదు హనుమాయణం. విడిపోయిన అమ్మనాన్నలను కలిపే హనుమంతురాలి కథతో తెరకెక్కించిన సుందరకాండ సైతం రామాయణ ఉత్తరకాండను గుర్తు చేసేదే. ఇలా బాపు చిత్రించిన ప్రతి కథలోనూ రామాయణమే కనిపిస్తుంది. ఎన్ని రామాయణాలు తీసినా బాపు రామాయణం తనివితీరదు. చూసే కొద్దీ చూడాలనిపిస్తూ... రాముని కమనీయ రూపాన్నే కాదు... ఆయన లీలా వైభవాన్ని సైతం మన కళ్ళ ముందు ఆవిష్కరిస్తూనే ఉంటుంది.

No comments:

Post a Comment

Pages